25, జనవరి 2010, సోమవారం

చందమామలో మాయా బజార్


మాయా బజార్ సినిమా తెలియని వారెవరు. ఉంటే గింటే వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యి ఉండరని మన రాజశేఖర రాజుగారు తన బ్లాగులో (చందమామ చరిత్ర) బెదిరిస్తున్నారు! నిజమే మరి భారత కథను ఎంత హాస్యం పట్టించి సినిమాను తీసినా, భారతంలో లేని సంఘటనలను ఇందులో ఉన్నట్టుగా చూపించినా, కథా కథనం, దర్సకత్వం, నటీ నటుల ఎన్నిక, వారి అపూర్వ నటన, మీదుమిక్కిలి చక్కటి సంభాషణలు, కమ్మటి పాటలు, సినిమాను ఒక దృశ్య కావ్యంగా తీర్చి దిద్దాయి.

సినిమాను తీసినది విజయా వారు అంటే మన చక్రపాణి-నాగిరెడ్డి గార్లే. దీనివల్ల చందమామలో మాయా బజారు కథకూడా ప్రచురించారు. మార్చ్ 27, 1957 సినిమా మొదటిసారి విడుదల అయ్యింది. ఏప్రిల్ నెల 1957 చందమామలో మాయా బజారు కథను సంక్షిప్తంగా ప్రచురించారు. చందమామలో ప్రచురించబడిన కథను పి డి ఎఫ్ రూపంలో కింద లంకె నొక్కి చూడవచ్చు.

చందమామలో మాయా బజార్


ఇప్పుడు ఇదే సినిమా పూర్తీ రంగులలోకి మార్చబడి నెల అంటే జనవరి 29 2010 మళ్ళి విడుదల కాబోతున్నది . కొద్ది రోజులక్రితం నేను విజయవాడ వెళ్ళినప్పుడు మాయా బజార్ సినిమా రంగుల సినిమా విడుదల సందర్భంగా పోస్టరు చూసాను. పోస్టరు ఫొటోనే పైన ఇవ్వటం జరిగింది.

మొదట సారి నలుపు తెలుపులో విడుదలయ్యి ఇప్పటికి నలభై సంవత్సరాలు దాటిపోయినాయి. నాలుగు దశాబ్దాల కాలంలో అనేక మార్పులు. చందమామ విజయా పిక్చర్సు ఇప్పుడు ఒకరి చేతిలో లేవు. వేరు వేరు యాజమాన్యాలలో ఉన్నాయి. మరిప్పుడు మాయా బజార్ విడుదల సందర్భంగా చందమామలో పాత చుట్టరికం పురస్కరించుకుని మళ్ళి ఎమన్నా ప్రత్యెక శీర్షిక వేస్తారా? వేచి చూద్దాం.

ఈ సినిమాని రంగులద్దిన తరువాత డి.వి.డి. ని వేస్తారని అనుకుంటున్నాను. అలా వేయబడే డివిడిలో అలనాటి సినిమా విశేషాలు, అప్పటి సినిమాలో నటించిన వారి తో ఇంటర్వ్యూలు (నాగేశ్వర రావు గారు గుమ్మడిగారు) వేసి ప్రేక్షకులకు అందిస్తారని ఒక ఆశ. ఆ తరువాత ఆ డివిడిని సవ్యమైనధర పెట్టి ( సినిమా వాళ్ళు దురాశ కొద్దీ Rs.400/- Rs.500/- పెడితే అసలుకే మోసం వస్తుంది) పైరసీ పాల పడకుండా చెయ్యాలని ఒక విన్నపం.


3 కామెంట్‌లు:

  1. రంగుల ‘మాయా బజార్’ విడుదల కాబోతుండగా మీ టపా సందర్భోచితంగా ఉంది. సంతోషం. మీకు అభినందనలు!

    అందరికీ తెలిసిన కథే అయినా ‘చందమామ’లో చదవటం వేరు కదా!

