27, మే 2010, గురువారం

దాసరి ప్రత్యెక సంచిక - ఒక పరిచయం

ఒక మాస పత్రిక సంచిక విడుదలయింది. మాస పత్రికకు సమీక్ష వ్యాసం. మాస పత్రికల సంచికలకు సమీక్షా! అని ముక్కున వేలేసుకునేవారికి ఒక్కటె జవాబు. ఇది అట్లాంటి ఇట్లాంటి మాస పత్రిక కాదు. వ్యాపార ప్రకటనల మధ్యఅక్కడక్కడ సినిమా బొమ్మలు, కథల్లాంటివి ఇరికించి, డబ్బులు దండుకోవటమే పరమావధిగా నడపబడుతున్న పత్రికకాదు. ఇది "రచన" మాస పత్రిక. పత్రికను నేను అడపా దడపా చదువుతున్నప్పటికీ, అట్టనుంచి-అట్టవరకుచదివినది మే నెల 2010 సంవత్సరపు సంచిక. కారణం? నెల రచన ప్రత్యేక సంచిక కావటమే. ప్రత్యేక సంచికా? అదేమిటి!! ఎప్పుడూ వినలేదే! అవును వినలేదు. మధ్య కాలంలో ఒక పత్రిక ప్రత్యేక సంచిక వేయటం వంటిసాహిత్య సంఘటన" అరుదు, కాదు కాదు అసలు జరగలేదు.

అటువంటి అరుదైన సంఘటనకు ఆద్యులు మన శాయిగారు. రచన వంటి పత్రికను నిబద్ధతతో నడుపుతూ, సాహిత్యఅభిమానులను అలరిస్తున్నారు. శేష తల్ప శాయి అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ పేరుగల వారు అనేక వేలమందిఉండి ఉంటారు. కాని "రచన శాయి" అంటే సాహిత్య ప్రపంచంలో అందరికీ ఎరుకే. అంతగా మమేకమైపోయి తన పత్రికరచన" ప్రచురణ కొనసాగిస్తున్నారు. ఈ ప్రత్యేక సంచిక పూర్తయ్యి బయటకు రావటానికి 46 రూపాయలు ఖర్చట, పాఠకులకు 50 రూపాయలకు ఇస్తున్నారు పత్రికని. సంచిక చూస్తే ఈ పక్క నుంచి ఆ పక్క వరకూ విషయమే కానిప్రకటన అన్నది లెనేలేదు. సంధర్భానుసారంగా చందామామ పత్రిక చందా గురించిన ప్రకటన తప్ప. చివరి అట్ట మీదఒక రంగుల ప్రకటన. ఈ మాట నిజమా, లేక నెనే పొరబాటుపడ్డానా అని మళ్ళి తరచి తరచి చూశాను. ఎందుకంటే, మనకు పత్రికల్లో ప్రకటనలు చూడటం ఎంత సహజమైన విషయమైఫొయిందంటే, అవి ఆ పక్కన ఉన్నా వాటినిపట్టించుకోకుండా మనకు కావలిసిన విషయాన్ని చదివేసుకోవటం (హంసల్లాగ పాలను నీటిని వేరుచేస్తూ!) దశాబ్దాలుగా అలవాటు చేసుకున్నాం.. ఈ మార్కెటింగు మానేజరు వెర్రి పీనుగులు ఎప్పటికి తెలుసుకుంటారోకదా, మనం ఏ వస్తువైనా వాళ్ళు వేసే వెర్రి మొర్రి భాష, చండాలపు (పూర్తి బాడ్ టేస్ట్ తొ ఉన్నవి) బొమ్మల ప్రకటనలు చూసికొనమని, మనకు అవసరమైతేనే కొనుక్కుంటామని!!!! రచన ప్రత్యేక సంచిక మాత్రం ఎటువంటి ప్రకటనలను మనకుపానకంలో పుడకల్లా, అడ్డుపడకుండా "ప్రత్యేకం" గా తయారు చేయబడ్డ ప్రత్యేక సంచిక. మరి శాయిగారి కష్టానికిప్రతిఫలంగా, అయిన ఖర్చులు ఐనా గిట్టాయో లెదో అని ఒక బెంగ మొదలయ్యింది.

