22, డిసెంబర్ 2009, మంగళవారం

ఏమిటీ వెర్రి?


సెల్ ఫోన్ల పిచ్చిమీద మితృలు,ప్రముఖ కార్టూనిస్టు, శ్రీ మట్టెగుంట అప్పారావుగారు(సురేఖ) వేసిన కార్టూన్ చూసి నవ్వుకుంటూ పేజీ తిరగెయ్యటంకాదు, ఆగి కొంత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఎక్కడ చూడండి అక్కడే సెల్. ఎక్కడ వెతికినా సెల్. రోడ్దుమీద పిచ్చివాళ్ళలాగ వాళ్ళల్లోనే మాట్లాడుకుంటూ పోయే వాళ్ళు, నలుగురిలో ఉన్నామన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఘాట్టిగా గొంతెత్తి మాట్లాడేవాళ్ళు, వెర్రి మొర్రి రింగుటోన్లతో అదరగొట్టేవాళ్ళు, ఎఫ్ ఎం రేడియో బయటకు వినపడేట్టుగా పెట్టి వాళ్ళకు ఆ గాన మాధుర్యం వల్ల (కీచుగా వస్తుంటుంది) కలిగే సంతోషమేమోగాని, ఇతరులకు శబ్ద కాలుష్యం కలుగచేసేవాళ్ళు,మోటారు సైకిలు నడుపుతూ, వెనుక వచ్చేవాడి గుడె పట్టుకుపోయే లాగ దబుక్కున స్పీడు తగ్గిపోయి మోగుతున్న సెల్ల్ ఫోనుకోసం తడుముకునేవాళ్ళు, వేగంగా కారు డ్రైవు చేస్తూ దృష్టి అంతా వినే విషయం మీద ఉండి, తమ ప్రాణాలేకాదు (వాళ్ళొక్కళ్ళే పోతె, ప్రపంచానికి ఒక పిచ్చాడు/పిచ్చిది తగ్గే ఆవకాశం ఉన్నది), అనేకమంది ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేవాళ్ళు,చెవి కింద సెల్ పెట్టుకుని, మెడవంచి దాన్ని పట్టుకుని, విచిత్ర భంగిమలో మాట్లాడుతూ పోయేవాళ్ళు, చివరకు బాత్రూంలోకి కూడ సెల్ పట్టుకు పోయేవాళ్ళు. ఏమిటిదంతా, సాంకేతిక ప్రగతా!! లేక దానివల్ల వచ్చిన వెర్రా? తప్పకుండా రెండోదే, ఏమాత్రం సందేహం లేకుండా కల్తీ లేని వెర్రే.

గ్రాహం బెల్ కనిపెట్టిన టెలిఫోన్ ఒక చక్కటి సమాచార సాధనం. దూరాన ఉన్న వ్యక్తితో అక్కడకు వెళ్ళకుండానే సంభాషించటానికి వీలు కలిపించిన పరికరం. సెల్ ఫోను, ప్రజలను వెర్రెక్కించి, అనేకానేక శారీరక, మానసిక రుగ్మతలను కలిగిస్తున్న సాంకేతిక పరిణామం.

ఎందుకింత పిచ్చెక్కి పోతున్నారు సామాన్య ప్రజలు ఈ సెల్ ఫోనుతో. మనం చేసె బటానీల వ్యాపారానికో, చేస్తున్న గుమాస్తా ఉద్యోగానికో చేతిలో ఎప్పుడూ పట్టుకుని, నిమిషానికోసారి మాట్లాడుతూ తిరగటం అవసరమా, లేక చేసే పనికి ఆటంకమా? ఇప్పుడు కూడ రెండోదే సందేహం లేకుండా.

