26, మే 2010, బుధవారం

అప్పుడే ఒక సంవత్సరం ! !













అప్పుడే సంవత్సరం అయిపోయింది. నిన్నో మొన్నోలాగా ఉన్నది. అనుకోకుండా చందమామల ధారావాహికలను వెతుకుతూ, బ్లాగాగ్ని బ్లాగు చూడటం, అందులో ఉన్న శిధిలాలయం మొదలగు ధారావాహికలను అందుకోవటం. బ్లాగాగ్ని గారి పుణ్యమా అని చందమామ మంచిరోజులలోని దాదాపు అన్ని సంచికలనూ అంది పుచ్చుకోవటం. తరువాత ఏమిటి అని ఆలోచిస్తూ, బ్లాగాగ్ని కొన్ని ధారావాహికలు ఇచ్చారు, మనం కూడా మరి కొన్ని ధారావాహికలు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకుని, బ్లాగు మొదలు పెట్టాను. అప్పటికప్పుడు తట్టిన "సాహిత్య అభిమాని" అని పేరు పెట్టేయటం జరిగిపోయింది. ఎలాగో మొదలు పెట్టాం కదా అని, అందరికీ తెలియని తెలుగు లింకులు ఇద్దామని నా మొదటి టపా వ్రాసేశాను. . అక్కడనుంచి రెండ్రోజులకొకసారి ఒక చందమామ ధారావాహిక చెయ్యనూ, కొద్దిగా వ్రాయటం, లోకం మీదకు వదలటం. అలా మొదలైన నా బ్లాగింగు, మీ అందరి అభిమానంతో, "వేణువు" వేణుగారు , చందమామ రాజశేఖర రాజుగారు, వంటి మిత్రుల ప్రోత్సాహంతో అనేక విషయాలు వ్రాయటం జరిగింది.

బ్లాగులో వ్రాస్తున్నప్పుడు అనేకానేక అనుభవాలు. ఎన్నెన్నో వ్యాఖ్యలు, చర్చలు. ఇప్పటికి మొత్తం 143 వ్యాసాలూ వ్రాయటం జరిగింది. దాదాపుగా నెలకు పన్నెండు వ్యాసాలు. కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ, టెక్నాలజీ పుణ్యమా అని పాటలు అందించటం, స్లైడు షోలు చెయ్యటం నేర్చుకుని బ్లాగు అందాన్ని(!) పెంచే ప్రయత్నం చేసాను.

నేను బాధపడినది ఈ మధ్యనే. ఎంతో కష్టపడి, రెండు మూడు రోజులు విషయ సమీకరణ చేసి, ప్రముఖ రాజకీయ కార్టూనిస్టు అబూ అబ్రహం గురించి వ్రాస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇటువంటి అద్భుత వ్యక్తుల గురించి ఎవరికీ ఆసక్తి లేదా అనిపించింది. శంకర్ పిళ్ళై, ఆర్కే లక్ష్మణ్, మారియో మిరిండా వంటి అద్భుత కార్టూనిస్టుల గురించి పరంపరగా వ్రాద్దామనుకున్న నా ఉత్సాహం కొంత అణిగి పోయింది.
నాకు చాలా ఆనందం వేసినది, నా బ్లాగులోని వ్రాతలు చూసి ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారు, నా కారికేచర్ గీసి పంపటం. అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. అలాగే, కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి సందర్భంగా నేను వ్రాసిన వ్యాసం చదివి బాగున్నదని వారి అబ్బాయి శ్రీ రోహిణీ ప్రసాదుగారు మెచ్చుకోవటం. నా బ్లాగులో చందమామల గురించి వ్రాస్తూ ఉన్నది గమనించి, జానపద కథాబ్రహ్మ శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి మీద వేసిన రచన ప్రత్యెక సంచిక లో నాకు రెండు మూడు వ్యాసాలు వ్రాసే అదృష్టం మరింత ఆనందాన్నిచ్చింది. నా పేరు మొట్టమొదటిసారిగా తెలుగులో అచ్చులో చూసుకోవటం అదీ "రచన" వంటి ఉత్తమ పత్రికలో కలలో కూడా అనుకోని అద్భుత సంఘటన.

బ్లాగులో వ్రాసుకోవటం ఒక చక్కటి మానసిక వ్యాయామం. రోజువారీ జీవితంలో ఎదుర్కునే అనేకానేక బాధలు, వ్యధలు, విచారాలు, చీకాకులు మరచిపోయి మన లోకంలో మనమే రాజుగా ఉండగలిగిన ఒక చక్కటి వ్యాపకం.

నేను వ్రాసిన రకరకాల వ్యాసాలు ఓపికగా చదువుతూ, మీ అందరిమీద ప్రయోగాలు చేస్తూ నేర్చుకునే నా ప్రయత్నాలన్నీ సహిస్తూ, నా బ్లాగుకు వచ్చి వ్యాఖ్యలు వ్రాసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.