ఇక ప్రత్యేక సంచిక అన్నారు, ఏమిటది అని అడుగుతున్నారు కదూ. అంటే మీరింకా ఈ సంచిక చూడలేదా. అయ్యయ్యో ఎంతపని జరిగిపోయింది, చప్పున వెళ్ళి (ఇంకా షాపుల్లో ఉన్నాయో లేదో) ఒక సంచిక "కొనండి" మీకేతెలుస్తుంది. అయినా ఈ ప్రత్యేక సంచిక "ప్రత్యేకం" ఏమిటో చెప్పాల్సిందే.

ఆయన ఒక ప్రముఖ మాస పత్రిక, అలనాటి చందమామలో పన్నెండు ధారావాహికలు 1954 నుండి 1978 వరకువ్రాశారు. అంటే 24 సంవత్సరాల పాటు, దాదాపు రెండు తరాల పిల్లల్ని ఉర్రూతలూగించినటువంటి ధారా వాహికలు. ఆయనెవరు? చాలా మందికి ఎప్పటికో కాని తెలియని పేరు, దాసరి సుబ్రహ్మణ్యంగారు. 54 సంవత్సరాలు ఒక్క చోటేనమ్ముకుని పని చేశారు. ఇక శారీరకంగా పని చెయ్యలేను అనుకున్నప్పుడే శలవుతీసుకున్నారు. అప్పటికే ఆయనవ పడిలో పడ్డారు. ఇది వ్రాస్తుంటేనే బాధ కలుగుతున్నది. ఆయన, చిన్నతనంలోనే జరిగిన ఒక వ్యక్తిగతమైనసంఘటన వల్ల భార్యా, కుమార్తెలకు దూరమయ్యారు . తనకంటూ ఒక కుటుంబం లేదు. ఒంటరి బ్రతుకు, దశాబ్దాలపాటు ఆ గదే ఇల్లు, అదే అఫీసు. అదే పని, చివరకు భోజనం కూడా అదే హోటలేమో. తలుచుకుంటెనేభయం దిగులు వేస్తున్నది. ఆదివారాలు ఏమి చేసేవారు, శలవు వస్తే కాలం ఎలా గడిచేది. ఆఫీసు నుంచి ఇంటికివచ్చాక వ్యాపకం ఏమిటి. మనమైతే తట్టుకునే వాళ్ళమా!? ఇంతటి ఒంటరి జీవితం గడుపుతూ, పిల్లలందరూ, పిల్లలాంటి పెద్దలందరూ తన కుటుంబమే అనుకుని, చక్కటి కథలు అల్లారు. చిత్రకారుడు రాఘవులు గారి (చిత్రా) సహకారంతో అద్భుత బాల సాహిత్యానికి ఒరవడి దిద్దటమే కాదు, ఉన్నతమైన ప్రమాణాలను ఏర్పరిచారు. ఆప్రమాణాలను మరి ఇంకెవరైనా అందుకునే అవకాశం దగ్గరలో ఉన్నట్టుగా కనపడదు. చిత్రాగారికి దాసరి వారికి ఉన్నఅద్భుత భాగస్వామ్యం పిల్లల, పెద్దల ఆనందానికి పునాది అయ్యింది. ఎన్నెన్ని బొమ్మలు ఎన్నెన్ని కథలు, బొమ్మా-కథా, లేక కథా-బొమ్మా అనుకునేట్టుగా పోటీపడి పాఠకులను బ్రహ్మానందపరిచారు ఇద్దరూ. నాకుఅనిపిస్తున్నది, చిత్రాగారు 1978లో పోవటం, దాసరిగారిని కృంగతీసినట్టున్నది, ఆపైన చందమామకు మూలస్థంభాలైన చక్రపాణిగారు, కొడవటిగంటి కుటుంబరావుగారు కూడ వెంట వెంటనే పరలోకగతులు కావటం కూడ దాసరినినిరుత్సాహంలోకి నెట్టిన సంఘటనలు. అందుకనే, చందమామలో మరి కొన్ని దశాబ్దాలు పనిచేసినా ఇకధారావాహికలు మటుకు వ్రాయలేదు.

