21, జులై 2010, బుధవారం

మా కిషోర్ కుమార్ అన్నయ్య

మా చిన్నతనంలో మా మురళి అన్నయ్య అంటే మాకు ఒక హీరో. నా కంటే 15 - 20 ఏళ్ళు పెద్ద అనుకుంటాను. మా కజిన్. మేము విజయవాడలో ఉంటే వాళ్ళు పక్కనే ఉన్న గుడివాడలో ఉండే వాళ్ళు. మాకు, మా మురళి అన్నయ్య ఎప్పుడు వచ్చినా సందడే. మార్కెట్టులోకి కొత్తది ఏదివచ్చిన వాడి చేతిలో ఉండేది. అప్పట్లో క్రేజు ట్రాన్సిస్టర్ (భుజాన తగిలించుకునేది), లేకపోతె కెమెరా వంటివి మాకు మొదటిసారి చూపించింది ఈయనే. వాళ్ళింట్లో జరిగే శుభ కార్యాలకు దగ్గరుండి మమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు.

అద్భుతంగా పాటలు పాడేవాడు. కాలేజీలో చదివే రోజుల్లో (గుడివాడలో) ఆయన పాడిన పాటలకు ప్రైజులు వచ్చాయి. ముఖ్యంగా దేవానంద్ సినిమా గైడ్ లో "గాతారహే" పాట అద్భుతంగా పాడి అందరినీ మెప్పించేవాడు.

ఆయన చిన్నతనం అంత అయిపోయినాక, మేము కొంచెం పెద్దవాళ్ళయ్యేప్పటికి 1978లో ఒక రోజు సాయత్రం మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను నా దగ్గర ఉన్న అహుజా టేప్ రికార్డరు, హెచ్ ఎం వి గ్రామఫోనుతో రికార్డులను టేపులోకి రికార్డు చేస్తున్నాను. "ఒరే! నీ దగ్గర గైడ్ పాటలు ఉన్నాయిరా?" అని అడిగాడు. నా దగ్గర 78 ఆర్ పి ఎం లక్క రికార్డులో ఉన్న పాటను తీసి ప్లే చెయ్యటం మొదలు పెట్టాను. వెంటనే కూచున్న కుర్చి మీదనే దరువు వేస్తూ పాటను అద్భుతంగా పాడటం మొదలు పెట్టాడు.

వెంటనే నాకు ఆలోచన వచ్చింది, పాటలో ఉన్న మ్యూజిక్ కూడ కలుపుతూ ఈయన పాడిన పాటను రికార్డు చేస్తే బాగుంటుంది అని. వెంటనే నా ప్లాను చెప్పి, కావల్సిన కనెక్షన్లు అవి ఇచ్చి, తలుపులన్ని మూసేసి, ఆ పాటను అహూజా టేప్ రికార్డరులో ఉన్న బిల్ట్ ఇన్ మైకుతోనే రికార్డు చేశాను. ఎప్పుడో 32 ఏళ్ళక్రితం పాడిన పాట, చేసిన రికార్డింగూను. స్నేహితులు రచన శాయిగారు బెంగుళూరు వస్తున్నారని తెలిసి ఆయనకు ఇవ్వటానికి మంచి పాటలు, సాహిత్య ప్రసంగాలు, భక్తి రంజని పాటలు నా దగ్గర ఉన్న ఆర్కైవ్స్ అన్నీ వెతుకుతుంటే, అప్పటి ఈ పాట దొరికింది.

మా కిశోర్ కుమార్ అన్నయ్య అసలు పేరు
పసుమర్తి మురళీకృష్ణ అందరం మురళి అన్నయ్య అని పిలుస్తాం. ఇప్పుడు మనం కరోకే అనుకునే పాటతో పాడుకునే పద్ధతి, అప్పట్లో నాకు చాతయిన పద్ధతిలో రికార్డు చేశాను. ఆయన పాడిన పాటను ఈ కింద ఇస్తున్నాను, విని ఆనందించండి.


