11, మార్చి 2010, గురువారం

దయ్యాలు-చందమామ




చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారు జూన్ చందమామ -2010 జూన్ సంచిక- కథలకు ప్రస్తుతం చిత్రాలు గీస్తున్నారు.జూన్ నెల చందమామకోసం రెండు దయ్యం కథలు ఎంపిక చేయడం జరిగింది. వాటిలో ఆర్ కుమార రత్నం గారు రాసిన ‘చింతచెట్టు దయ్యం’ అనే ఒక పేజీ కథకు ఆయన ప్రస్తుతం బొమ్మలు వేస్తున్నారు. ఏదో పని మీద ఆయనకు ఇవ్వాళ ఫోన్ చేసి మాట్లాడితే ఆ కథ చాలా బాగుందని తన అభిప్రాయం చెప్పారు.

చిన్న కథే అయినా మనిషి కష్టాలు చూసి దయ్యమే భయపడి మనుషులను పీడించుకు తినడం ఆపేసిందని ముగించడం చాలా బాగుందని శంకర్ గారు చెప్పారు. దయ్యం కథ మళ్లీ చాన్నాళ్ల తర్వాత చందమామలో రాబోతోందని సంతోషపడ్డారు. ‘ఇలాంటి కథలే కావాలి. ఎందుకు చందమామలో కార్టూన్లు, లోకజ్ఞానం ఇలా రకరకాల విషయాలు రాస్తున్నారం’టూ బాధపడ్డారు.

‘చందమామ అంటే పూర్తి పేజీలలో కథలు ఉండాలని కథలు లేకుండా చందమామను నింపడం ఏమిట’ని ఆయన దెప్పి పొడిచారు. ఇన్ని సంవత్సరాలుగా చందమామ వస్తోందంటే కారణం కథలేనని, కథల కోసమే చందమామను చదువుతున్నారని ఆయన అమూల్యమైన అభిప్రాయం చెప్పారు.

పేదవాళ్లకు, పనిపాటలు చేసుకుంటూ కాస్త తీరిక సమమంలో చదువుకునేందుకు కథలు తప్ప జీకేలు, కార్టూన్‌లు ఉపయోగపడవని, కష్టజీవులకు కాస్త సరదా తెప్పించేందుకు, శ్రమను మరిపించేందుకోసమే చందమామ కథలు ముందునుంచి ప్రయత్నించాయని కథల స్థానంలో కార్టూన్లు, జీకెలు వేస్తే ఎవరికి అవసరమని ఆయన ఢంకా భజాయించారు.

ఆయన మాటలు వింటూంటే ఆ క్షణం నా నోట్లో ఎవరో అమృతం పోసినట్లయ్యింది. చందమామ కథలు ఎవరికోసం ఉంటూ వచ్చాయో. ఎవరికి ఉపయోగపడ్డాయో ఇంత అధ్భుతంగా చెప్పగా నేనింతకు ముందు ఎన్నడూ వినలేదు. ఒక్కసారిగా నా బాల్యం కళ్లముందు సాక్షాత్కరించింది.

పల్లెల్లో వ్యవసాయానికి కరెంట్ పగలు నాలుగు గంటలు, రాత్రి నాలుగు గంటలు మాత్రమే ఇచ్చిన ఆ కాలంలో -1970లు- అప్పుడే మా ప్రాంతాల్లో పరిచయమయిన కరెంట్ మోటర్‌ను ఆన్ చేసి పొలాలకు నీళ్లు మలపడం, బావిలో నీళ్లు అయిపోతాయోమే మోటర్‌లో గాలిపోతే మళ్లీ ఆన్ కాదేమో అని భయంతో పొలంకాడికి, దగ్గరే ఉన్న బావికాడికి చక్కర్లు కొడుతూ ఉన్నప్పుడు మాకు చందమామే అప్తబంధువయ్యేది.

ఒక పొలంలో నీళ్లు తడుపుతూ మరో పొలానికి నీళ్లు మలిపే మధ్య కాలంలో దొరికే విరామాన్ని చందమామను చదువుతూనే గడిపేశాం. ఇంకా రాత్రి పూట పొలాలకు నీళ్లు పెట్టవలసి వస్తే లైటు అవసరం లేని సమయంలో కూడా ఆపివేయకుండా దాన్ని అలాగే వుంచి ఆ వెలుతురులో కొత్త చందమామను చదివి సంతోషపడిన రోజులు మావి. ఎందుకంటే పగటిపూట చందమామ చదివేందుకు ఇళ్లలో చాలా పోటీ ఉండేది. ఒక పట్టాన దొరికేది కాదు.

