18, సెప్టెంబర్ 2010, శనివారం

భక్తి రంజని


















రేడియో
వింటూ ఉన్నప్పటి నా జ్ఞాపకాలు అని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తే, మొట్టమొదటిగా తలపుకు వచ్చేది 'భక్తి రంజని" కార్యక్రమమే. కారణం, పొద్దున్నే ఆరుగంటలకు మొదలయ్యే ఈ చక్కటి కార్యక్రమం, చిన్నతనంలో నన్ను లాలిస్తూ నిద్రలేపటమే. మా నాన్నగారు, తెల్లవారుఝామునే లేచి వ్యాయామం చేసి, ఆరుగంటలకల్లా రేడియో పెట్టేవారు. ఆ శ్రావ్యమైన భక్తి పాటలు వింటూ నిద్ర లేవటం ఎంతటి ఆనందాన్నిచ్చేది! ఆయన తన దగ్గర ఉన్న రెండు చేతి గడియారాలు, ఒక అలారం గడియారం వీటన్నిటికి కీ ఇవ్వటానికి సమయం ఏడుగంటల వార్తలు వింటూ. సరిగ్గా తెలుగు వార్తలు మొదలవ్వటం, ఆయన గడియారాలకు కీ ఇస్తూ వాటి టైము సరిచూడటం. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొచ్చినా, అవ్వొక చక్కటి రోజులు.

భక్తి రంజని అనగానే వెంటనే గుర్తుకు వచ్చెవారిలో మొట్టమొదటి వారు శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు గారు శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు. వీరిద్దరూ పాడినన్ని భక్తి రంజని పాటలు మరెవ్వరూ పాడలేదు. ముఖ్యంగా వోలేటి వెంకటేశ్వర్లుగారు పాడిన భజగోవిందం ఎంత శ్రావ్యంగా, రాగయుక్తంగా ఉందేది. ఆ అద్భుత గానం నుండి కొద్దిగా విని ఆనందించండి.


అలాగే బాలాంత్రపు రజనీ కాంతరావుగారు, అధికారి మరియు కళాకారుడు. సామాన్యంగా ఆ రోజుల్లో కళాకారులైనవారే స్టేషన్ డైరక్టర్లుగా ఉండేవారు. గుమాస్తాలు ప్రమోషన్లు సంపాయించి డైరక్టర్లు అయ్యేవారు కాదు. స్వతహాగా సంగీత కళాకారుడైన రజనీ కాంత రావుగారి ఆధ్వర్యంలో ఎన్నో చక్కటి భక్తిరంజని గీతాలు తయారు చెయ్యబడినాయి. వాటిల్లో బహుళ ప్రజాదరణ పొందినవి "సూర్యాష్టకం" ఈ చక్కటి అష్టకాన్ని గానం చేసినవారు శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీ జగన్నాధాచార్యులు శ్రీ రమణమూర్తి, శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు, శ్రీమతి వింజమూరి లక్ష్మి తదితరులు. ప్రతక్ష్య దైవమైన సూర్యభగవానుడిని కీర్తిస్తూ పాడిన ఈ అష్టకంలో రజనీ కాంతరావుగారి గాన మాధుర్యం ఒక్కసారి వినండి.


ఇదే విధంగా "శ్రీ సూర్యనారాయణా" అన్న ఒక రమణీయమైన బృందగీతం. ఈ పాట సామాన్యంగా ఆదివారాల్లో మాత్రమే వేసెవారు (ఆదివారం సూర్యుని రోజు కావటం వల్ల కాబోలు). ఈ పాటకోసం వారమంతా వేచి ఉండి. ఆదివారమైనా సరే పొద్దున్నే లేచి వినటంలో ఉన్న ఆనందం, ఇప్పుడు పొద్దున్నే వచ్చే చద్ది వార్తలు వింటూ లేవటంలో లేదు. ఒక్కసారి ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవటానికి "శ్రీ సూర్యనారాయణా" అంటూ మనం కూడ గళం కలిపి ఆనందిద్దాం!


ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని భక్తి గీతాలు. ఒక్క హిందూ మత కీర్తనలు, బృద గీతాలే కాకుండా వారాన్ని బట్టి శుక్రవారం ఖురాను పఠనం, ఆదివారం బైబిలు నుండి సూక్తులు ఎంతో చక్కగా వినిపించేవారు. ఖురాను పఠనం 1960లు 1970 మొదటి రోజులలో ఒక సాయిబు గారు హాయిగా చక్కటి తెలుగులో వినిపించేవారు. అదేమీ ఎబ్బెట్టుగా ఉండేది కాదు. మనకు సంబంధించినదే వింటున్నట్టుగా ఉందేది. ఇక పండుగలు వస్తే ఆ పండుగకు సంబంధించిన పాటలు, దుర్గాదేవి, వినాయకుడు, తిరుప్పావై ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు.