కొన్ని వేలమంది అభిమానులను తయారు చేసుకున్నా, తానెవరో ఆ అభిమానులకు తెలియదు. ఆయనెవరోచందమామలో భలే వ్రాస్తున్నారు అని నెల నెలా చదివటమే కాని, ఆయన గురించి ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నించిన వారికి మాత్రం పేరొక్కటి తెలిసేది. ఆయన విజయవాడలోనే ఉన్నారని తెలుసుకున్నఅదృష్టవంతులు వెళ్ళి చూసి వచ్చారు. అంతే, అంతకంటే ఎవరికీ ఎమీ తెలియదు. అటువంటి రచయిత ఈ మధ్యనేజనవరి 2010లో పరమపదించారు. ఆ వార్త తెలిసి అభిమానులందరూ తల్లడిల్లి పోయారు. "అరే! మనం కూడఒక్కసారి చూసి వచ్చి ఉంటే ఎంత బాగుండేది, ఆయనతో మాట్లాడి పరామర్శించి వచ్చి ఉంటే....." "ఎందుకు పనికిరానిమాటలు ఆ పని చెయ్యనప్పుడు" అని అద్దంలో బొమ్మ కోపంగా తిడుతున్నా సరే ఆ తిట్లు పడి ఊరుకుందామనుకునేప్రయత్నంలో ఉండగా, . రచన శాయిగారు, ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరుమీద, రచన ప్రత్యేక సంచింక తీసుకు వద్దామని. లేడికి లేచిందే పరుగా అని ఆశ్చర్య పోయేవారు నోళ్ళు అలాతెరుచుకు చూస్తుండగానే, చందమామ అభిమానులను కూడగట్టి పన్నెండు ధారావాహికలకూ సమీక్షలువ్రాయించారు (ఆయనే జ్వాలా దీపానికి వ్రాశారు). అంతే కాదు అరుదైన దాసరి జీవితానికి సంబంధించిన మరెంతోఅరుదైన బొమ్మలు, ఆయన ఉత్తరాలు, ఇతర రచనలు కష్టపడి సేకరించి ఈ మొత్తాన్ని ఒక అద్భుతమైన "మీఠా పాన్" లాగ చుట్టి అందరికీ అందుబాటులోకి తెచ్చి, తెలుగు పత్రికా చరిత్రలో ఒక మైలురాయిగా ప్రత్యేక సంచికను తీసుకువచ్చారు. రచన శాయిగారికివే సాహిత్య ప్రణామాలు, ధన్యవాదాలు.

ఒక రచయితకు, ఆయన అభిమానులు ఆయన రచనల గురించి సమీక్షలు వ్రాసి ఒక మాస పత్రిక సంచికలో వేయటంఇదే ప్రధమం, మళ్ళి ఇటువంటి సంఘటన జరుగక పోవచ్చు. అలనాటి బాల పాఠకులు దాదాపుగా అందరూనలభై-ఏభయ్యో పడిలో పడినవారు, వాళ్ళ చిన్నతనంలో మురిపెంగాచదువుకున్న ధారావాహికల గురించి సమీక్షలు, విశ్లేషణలు వ్రాయటం, అదే రచన ప్రత్యేక సంచిక గొప్పతనం.

ధారావాహిక సమీక్షకులు
చందమామలో ప్రచురించిన వరుస క్రమమంలోనే దాసరి ధారావాహికలకు సమీక్షలు ప్రచురించారు. ఆపరిచయం,సమీక్ష లేక విశ్లేషణలు చేసినవారు:


1. తోకచుక్క దాసరి వెంకటరమణ

2.మకరదేవత కొడవటిగంటి రోహిణీ ముఖ

3.ముగ్గురు మాంత్రికులు చొక్కాపు వెంకట రమణ
4.కంచుకోట ఫణికుమార్ (బ్లాగాగ్ని)
5.జ్వాలాదీపం వై శెషతల్ప శాయి
6.రాకాసి లోయ శ్రీమతి గాయత్రి
7.పాతాళ దుర్గం రాజశేఖర ఋఆజు
8.శిధిలాలయం శివరామప్రసాదు కప్పగంతు