ఎక్కడకి వెళ్ళి ఎవరితో మాట్లాడాలన్న, గుండెలు గుబగుబలాడుతుంటాయి, ఏ క్షణాన సెల్ మోగి ఆవతలి మనిషిని మన దగ్గరనుంచి ఈడుచుకుపోతుందో అని. అబ్బో! ఆ విలువైన కాల్ మాట్లాడి, ఆ మనిషి చెప్పండి అంటాడు, అప్పటిదాకా నిలువు గుడ్లేసుకుని చూస్తున్న మనం అక్కడకొచ్చి అతగాడితో ఎందుకొచ్చామో కష్టపడి గుర్తుకు తెచ్చుకుని, విషయం చర్విత చరణంగా చెప్పటానికి ప్రయత్నిస్తుండగా, మళ్ళీ వేరొక రకమైన అల్లరితో (అదే రింగు టోనట), మనవాడికి పక్క గదిలో ఉన్నవాడి పిలుపు, సంభాషణకు అంతరాయం, మనం జుట్టు ఇంకా ఏమైనా మిగిలిందా అని తడుముకోవటం(పీక్కుని స్వాంతన పొందుదామని ఆశ). ఈ పిచ్చి ఇదే తరహాలో మరింత ముదిరితే ఇంకొన్నాళ్ళు పోయిన తరువాత ఒక ఇద్దరు మాట్లాడుకోవాలంటే సహజ సంభాషణ ముఖా ముఖి అవకాశం ఉంటుందా, లేక ఎదురుకుండా ఉన్నాసరే ఇద్దరూ సెల్ ఫోన్లు తీసి (క్లింటు ఈస్ట్‌వుడ్ కౌ బాయ్ సినమాల్లో తన తుపాకీ తీసినట్టు)మాట్లాడుకోవాలా? చాలా విచారకరమైన విషయం, రెండోదే సరైన సమాధానం.

ఇదివరకు ఎర్ర బస్సుల్లో ఎక్కితే, రక రకాల మనుషులు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం, అబ్బబ్బా ఏమిటీ గోల అని సణుక్కుంటూ, నొసలు ముడివేసి తప్పనిసరిగా వాళ్ళ మధ్య కూచుని, నాగరికత అంతా మన దగ్గరే, ఏమిటీ మూక గోల అనుకుంటూ ప్రయాణం కొనసాగించే, పాంటులోపల చొక్కా వేసుకున్న మగాళ్ళు, హాండుబాగ్ లేనిదే బయటకు రాలేని ఆడవాళ్ళు తారస పడేవాళ్ళు. రాష్ట్రమంతా కనెక్టివిటీ అని బెదరగొడుతున్న ఈ రోజులలో, ఒక్కసారి విజయవాడనుండి, హైదరాబాదుకు మరే బస్సు వద్దు, వోల్వోలో ఎక్కి ప్రయాణించండి. ప్రత్యక్ష నరకం. ఆ బస్సువాడిచ్చిన కవర్లో మూతిపెట్టి ఛండాలపు శబ్దాలు చేస్తూ డోక్కునే వాళ్ళు (వీళ్ళకి బస్సు పడకపోతే , ఎక్కేముందు, అంత పీకలదాక మెక్కటం దేనికో మరి)అందరికీ పంచే పరిమళం భరిస్తుంటే,పక్కన కూచున్నవాడు, అరోజు పౌర్ణమా లేక అమావశ్య దగ్గరకు వస్తోందా అని మనకు అనుమానం వచ్చేట్టుగా ,ఉన్నట్టుండి తన సెల్ లో ప్రేలాపన మొదలు. సరే వాడి వంక కోపంగా చూస్తే, కొంచెం మర్యాద మన్నన ఇంకా మిగిలిన ఆధునిక మానవుడు ఐతే, తన అమోఘమైన వాణి మోతాదు కొద్దిగా ఒక రెండు సెకన్ల పాటు తగ్గించుకుంకునే అవకాశం లేకపోలేదు , లేదా వాడు మరింత కోపంగా కౌసికుడు కొంగ వంక చూసినట్టుగా చూస్తాడు. వీడితో చూపుల యుధ్ధం పనిచేయ్యలేదు, వ్యాగ్యుధ్ధం మొదలు పెట్టటానికి మాటలు మనం వెతుక్కుంటూ ఉండగా, ఒకే సారి రకరకాల శబ్దాలతో, మరి ముగ్గురికి ఫోన్లో పిలుపు. ఎంతమందితో చెయ్యగలం యుధ్ధం. గాంధీగారు చచ్చిపోయి బతికిపోయాడుకాని, ఇలా ఒక్క ప్రయాణం చేసి ఉంటే, అహింస , సత్యాగ్రహం వంటి మాటలు మాట్టాడేవాడా అని అనుమానం. ఇప్పుడు ఒకసారి అలోచిస్తే ఎర్ర బస్సు ప్రయాణం లో మనం నొసలు ముడివేసింది నాగరికులని చూశా? లేక వోల్వోలో మనం వాగ్యుధ్ధానికి కూడ వెరచి మిన్నకున్నది అనాగరికులను చూశా? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానం గట్టిగా గొంతెత్తి అవును అని సమాధానం చెప్పక తప్పదు.

