17, నవంబర్ 2010, బుధవారం

దొరికిన పెన్నిధి!

బొమ్మ చూడంగానే పెన్నిధి ఏమిటో అర్ధం అయిపోయిందా? సరే అర్ధం అయినా నే చెప్పే రెండు మాటలూ కూడ చూడండి.

మన 'రచన' శాయిగారు, దాసరి సుబ్రహ్మణ్యంగారి ఇతర రచనలు (అంటే చందమామలో కాకుండా వేరే ప్రచురణ అయినవి) ఒక సంపుటిగా తీసుకుని వస్తున్నారు. ఈ కింది లింకు నొక్కి వివరాలు చూడండి, వీలైతే ఈ ప్రయత్నంలో సహాయపడండి. చందమామ అభిమానులందరూ, నాతోపాటుగా, ఇప్పటికే వారు చేయగల సహాయం వారు చేశారు.




సరే అసలు విషయానికి వస్తే, శాయిగారు, దాసరివారిచే రచించబడిన 'మృత్యు లోయ ధారావాహికను కూడ పైన ఉదహరించిన సంపుటిలోకి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారు. నా దగ్గర ఆ రోజుల్లో బొమ్మరిల్లు మొదటి సంచిక దగ్గరనుండి, ఆ ధారావాహిక అయిపొయ్యేవరకు సంచికలు అన్ని ఉండేవి. వాటిల్లోంచి మృత్యులోయ ధారావాహికను అట్టమీద ఆ ధారావాహిక రంగు బొమ్మలను విడతీసి, నేను నాగార్జునసాగర్ లో పనిచేస్తున్న రోజులలో, మా ఆఫీసు ఫైలరు (స్వర్గీయ) గోపాల్ బైండు చేసిపెట్టాడు. ఆ బైండు ఈ మధ్య కూడ చూసిన జ్ఞాపకం. కాని, మనకు అవసరం వచ్చినప్పుడు కనపడితే మర్ఫీ సూత్రాలు, పీటర్ వారి మాటలు ఎందుకు వస్తాయి?!

సరే శాయిగారు చెప్పినమీదట విజయవాడలో మా తమ్ముడి చేత నా కలెక్షన్ మొత్తం వెతికించాను, కనపడలేదు. ఇక ఇక్కడ బెంగుళూరులో నా దగ్గర ఉన్న కొద్ది కలెక్షన్లో వెతకటం మొదలుపెడితే, దేనికోసం వెతుకుతున్నామో అది "సహజంగా" కనపడలేదు, పై ఫొటోలొ ఉన్న నిధి మటుకు దొరికింది. ఎంతో కాలంగా ఈ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయా అని మధన పడుతున్నాను. ఇవ్వాళ్టికి దొరికాయి.

నిధి గురించి:

ఈ చిన్ని చిన్ని పుస్తకాలు నిధి అంటారేమిటి అనుకునే వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళకోసం కాదు ఈ మాటలు.

చిన్నప్పుడు, మనం చదువుకున్న క్లాసు పుస్తకాల దగ్గరనుండి, అప్పుడు మనం చదివి అనందించిన బొమ్మల పుస్తకలు, చందమామలు, బొమ్మరిల్లు, శంకర్స్ వీక్లీలు వగైరా వగైరాలు అన్ని మళ్ళి ఇప్పుడు దొరికితే అవన్ని నా దృష్టిలో నిధే.

బొమ్మరిల్లు 1971 అక్టోబర్ లో అనుకుంటాను ప్రారంబించారు. చందమామ వంటి అద్భుత పత్రిక మార్కెట్టులో అప్పటికే పాతుకుపోయి ఉండగా, ఆ పత్రికకి దీటుగా పాఠకులను ఆకర్షించటానికి బొమ్మరిల్లు చెయ్యని ప్రయత్నం లేదు. బొమ్మరిల్లు బాపినీడుగారు ఈ విషయంలో చాలావరకు విజయం సాధించారు, చందమామ సర్క్యులేషన్ కొంతవరకు కొల్లగొట్టగలిగారు. బాపినీడు గారి ప్రయత్నం విజయవంతం అవటం చూసి ఇంకా అనేక పత్రికలు బుజ్జాయి వంటివి మార్కెట్టులోకి రావటానికి సాహసించాయి. అప్పటివరకు చందమామ ఉండగా మనం నిలదొక్కుకోగలమా అనే ప్రచురణకర్తల భయాన్ని, బొమ్మరిల్లు బాపినీడుగారు పటాపంచలు చేశారు. బొమ్మరిల్లు వారు చేసిన అనేకానేక ప్రత్యేక ఆకర్షణల్లో 1973 జనవరి నుంచి ఒక సంవత్సరం పాటు బొమ్మరిల్లు పుస్తకంతోపాటుగా అనుబంధంగా ఈ చిన్ని బుల్లి పుస్తకం ఇవ్వటం ఒక ప్రదానమైనది. ప్రతి బొమ్మరిల్లు సంచికతోపాటు, ఈ చిన్ని పుస్తకన్ని పదిలంగా తీసుకుని జాగ్రత్తగా చదివి భధ్రపరిచాను. మొత్తం 13 పుస్తకాలు కాని పదమూడోది బొమ్మలో రాలేదు.