9.రాతిరధం వేణువు
10.యక్షపర్వతం వేణువు
11.మాయా సరోవరం శ్రీమతి సుజాత

12.భలూక మాంత్రికుడు ఎం వి వి సత్యనారాయణ


సమీక్షలు-తీరుతెన్నులు:
సమీక్షలు అన్నీ కూడ బాగున్నాయి. ఆయా ధారావాహికలు ఇప్పటివరకూ చదవని వారికి కూడ ఆసక్తి కలిగించేవిధంగా ఉన్నాయి. మొత్తంమీద చొక్కాపు వెంకటరమణగారు ముగ్గురు మాంత్రికులు ధారావాహిక మీద వ్రాసినసమీక్ష కొత్త పుంతలలో సాగింది. నలుగురూ నడిచిన దారినే కాకుండా కొత్త పధ్ధతిలో వ్రాసి సమీక్షకు మంచి వన్నెతీసుకు వచ్చారు.

ముఖ చిత్రం దాసరి వారి ఫొటోకు బదులు బొమ్మ గీయించాలని నిర్ణయించినప్పుడు ఆ బొమ్మ దాసరివారి మధ్య వయస్సులోది అయ్యి ఉంటే బాగుండేది. అంతే కాకుండా, ఆయన బొమ్మను వారు వ్రాసిన అనేక కథలలోని ప్రదేశం బాక్‌గ్రౌండ్ గా ఉంచి ఆయన పాత్రలలో ముఖ్యమైనవి ఆయన చుట్టూ చేరి ఆయనను ఆనందంగా చూస్తున్నట్టుగా వేసి ఉంటే ? మరీ గొంతెమ్మ కోరిక అంటారా. అవును అంతే మరి. చేసే వాళ్ళు ఉంటే చెప్పే వాళ్లకు తక్కువ లేదుకదా మరి ! ! !

దాసరి ఉత్తరాలనుండి కొన్ని విషయాలు, వ్యాఖ్యలు:

"..........నా కూతుర్ని చూడాలని, చాతనైతే వాళ్ళందరి సుఖంకోసం, ఏ త్యాగమైనా, ఆఖరికి గడ్డయినా తిని నాలుగుడబ్బులు కూడాబెట్టాలని ఉంది...............ఎన్నిసార్లు నా కూతురికోసం నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నానో నేనువ్రాయలేను......"
(1950 లలో)


ఎవరి అనుభవాలు ఇచ్చిన జ్ఞానం వాళ్ళ వాళ్ళ సొత్తుగా ఉంటుంది. దానికి జమా ఖర్చులు ఇంకెవరైనా వేయాలంటేచాలా వింతగా ఉంటుంది. (1950 లలో)

కొత్త సీరియల్ వ్రాయటం తలకు మించిన పని అని....(1988 లో)

నా అంచనా ఏ నాటికీ తెలుగు చందమామ ప్రాభవం ప్రాముఖ్యతా తగ్గదని.......ఎవరూ చందమామ ధోరణిలో ఉండేపత్రిక ప్రాభించకపోవటం గమనించదగిన సంగతి. ఆంధ్ర ప్రభ వాళ్ళు పిల్లల పత్రిక అంటూ ప్రారంభించి చేతులుకడిగేసుకున్నారు. ఈ ఇంగ్లీషు పత్రికలూ అవీ, వాటి లోకం వేరు. (2007 లో)

డెబ్భై డెబ్భై ఐదేళ్ళు తర్వాత రచనలు చేసిన మంచి రచయిత ఉన్నట్లు దాఖలాలు లేవు. మరి నేనూ ఆ కోవకు చెందినవాడినే కనక, ఎనభై దాటాక వ్రాయగలన్ లేదో.....ఈ 26 తరువాత పరీక్షించుకోవాలి. టేబుల్ వగైరా సర్దుతున్నాను. (25 01 2008 న)