‘నెలరోజులు పనిచేయవలిసిన లైట్ అప్పుడే కాలిపోయిందేమిట్రా బ్యాటరీలు తింటున్నారా ఏమి అంటూ మా పెద్దవాళ్లు ఎగిరితే మాకేం తెలుసు పొలంకాడికి తీసుకుపోయాం అంతే’ అని అమాయకంగా ముఖం పెట్టి తప్పుకోవడం మర్చిపోగలమా..

శంకర్ గారూ! ఎంత మంచి విషయాలు మళ్లీ గుర్తుచేశారు మీరు. నిజంగా చందమామ పేదవాళ్లకు, పని పాటలు చేసుకుని అలసట తీర్చుకునే వాళ్లకు ఎంత చక్కగా ఉపయోగపడిందో. పేరుకు దయ్యం కథ అనగానే మూడనమ్మకాలను మళ్లీ ప్రచారం చేస్తున్నట్లు విమర్శలు రావడం సహజమే కానీ, చీకటిని ఇంకా అనుభవిస్తున్న, చీకటిలో ఇంకా ప్రయాణాలు కొనసాగిస్తున్న భారతీయ ప్రజలకు దయ్య్యం అనే భావనను మర్చిపోవడం సులభం కాదు.

నడిరాత్రులు పక్క ఊళ్లనుంచి వస్తూ దట్టంగా ఉన్న చెట్ల ఆకులు కదిలితే, ఉన్నట్లుండి పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి పడితే చచ్చాన్లో బాబోయ్ అంటూ పరుగుపెడుతున్న గాఢాంథకారపు అనుభవం ఇంకా మన మనస్సులలో మిగిలే ఉంది.

ఇలాంటి వారు చింతచెట్టుమీద దయ్యం గురించి చదివితే, ఆ దయ్యం కూడా మనిషి కష్టాలు దయ్యం పెట్టే బాధల కంటే ఎక్కువ అనే సత్యాన్ని గ్రహించి అప్పటినుంచి అది మనుషులను పీడించడం మానుకున్న వైనం చదివితే వారి మనస్సుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే చందమామ కథను లక్షలాది మంది భారతీయులు తమ స్వంత జీవిత అనుభవాలతో పోల్చుకుని పరవశించడం. దశాబ్దాలుగా ఇదే తీరు.

చందమామలో దయ్యం కథలు మళ్లీ వేస్తే ఎక్కడ విమర్శలు వస్తాయో అనే భయంతోనే వేసి చూద్దాం ఏమవుతుందో అని సాహసించి జూన్ చందమామలో రెండు దయ్యం కథలు ఎంపిక చేశాము. అది ఇంకా బయటకు రాకముందే. బొమ్మలు కూడా ఇంకా తయారు కాకముందే చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారు అమాంతంగా వాటిని ఆకాశానికి ఎత్తి ప్రశంసించడం. నిజంగా గుండె పొంగిపోతోంది నాకయితే..

‘దయ్యం కోరిక’ అనే మరో కథ ఆరుపల్లి గోవిందరాజులు గారు -విశాఖపట్న- పంపారు. ఇది కూడా ముగింపు కాస్త మార్చి జూన్ నెలకే ఎంపిక చేయడమైంది. శంకర్ గారు రెండు కథలూ బాగున్నాయని ప్రశంసించారు. చాలాకాలం తర్వాత ఇంత స్పష్టంగా ఉన్న కథలకు బొమ్మలు వేస్తున్నానని ఆయన చక్కటి తెలుగులో మాట్లాడుతుంటే వాటిని ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదనిపిస్తోంది.

జగమెరిగిన చిత్రకారులు ఒకే చెప్పారు. ఇక పాఠకుల తీర్పు కావాలి. ఈసారి చందమామలో ఎన్నడూ లేనివిధంగా అయిదు కథలు కొత్తవి ఎంపిక చేయడమైంది. అన్నీ మంచి కథలే. జూన్ చందమామ వచ్చాక అభిమానులుగా మీరే తీర్పు చెప్పండి.