ఇక నిధి గురించి చెప్పాలంటే అవి అన్ని కూడ ఎక్కువగ జంతువులు పాత్రలుగా గల (ముఖ్యంగా కుందేలు) చిన్నపిలల కథలు. 13 అనుబంధాలలో 11 శ్రీమతి గుత్తా విజయలక్ష్మి గారు వ్రాస్తే, రెండుమటుకు శ్రీ సింగంపల్లి అప్పారావుగారు వ్రాశారు. వీరిద్దరూ కూడ ప్రముఖ (పిల్లల) కథల రచయితలు, పిల్లల భాషలో కథలు వ్రాయటంలో నిష్ణాతులు. ఈ కథలన్ని కూడ దాదాపుగా ఆంగ్లంలో ఉన్న బ్రెర్ రాబిట్ వంటి జానపద కథలకు స్వేచ్చానువాదమని తరువాత్తరువాత చాలా కాలానికిగాని తెలియలేదు.

అదే అనుబంధాలలో చిన్న చిన్న పజిల్స్, దారి కనుక్కోండి చిక్కు ప్రశ్నలు, ఒక బొమ్మ ఇచ్చి అందులో ఏదో ఒక అక్షరంతో మొదలయ్యే వస్తువులు ఎన్ని ఉన్నాయి వంటి చిత్రమైన ఆకర్షణలు కూడ ఉండేవి. ఈ పదమూడు చిన్న పుస్తకాలు వేసినాక, ఇక చిన్న పుస్తకాలు వేయటం మానేసి, అవే కుందేలు కథలను అనుబంధంలో కాకుండా బొమ్మరిల్లులోనే వేశేవారు.

ఇదండీ మొత్తం మీద 'రచన' శాయిగారి వల్ల దొరికిన "నిధి" కథ. కొద్దిగా సమయం పట్టినా ఈ చిన్ని పుస్తకాలన్ని స్కాన్ చేసి పిడిఎఫ్ లాగానో లేదా స్లైడ్ షోగానో అందరికీ అందించాలని నా అభిలాష. మరి కాపీ రైటు......

11 కామెంట్‌లు:

  1. శివరాం ప్రసాద్ గారు!
    మీరు ప్రచిరించిన బొమ్మలు, బొమ్మరిల్లు అనుబంద పుస్తకాలతో, అందమైన బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్టు వుంది.
    అలాగే సురేఖ గారు, బొమ్మరిల్లు పత్రిక అందించిన అరేబియన్ నైట్స్ చిన్న పుస్తకాలు గురించి వ్యాసపు లెంకె, బ్లాగు మిత్రుల కొసం ఇక్కడ.
    http://surekhacartoons.blogspot.com/2010/08/blog-post_08.html

    అలనాటి ఆ పాత మధురాలను,మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. ఈ చిత్రనిధి అందించినందుకు చాలా ధన్యవాదములు.

    1973 నాటి పుస్తకరాజాలు కదా - వీలు కుదిరితే అందరికీ
    (కాపీరైటు గూర్చి ఆలోచించకుండా) అందివ్వగలరని మనవి

    స్కానింగుకి ఎక్కువ సమయం అవసరమవుతుంది -
    ఫోటోలు తీయడంలో మీరు చక్కటి నైపుణ్యం కలిగినవారు
    కనుక డిజిటలు కెమెరాతో ప్రయత్నించగలరు