14 కామెంట్‌లు:

  1. సంతోషం...అభినందనలు

    మీరు ఉత్సాహాలు అణగారి పోయాయనో, ఎవరూ స్పందించలేదనో - అలాటి బ్లాగ్మానసిక స్థితి నుంచి ముందు బయటపడండి..అదో దీర్ఘకాలం బాధించే వ్రణం...మీకు నచ్చిన రసాలూ, పంచాలనుకున్న మంచి, రాయాలనుకున్న రత్నం రాస్తూ పోవడమే. మీ తృప్తి కోసం రాసుకోటమే. ఇంకోడి కోసం కాదు...స్పందనల కోసం ఎదురు చూస్తూ ఉంటే కొన్నాళ్ళకు - ఇహ అంతే...ఏమనుకోకండి ఇలా రాసానని... :)

    వంశీ

    రిప్లయితొలగించండి
  2. శివ గారూ
    వార్షిక శుభాకాంక్షలు...
    మీరు మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు నచ్చడానికి 5 కారణాలు.
    1) మీ ఉత్సాహం
    2) సామాజిక స్పృహ
    3) మంచిని అందరితో పంచుకోవాలన్న తపన
    4) మంచిని పొగిడే, చెడు అనుకున్నదానికి తెగిడే చొరవ
    5) సూటితనం

    ఇవి కొనసాగిస్తూ మరింత అద్భుతమైన పోస్టులు అందించాలని కోరుకుంటూ...
    సాహిత్యాభిమాని అభిమాని
    S.Ramu
    Dean
    Indian School of Journalism
    Hyderabad

    రిప్లయితొలగించండి
  3. శివ గారూ! అబూ అబ్రహాం గురించి మీరు రాసింది చదివి, సంతోషించానండీ. అప్పుడేదో నెట్ ప్రాబ్లమ్ వచ్చి వ్యాఖ్య రాయలేదు. నాలాంటివాళ్ళు ఇంకా కొందరైనా ఉండివుండొచ్చు కదా?

    అబూ అబ్రహాం కార్టూన్లు అప్పట్లో ‘వార్త’లో చూసి బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి. ఆ గీతల్లో ఎంత సింప్లిసిటీ!
    ఆ పేపర్ వాళ్లతో ఎవరో అన్నారట కూడా...‘కార్టూనిస్టు మోహన్ ఉన్నాడుగా, బొమ్మలు గీయటం చేతకాని ఆ అబూ అబ్రహాం అనే ఆయనతో కార్టూన్లు వేయిస్తారేమిటి?’ అని! ఆయన గీతల్లో లాలిత్యం చిన్నపిల్లలు బొమ్మలు వేసినట్టు అనిపించటంలో ఆశ్చర్యమేమీ లేదు.

    శంకర్ పిళ్ళై, మేరియో మిరిండా, ఆర్కే లక్ష్మణ్ ల గురించి తప్పనిసరిగా రాయండి. కొత్తవాళ్ళకు వారి గురించి తెలుస్తుంది. తెలిసినవాళ్ళు వారి ప్రతిభను గుర్తు చేసుకుని ఆస్వాదిస్తారు!

    అన్నట్టు... మీ టపాలో ప్రచురించిన ‘వార్తాపత్రిక’ SIVA'S ను ఎలా తయారుచేశారో, ఆ మర్మమేమిటో అంతుబట్టలేదు. బ్లాక్ అండ్ వైట్ లో ఉండేసరికి చాలా పాత పేపర్ ఫీలింగ్ చూసిన చక్కని అనుభూతి కలిగిందండీ.:)

    రిప్లయితొలగించండి
  4. శివ గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    రిప్లయితొలగించండి
  5. ప్రసాద్ గారు, మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఎన్నో వార్షికోత్సవాలతో బ్లాగ్లోకంలో చిరస్థాయిగా వెలుగొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  6. Congratulations Sir ! మీ బ్లాగ్ రెగులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చూస్తూంటాను నేను. నా బ్లాగ్ కూడా మొదలెట్టి రేపటికి సంవత్సరం అవుతుంది.నిన్న నేను రాసిన టపా వీలుంటే చూడండి.
    http://trishnaventa.blogspot.com/2010/05/blog-post_26.html

    రిప్లయితొలగించండి
  7. శివ గారూ !
    ప్రథమ వార్షికోత్సవ శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు......మీ బ్లాగు ద్వారా నా నేను అభిమానించే కళాకారుల గురించి తెలుసుకున్నాను. ముందు ముందు మరింత అద్భుతమైన పోస్టులతో అలరిస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  9. Padmarpita, Vamsi, Karthik,Ramu, Venu, Swarnamallika and Dharaniroy Chowdary: THANK YOU VERY MUCH FOR YOUR GOOD WISHES.

    Venugaroo. There is not much wonder about the old news paper. Just visit our Mana Telugu Chandamama Blog and on the right hand side there is a box CHANDAMAMA ANTE Chitra+Sankar+Vapa. Just click on that and it would take you to a web site. You will know everything.

    రిప్లయితొలగించండి
  10. శివ గారూ, మీరు చెప్పిన ఆధారంతో... పాత న్యూస్ పేపర్ రూపకల్పన గురించి తెలుసుకుని, ఓ నమూనా కూడా తయారుచేశాను. థాంక్యూ!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.