అనామకంగా ఉన్న ఒక చక్కటి రచయిత గురంచి ఎంతో శ్రధ్ధతో ఒక ప్రత్యేక సంచిక వేసిన "రచన" శాయిగారికిచందమామ అభిమానులందరి తరఫునా కృతజ్ఞతలు.
2 వ్యాఖ్యలు:

  1. తనకంటూ ఒక కుటుంబం లేదు. ఒంటరి బ్రతుకు, దశాబ్దాలపాటు ఆ గదే ఇల్లు, అదే అఫీసు. అదే పని, చివరకు భోజనం కూడా అదే హోటలేమో. తలుచుకుంటెనేభయం దిగులు వేస్తున్నది. ఆదివారాలు ఏమి చేసేవారు, శలవు వస్తే కాలం ఎలా గడిచేది. ఆఫీసు నుంచి ఇంటికివచ్చాక వ్యాపకం ఏమిటి. మనమైతే తట్టుకునే వాళ్ళమా!? ఇంతటి ఒంటరి జీవితం గడుపుతూ, పిల్లలందరూ, పిల్లలాంటి పెద్దలందరూ తన కుటుంబమే అనుకుని, చక్కటి కథలు అల్లారు.

    శివరాం గారూ, మొన్న కూడా మీకు ఈమెయిల్ పంపాను. చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు చెన్నయ్‌లో 1952 నుంచి 2006 వరకు 54 ఏళ్లపాటు నివసించిన ఆ ఒకే ఒక్క ఇంటిని పట్టేశాను. భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా చందమామ మళ్లీ వడపళని ఏరియాకే వచ్చేసింది. పాత చందమామ భవంతికి కూతవేటు దూరంలో దాసరి సుబ్రహ్మణ్యంగారు అయిదు దశాబ్దాలపాటు నివసించిన ఇంటికి పక్కనే ప్రస్తుతం చందమామ కొత్త ఆఫీసు ఉంది. తలుపు తెరిస్తే ఎదురుగా దాసరి గారు ఉంటూ వచ్చిన ఇల్లు శిథిలాలయం రూపంలో కనపడుతోంది. కొత్త ఆఫీసులోంచి మొన్న బయటకు వస్తే ప్యాకింగ్ విభాగం రవి కనిపించి తాతా సర్ (చందమామ ఉద్యోగులు దాసరి గారిని "తాతా సర్" అని పిలుచుకునేవారు.)ఉన్న ఇల్లు ఇదే అని చూపించారు. వడపళనిలో ప్రఖ్యాత మురుగన్ కోయిల్ సమీపంలోనే ఆయన యాభై ఏళ్లుగా ఉండేవారట. యాభై ఏళ్లుగా మరమ్మతులు లేని ఇల్లు ఎలా ఉంటుందో అలాగే ఉంటోంది. చూడగానే సంతోషం, బాథ తన్నుకొచ్చాయి. ఎలాగైనా సరే దాసరి గారు నివసించిన ఇల్లు పోటో తీసి పంపిస్తాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. రాజుగారూ మీరు ఇచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. మన దాసరి గారు ఐదు దశాబ్దాలు పైగా ఉన్న ఆ ఇల్లు వెంటనే ఫొటో తీసి మీరు ఒక వ్యాసం వ్రాయగలరు. ఎందుకంటే, ఇన్ని మంచి కథలు అల్లిన చోటది. అటువంటి చోటును చరిత్రలో నిలపాలి. ఇప్పుడు ఆ బాధ్యత మీదే. ఎందుకంటే ఆ ఇంటి పక్కనే మీరు ప్రస్తుతం పని చేస్తున్నారు.
    ఇప్పుడున్ని ఆ ఇంటి యజమాని, ఆ ఇంటిని కూలగొట్టి ఏదో ఒక కాంప్లెక్సు ఏ రోజైన చెయ్యవచ్చు. కాబట్టి సత్వరం ఫొటో తీసి భద్రపరచగలరు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.