    రిప్లయితొలగించండి
  3. రచన శాయి గారు బొమ్మరిల్లు లో మృత్యులోయ ఎప్పుడు
    ప్రారంభించారో తెలియజేయమని అడిగారు.స్థానిక గౌతమీ
    గ్రంధాలయంలోనాకు దొరకలేదు. బాలమిత్ర అనే పిల్లల
    పత్రిక వచ్చేది. ఆందులో కొంతకాలం కధలకు బొమ్మలబదులు
    ఫొటోలు ( మనుషులకు వేషాలువేసి) వేసేవారు. ఆ కాపీలు
    మీ దగ్గర ఉన్నాయాండీ

    రిప్లయితొలగించండి
  4. @ సురేఖ గారూ

    మృత్యులోయ ధారావాహిక, బొమ్మరిల్లులో ప్రారంభ సంచికనుండి వచ్చింది. నాకు గుర్తున్నంతవరకు, అక్టోబరు 1971 నుంది ఈ ధారావాహిక మొదలయ్యింది.

    ఇక బాల మిత్ర గురించి నాకు తెలియదు. ఆ పత్రికను నేను పెద్దగా చూసింది లేదు చదివింది లేదు. అదొక అరవ పత్రికని తెలుగులోకి తర్జుమా చేసి ఏవో కొన్ని పత్రికలు అమ్ముకునేవారు అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  5. శివరాం ప్రసాద్‌ చాలా అరుదైన పుస్తకాలు
    వాటి చిత్రాలు చూస్తుంటేనే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉంది, చదవాలని ఆతృతగా కూడా ఉంది
    ఇంక కాపీరైట్‌ అంటారా.. ఇలాంటి అరుదైన పుస్తకాలను నలుగురితో పంచుకోవడమే మేలు ఎందుకంటే అలాగైన అవి భద్రంగా ఉంటాయి లేకపోతే అవి కనుమరుగైపోయివా ఆశ్చర్యము లేదు, పత్రిక యాజమాన్యం కాపీరైట్‌ గురించి పట్టించుకొనెట్టైతే వాటిని భద్రపరిచి మరల ముద్రించేవారు
    నేను ఎప్పుడెప్పుడు ఆ పుస్తకాలు అందిస్తారో ఎదురు చూస్తుంటాను....

    రిప్లయితొలగించండి
  6. పత్రికే ఉనికిలో లేకుండా పోయిన తర్వాత కాపీరైట్ సమస్య గురించి పట్టింపా? -నా వ్యాఖ్యలో నెగటివ్ సెన్స్ లేదని మనవి- వాటితో వ్యాపారం చేసినప్పుడు కదా కాపీరైట్ సమ్యస్య అడ్డు వచ్చేది. అయినా అమ్మ పెట్టదు అడుక్కుతిన నివ్వదు సామెత ఊరికే వచ్చిందా మరి. ఈ విషయంలో జీవేష్ గారికే నా ఓటు. సంస్తలకు సంస్థలే కనుమరుగవడం తప్పని పరిస్థితిలో వ్యక్తిగత సేకరణలే ఆ ఆ పత్రికల కాపీలను చరిత్ర కోసం భద్రపర్చే పాత్ర తీసుకుంటున్నాయి. మనిషికి సంబంధించిన సమస్త విజ్ఞానాన్ని తొక్కిపెట్టి, దాచి ఉంచి, దానికి కాపీరైట్ అనడమే దౌష్ట్యం, దుర్మార్గం. ఇది బొమ్మరిల్లుకే కాదు,చందమామతో సహా ఏ పత్రికకయినా, వాటి యాజమాన్యాలకైనా వర్తించే సూత్రం.

    రిప్లయితొలగించండి
  7. జీవేష్ గారూ, రాజుగారూ ఇద్దరికీ ధన్యవాదాలు. కాపీరైటు పేరుతో ఎన్నెన్ని పుస్తకాలు పున:ముధ్రణ కాకుండ పడిఉన్నాయో కదా. ఆ కాపీ రైటుకలవారు కోరే గొంతెమ్మ కోరికలతో అవి మళ్ళి "లోకంలోకి" తీసుకొద్దామని ప్రయత్నించే సాహసులు కూడ భయపడి పారిపోతున్నారు.

    కాని బొమ్మరిల్లు విషయంలో బాపినీడుగారు చాలా సహ్రుదయంతో ఇప్పటికే మృత్యులోయను పున:ప్రచురణకు రచన శాయిగారికి అనుమతించి తన ఔదార్యాన్ని వ్యక్తపరిచారుట. ఈ విషయంలో వీలైతే ఆయనను(బాపినీడుగారు)సంప్రదించాలి. ఈ చిన్ని పుస్తకాలు కూడ "ఈ పుస్తకాలు" గా (పేజీలు తిప్పుతూ చదువుకునే వీలుగా) చెయ్యటానికి అనుమతిస్తే నేను చెయ్యటానికి నాకు అభ్యంతరం లేదు.