ఇక రింగు టోన్లనబడే శబ్దాలు!! ఎంత తక్కువచెప్తే అంత అంత మంచిది. ప్రపంచంలో ఉన్న సమస్త పశుపక్ష్యాదులు చెయ్యగలిగిన రకరకాల శబ్దాలు, కూతలు, అరుపులు, జంతు ప్రపంచం మీద చక్కటి డాక్యుమెంటరీలు తీసిన డేవిడ్ అటేన్‌బరోకి కూడ తల తిరిగి పోతుంది. ఇక పశి పిల్లల నవ్వులు, ఏడుపు, పిచ్చి-పిచ్చి పాటలు, సంగీతంగా చలామణి అవుతున్న చప్పుడు, ఇవన్ని కాక చూసుకో నా తఢాకా అని సొంత గొంతుతో శబ్ద విన్యాసాలు-నేరెళ్ళ వేణు మాధవ్ గారుకూడ ఉలిక్కిపడతారు వీటిని వింటే. నిజమే కవితకి అనర్హం ఏమున్నది ఈ విశాల ప్రపంచంలో? లేదుకదా ! ఈ రింగుటోన్లకి కూడ ఇది అది అని లేదట చప్పుడు ఎంత చెయ్యగలిగితే అంత ఘొప్ప ట. కొన్ని కొన్ని ఈ శబ్దాలను వింటుంటే, గోడ మీద ఎవరన్న గోరుపెట్టి గీకుతుంటే కలిగే జలదరింపు వస్తుంది. పక్కనున్నవాడు ఎంత ఉలిక్కిపడితే, (ఆ శబ్ద సౌదర్యం అంతటికి తనే సృష్టికర్తను అని) అంత గర్వంగా చూస్తూ ఫోనెత్తి చెవికింద పెట్టుకోవటం ఇవాల్టి నాగరికతగా జరిగిపోతోంది.

పొరబాటున ఏదన్న సినిమాకి వెడితే అక్కడకూడ ఇదే సెల్ ఫోన్ల న్యూసెన్సు. మన సుత్తి వీరభద్ర రావుగారి పంధాలో చెప్పాలంటే, సినిమాకి చూడటానికి తగులబడ్డ ఆ వెధవ, ఆ చవట, ఆ నెలతక్కువ మందమతి, ఈ సెల్లెందుకు తెచ్చాడ్రా వెంట అని లోలోపల సణుక్కోవటం తప్ప మరేమైనా చెయ్యగలమా. మనమేదన్న వాణ్ణి మందలించపోతే, మిగిలిన సన్నాసుల జేబుల్లోనూ అవ్వే ఫోనులుగా, మన్నే మందలిస్తారు, అనవసరంగా అల్లరి చేస్తున్నామని, ఆ సెల్లుగాడి మీద అనవసరపు కనికరం జాలి చూపిస్తూ.

ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు అలా చల్లగాలికి పార్కుకు పోయి, బెంచి మీద కూచుని అంతర్ముఖులవుదామనుకుంటే అత్యాశే, అక్కడకూడ శెనక్కాయలు జంగిడీలో పెట్టుకుని అమ్మేవాడితో సహా సెల్ ఫోన్లో మాట్లాడుతూ తిరిగేస్తుంటారు. ఇంకెక్కడి ప్రశాంతత!

అసలు ఇవ్వేమి కాదు, మనకు ఈ శబ్ద ఘోష వినపడకుండా చెవిలో పెట్టుకునేది ఎవరన్న ఒక పరికరం కనిపెట్టి అమ్మటం మొదలుపెడితే అమ్ముడుపోతుండంటారా. అనుమానమా? సరిపోయింది సంబడం!!