    ‘లాహిరి లాహిరి’ పాటకు రంగులద్దకుండా వదిలేస్తే బావుంటుందేమో. రంగులతో ఆ పాటలో పరిమళించే వెన్నెల వన్నెలు తగ్గుతాయనే భయం నాకుంది.:)

    రంగులద్దిన డీవీడీతో పాటు ఈ సినిమాకు పనిచేసిన కళాకారుల ఇంటర్వ్యూలు అందిస్తే నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. నాగేశ్వరరావు గారు, గుమ్మడి గార్లతో పాటు సింగీతం శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ కూడా ఇవ్వొచ్చు.

    రిప్లయితొలగించండి
  2. "చందమామ విజయా పిక్చర్సు ఇప్పుడు ఒకరి చేతిలో లేవు. వేరు వేరు యాజమాన్యాలలో ఉన్నాయి. మరిప్పుడు మాయా బజార్ విడుదల సందర్భంగా చందమామలో పాత చుట్టరికం పురస్కరించుకుని మళ్ళి ఎమన్నా ప్రత్యెక శీర్షిక వేస్తారా? వేచి చూద్దాం."

    ఛాన్సే లేదు. విశ్వనాధరెడ్డి గారికి, ప్రస్తుత చందమామ యాజమాన్యం -జియోదెశిక్- వారికి సంబంధాలు ఏ మాత్రం లేనందున చందమామ సైట్‌‌లో సినిమాల గురించి రాయడానికి ఏమాత్రం అవకాశం లేదు. విజయావారి సినిమాలే అయినా, అవి చందమామ సినిమాలే అయినా ఇప్పడు వాటి గురించి పరిచయం, సమీక్ష చందమామ సైట్‌లో చేయగలిగే అవకాశం లేదు. బాధాకరమే అయినా నిజం నిజమే. విజయావారి సినిమాలతో సంబంధం లేని చందమామ మాత్రమే ప్రస్తుతం మనముందుంది. ఇందుకు ఎవ్వరూ ఏమీ చేయలేరు

    రంగుల మాయాబజారు గురించి మంచి వివరాలు చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. చందమామలో ప్రస్తుతం సినిమా సమీక్షలకు, పరిచయాలకు తావులేకున్నా, విశ్వనాధరెడ్డి గారు తదితరులు విజయావారి సినిమాలపై, విజయా నాగిరెడ్డిగారిపై చక్కటి సినీ పుస్తకాలు ఈ మధ్యే ప్రచురించారు. వీలయితకే కింది పుస్తకాలను తీసుకుని చదవగలరు. తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగాన్ని మన కళ్లముందు ఉంచే అపురూప పుస్తకాలివి. కింద చూడగలరు.

    షావుకారు - చక్రపాణి శతజయంతి ప్రచురణ - చక్రపాణి
    చక్రపాణి విజయపతాక – చక్రపాణి, చందమామ, విజయా
    మదిలోని జ్ఞాపకాలు – బి. నాగిరెడ్డి జీవిత చరిత్ర, విజయా పబ్లికేషన్స్
    ఆనాటి ఆనవాళ్లు -75 సంవత్సరాల తెలుగు సినిమా – విజయా పబ్లికేషన్స్
    కళాత్మక దర్శకుడు బి.యన్. రెడ్డి - డా. పాటిబండ్ల దక్షిణామూర్తి

    అలాగే కింది పుస్తకాలు కూడా
    మహానటి సావిత్రి –హెచ్ రమేష్ బాబు
    కాంచనమాల జీవనచిత్రాలు - హెచ్. రమేష్ బాబు
    వెండి వెన్నెల - వినాయక రావు
    సినీ పూర్ణోదయం - పులగం చిన్నారాయణ
    నూట పదహార్లు (1942-73) - భమిడిపాటి రామగోపాలం
    ఆలాపన – విఎకె రంగారావు.

    పై అన్ని పుస్తకాలు నేను ఎలాగోలాగూ సేకరించుకోలిగాను. ఇంకా కొన్ని అపరూప పుస్తకాలు తెలుగు సినిమాపై మిగిలే ఉన్నాయి. అవి నాకు లభ్యం కాలేదు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.