    జీవేష్, మీరు నాకు ఒక మైలు ఇవ్వండి. నా మైలు చిరునామా నా ప్రొఫైల్ లో ఉన్నది.

    రిప్లయితొలగించండి
  8. శివ గారూ,

    మీకు దొరికింది నిజంగా అమూల్యమైన పెన్నిధే!
    నేటితరం పిల్లలక్కూడా ఇలాంటివి అందుబాటులోకి తెస్తే అద్భుతంగా ఉంటుంది.

    ఈ పుస్తకాల ముఖచిత్రాలు ఎంత బాగున్నాయో. ఆర్టిస్టు MKB అంటే ఎంకే బాషా. చందమామలో బొమ్మలు వేసిన Razi పేరు కూడా ఎంకే బాషానే. ఇద్దరూ ఒకరేనా? చందమామ రాజు గారు కానీ, మరెవరైనా కానీ ఈ సందేహం తీర్చాలి.

    రిప్లయితొలగించండి
  9. శివరాం ప్రసాద్ గారు,
    అలనాటి విషయాలు గుర్తు చేసినందుకు చాలా థాంక్స్. బొమ్మరిల్లు పుస్తకం పేరే నేను మరచిపోయాను !! అవన్నీ గుర్తొస్తున్నాయి.అనుబంధాలు నేను కూడా కొన్ని దాచుకున్నాను కానీ తర్వాత ఎప్పుడో పారేసుకున్నాను. బాలమిత్ర పై మీకులాగే నాకు కూడా శీత కన్ను ఉండేది. బుజ్జాయి వగైరాలు చదివింది చాలా తక్కువ. ఇక పోతే, కాపీ రైటు విషయం లో ఇక్కడి మిత్రుల అభిప్రాయమే నాదీను. మీకు గనక వీలయితే నిస్సంకోచం గా పోస్ట్ చెయ్యండి.
    నేను కూడా బెంగళూరులోనే ఉంటాను.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శివరామ ప్రసాద్ గారూ
    ఫోటోల కంటే స్కానింగ్ మేలనుకుంటాను.ఫోటోలు ప్లేస్ ఎక్కువ తీసుకుంటవి. ఆలోచించండి. మీరు ఏది చేసినా బాగా యోచించి ఇష్టంగా చేస్తారు. అందుకు చక్కటి ఉదాహరణ వపా బొమ్మల కొలువు.(నాకు తెలిసి)
    బొమ్మరిల్లు విజయబాపినీడు నేతృత్వంలో సెప్టెంబర్ 1971 లో ప్రారంభమైంది.చందమామ సీరియల్ తో తులతూగే మృత్యులోయ వంటి అద్భుత జానపద సీరియల్ తో, ఉత్పల గారి చిన్నికృష్ణుడు గేయ కథతో, ఇంకా అనేక ఆకర్షణలతో వచ్చిన బొమ్మరిల్లు చందమామకు గట్టి పోటి ఇచ్చింది. చందమామ ధాటికి తట్టుకొని నిలబడి, చందమామ ప్రారంభించిన చాలా సంవత్సరాలకు చందమామ తర్వాత ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా బొమ్మరిల్లు చాలా కాలం నిలిచింది.
    MKB అంటే ఎం కే భాషా గారే, ముందు బొమ్మరిల్లు లో పని చేసారు. చందమామలో చేరిన తర్వాత Razi పేరుతొ బొమ్మలు వేశారు. చందమామలో కథలకు బొమ్మలు వేసిన వారిలో చిత్ర, శంకర్, జయ, తర్వాత స్థానం రాజిదే అనే చెప్పాలి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శివ రామ ప్రసాద్ గారూ!
    బొమ్మరిల్లు లో ఉత్పల గారి మొదటి సీరియల్ గేయ కథ(బొమ్మరిల్లు ప్రారంభ సంచికలో) మనుచరిత్ర బాపు బొమ్మలతో వచ్చింది. చిన్నికృష్ణుడు ఆ తర్వాత వచ్చింది. నా పై కామెంట్లో పొరపాటు దొర్లింది. అందుకే ఈ సవరణ.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.