కాని ఇంటర్‌నెట్‌లో కొంత గాలించండి. అమెరికాలో ఇప్పుడిప్పుడే చిన్న సైజు సెల్ ఫోను జామర్లు అమ్ముతున్నారుట. మనం అది జేబులో వెసుకుని బస్సు ఎక్కి కూచుని, జేబు తడుకుముంటున్నట్టుగా మీట నొక్కితే చాలు బస్సులో ఉన్న సెల్స్ అన్ని కూడ బంద్‌ట. మనక్కూడ దొరుకుతాయేమో త్వరలో! దురాశ!!

నలుగురు స్నేహితులు హయిగా కూచుని, ఎటువంటి ఆటంకం లేకుండా కబుర్లు చెప్పుకుని ఎన్నాళ్ళయింది?? ఈ సెల్ ఫోను వచ్చి ప్రతి క్షణం ఎవడికో ఒకడికి ఫోను, సంభాషణకు అంతరాయం, ఇంకెక్కడ బాతాఖాని, ఎగిరిపోయింది కిటికీలోంచి, వచ్చింది సెల్ ఫోనులో కాన్‌ఫరెన్సు కాల్. ఎగిరిపోయింది అంటే గుర్తుకు వచ్చింది, సెల్ ఫోనుల ధాటికి మనకు ఎక్కడా పిచ్చికలు కనపడటంలేదు. కారణం ఈ సెల్ టవర్లనుండి వచ్చే రేడియేషన్ కారణమట.నిజమా?

మనిషి తానంతట తానుగా వచ్చి ఎదురుకుండా కూచుని మనతో మాట్లాడాలని ఆత్రుత పడుతుంటే, గ్రహింపులేకపోయింది, ఏమాత్రం విలువ లేకుండాపోయింది, ముందస్తుగా అప్పాయింటుమెంటు తీసుకోకుండా, కార్యాలయం గోడ పక్కనుంచే తన సెల్లుతో ఒక్క కాల్ చెయ్యగానే ఎదురుకుండా కూచున్న మనిషిని (పాపం అతను పదిరోజులక్రితం ఈ ఐదు నిమిషాల అప్పయింటుమెంటు తీసుకుని ఉంటాడు) వదిలేసి ఆ సెల్లుగాడితో ఫది నిమిషాలు వాగుడు. పని మీద వచ్చిన అతగాడు, నాకు ఐదు నిమిషాలు, ఈ అధికారి ఇంత చచ్చిపోతూ గునుస్తూ టైము ఇచ్చాడు, ఏదో పెద్ద బిజీగా ఉన్నట్టు, ఇప్పుడు చూస్తే ఈ వాగుడేమిటి అని అనలేడుకదా అని అధికార మదం, దాన్ని మించిన సెల్లు పిచ్చి.

ఒక్కో కార్యాలయంలో, అధికారి స్తాయిని బట్టి (అవసరంబట్టి కాదట!!) కనీసం ఒక ఫోను, స్విచ్ బోర్డుతో కలిపిన ఒక ఇంటర్కాం ఫోను ఉండటం ఆనవాయితీ. ఇవి చాలవన్నట్టుగా, ఆధికారి జేబులో ఒకటో, కొండకచో రెండో సెల్ ఫోనులు. ఇంకేమి పనిచేస్తాడు, నిర్ణయాలు ఏమి తీసుకుంటాడు, వీటిల్లొ పడి వాగటమే సరిపోతుంది. ఈ సెల్ ఫోన్లవల్ల ఎన్నెన్ని ఆటంకాలు (ఉపయోగాలు లేవని కాదు, నిజంగా, నిజాయితీగా పోల్చి చూస్తే అతి తక్కువ) ఎన్నెన్ని నిర్ణయాలు ఆలశ్యం అవుతున్నాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి (అలోచనకు అవకాశాంలేకుండ ఎడతెరిపిలేకుండా ఇవ్వి మోగుతుంటే). ఇదివరకు సెక్రటరీకి చెప్పి లోపలకి ఫోన్లు ఇవ్వకు అని చెప్పేవాళ్ళు పని పూర్తిచేసుకోవటానికి. ఇప్పుడు, అఫీసులోకి వెళ్ళినాక ఎంతమంది అధికార్లు వాళ్ళ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు? తనమీద తనకు నియంత్రణలేనీఅడు కింది ఉద్యోగులకు ఏమి చెప్తాడు ఇక!