శంకర్ గారూ! ఒక పేజీ కథ అయినా వెంటనే దాని గొప్పతనాన్ని పట్టేశారు. నా కథల ఎంపికకు గౌరవం కలిగించారు. జీవితం ధన్యమైంది.

మీరు చల్లగా ఉండండి. చందమామ కథల సారం విప్పిచెప్పారు. ఎవరి కోసం చందమామ కథలు వేయాలో కూడా తేల్చి చెప్పారు.

మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండి, ఇలాగే బొమ్మలు గీస్తూ ఉండండి.

లక్షలాది ప్రజలకు ఉపశమనం కలిగించిన, కలిగిస్తున్న మీకు మా వందనాలు…

రాజు.


చందమామ రాజుగారు తన బ్లాగులో ప్రచురించిన వ్యాసం, బ్లాగులో పున:ప్రచురణ


రాజుగారూ నేను మునుపు వేరొకచోట వ్రాసిన మాట ఇక్కడ సందర్భం కాబట్టి మళ్ళి వ్రాస్తాను


ఆశ్చర్యకరమైన విషయమేమంటే, చందమామలో దయ్యాల కథలు కూడా పుష్కలంగా ఉండేవి. కాని, అవి పిల్లల్లో మూఢ నమ్మకాలను పెంచేవిగా ఉండేవి కావు. దయ్యాలంటే సామాన్యంగా భయం ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు. అయితే, చందమామలోని కథలు అటువంటి కారణంలేని భయాలను పెంచి పోషించేట్లుగా ఉండేవి కావు. చందమామ కథల్లో ఉండే దయ్యాల పాత్రలు ఎంతో సామాన్యంగా, మనకి సరదా పుట్టించేట్లుగా ఉండేవి. అవి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దాం అనిపించేది. దయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి గానీ పిల్లలను భయభ్రాంతులను చేసేట్లు ఉండేవి కాదు.

-శివరామ ప్రసాదు కప్పగంతు

RTS Perm Link

Filed under చందమామ శంకర్" rel="category tag">చందమామ శంకర్ | చందమామలో దయ్యం కథలు">Comments (2)

2 Responses to “చందమామలో దయ్యం కథలు”

  1. SIVARAMAPRASAD KAPPAGANTU on March 10, 2010 10:14 AM

    రాజుగారూ, శంకర్ గారు చక్కగా చెప్పారు. చందమామకాని మరే పత్రిక కాని జనం చదివేది కాస్త సేద తీరటానికి. అక్కడ కూడా లోకంలో ఉన్న సమస్త విషయాలు వ్రాసేస్తే, మానసిక ఉల్లాసం ఎలా వస్తుంది? కాల్పనిక ప్రపంచంలో పడి కొంతదూరం పోయినాక మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. అందుకనే చందమామలో ఏ కథ అయినా కూడా చక్కగా చదివి ఆనందించే వాళ్ళం.

    పత్రికలకు కథలు వ్రాసే రచయితలూ, ముఖ్యంగా చందమామ కు వ్రాసేవారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, చదువరులకు మీ మీ ఇజాలు అవి అక్కర్లేదు, మీ వెర్రి మొర్రి ఆలోచనలను మామీదకు నేట్టకండి. చదివినంతసేపు హాయిగా ఉండాలి, పడిన కష్టం మరచిపోవాలి.

    ఈ విషయంలో దాసరి వారి నిబద్ధత రచయితలందరూ పాటించ వలసినది. తానూ స్వతహాగా వామ పక్ష ధోరణులు కలగి ఉన్నా, ఏనాడూ కూడా తన ఆలోచనలను చిన్నారి చదువరుల మీద రుద్దే ప్రయత్నం ఏనాడూ చెయ్యలేదు. అలాగే కొడవటిగంటి కూడా సాహిత్య వ్యవసాయాన్ని పార్టీ వ్యవసాయంగా ఏనాడు మార్చలేదు.

  2. chandamama on March 10, 2010 12:27 PM

    శివరాం గారూ,
    ‘చింతచెట్టు దయ్యం’ సింగిల్ పేజీ కథకోసం బొమ్మ గీస్తూ ఉండగానే శంకర్ గారికి మరో పనిమీద ఫోన్ చేసాను. గొంతు గుర్తుపట్టిన వెంటనే ఆయన కథ గురించి ఎత్తుకున్నారు. నా ఉద్దేశ్యంలో ఆయన చిత్రకారుడిగా కథలో దృశ్యం కోసం వెతుక్కున్నారు. చింతచెట్టు.. దానిపై దయ్యం… మనిషిని చూడగానే అది దబ్బున కిందికి దూకడం… రూపంలో అయనకు కథలో దృశ్యం నేరుగా తట్టేసింది. అంతే… ఆయన ఆ కథను అమాంతం పైకెత్తేశారు.

