9, డిసెంబర్ 2009, బుధవారం

"చందమామ" జ్ఞాపకాలు-1

అప్పుడు నాకు ఏడెనిమిదేళ్ళుంటాయేమో! అది చలికాలం కావడంతో చిరుచలిగా ఉంది. ఆ రోజు సెలవు కావడం వల్ల మా నాన్న ఇంటి దగ్గరే ఉన్నాడు. పొద్దున్నే లేచి వంటింట్లో పొయ్యి దగ్గర వెచ్చగా చలి కాగుతున్నాం మా నాన్నా నేనూ. మా అమ్మ కొంచెం దూరంలో మజ్జిగ చిలుకుతోంది. చందమామ మా నాన్న చేతిలో ఉంది. (తొందరపడి మా నాన్నను అపార్థం చేసుకోకండి. అంతకు ముందురోజే అరడజనుసార్లు చందమామ పారాయణం పూర్తిచేశాను నేను.) మా నాన్నేమో చందమామ చాలా దీక్షగా చదివేస్తున్నాడు. మజ్జిగ చిలకడమయ్యాక వెన్నతీస్తూ మా అమ్మ మా నాన్నతో ఏదో చెప్పింది. మా నాన్న అప్పటికి పద్మపాదుడు, పింగళుల వెంట పిశాచగార్ధభాలెక్కి ఆకాశమార్గాన శరవేగంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆ హోరులో ఈ మాటలు ఎవరికి మాత్రం వినిపిస్తాయి చెప్పండి? ఐతే మా అమ్మ ఆ మాత్రమైనా అర్థం చేసుకోకుండా మళ్ళీ ఏదో చెప్పింది. అప్పటికీ మా నాన్న కిందికి చూడలేదు.

వెన్న తీసిన తర్వాత కవ్వం వంటింట్లో పెట్టడానికొచ్చిన మా అమ్మ మా నాన్న "ఆకాశయానాన్ని" గమనించింది. గమనించి, అంతసేపూ మా నాన్న తన మాటలు విననందుకు ఉక్రోషం వచ్చి మూడోసారి అదేమాట ఇంకాస్త గట్టిగా చెప్పింది. అంత చలిలో కూడా వాతావరణం వేడెక్కుతోందని నాకర్థమైంది కానీ పరిస్థితి తీవ్రత తెలియలేదు. మా నాన్నకు అసలు ఆ మాత్రం కూడా తెలియదు! అప్పుడు ఏం జరుగుతోందో మా ఇద్దరికీ అర్థమయ్యే లోపలే మా అమ్మ మా నాన్న చేతుల్లో నుంచి చందమామ లాక్కుని, నలిపి పొయ్యిలో పెట్టేసింది! అలా చెయ్యడం మా అమ్మకు చందమామ అంటే ఇష్టం లేక కాదు. అప్పట్లో మా అమ్మ కూడా ప్రతి నెలా చదివేది. (మా నాన్న, నేను ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నాం.) ఇక ఆ పొయ్యిలో మహామాయుడి సమాధిలోని అనంత ధనరాశులతో బాటు మహామాయుడి మంత్రదండం, బంగారుపిడి గల ఖడ్గం, అతడి కుడిచేతి చూపుడువేలికి ఉన్న మహిమ గల ఉంగరం లాంటి అమూల్యవస్తువులు కూడా అంటుకోవడం వల్ల వంటిల్లంతా వింతవెలుగుతో నిండిపోయింది.

ఇంకేముంది? హాహాకారాలతో వంటిల్లు అదిరిపోయింది! పెట్టింది మనమే:-). దాంతో ఈ లోకంలోకొచ్చిన మా నాన్న వెంటనే చందమామను బయటికి లాగి నిప్పునార్పేశాడు. ఇక దాన్ని తీసుకుని నేనక్కడి నుంచి పరుగో పరుగు...ఇంకా అక్కడే ఉంటే ఏం మూడుతుందో అని! (ఇక వాతావరణమా? అది ఆ నిప్పుతోబాటే చల్లారిపోయిందిగా? మంటల్లో పడిన చందమామను చూసి మా నాన్న కంగారు పడితే అది చూసి మా అమ్మకు నవ్వొచ్చింది. నవ్వుతూనే అంది "లేకపోతే ఏమిటది? ఒక పక్క నుంచి చెప్తూంటే చెవినేసుకోకుండా అదే లోకమా?" అని.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.