ఎస్సేమ్మెస్సులు మాట వింటేనే దడ పుట్టుకొస్తోంది , ఎంతమంది యువతీ యువకులు ఈ జాడ్యానికి బానిసలయ్యి పోయి, తమ విలువైన కాలాన్ని చేజేతులా వృధాగా గడుపుతున్నారు. ఇందులో ఒక జోకులేనా, వెర్రిమొర్రి వ్యాఖ్యలేనా, ఏమిటి చెప్పటం ఎంతెంత ట్రాఫిక్కు. వీటికోసమా ఈ సాంకేతిక/సమాచార విప్లవం!! ఎక్కడపడితే అక్కడ సెల్ టవర్లు, రిపీటర్లు ఆ చుట్టుపక్కల వాళ్ళకు వాటినుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం ఎంత ఉన్నది అన్న విషయం చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఈ సెల్ ఆపరేటర్లు అంతాకలసి.

ఈ విధంగా సాంకేతికంగ అభివృధ్ధి సాధించటం ఎంతగానో బాగున్నది. కాని ఆ అభివృధ్ధిని సవ్యమైన దిశగా వాడుకోవాలి, మనిషికి మనిషి మరింత చేరువకావాలి. ఈ సాంకేతిక పరికారాల సహాయంతో మరంతో ఉత్పాదకపరంగా వాడుకోవలి గాని, మితిమీరిన వినోదానికో, డబ్బులుకోసం సెల్ ఆపరేటర్లు ఎర చూపే అనవసరపు జాడ్యాలను దరిచేరనివ్వకూడదు.

ఒక కుటుంబంలో వాళ్ళు హాయిగా కూచుని ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుని ఎన్నాళ్ళై ఉంటుంది ఊహించుకోండి. దాదాపు రెండు దశాబ్దాలయ్యి ఉంటుంది. మొదట టి.వి దయ్యం, ఆతరువాత కేబుల్ టి.వి భూతం, వీటికి తోడుగా ఇప్పుడు ఇంటర్నెట్టు, సెల్‌ఫోను పిశాచాలు. ఏ ఇంట్లో చూసినే ఇదే భాగోతం. ఇదివరకు ఎవరింటికన్నా వెడితే కొచోబెట్టి మంచినీళ్ళు కనుక్కునేవారు. ఇప్పుడు కూచోబెట్టి టి.వి రెమోటు చేతికిస్తారుట. అదిట లేటెస్టు మర్యాదల నిబంధనలలో లో వ్రాసినది.

మనమెంతో నాగరికులమని, పూర్వం అనేక దురాచారాలుండేవని, అవన్ని దాటుకుని మనమెంతో పరిణితి పొందామని అనుకుంటూనే, ఈవిధమైన ఆధునిక (!!) దురాచారాల పాల పడటం ఎంతైనా శోచనీయం.


కొన్నాళ్ళకి ఈ వెర్రి ముదిరి, పిచ్చిగా మారి సెల్లును ఇలా చెవిలో పెట్టేసుకునే ప్రయత్నం చేస్తారేమో అని ఒక కళాకారుని వ్యంగ్యం

10 కామెంట్‌లు:

  1. శివ గారూ !
    మనుష్యుల అవసరంకోసం తయారుచేసుకున్న వస్తువులు అనవసరంగా ఉపయోగించే పరిస్థితికి చేరిన వాటిలో ప్రస్తుతం అగ్రస్థానంలో వున్న సెల్ ఫోన్ వెర్రి గురించి మీరు వివరించిన తీరు, సురేఖ గారి వ్యంగ్య చిత్రం బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. ".....మనం చేసె బటానీల వ్యాపారానికో, చేస్తున్న గుమాస్తా ఉద్యోగానికో చేతిలో ఎప్పుడూ పట్టుకుని, నిమిషానికోసారి మాట్లాడుతూ తిరగటం అవసరమా..."
    "....కౌసికుడు కొంగ వంక చూసినట్టుగా చూస్తాడు."

