4, అక్టోబర్ 2010, సోమవారం

రిక్షాలో కవిరాజు

బొమ్మకు ఒక ముఖ్య కథ ఆ తరువాత ఒక ఉప కథ ఉన్నాయి.

ముందుగా ముఖ్య కథ. పై బొమ్మలో ఉన్నవారెవరో తెలుసుకదా! తెలియకపోతే ఈ పోస్టుకు ముందు పోస్టు చూడండి. ఈ ఫొటో ది హిందూ పత్రికలో 23 సెప్టెంబరు, 2006 న ప్రచురితమైనది. ఈ ఫొటో దాదాపుగా 1940ల చివరి భాగంలోనో లేదా 1950-51 ప్రాంతాలలో విజయవాడలో తీయబడింది. ఫొటోను తీసినది శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి స్నేహితుడుట. వారి పేరు తెలియలేదు.

పురాణం వారు, వారి స్నేహితుడు విజయవాడలోని (అప్పటి బెజవాడలో) ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో చదువుకుంటూ ఉండే సమయంలో జరిగిన సంఘటన ఇది అని తెలిసింది. అప్పట్లో తొక్కుడు రిక్షాలు ఉండేవి కాదు. మనిషి లాగే రిక్షాలే ఉండేవి. ఈ మధ్యవరకూ కూడ మన కలకత్తాలో కనపడేవి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. సరే, కథలోకి వస్తే (నిజంగా జరిగినదే) అలా వారు చదువుతున్న కాలేజీలోనే, ఒక ప్రముఖ రచయిత భవిష్యత్తులో కవి సామ్రాట్టు, ఐన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు శాఖాధిపతిగా ఉండేవారు. విశ్వనాథవారు కాలేజీకి దగ్గరలోనే ఉన్న మారుతీ నగర్లో ఉండేవారనుకుంటాను (వారిని ఆ ఇంట్లోనే మా మామయ్యతో కలిసి రెండుసార్లు చూశాను, చాలా కాలం క్రితం లెండి అప్పటికి నేను చాలా చిన్నవాడిని) సరే మళ్ళి కథలోకి నన్ను లాగితే, అలా విశ్వనాథవారు మారుతీ నగర్లో ఉంటూ ఆ దగ్గరిలోనే ఉన్న కాలేజీలో తెలుగు శాఖాధిపతిగా ఉండేవారు. రోజూ కాలేజీకి వెళ్ళటానికి ఆ తెలుగు మాష్టారు గారికి కారా, మోటారు సైకిలా. వెళ్తే నడిచి వెళ్ళటం లేదా రిక్షా. సామాన్యంగా అలా రిక్షాలోనే వెళ్ళేవారుట. ఆ విధంగా ఈ కవిరాజు రిక్షాలో ఠీవిగా వెళ్తున్నాపుడు, మన స్నేహితుల ద్వయం (పురాణం అండ్ కో) కంటపడ్డారు. "అండ్ కో" దగ్గర ఆ సమయానికి కెమేరా ఉన్నది, అలా క్లిక్ మనిపించి ఒక చారిత్రాత్మకమైన ఫొటో సొంతం చేసుకున్నారు. సరే తీసి దాచుకోవచ్చుకదా! లేదు, విశ్వనాథవారి శిష్యులు కాదూ, ఫొటో ప్రింటు చేయించి రిక్షాలో కవి రాజు అని అందరికీ చూపించారట. ఈ ఫొటో ఎలా చిక్కిందో మరి, హిందూ పత్రిక వారు వారి పత్రికలో వేశారు. అది నేను ఇంటర్ నెట్లో చూసి సేవ్ చేసుకుని దాచుకున్నాను. ముఖ్య కథ సమాప్తం.