    అందులోనూ ఆ కథను తెలుగులో మరొకరు చదువుతూంటే వినడం కాకుండా ఇంగ్లీషు అనువాదాన్ని నేరుగా చదువుతూ కథ సారాన్ని పట్టేశారు. ‘ఎన్నాళ్ల తర్వాత మళ్లీ కొత్తగా దయ్యం కథకు బొమ్మ వేస్తున్నాను’ అంటూ మహదానందపడ్డారు. ఎలాంటి కథ పంపినా బొమ్మలు గీయవలిసిన బాద్యత తన పై ఉన్నప్పటికీ, చందమామలో కథలు తగ్గుతున్న పరిణామం పట్ల తన అసంతృప్తిని ఆయన లీలామాత్రంగానే వ్యక్తపరిచారు.

    రోహిణీ ప్రసాద్ గారి అనువాదం చక్కగా సాగిపోయినట్లుంది. అనువాదం చేసింది కుటుంబరావు గారి అబ్బాయి అని చెబితే సంతోషపడ్డారు. పెద్ద కొడుకు రామచంద్రరావు ఇలా కథలు, అనువాదాలు పట్టించుకోకుండా తొలినుంచీ కెమెరాకే పరిమితం అయ్యాడంటూ పాత జ్ఞాపకాలు తల్చుకున్నారు. కుటుంబరావు గారు పోయాక వారి కుటుంబంతో సంబంధాలు తగ్గుతూ వచ్చాయట. కొకు వారసుడిగా రెండో అబ్బాయి ప్రస్తుతం చందమామ ప్రాజెక్టులలో పని చేస్తున్నారని చెబితే సంతోషించారు.

    శివనాగేశ్వర రావు గారు రాయగా మీరు అనువదించిన బేతాళ కథ “స్వర్ణపుష్టం” ఏప్రిల్ సంచికలో వస్తోంది. దానికి బొమ్మలు వేయడం పూర్తయిందని చెప్పారు. మీరు రాసి పంపిన తొలి బేతాళ కథ “నిజమైన చదువు” కు కూడా బొమ్మలు వేసేశారు. ఇవి రెండూ వరుసగా ఏప్రిల్, మే నెల సంచికలలో రాబోతున్నాయి.

    రోహిణీ ప్రసాద్ గారు, చందమామ సీనియర్ కథకులు సత్యనారాయణ శర్మ గారు -విశాఖపట్నం- రచించిన బేతాళ కథలు జూన్, జూలై సంచికలలో రావచ్చు. వీలైనంత ఎక్కువగా కొత్త కథలను వేయడానికి పూనుకుంటున్నాము కాబట్టి ఈ సంవత్సరంలో కథలు పంపిన అందరికీ న్యాయం జరగవచ్చనే అనుకుంటున్నాము.

1 కామెంట్‌:

  1. శివరాం గారూ, మీరన్నది నిజం. మా ఊళ్లలో చిన్నప్పుడు పగటివేషగాళ్ల రూపంలో గ్రామీణ కళాకారులు వేసవిలో రామాయణ పారాయణం చేస్తూ రోజులతరబడి ప్రదర్శనలు ఇచ్చేవారు. చివరలో శూర్పణక గర్వభంగం ప్రదర్శనతో ముగించేవారు. నిజంగా ఆ రోజు గురించి చెప్పాలి. శూర్పణక పాత్రధారి రాక్షసవేషం ధరించి భయంకరంగా ఊరి వీధుల్లో పాత తాడనం చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ వికార వికృతరూపం, రుధిర నేత్రాలు చూసి పిల్లలందరూ వణికిపోయేవారు. మరీ చిన్నపిల్లలయితే ఎక్కడున్న వాళ్లు అలాగే ఉచ్చ కార్చేసేవారు. రాత్రిపూట కలలోకి కూడా శూర్పణక వచ్చి పిల్లలందరినీ భయపెట్టేది.

