9, డిసెంబర్ 2009, బుధవారం

పిచ్చి కుదిరితే కాని పెళ్ళి కుదరదు, పెళ్ళి కుదిరితేకాని పిచ్చి కుదరదు !!


నా చిన్నతనంలో పూర్తిగా హాస్యంతో నిండిన ఒక పాట తరచూ శ్రీలంకా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(రేడియో సిలోన్ ఇంగ్లీష్) లో వింటూ ఉండేవాడిని. ఆ పాట పేరు "చిల్లు బక్కెట్టు".

ఇందులో రెండు పాత్రలు ఒక మగ ఒక ఆడ. మగ పాత్ర పేరు హెన్రి, ఆడ పాత్ర పేరు లైస.

లైసా గయ్యళిలాగ అనిపిస్తుంది, భర్త కాబోలు హెన్రీని బక్కేట్టులో నీళ్ళు తెచ్చిపెట్టమంటుంది.

హెన్రి: బక్కెట్లో చిల్లుందే ఓ లైస, ఓ లైసా

లైస: గడ్డి కుక్కవోయ్ ఓ హెన్రి, ఓ హెన్రి

హెన్రి: గడ్డి పొడుగ్గ ఉందే, పొడుగ్గ ఉంది లైస లైసా

లైస: వార్ని కత్తిరించరా మగడా కత్తిరించు

హెన్రి: దేంతో కత్తిరించనే లైసా, దేంతో!

లైస: హు గొడ్డలి, గొడ్డలితోరా నా మగడా

హెన్రి: గొడ్డలి మొద్దుబారిందే లైసా, గొడ్డలికి పదునులేదే ఓ లైసా

లైసా: పదును పెట్టవోయ్, గొడ్డలికి పదును పెట్టు ఓ హెన్రి

హెన్రి: ఎల్లా పదును పెట్టాలే పదును, పదును ఓ లైసా

లైసా: (విసుగ్గా) రాయి మీదరా నాయనా రాయిమీద

హెన్రి: రాయంతా పొడిగా ఉందే ఓ లైస, ఓ లైసా పదునెట్ట పెట్టేదే ఓ లైస, ఓ లైసా

లైస: తడిచెయ్యవోయ్ రాయిని, తడిచేయి

హెన్రి: దెంతో తడిచెయ్యనే ఓ లైసా, ఓ లైసా

లైస: వార్ని, నీళ్ళురా నాయనా, నీళ్ళతోరా బాబూ

హెన్రి:(ఇకిలిస్తూ) నీళ్ళెట్టా తేనే ఓ లైసా, నీళ్ళెట్ట తెచ్చేదే ఓ లైసా

లైస: బక్కెట్టులోరా బాబూ, బక్కెట్టుతోరా నా మగడా

హెన్రి: బక్కెట్టులో చిల్లి ఉందే ఓ లైసా ఓ లైసా
ఇలా చివరికి మొదలు పెట్టిన చోటుకే వస్తారు ఇద్దరూను. మనకు తెలుగులో పిచ్చి కుదిరితే కాని పెళ్ళి కుదరదు, పెళ్ళి కుదిరితేకాని పిచ్చి కుదరదని ఒక చక్కటి సామెత ఉంది. ఒక దానికొకటి పెనవేసుకుపోయిన సమస్యలు, ఒకటి ముందు తీరితేకాని రెండోది తీరదు. ఏది ముందు? ప్రతిదానికి రెండో సమస్య ముందు తీరాలి!! దీన్నే ఆంగ్లంలో       కాచ్ 22 అనికూడ అంటారుట, బాగా చదువుకున్నవారు చెపుతూ ఉంటే విని తెలుసుకున్నాను.

పాట వినాలనుందా, ఈ కింది ప్లెయర్‌లో వినండి

ఈ పాటను పాడినది ప్రముఖ "కలెప్సో" గాయకుడు హారీ బెల్‌ఫాంటే మరియు మరియు ఒడెట్టా.ఈ పాట ఈ మధ్యనే ఒక స్నేహితుడు పంపాడు. అది మీ అందరితో పంచుకోవాలని అనిపించి, ఈ బ్లాగులో ఉంచాను. కాకపోతే పాట పూర్తిగా వినటానికి కొంచేం ఓపిక పట్టాలి.
3 వ్యాఖ్యలు:

 1. పాట విన్నానండీ చాలా బాగుంది. మీరు చెప్పిన సామెత ఈ పాటకి సరిగ్గా సరిపోయింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "ఒక దానికొకటి పెనవేసుకుపోయిన సమస్యలు, ఒకటి ముందు తీరితేకాని రెండోది తీరదు. ఏది ముందు?" ఇదేదో మన తెలంగాణా, ఆంధ్ర సమస్యకు కూడా వర్తించేటట్టుందే. పాటకు మీ పరిచయం బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రాజుగారూ! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. కాని, నేను ఇది హాస్యానికి వ్రాశాను, అందుకని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ముడిపెట్టి ఇందులో ఉన్న హస్యాన్ని తగ్గించదలుచుకోలేదు.

  మీరన్న సమస్య మటుకు కాచ్ 22 పరిస్థితిగా మార్చిన ఘనత వహించిన రాజకీయ నాయకులు వారి గోడమీద పిల్లి తంత్రాలు. వాళ్ళెప్పుడూ ప్రజల చెవుల్లో కలవపూలు చూస్తుంటారు. ఇప్పుడు ఆ కలవ తూళ్ళతోనే బాదించుకుంటున్నారు. ఇది కూడ వాళ్ళ గొ.పి. తంత్రంలో భాగమే. మరదే కాచ్ 22 అంటే!!!

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.