ఇక ఉప కథ. ఓ ఆదివారం మధ్యాహ్నం, నేను నెట్లో పడి కొట్టుకుంటూ ఉంటే, మితృలు, ప్రముఖ కార్టూనిస్టు శ్రీ మట్టెగుంట అప్పరావు (సురేఖ) గారి దగ్గర నుండి ఒక జరూరు మైలు. ఏమని? ముళ్ళపూడి వెంకటరమణ గారు తన "కోతి కొమ్మచ్చి" కథ మూడవ భాగంలో తాను వ్రాసిన విషయానికి సరిపోయే ఫొటోల కోసం వెతుకుతున్నారని, అందులో శ్రీ విశ్వనాథ, శ్రీ పి వి నరసింహారావు గార్ల నడివయస్సు ఫొటోలు ఆయనకు కావాలని చెప్పారు. నాకు వెంటనే ఇంతకు ముందే హిందూ ఆన్ లైను పత్రికనుండి నేను చురాయించిన ఫొటో గుర్తుకు వచ్చింది. కాసేపు అలా నెట్లో వెతికి పి. వి. గారి ఫొటో ఆయన మధ్యవయస్సులోనిది కూడా సంపాయించాను. వెంటనే, ముళ్ళపూడిగారికి ఈ రెండు ఫొటోలు పంపాను. ఫొటోలు నేను తియ్యలేదు, ఆ ఫొటోల్లో నేను లేను, ఆ ఫొటోల్లో ఉన్నవారు నాకు రక్త బంధువులు కాదు (సాహితీ బంధువులు మాత్రమే). ఐనా కూడా, ఈ రెండు ఫొటోలు స్వాతి పత్రికలో, కోతి కొమ్మచ్చి మూడవ భాగం ధారావాహికలో ప్రచురితమవ్వగానె పరమానందమయ్యింది. అలా కోతి కొమ్మచ్చి మూడవ భాగలో, ఉడతా సాయంగా, ఈ ఫొటోలు పంపిన వైనం ఎన్ని రోజులైనా గుర్తుంటుంది. ఉప కథ కూడ సమాప్తం.

నాకు గుర్తులేక వ్రాయని విశేషాలు హిందూ పత్రికలో (ఆంగ్లంలో) ఉన్నాయి ఈ కింది లింకు నొక్కి చదవగలరు

రిక్షాపై కవిరాజు

ఫోటో తీసిన వారు శ్రీ అండవల్లి సత్యనారాయణ గారు అని పైన ఉన్న హిందూ ఫీచర్ చదివిన తరువాత తెలుస్తున్నది.

నేను పంపిన ఫోటో కోతి కొమ్మచ్చిలో విధంగా కనపడింది
పై పేజీ స్వాతి పత్రిక కర్టెసీ

6 కామెంట్‌లు:

  1. బాగున్నై మీ కథలు రెండూ. ఫొటో అంతకన్నా బాగుంది. విశ్వనాథవారికి సాధారణంగా ఉపయోగించే బిరుదు కవిసామ్రాట్టు (ఎవరిచ్చారో నాకు తెలియదు). కవిరాజు అని టపా శీర్షిక చూసి టపా తెరవంగానే విశ్వనాథ ఫొటోచూసి కొంచెం అయోమయానికి గురయ్యాను. కవిరాజు అని త్రిపురనేని రామస్వామిగారిని సంబోధించడం ఉంది. ఆయనకి ఆ బిరుదు ఎవరిచ్చారో కూడా నాకు తెలియదు.
    విశ్వనాథవారు మారుతీనగర్‌లోనే నివాసం ఉండేవారు. ఆ వీధికి తరవాత ఆయన పేరు పెట్టారు.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు కొత్తపాళీగారూ, కే క్యూబ్ గారూ.

    రిప్లయితొలగించండి
  3. ప్రముఖ రచయిత కవి సామ్రాట్టు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చాలా చక్కని విషయం వ్రాశారు....కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు.
    శ్రీ విశ్వనాధ వారిని గురించి ఎంత చదివినా ఇంకా మిగిలి పోతూనే ఉంటుంది. చింతా వారి " ఆంధ్రామృతంలొ " విశ్వనాధ వారి భావుకతని చదివే ఉంటారనుకొంటాను.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.