15, నవంబర్ 2010, సోమవారం

చందమామ నాగిరెడ్డిగారి జీవన వివరాలు


విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పించిన “లైఫ్ స్కెచ్ ఆఫ్ ఎ లెజెండ్ శ్రీ బి నాగిరెడ్డి” అనే డీవీడీ డాక్యుమెంటరీ తయారయ్యింది . విజయా ఆసుపత్రిలో నాగిరెడ్డిగారి కాంస్యవిగ్రహాన్ని ఒక ప్రత్యేక మందిరంలో ఆవిష్కరించి దానికి ఒక మ్యూజియం స్థాయిని కల్పించాలని ఆయన బంధువులు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ అరుదైన డీవీడీ డాక్యుమెంటరీ రూపొందింది.

నాగిరెడ్డి గారి జీవిత విశేషాలను, చందమామ, విజయా స్టూడియో, విజయా హాస్పిటల్ ఆవిర్భావ నేపధ్యాలను మీడియా మిత్రులకు అందజేయాలనే తలంపుతో విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎండీ రాంబాబు గారు ఈ డీవీడీని 2007లో చెన్నయ్ మీడియా మిత్రులకు ఇచ్చినట్లు వినికిడి. ఇవి తప్ప ఈ డీవీడీలను ఎవరికీ అందుబాటులోకి తీసుకురాలేదు.

2007లో ఈ డీవీడీని నాగిరెడ్డి గారి కుటుంబ సభ్యులకోసం, ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కోసం మాత్రమే రూపొందించినప్పుడు మా జర్నలిస్టు మిత్రుడు, విశ్వనాధ్ -ప్రస్తుతం హెచ్‌‍ఎమ్‌టీవీ రాయలసీమ కో ఆర్డినేటర్- ప్రెస్ మీట్‌ ద్వారా దాన్ని సంపాదించాడు. తెలుగువారే కాకుండా యావద్భారతమూ మర్చిపోలేని చందమామ, విజయా హాస్పిటల్, విజయా స్టూడియోస్‌ని స్థాపించిన నాగిరెడ్డి గారిని ఓ రెండున్నర గంటల పాటు తల్చుకుంటూ ఎందరో ప్రముఖుల స్మరణలతో ఈ డీవీడీ రూపొందింది.


చందమామ సంస్థాపకులు నాగిరెడ్డిగారు, కడపజిల్లా సింహాద్రిపురం మండలంలో పొట్టిపాడు గ్రామంలో జన్మించారు. రైతు జీవితం తెల్లవారు నాలుగన్నరకు మజ్జిగన్నం తిని పొలానికి వెళ్లడంతో మొదలవుతుంది. పనివాళ్లు రాకముందే బండి కట్టుకుని పొలం వద్దకు పోయి రడీగా ఉండాలిరా అనే పెద్దల మాటను తుచ తప్పకుండా పాటించారాయన. పొలంలోకి ముందుగా పనివాళ్లు కాక ఇంటి మనిషి పోవాలి అనేది రైతు జీవన సంస్కృతి. ‘ఆనాటి నుంచి ఈనాటి వరకు తెల్లారి ఆ నాలుగన్నర గంట అయిందంటే తర్వాత నేను నిద్రపోవడం ఎరుగను’ అన్నారీయన.

స్వాతంత్ర్య పోరాటం – ఉల్లిపాయల వ్యాపారం
1940లలో ఉధృతంగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో చిన్నవయస్సులోనే నాగిరెడ్డి గారు పాల్గొని దెబ్బలు తినటంతో ఆయన తండ్రి వీడు చెడిపోతున్నాడేమో అనే భయంతో మద్రాసులో తాను నడుపుతున్న ఉల్లిపాయల వ్యాపారంలో నాగిరెడ్డిగారిని పెట్టారు. అలా వ్యాపారంకోసం ఆయన బర్మా రంగూన్ ప్రయాణాలు చేస్తూండేవారు. రెండో ప్రవంచయుద్ధ కాలంలో బాంబులు కురిసి వ్యాపారం కుప్పకూలడంతో ఆయన వ్యాపారంలో సర్వం కోల్పోయారు.

