24, జులై 2010, శనివారం

"చూసిందే మళ్ళి చూడు" సినిమా ట్రైలర్


మనకు తెలుగులో సినిమా ట్రైలర్లు తయారు చెయ్యటం వాటిని విడుదలకు ముందుగా ఇతర సినిమాలలో విశ్రాంతి సమయంలో చూపటం, తక్కువ. ఏవో అతి కొద్ది సినిమాలకు ట్రైలర్లు ఉన్నాయి. కానీ ఆంగ్ల సినిమాలకు దాదాపు ప్రతి సినిమాకు ట్రైలర్ ఉండి తీరుతుంది. అవి తయారు చెయ్యటం కూడ ఒక కళ, నైపుణ్యం ఉంటే కాని చెయ్యలేరు. కాని ట్రైలర్లు తయారు చేసేవారు చాలా భాగం అభూత కల్పనలతో డాంబికమైన మాటలతో తమ ట్రైలర్లను నింపేసి, ప్రేక్షకులను సినిమా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి డాంబికాలను , అభూత కల్పనలను ఎద్దేవా చేస్తూ ఆకాశవాణి విజయవాడ కళాకారులు మూడు దశాబ్దాల క్రితం తయారు చేసిన సినిమా ట్రైలర్ పారడీ ఒకటి నా దగ్గర కలెక్షన్లో ఉన్నది. అదే "చూసిందే మళ్ళి చూడు" సినిమా ట్రైలర్. విని ఆనందించండి. అలనాటి ఆకాశవాణి కళాకారులకు హృదయపూర్వక అభినందనలు.




ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ పుణ్యమా అని, ఇలాంటివి హాస్య ప్రధానంగా మనం కూడాచెయ్యచ్చేమో ప్రయత్నించి చూడండి.


============================================================
పారడీ సినిమా ట్రైలర్ లో నా కు తెలిసిన గొంతులు శ్రీ . బి ఆనంద్, శ్రీమతి ఎం నాగరత్నమ్మ, శ్రీమతి వి బి కనకదుర్గ. మిగిలిన గొంతులు గుర్తుపట్టినవారు తెలియచేయగలరు.

ఈ వ్యాసం చూసి ఈ కార్యక్రమాన్ని తయారు చేసిన రేడియో కళాకారుని కుమార్తె తృష్ణ గారు ఈ విధంగా తెలియ చేసారు:
ఆ "ట్రైలర్"ను, మా నాన్నగారు శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తిగారు(రేడియో రామం) 1980లో విజయవాడ రేడియొస్టేషన్లో అనౌన్సర్ గా పనిచేస్తున్న రోజులలో, వివిధభారతి శ్రోతల కోసం తయాయరుచేసిన "నీలినీడలు" అనే ప్రోగ్రాం కోసం చేసినది.

ఇటువంటి చక్కటి కార్యక్రమం తయారుచేసి శ్రోతలను అలరించిన రేడియో రామం గారికి అభినందనలు. సమాచారాన్ని అందచేసిన తృష్ణ గారికి థాంక్స్ .
===================================================================

3 కామెంట్‌లు:

  1. చాలా మంచి ఆడియో..
    సార్ మీరు చూడగా పెద్ద లైబ్రరీ లా ఉన్నారు.. ఎన్ని అమూల్యమైన విషయాలు సేకరించారు.. చందమామల దగ్గర నుంచీ మానెక్ షా ప్రసంగం వరకూ..

    మీలాంటి వాళ్ళు బ్లాగులోకి వచ్చి మాకు ఇవన్నీ అందివ్వడం మా అదృష్టం.

    కార్తీక్

    రిప్లయితొలగించండి
  2. హెల్త్ బాలేకపోవటంవల్ల నేను ఈ మధ్యన బ్లాగింగ్ చేయటంలేదండీ.ఇవాళ అనుకోకుండా కూడలి చూడటం అందులో మీ టపా చూసి చాలా ఆశ్చర్యం కలిగింది...
    ఆ "ట్రైలర్"ను, మా నాన్నగారు శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తిగారు(రేడియో రామం) 1980లో విజయవాడ రేడియొస్టేషన్లో అనౌన్సర్ గా పనిచేస్తున్న రోజులలో, వివిధభారతి శ్రోతల కోసం తయాయరుచేసిన "నీలినీడలు" అనే ప్రోగ్రాం కోసం చేసినది. దాని స్క్రిప్ట్,తయారీ కూడా మా నాన్నగారిదే. చేసినవారి పేరు తెలియదన్నారని ఈ వ్యాఖ్య రాస్తున్నానండీ. జాతీయస్థాయిలో మా నాన్నగారికి వచ్చిన పది అవార్డ్లలో ఈ కార్యక్రమం(నీలినీడలు) మొదటిది. విజయవాడ రేడియో కేంద్రానికి సృజనాత్మక కార్యక్రమాల్లో మొట్టమొదటిసారి జాతీయ అవార్డ్ వచ్చిన కార్యక్రమం కూడా ఇదే. దీని తరువాత కూడా మా నాన్నగారికి సృజనాత్మక విభాగంలో చాలా జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ "నీలినీడలు" కార్యక్రమంలో "సినిమా ట్రైలర్" బిట్ కాక ఆసక్తి కలిగించే చాలా బిట్స్ ఉన్నాయి. మీరు రాసినట్లుగా ముఫ్ఫై సంవత్సరాల క్రితమే సమకాలీన సమాజంలో అప్పటికే వస్తున్న కొన్ని విపరీత ధోరణుల గురించి సోదాహరణంగా సౌన్డ్ మీడియంలో వినిపించాలని నాన్నగారు చేసిన ప్రయత్నం ఇది. మూడు దశాబ్దాల క్రితం నాటికే సగటు మనిషి దైనందిన జీవితంలో నానాటికీ పెరిగిపోతున్న స్పీడ్ గురించి ప్రస్తావిస్తూ ఈ "సినిమా ట్రైలర్" ను సొంతంగా తయారుచేసి వినిపించారు; అంటే వంద సంవత్సరాల మనిషి జీవితాన్ని రెండు మూడు గంటల్లో చూపించే సినిమా చాలా స్పీడ్ క్రిండే లెఖ్ఖ. అలాంటి రెండు,మూడు గంటల సినిమా సారాంశాన్ని కేవలం పది నిమిషాల వ్యవధిలోనే తెర మీద చూపించే సినిమా ట్రైలర్ ఇంకా స్పీడ్ కదా. మనిషి జీవితంలో నానాటికీ పెరిగిపోతున్న స్పీడ్ ని మూడు దశాబ్దాల క్రితమే పసిగట్టి చేసిన చిన్న ప్రయత్నం ఇది. సమాజంలోని ఇలాంటి అనేక నీలినీడలను గురించి ఇంకా ఎన్నో ఉదాహరణలు ఆ ప్రోగ్రాంలో ఉన్నాయి.

    ఈ సినిమా ట్రైలర్ గురించి విన్న, చదివిన బ్లాగ్మిత్రులకి, ఇది తయారు చేసిన రూపకర్త రామం గారి అమ్మాయిగా ఈ వివరణ ఇస్తే బాగుంటుందని ఓపిక చేసుకుని ఈ వ్యాఖ్య రాస్తున్నానండి.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది శివగారూ.. మిమ్మల్ని చూసైనా బద్ధకించకుండా ఇంకా చాలా మంది ఇలాటి సమాచారంతో ముందుకు రావాలని కోరుకుంటూ....మీ ఆసక్తికి, ఓపికకు ఆశ్చర్యపోతూ, ఆణిముత్యాలు అందిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలతో

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.