    కాని చందమామలో దయ్యం బొమ్మలు కాని, రాక్షసుల బొమ్మలు కాని ఎప్పుడూ పిల్లలను భయపెట్టలేదు. కొత్త చందమామ వస్తే దాంట్లో ఉండే దయ్యాలను, రాక్షసులను తనివితీరా చూసేవాళ్లం. రామాయణం సీరియల్‌లో కుంభకర్ణుడిని చందమామలో చూసినప్పుడు 'అతడు దుర్మార్గుడు ఎలా అవుతాడు ఇంత అందంగా ఉన్నాడు' అని చర్చించుకునే వాళ్లం. అంటే సుందరాకారులందరూ చెడ్డవాళ్లు కాదు అనే ఒక భావం మాలో అంతగా ముద్రించుకుపోయింది మరి. పాతాళ దుర్గం సీరియల్‌లో మహాకలి రాక్షసుడు చిత్రాలను చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుందే తప్ప భయం కలగదు ఎవ్వరికీ. దుష్టపాత్రలను చూపేటప్పుడు కూడా పాఠకులను భయపెట్టకూడదు అనే సాంప్రదాయం చందమామలో మొదటినుంచీ ఉన్నట్లుంది. అందుకే పూర్తి పేజీలో రావణ, మేఘనాథ, కుంభకర్ణాదులను చూస్తూ పాత్రల రూపలావణ్యాలకు మైమరిచిపోయోవాళ్లం. ఈ విషయంలో చిత్రకారుల హస్త నైపుణ్యం ఎంత గొప్పదో మరి.
    మంచి విషయం గుర్తు చేశారు. అభినందనలు.

    శివరాం గారూ, మీరన్నది నిజం. మా ఊళ్లలో చిన్నప్పుడు పగటివేషగాళ్ల రూపంలో గ్రామీణ కళాకారులు వేసవిలో రామాయణ పారాయణం చేస్తూ రోజులతరబడి ప్రదర్శనలు ఇచ్చేవారు. చివరలో శూర్పణక గర్వభంగం ప్రదర్శనతో ముగించేవారు. నిజంగా ఆ రోజు గురించి చెప్పాలి. శూర్పణక పాత్రధారి రాక్షసవేషం ధరించి భయంకరంగా ఊరి వీధుల్లో పాత తాడనం చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ వికార వికృతరూపం, రుధిర నేత్రాలు చూసి పిల్లలందరూ వణికిపోయేవారు. మరీ చిన్నపిల్లలయితే ఎక్కడున్న వాళ్లు అలాగే ఉచ్చ కార్చేసేవారు. రాత్రిపూట కలలోకి కూడా శూర్పణక వచ్చి పిల్లలందరినీ భయపెట్టేది.

    కాని చందమామలో దయ్యం బొమ్మలు కాని, రాక్షసుల బొమ్మలు కాని ఎప్పుడూ పిల్లలను భయపెట్టలేదు. కొత్త చందమామ వస్తే దాంట్లో ఉండే దయ్యాలను, రాక్షసులను తనివితీరా చూసేవాళ్లం. రామాయణం సీరియల్‌లో కుంభకర్ణుడిని చందమామలో చూసినప్పుడు 'అతడు దుర్మార్గుడు ఎలా అవుతాడు ఇంత అందంగా ఉన్నాడు' అని చర్చించుకునే వాళ్లం. అంటే సుందరాకారులందరూ చెడ్డవాళ్లు కాదు అనే ఒక భావం మాలో అంతగా ముద్రించుకుపోయింది మరి. పాతాళ దుర్గం సీరియల్‌లో మహాకలి రాక్షసుడు చిత్రాలను చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుందే తప్ప భయం కలగదు ఎవ్వరికీ. దుష్టపాత్రలను చూపేటప్పుడు కూడా పాఠకులను భయపెట్టకూడదు అనే సాంప్రదాయం చందమామలో మొదటినుంచీ ఉన్నట్లుంది. అందుకే పూర్తి పేజీలో రావణ, మేఘనాథ, కుంభకర్ణాదులను చూస్తూ పాత్రల రూపలావణ్యాలకు మైమరిచిపోయోవాళ్లం. ఈ విషయంలో చిత్రకారుల హస్త నైపుణ్యం ఎంత గొప్పదో మరి.

    మంచి విషయం గుర్తు చేశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.