ఉల్లిపాయల వ్యాపారంలో దెబ్బతిని సర్వం కోల్పోగానే అంతవరకూ బర్మా, రంగూన్ లకు ప్రయాణిస్తూ వ్యాపారం చేస్తున్న నాగిరెడ్డి గారు భార్య శేషమ్మ గారితో కలిసి కడపజిల్లా రాజంపేటకు దగ్గరగా ఉన్న ఒక కుగ్రామం ఓరంపాడు -నెల్లూరు-లో ఓ పూరిపాకలో మూడేళ్లపాటు అత్యంత కనాకష్టమైన జీవితం గడిపారు.

1940ల మొదట్లో జరిగిన ఈ ఘటనలో ఆయన ఈ ఊర్లో ఉన్నప్పుడు వైద్య సౌకర్యం లేని ప్రజలకు మందులు ఇవ్వడంతో పాటు, పిల్లలను సాయంత్రం పూట చేరదీసి ఇష్టమైన కధలను రక్తికట్టేలా చెప్పేవారు. వారికి ఎలాంటి కథలు నచ్చుతాయో వారి హావభావాలు పసిగట్టడంద్వారా తెలుసుకుని సరైన కథలను ఎంపిక చేసుకుని చెప్పేవారు.

నాగిరెడ్డిచక్రపాణిచందమామ
1943లో మళ్లీ మిత్రుడి సహాయంతో మద్రాసుకు వచ్చిన నాగిరెడ్డిగారు అయిదు వేల రూపాయలతో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అదే సుప్రసిద్ధమైన బి.ఎన్.కె ప్రింటింగ్ ప్రెస్. ఆ రోజుల్లో బి.ఎన్.కె ప్రెస్ అంటే ఒక చరిత్ర.. ఆసియా ఖండంలోనే అంత పెద్ద ప్రిటింగ్ ప్రెస్ లేదనే స్థాయికి అది అచిరకాలం లోనే ఎదిగింది. చందమామ ప్రింటింగ్ అవసరాలు ప్రెస్ పరిమాణాన్ని బాగా పెంచివేశాయి.

“రోజూ రాత్రి పూట పడుకునే ముందు మా అవ్వగారు ఏదో ఒక కథ చెబితే కాని నిద్రపోయేవాడిని కాను. మనకు ముఖ్యంగా ఇతిహాసాలలో భారతం, భాగవతం, రామాయణం చాలా ముఖ్యమైనవి. దేవుని దయవల్ల రామరాజు టీచర్ నాకు ఈ పుస్తకాలను చక్కగా బోధ చేయడం వల్ల, ఆ పుస్తకాలలోని కథలను పిల్లలకు అర్థమయ్యేలా తిరిగి వారికోసం రిలీజ్ చేయాలని అనిపించేది. చక్రపాణి గారు మద్రాసుకు తన పత్రిక ప్రిటింగ్ కోసం వచ్చి కలిసినప్పుడు ఈ విషయం చెబితే ఆయన కూడా ఈ ఆలోచనను ఒప్పుకోవడం. పిల్లలకోసం కథల పత్రికను పెట్టాలని చక్రపాణిగారు సలహా చెప్పారు. ఇద్దరి ఆలోచనలు అలా కలవడంతో చందమామ పత్రికను 1947లో పెట్టడం జరిగింది. చందమామ పత్రిక అలా చరిత్రలో నిలిచిపోయిందంటే చక్రపాణి గారే కారణం.”

మన జీవితవిధానం, హైందవ సంప్రదాయం మన తర్వాతి తరాలకు ఎక్కడ దూరమవుతుందని నాగిరెడ్డిగారి తండ్రి భయపడేవారు. ఆయన భయమే తదనంతరం చందమామ ఆవిర్భావానికి కారణమైంది. స్వామి రామతీర్థ చెప్పిన కథలు, జీవిత ఉదాహరణలు నాగిరెడ్డిగారికి ఎంతో ఇష్టం. చందమామ స్థాపనకు ముందు కథలపై ఆయన అభిమానానికి రామతీర్థ కూడా ప్రేరణగా నిలిచారు.