ఇన్ని జ్ఞాపకాల్లో అవో కొన్ని మాత్రమే ఆకాశవాణిలో ఉన్న ఏ పుణ్యాత్ముడు పూనుకుని సి డి లువేసి అమ్మారో, వారి దయతో కొన్ని మనం మళ్ళి వినగలుగుతున్నాం. కాని భక్తి రంజని మొత్తం ఒక డి వి డి కింద తయారు చేసి ఆకాశవాణివారు అమ్మితే ఎంత బాగుండును. నిజం! అనేక మంది ప్రముఖులు, వాళ్ళు భక్తి రంజని అభిమానులమని అనేక కార్యక్రమాలలో వేదిక మీదనుండి చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఆకాశవాణి వారు మరొక్కసారి పూనుకుని, మొత్తం భక్తిరంజని పాటలు అన్ని కూడ ఒక డి వి డి వేసి, అందులో అలనాటి కళాకారుల వివరాలు ఫొటోలు, ఇంకా జీవించి ఉన్నవారితో పరిచయాలు కలిపి విడుదలచేస్తే ధర ఎంతైనా సరే కొనుక్కోవచ్చు. అంతటి మంచి ఆలోచన ఆకాశవాణి వారికి కలుగాలని, భక్తి రంజనిలో మనకు వినపడే దేవుళ్ళందరినీ నేను ప్రార్ధిస్తున్నాను.

అదే విధంగా అలనాటి భక్తి రంజని, ముఖ్యంగా ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి ప్రసారమైన పాటలు ఎవరి దగ్గరైనా రికార్డింగులు ఉంటే వాటిని తమ బ్లాగుల ద్వారా పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను.

2 కామెంట్‌లు:

  1. ఆకాశవాణి హైదరాబాదు భక్తిరంజనిలో టంగుటూరి సూర్యకుమారి
    గళంలో "చిదానందరూప శివోహం శివోహం" చాలా అద్భుతంగా
    ఉండేది. ఇప్పుడు ఆ రేడియో వెర్షను ఎక్కడా వినపడదు.

    మొదట్లో భక్తిరంజని అరగంటసేపు ప్రసారం అయ్యేది. శనివారం
    కచ్చితంగా వెంకటేశ్వర సుప్రభాతం ఎందుకని వినిపిస్తారో అర్ధం
    అవదు! ఆ సుప్రభాతం అయితే బోరుగా ఉండేది కానీ ఆ
    తరువాత వినిపించే గద్యం బాగుండేది. ఇప్పుడా గద్యం రేడియో
    లో వినపడదు. (టెలివిజను SVBలో వస్తుంది)

    అలాగే సోమవారాల్లో మల్లికార్జున సుప్రభాతం, అఖండ తాండవం,
    గిరిజా కల్యాణం మొదలైనవి చాలా వినసొంపుగా ఉండేవి. ఇప్పుడు
    అవి ఎక్కడా లభించవు. ఘంటసాలగారి గిరిజా కళ్యాణం చాలా
    కుదింపులకి గురయ్యింది

    ధనుర్మాసం సంధర్బంగా ప్రసారం అయ్యే తిరుప్పావై కూడా కుదింపులు
    అయి , కాలదోషం పట్టి వినడానికి ఇబ్బందిగా తయారయ్యింది. అయినా
    అదే ప్రసారం చేస్తూ ఉంటారు. అది వింటేనే విన్నట్లు ఉంటుంది శ్రోతలకి!
    ఆ రికార్డులని సరిచేసే ప్రయత్నమే చేయరు ఆకాశవాణి పెద్దలు. మరో
    ముఖ్యమైన కార్యక్రమం దేవీ నవరాత్రుల సంధర్బంగా ప్రసారం అయ్యే
    "దేవీ శరణం గచ్చామి". ఈ రికార్డుల నాణ్యత కూడా సరిచేయాల్సి ఉంది

    రిప్లయితొలగించండి
  2. మనవాణిగారూ!

    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.అలనాటి భక్తిరంజనిలోని అపురూపమైన పాటలను ఆకాశవాణివారు సి డి లుగా వేసి అమ్ముతున్నారు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో చిన్న స్టాళ్ళు పెట్టి వీటిని విక్రయించే ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ స్టాళ్ళల్లో ఉండే మనుషులకు వివరాలు పెద్దగా తెలియదు. మనమే వెతుక్కుని కొనుక్కోవాలి.

    మీ దగ్గర పాత కార్యక్రమాల టేపులు ఉంటే తెలియచేయగలరు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.