1, మార్చి 2010, సోమవారం

చందమామ సర్క్యులేషన్ విశేషాలు

చందమామ తెలుగు, తమిళంలో మొదట ప్రారంభమైనప్పటికీ తదనంతర కాలంలో హిందీ చందమామ సర్క్యులేషన్లో అన్ని భాషలను అధిగమించింది. చాలా సంవత్సరాలు హిందీ సర్క్యులేషనే అగ్రస్థానంలో ఉండింది. 1947లో 6 వేల కాపీలతో ప్రచురణ మొదలైన చందమామ 1980 నాటికి హిందీ, తెలుగు, మరాఠీ, ఒరియా భాషల్లో ఒక్కొక్క భాషలో లక్ష కాపీలపైగా ముద్రణ పొందుతూ వచ్చింది.

1980-95 మధ్య కాలంలో మనోజ్ దాస్ గారు ఒరియా చందమామ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన రాత శైలి, కథా రచనలో ఆయన ప్రావీణ్యత కారణంగా ఒరియా ప్రజలు చందమామకు పాదాక్రాంతులయ్యారంటే నమ్మండి. ఒక దశలో అన్ని భాషలనూ అధిగమించి ఒరియా చందమామ దాదాపు రెండు లక్షలపైగా కాపీల సర్క్యులేషన్‌ను దాటిందంటే ఎవరూ నమ్మలేరు. భారత దేశంలో ఒక కథల పత్రిక ఒక భాషలో నెలకు రెండు లక్షల కాపీల సర్క్యులేషన్ దాటడమే ఒక రికార్డు.

ఇంత ఉజ్వల రికార్డును సాధించిన ఒరియా చందమామ సర్క్యులేషన్‌ను 1996లో ఒరిస్సాపై విరుచుకుపడిన ప్రళయభీకర తుపాను దారుణంగా దెబ్బతీసింది. 36 గంటల పాటు కదలకుండా నిలగురిసిన ఆ పెను తుఫాను ఒరిస్సాలోని లక్షలాది కుటుంబాల జీవితాలనే ధ్వంసం చేసివేసింది. ఇలా లక్షలమంది చెట్టుకు పుట్టకు ఒకరుగా చెదిరిపోవడంతో, తల్లిదండ్రులు వరద వెల్లువల్లో కొట్టుకుపోగా వేలాది పిల్లలు అనాధలయిపోవడంతో చందమామనే కాదు ఏ పుస్తకాన్ని కూడా కొనలేనంత ఘోరంగా ఒరిస్సా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది.

హిందీ, తెలుగు, మరాఠీ, తమిళం ఇలా అన్ని భాషల చందమామలనూ ఒరియా చందమామ అవలీలగా అధిగమించింది. కథలు, చిత్రాల పరంగా 1950-80ల మధ్యకాలం చందమామకు స్వర్ణయుగం కాగా, 1980-95 కాలం చందమామకు సర్క్యులేషన్ పరంగా స్వర్ణయుగం. ఈ కాలంలోనే మొదటిసారిగా తెలుగు, హిందీ, మరాఠీ చందమామలు ఒక్కోభాషలో లక్ష కాపీలపైగా సర్క్యులేషన్ సాధించాయి.

దురదృష్టం అనవచ్చో లేదో కాని అదే సమయంలో 1996 మధ్యలో చందమామ ప్రచురణ ఆగిపోయింది. దాదాపు ఒకటన్నర సంవత్సరం చందమామ ఆగిపోయింది. దాని ప్రభావం ఈనాటికీ చందమామపై కనపడుతూనే ఉంది. నిలకడగా వస్తున్న చందమామ ఒకటన్నర సంవత్సరం కనబడకుండా పోవడం దాని సర్క్యులేషన్‌పై తీవ్ర ప్రభావం వేసింది. ఒరిస్సా చందమామే ఒకప్పుడు రెండు లక్షల కాపీలపైగా ప్రచురించబడిన కాలం నుంచి ప్రస్తుతం అన్ని చందమామలూ కలిపి రెండు లక్షల కాపీల లోపు ప్రచురణ అవుతున్న కాలంలోకి చందమామ ప్రవేశించింది.

దీనికి ఎన్నో కారణాలు. మాట్లాడే బొమ్మలతో లక్షలాది మందిని మంత్రముగ్దులను చేసిన అలనాటి చిత్రకారులు చిత్రా, ఎంటీవీ ఆచార్య, వపా గార్లు లేకపోవడం. చందమామ ప్రాభవాన్ని అత్యున్నత శిఖరాలపై నిలిపిన ధారావాహికలు ప్రత్యేకించి దాసరి సుబ్రహ్మణ్యం గారి సీరియల్స్ 1978 తర్వాత ఆగిపోవడం, -పాత సీరియల్స్‌నే తిరిగి ప్రచురిస్తూ రావడం ప్రారంభమైంది.-, చక్రపాణి, కుటుంబరావుల వంటి అద్బుత సంపాదకుల వారసత్వం తదనంతరకాలంలో కనుమరుగవడం కూడా చందమామ ప్రాభవం అంతరించడానికి ఒక కారణం. 1990ల వరకు వపా గారి మాంత్రిక హస్తం రూపొందించిన చిత్ర కళాఖండాలు చందమామ ప్రాభవాన్ని ఎలాగోలా కొనసాగించాయి.

చందమామ అజ్ఞాతవాసం చేసిన ఆ ఒకటన్నర సంవత్సర కాలం తర్వాత పునఃప్రచురణ అయిన చందమామ సర్క్యులేషన్‌పై తీవ్ర ప్రభావమే వేసింది. దీనికి కారణాలు ఒకటి కావు. దీనికి తోడు మారుతున్న సమాజం, మారుతున్న తరాలు, పిల్లల, పెద్దల అభిరుచులలో, ఎంపికలలో వచ్చిన మార్పులు, వీటికి తోడు యాజమాన్యానికి, సిబ్బందికి పని కాంబినేషన్‌లో గతంతో పోలిస్తే వచ్చిన మార్పులు.. ‘అరయంగా కర్ణుడీల్గె నార్గురిచేతన్’ అన్న చందంగా చందమామ పరుగుపందెంలో వెనుకబడిపోయింది.

హిందీ, తెలుగు, మరాఠీ చందమామలు ఒక్కొక్కటి ప్రస్తుతం 30 వేల సర్క్యులేషన్‌తో నడుస్తున్నాయి. ఇంగ్లీష్ చందమామ మాత్రం 35 వేల పైచిలుకు సర్క్యులేషన్‌తో నడుస్తోంది.

శ్రీ రాజ శేఖర రాజు గారు తన బ్లాగు చందమామ చరిత్రలో ఒక పాఠకుని ప్రశ్నకు సమాధానాన్నిఇక్కడ ప్రచురించటం జరిగింది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.