చక్కగా పాటలు పాడగలిగిన శక్తి ఉండికూడా ఆరోజులలో తగిన ప్రోత్సాహం, అవకాశాలు లేక ఆయనలో ఉన్న కళ ఆయనకేమీ ఉపయోగపడలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, ప్రస్తుతం పెద్దవాడయిపోయి, తన కొడుకు దగ్గర మచిలీపట్టణంలో విశ్రాంతిగా గడుపుతున్నాడు.

ఆయన ఇప్పటి ఫోటో

8 కామెంట్‌లు:

  1. aayana ganam chala chala bagundi andi,same like kishore voice.ee record ni a peddayana ki vinipinchara? chala thrill iyi vuntaru.

    రిప్లయితొలగించండి
  2. చాలా చాలా థాంక్స్ మామయ్యా. ఈ పాట గురించి మా అమ్మ, రాధ పిన్ని, శారు పిన్ని ఎన్ని సార్లు చెప్పారో లెక్క లేదు. ఈ పోస్ట్ అమ్మమ్మతో సహా అందరికీ చూపిస్తా, పాట వినిపిస్తా. ఎంతగానో సంతోషిస్తారు. పెద్ద మామయ్య స్వరం ఇలా ఇంత చక్కగా మళ్ళీ వింటామని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడే పరిస్తితిలో లేరు.

    రిప్లయితొలగించండి
  3. అందరూ చెపుతూ ఉంటే వినడమే కానీ ఆయన పాడుతుండగా ఎప్పుడు వినలేదు. మాకు ఊహ తెలిసే నాటికి ఆయన పాడడం మానేశారు. పైగా ఈ టేపు మీ ఒక్కరి దగ్గరే ఉంది. వేరే ఎక్కడా ఆయన పాటలు రికార్డ్ చేసినవి లేవు. ఇప్పుడు ఈ పాట వింటూ ఉంటే అమ్మ చెప్పింది చాలా తక్కువేమో అనిపిస్తోంది. ఇలా ఇంత జాగ్రత్తగా భద్రపరిచి మాకు వినిపించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. చాలా మంచి పరిచయం. ఆయన గాత్రాన్ని కూడా వినగలిగినందుకు మీకు కృతజ్నతలు..

    రిప్లయితొలగించండి
  5. @అజ్ఞాతగారూ. తెలుగును తెలుగులోనే వ్రాసే ప్రయత్నం చెయ్యండి. ఆ తరువాత మీ పేరుతోనే వ్యాఖ్యలు వ్రాయండి. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. రికార్డు చేసిన వెంటనే ఆయనకి వినిపించాను. ఆ తరువాత అనేక కుటుంబ ఫంక్షన్లలో ఈ పాట వినటం ఆయన్ని మెచ్చుకోవటం ఒక పరిపాటి.

    @స్వర్ణమల్లిక ఆయన ప్రస్తుత పరిస్థితి మీ దగ్గరనుండి విని బాధపడుతున్నాను. ఒకసారి చూసి రావాలి. మీ వ్యాఖ్య/ల కు ధన్యవదాలు.

    @కేక్యూబ్ గారూ ధన్యవాదాలు.

    @ మాగంటి: ఏరా శాయి. ఎక్కడ ఉన్నావు. ఇందులో గ్రేట్ ఏమున్నది. నా దగ్గర దాచిన పాట, బ్లాగు పుణ్యమా అని ఇలా అందరితో పంచుకోగలిగాను. మన మురళి అన్నయ్య పాట ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 వందలమంది విని ఉంటారు.

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగుందండి .
    ఇలా పాత వాళ్ళు పాడిన పాటలు వినటము గొప్ప అనుభూతి .

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగా పాడారు... ఆయన గొంతులో ఆ మాధుర్యం ఉంది... ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.