17, నవంబర్ 2010, బుధవారం

ఈ  శిధిలాలలో.....


క్రితం సంక్రాంతికి(జనవరి 2010) విజయవాడ వెళ్లినప్పుడు, ఆకాశవాణి వారి కేంద్రానికి కొత్త సి డి లు ఏమన్నా అమ్ముతున్నారేమో అని చూడటానికి వెళ్లాను. కొత్త సి డి లు లేవు. ప్రస్తుతం ఆకాశవాణి వారి కొత్త భవనాలలో (కట్టి కూడా 30-40 సంవత్సరాలు అయ్యి ఉంటుంది) పని చెసుకుంటున్నారు. అలనాటి వారి స్టూడియోలు ఎలా ఉన్నాయో అని పరికిస్తే, పరిస్థితి విధంగా ఉన్నది.1948 లో స్థాపించబడినప్పటి నుండి అద్భుతమైన కార్యక్రమాలను అందించిన ఆకాశవాణి విజయవాడ కేంద్రపు పూర్వ స్టుడియోల పరిస్థితి ఇది. బహుముఖ ప్రజ్ఞాశాలురు, శ్రీ బందా కనక లింగేశ్వర రావు,శ్రీ ప్రయాగ నృసింహ శాస్త్రి , శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు, శ్రీ ఉషశ్రీ, శ్రీ కూచిమంచి కుటుంబరావు, శ్రీ కె వెంకటేశ్వర రావు, శ్రీ ఓలెటి వెంకటేశ్వర్లు, శ్రీ నండూరి సుబ్బారావు, శ్రీ చివుకుల రామమోహనరావు, శ్రీ ఏ బి ఆనంద్, శ్రీమతి పి సీతారత్నం , శ్రీమతి నాగరత్నమ్మ, కుమారి వి బి కనకదుర్గ, కుమారి వింజమూరి లక్ష్మి మున్నగుగా గల నటీ నటులు, ఇంకా నాకు తెలియని ఎందరో మహానుభావులు అద్భుత కళాకారులు వారు చేసేది ఏదో ఉద్యోగ ధర్మంగా కాకుండా, పూర్తిగా మనసుపెట్టి, తయారు చేసిన అద్భుతమైన సంగీత, నాటక, నాటికలు అన్ని కూడా పైనున్న శిధిలాల నుండి వచ్చినవే. నాకు బాగా గుర్తు, పక్కనుండి ఎప్పుడు వెళ్ళినా స్టుడియోల వంక ముచ్చటగా చూసుకునేవాళ్ళం. ఎన్నెన్ని చక్కటి కార్యక్రమాలు, గణపతి, వర విక్రయం, కన్యాశుల్కం, నాటికి నేడు వంటి నాటికలు బావగారి కబుర్లు, వినోదాల వీరయ్య, ఉషశ్రీ పురాణాలు, ధర్మ సందేహాలు వంటి చిక్కటి శీర్షికలు, చిన్న పిల్లల కార్యక్రమాలు, పావు గంట, అరగంట, గంట నాటికలు, నాటకాలు, ఆదివారాల్లో సంక్షిప్త చలన చిత్రాలు, కార్మికుల కార్యక్రమం, వనితావాణి, అన్నిటికి మించి పంట సీమలు(శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారిచే మొదలు పెట్టబడి రైతులపాలిట పెన్నిధిగా మారిన కార్యక్రమం) ఎన్నని చెప్పేది అన్నీ...అన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. గుర్తులు మిగలకుండా మన ఆకాశవాణి వారు చాలా జాగ్రత్తపడినట్టు కనిపిస్తున్నది, మిగిలినది మన జ్ఞాపకాలేమో! లేదా ఆకాశవాణి వారి భాండారాలలో ఆశ్రధ్ధతో ఎక్కడన్నా పొరబాటున వదిలేసినవి ఏమన్నా ఉన్నాయేమో మరి! ఎక్కడో ఒక చిరు ఆశ.

మనకు మన కళా రూపాల మీద, అలనాడు కళా సృష్టి జరిగిన భవనాలు, నివాసాలయాలు మున్నగునవి జాగ్రత్తపరిచి మ్యూజియాలుగా తయారుచేసే శ్రద్ధ కరువైనది. పైన చెప్పిన భవనం మొత్తం కలిపి ఒక ఏడు ఎనిమిది వందల గజాలు ఉంటుంది ఏమో. ప్రభుత్వానికి స్థలం ఏపాటి? కొత్త భవనాలు కట్టగానే పాత భవనాన్ని చక్కగా పరిరక్షించే ఏర్పాటు చేసి, అందులో అలనాటి కళాకారుల ఫోటోలు, వారి జీవిత వివరాలు, తెలుగు నాట రేడియో చరిత్ర, అప్పటి కార్యక్రమాల ఆడియోలు ఉంచి ప్రజల సందర్శనార్ధం ఏర్పాటు చేసి ఉంటే ఎంత బాగుండేది! అటువంటి మ్యూజియంలోనే ఆకాశవాణీవారి సి డిలు అమ్మే ఏర్పాటు చేసి ఉంటే!! సరి! సరి !!అన్ని కలలే. మనకు అదృష్టం లేదని బాధ పడటమే మిగిలింది.

అలనాటి అద్భత కార్యక్రమాలనే భద్రపరచలేక పారేసుకుని, ఇప్పుడు మీరా మీరా అంటూ వీధినపడి పేపరు ప్రకటనల ద్వారా వారివే అయిన రేడియో కార్యక్రమాలను ప్రజల దగ్గర నుండి మీరిస్తారా మీరిస్తారా అంటూ అభ్యర్ధించాల్సిన స్థితికి తెచ్చిన ఆకాశవాణి అధికారులకి ఇంతటి కళా దృష్టి ఉండి పాత భవనాలను పరిరక్షించి ఏదో చేసి ఉండాల్సినది అనుకోవటం పూర్తిగా దురాశే అనిపిస్తున్నది.
.3 వ్యాఖ్యలు:

 1. ప్చ్...! ఇది చదివాక, మనసంతా బాధతో నిండిపోయింది. కామెంట్ కూడా చెయ్యాలని లేదు. కిం కర్తవ్యం?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నా బాధ పంచుకోవటానికే, వ్రాశాను మిత్రమా. పొరబాటున ఆకాశవాణివారు ఎవరన్నా చూసి ఈ విషయంలో ఎవరన్న కొద్దిగ....కొద్దిగానైనా స్పందిస్తారేమోనని ఈ ఆశాజీవికి కొట్టుమిట్టాడుతున్న ఆశ.

  కిం కర్తవ్యం....చిన్న పని. ఆకాశవాణి కార్యక్రమాల మీద మక్కువ ఉన్న వారందరూ తలా ఒక్క పోస్టుకార్డు వారికి ఇష్టమైన కేంద్రాలకు ఉత్తరాలు వ్రాసి వారికి ఇష్టమైన కార్యక్రమాలగురించి వాకబు చెయ్యటం, వారి అభిమాన నటీ నటుల గురించిన వివరాలు అడగటం మొదలుపెడితే, మెల్లిగా నిద్ర నటించేవాళ్ళు కూడ నిద్ర లేస్తారని చరిత్ర చెబుతున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "నిద్ర నటించేవాళ్లు కూడ నిద్రలేస్తారని చరిత్ర చెబుతున్నది."

  చదువుతున్న నాకే కత్తితో ఎక్కడో పొడిచినట్లుంటోంది. ఆకాశవాణి మందపు చర్మాలు దీనికయినా స్పందిస్తాయా?

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.