    అహ్హహ్హహ్హహ్హహ్హహ్హ్హ......

    ".....ఇంకొన్నాళ్ళు పోయిన తరువాత ఒక ఇద్దరు మాట్లాడుకోవాలంటే సహజ సంభాషణ ముఖా ముఖి అవకాశం ఉంటుందా...."
    ఇప్పటికే అతి ముఖ్యమైన నిర్ణయాలను కూడా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే తీసేసుకుంటున్నారు. కుటుంబంలో అందరూ ఉద్యోగస్తులు, పని చేసేవారు అయితే ఇప్పుడు సెల్‌ఫోన్ మాటలే గతిగా మిగిలాయి.

    "....ఆ బస్సువాడిచ్చిన కవర్లో మూతిపెట్టి ఛండాలపు శబ్దాలు చేస్తూ డోక్కునే వాళ్ళు..."
    వోల్వో బస్సుల్లో ఇలాంటి తతంగాలు కూడా ఉన్నాయా!

    "...అక్కడకూడ శెనక్కాయలు జంగిడీలో పెట్టుకుని అమ్మేవాడితో సహా సెల్ ఫోన్లో మాట్లాడుతూ తిరిగేస్తుంటారు. ఇంకెక్కడి ప్రశాంతత! ..."
    బఠానీలు అమ్మేవాడికి, శనక్కాయల జంగిడీ వాడికి కూడా సెల్ రూపంలో సమాచార సాధనం అందుబాటులో ఉందంటే ఇంతకు మించిన ప్రజా సమాచార ప్రసార వ్యవస్థ మరొకటి ఉండదు. కానీ దాని నెగటివ్ కోణం చూస్తే నిజంగా భయమేస్తుంది. ఇప్పటికే చాలా కార్పొరేట్ ఆఫీసుల్లో పని సమయంలో మొబైల్ వాడటం నిషేధించారు. బహిరంగ స్థలాల్లో ధూమ, మద్యపాన నిషేధం లాగా హస్తవాణి నిషేధం కూడా త్వరలోనే వస్తుందేమో...

    "...సెల్ ఫోనుల ధాటికి మనకు ఎక్కడా పిచ్చికలు కనపడటంలేదు.."
    బెకబెకలతో నిత్యం సందడిగా ఉండే మా ఊర్లో కప్పలు కనిపించకుండా పోయాయట. ఇంకా ఎన్ని కనిపించకుండా పోతాయో మరి..

    ..."ఒక కుటుంబంలో వాళ్ళు హాయిగా కూచుని ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుని ఎన్నాళ్ళై ఉంటుంది..."
    మీది ఎంత కమ్మటి చందమామ కల....

    చివరగా...
    ఆ చెవిలో సెల్లు.. చాలా బాగా ఉన్నట్లుందే...!

    మీ వ్యంగ్యం అదరగొడుతోంది.. ఇలాగే సాగించండి.

    రిప్లయితొలగించండి
  3. వారి కార్టూను వాడుకున్నానని నేను మైలు పంపినప్పుడు, మన సురేఖ గారి ప్రత్యుత్తరం ఈ కింది విధంగా ఉన్నది.

    పంపినవారు: APPA RAO MATTEGUNTA
    తేది: 17 డిసెంబర్ 2009 11:00 am
    సబ్జెక్టు:
    కి: SIVARAMAPRASAD KAPPAGANTU


    శ్రీ శివరామ ప్రసాద్ గారు, శుభోదయం. సెల్ ఫోన్ పిచ్చి మీద ఎంత బాగా చెప్పారండి. మీ అద్భుతమైన కధనంతో నా కార్టూన్ కు విలువ పెంచినందుకు ధన్యవాదాలు.కాలర్ ట్యూన్స్ కూడా చాలా ఘోరంగా వుంటున్నయి. నాకు తెలిసినాయన సెల్కు కాల్ చేయగానే "ఎవడ్రా అది.."అంటూ ఏదో తెలుగు సిన్మాలో హీరో విలన్ అనే మాటలు వినిపిస్తాయి.అప్పటి నుంచి ఆ పేరు లిస్టు లోచి డిలీట్ చేసేశా.ఇక రైలెక్కగానే ఒక్కో స్టేషన్ రాగానే రన్నింగ్ కామెంటరీ మొదలవుతుంది.ఇలాటివి మనమ్ చెప్పుకొని భాధ పడటంతప్ప ఈ జనంలో మార్పు రాదు.

