22, సెప్టెంబర్ 2010, బుధవారం

పూర్వ విద్యార్ధులు - వారి అభిరుచి

మనం స్కూల్లో చదివే రోజుల్లోనూ, కాలేజీలో చదువుకునే రోజుల్లోనూ విన్న పాటలు, చూసిన సినిమాలు చాలా కాలం గుర్తుండిపోతాయి. మన అభిరుచి ఒక రూపం దిద్దుకునే రోజులు మనకున్న తీపి గుర్తులు. ప్రతివారికి 14-15 సంవత్సరాల నుండి 18-19 సంవత్సరాల వయస్సులో ఏర్పడ్డ అలవాట్లు, అలోచనా ధోరణులు దాదాపుగా జీవిత కాలం ఉంటాయి. అందుకనే, మనవాళ్ళూ మొక్కై వంగనిది మానై వంగుతుందా అని జాగ్రత్త చెబుతూ ఉంటారు. వయస్సులో పాశ్చాత్య సంగీతం అంటె అభిరుచి ఏర్పడితే అదే ఉండిపోతుంది. తరువాతి కాలంలో ఇతర సంగీత పధ్ధతులను అస్వాదించటం తెలుసుకున్నా, మొదటి అభిరుచి మీద ఉండే మక్కువ ఎప్పటికీ మారదు.

మనం చదువుకునే రోజులలో మనకు నచ్చిన పాటలన్ని కూడ పోగుచేసి ఒకచోట ఉంచుకోవటం సాధ్యమౌతుందా? అసలు ఆ పాటలు దొరుకుతాయా? అలా ఆ పాత తీపి జ్ఞాపకాలుగా, మన మనస్సులో వినపడే అనేకానేక పాటలు దొరకవు. ఎప్పుడన్నా దొరికితే పరమానందం కలుగుతుంది. పూర్వ విధ్యార్ధులు బాచిలవారీగా (సంవత్సరాలవారిగా) విద్యార్ధి సంఘాలు ఏర్పాటు చేసుకుని కలుసుకోవటం, ఒకరిని ఒకరు చూసుకుని ఆనందించటం, జీవితంలో తాము సాధించిన విజయాలు అందరితో పంచుకోవటం, వైఫల్యాల బాధ నుండి ఉపశమనం పొందటం ఈ పూర్వ విధ్యార్ధి కలయికలలో జరుగుతుండటం సహజం. ఈ కలయికలో ఉండే పరమానందం ప్రముఖ రచయిత చలం గారు తన కథలో (కథపేరు గుర్తుకు రావటంలేదు) అప్పుడు వారి వయస్సు, సమాజంలో వారి స్థాయి మరిచిపోయి చేసే అల్లరి ఎంతో చక్కగా పూర్తి హాస్యంతో వర్ణించి చెప్పారు. ఇదే విధంగా విశ్వనాథ సత్యనారాయణగారు కూడ తన రచనల్లో ఒకచోట ఈ ఆనందం గురించి వ్రాసినట్టు గుర్తు

తెలుగునాట అటువంటి పూర్వ విద్యార్ధి సంఘాలు, తమ రోజులలో విని ఆనందించిన పాటలు, సంగీతం ఒక చోట పోగు చేసి "తమ వాళ్ళందరికీ" మాత్రమే కాకుండా, ఆయా సంవత్సరాలలో పెరిగి పెద్ద వారైన వారందరికి ఒక బంగారు గనిలాగ వెబ్‌సైటును ఏర్పరిచిన ఉదాహరణలు లేవు. అలనాటి రచయితలు, రచనలు, పాటల మీద మక్కువతో అమెరికా నుండి సుసర్ల శాయి గారు, మాగంటి వంశీగారు వంటి వారు తమ తమ వెబ్ సైట్లల్లో దొరికినంతమేర బంగారపు తునకలను ఉంచుతున్నరు. వారి కృషి ఎంతైనా అభినందనీయం.

ఇంటర్నెట్‌లో అటూ ఇటూ వెతుకుతుంటే, ఒక చక్కటి వెబ్ సైటు దొరికింది. ఆ వెబ్సైటు ఏర్పరిచినవారు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలోని బ్రైర్‌క్లిఫ్ఫ్ మానర్ అనేచోట ఉన్న బ్రైర్‌క్లిఫ్ఫ్ హై స్కూల్ పూర్వ విద్యార్ధులు. ఈ స్కూల్లో తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతివరకు ఉన్నది, 1956 లో నెలకొల్పబడింది. ఈ స్కూల్లో ఐదారు వందల మంది విద్యార్ధులు చదువుతూ ఉంటారు. 2008లో ప్రముఖ అంతర్జాతీయ వార పత్రిక న్యూస్ వీక్ వారు చేసిన ఒక సర్వేలో అమెరికాలో ఉన్న 1200 గొప్ప స్కూళ్ళల్లో 301వ స్కూలుగా గుర్తింపు పొందింది వారి స్కూలు చిహ్నం (మాస్కట్) ఎలుగుబంటి.

1960వ సంవత్సరంలో చదువుకున్న విద్యార్ధులు కొంతమంది కలిసి ఈ వెబ్సైటు ఏర్పరిచి, తాము చదువుకునే రోజుల్లో తమకు ఇష్టమైన పాటలన్ని పోగుచేసి అందులో వినటానికే కాక డౌన్లోడ్ చేసుకోవటానికి వీలుగా కూడ ఉంచారు. ఆ వెబ్ సైటులో నాలుగు వందలకు పైగా పాటలు ఉన్నాయి. అక్కడ ఉన్న పాటల్లో కొన్నిటి కలగలుపు ఈ కింది ప్లైయర్లో వినండి.

ఈ వెబ్సైటు చూసి అక్కడ ఉన్న పాటలన్ని ఏమిటో చూద్దామని ఆసక్తి ఉన్నవారు, ఈ కింది లింకు నొక్కి, చూసి, విని ఆనందించవచ్చు.

పూర్వ విద్యార్ధులు మెచ్చిన పాటలు

మనకు కూడ ప్రస్తుతం ఉన్న సాంకేతిక ఉపకరణాలను, ఇంటర్నెట్టును ఉపయోగించుకుంటూ ఇటువంటి వెబ్ సైట్లు ఏర్పరుచుకోగలిగితే ఎంతో బాగుంటుంది.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.