    మీ అప్పారావు

    రిప్లయితొలగించండి
  4. భలే రాశారండీ శివ గారూ! సెల్ ఫోన్ వాడకం పిచ్చి ఎంతగా ముదిరిందో భలే వ్యంగ్యంగా, వివరంగా రాశారు.
    > మొదట టి.వి దయ్యం, ఆతరువాత కేబుల్ టి.వి భూతం, వీటికి తోడుగా ఇప్పుడు ఇంటర్నెట్టు, సెల్‌ఫోను పిశాచాలు. ఏ ఇంట్లో చూసినే ఇదే భాగోతం.

    సురేఖ గారి కార్టూన్ కూడా చాలా బావుంది. ఆయన కాలర్ ట్యూన్ అనుభవం చదివాక, ‘ఇలాంటివి కూడా ఉంటున్నాయన్నమాట’ అని నిట్టూర్చాల్సొస్తోంది!

    రిప్లయితొలగించండి
  5. నిజమే! నాక్కూడా ఈ విషయమై చాలాసార్లు వొళ్ళుమండింది.

    ఇద్దరం మిత్రులం కలసి డిన్నరుకు వెళతామా అతనికి ఫోనొస్తుంది, ఇక అందులో మాట్లాడటం. ఇక చూడండి నా పరిస్థితి బుధ్ధిగా తిని మళ్ళి అతను భోజనం పూర్తిచేసేదాకా వేచిచూడడం.

    బస్సుల్లో గోలొకటి అలా గంటలు గంటలు మాట్లాడుతుంటారు పక్కవాడికేమైనా ఇబ్బందేమో అన్న బుధ్ధికూడా లేకుండా. ఇక రింగుటోన్లు... అవేవో ఫోనొచ్చిందని బస్సులో అందరికీ తెలవాలి అన్నట్లుగా వుంటాయి.

    ఇక ఆఫీసుల్లో... ఇక్కడేవో కొంపలుతగలబడుతుంటాయా వీళ్ళు మాత్రం వయ్యారాలుపోతూ సొల్లు కబుర్లు చెప్పుకుంటుంటారు. ఆఫీసుల్లో రింగుటోన్లు పెద్ద శబ్దంతో మ్రోగించేవాళ్లంటే నాకు వొళ్ళుమంట ముఖ్యంగా మీటింగుల్లో.

    రిప్లయితొలగించండి
  6. సెల్ ఫోన్ పిచ్చి మీద బాగా చెప్పారండి!

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగా చెప్పారు. పైగా ఈ మధ్య స్కూల్ పిల్లలు కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఇళ్ళలో చిన్న పిల్లలకు ఆటవస్తువైపోయింది. ఏం చేస్తాం టెక్నాలజీ పేరు మీద ఇంకా ఎన్ని చూడాల్సొస్తుందో.

    రిప్లయితొలగించండి
  8. ఒక పని చెయ్యగలమెమో చూద్దాం . వారం లో ఒక రోజు సెల్ వాడకుండా ఉండటానికి తొలి ప్రయత్నం చేద్దాం. లేదా ఆ రోజు మనం కాల్ చేయకుండా నియంత్రించుకుందాం. ఇది ఒక ప్రారంభం .

    రిప్లయితొలగించండి
  9. నేను మొదటినుంచీ సెల్ ఫోనుకు బద్ధ వ్యతిరేకిని. ఇన్ కమింగ్ కాల్స్ కు డబ్బు కట్టే గతి ఉన్న రోజుల్లో ఆ విషయం మీద "అలిగి" నేను సెల్ ఫోన్ కొనలేదు. ఆ చార్గీలు తీసేశాక శాంతించి ఒక ఫోను కొనుక్కున్నాను. సెల్ ఫోనులో ఎప్పుడో ఒక్క 500 వేస్తె దాదాపుగా ఆరు నెలలు వస్తుంది. నాకు సెల్ ఫోను, ఫోనుగా కంటే కేమేరాగా ఎక్కువ ఉపయోగపడుతున్నది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.