(సినీ నటి జమున గారు 1947 తొలి చందమామను తెనాలిలోని బంధువులు తీసి పంపితే చదివారు. అప్పటినుంచి ఈనాటివరకు అంటే 2007 వరకు అన్ని చందమామలు కొని చదివి భద్రపరుస్తూ వస్తున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ఈ అపరూపమైన ఆస్తిని ఎవరికీ ఇవ్వలేదట. అన్ని చందమామలూ అలా భద్రపరుస్తూనే ఉన్నారట. నమ్ముతారో లేదో నాకు తెలియదని ఈనాటికీ చందమామను తాను చదువుతూనే ఉన్నానని ఆమె నాగిరెడ్డిగారిపై డీవీడీ డాక్యుమెంటరీలో చెప్పారు.)

విజయా ఆసుపత్రి నేపథ్యం:
“1942లో మా నాన్న డయాబెటిక్ పేషెంట్. మద్రాసులో ఒక ఆసుపత్రిలో చేర్పిస్తే నరకం. జంతువుల్లాగా ట్రీట్ చేసేవాళ్లు, రోగుల వెన్నంటి వచ్చే వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. డిశ్చార్చ్ అయి ఇంటికి తీసుకువచ్చాక అయిదు నెలలు ఆలోచించాను. రోగులకే కాకుండా రోగులను వెన్నంటి వచ్చే సహాయకులకు, బంధువులకు సౌకర్యం కల్పించే ఆసుపత్రి ఉంటే ఎంత బాగుంటుందని పదే పదే ఆలోచించాను. ఆ ఆలోచనే విజయా హాస్పిటల్‌కు మార్గ నిర్దేశం చేసింది. ప్రపంచంలోని అతి గొప్ప కంటి ఆసుపత్రులలో ఒకటైన శంకర్ నేత్రాలయ హాస్పిటల్ విజయా హాస్పిటల్ స్పూర్తితోటే పుట్టింది.”

‘పేషెంట్ ఎంత ఇంపార్టెంటో, పేషెంట్ తరపున వచ్చిన వారికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రోగులతో పాటు వారి బంధువులూ వస్తారు. వారు వస్తారు. అది వారి తత్వం. వారికి మనం సౌకర్యాలు కల్పించాలి.’ ఇదీ నాగిరెడ్డి విజన్. విజయా హాస్పిటల్ ప్రాంగణం రోగులతో పాటు వచ్చిన బంధువులకు కల్పతరువు లాంటిది. ఏ ఆసుపత్రి ప్రాంగణంలోనూ ఇలాంటి సౌకర్యాలు చూడం మనం. రోగుల వెన్నంటి వచ్చిన వారిని ఇతర హాస్పిటల్స్‌లో చీదరించుకుంటారు, బయటకు పంపేస్తారు.

కాని విజయా హాస్పిటల్ చరిత్రలో ఇలాంటి అనుభవం ఎవరూ చూడలేదు. హాస్పిటల్ కారిడార్లు కాని, భవంతుల ముందు అరుగులు కాని విశాలంగా ఉంటాయి. రోగి బయటకు వచ్చినా కాసేపు కూర్చుని సేద తీరడానికి ఇవి ఉపయోగపడతాయు. విజయా హాస్పిటల్ ఎంత సౌకర్యం కల్పించిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు.

నాగిరెడ్డి గారు ఉన్నంతవరకు రాయలసీమ నుంచి ఎవరైనా రోగులు ఆసుపత్రికి వచ్చారంటే ఆప్తబందువు చెంతకు వచ్చినట్లే పీలయ్యేవారు. ముఖ్యంగా కడప జిల్లా రైతులు, మధ్యతరగతి ప్రజలు విజయా ఆసుపత్రికి చికిత్స కోసం వస్తే వారు నాగిరెడ్డిగారి స్వంత మనుషుల కిందే లెక్క. ఆయన డాక్టర్ కాదు. కాని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆయన విజయా ఆసుపత్రిలో పట్టి పట్టి నడుస్తూ డాక్టర్లను, సిబ్బందిని, రోగులను పలుకరించేవారు.

ఎవరయినా డిశ్చార్జ్ అయి వెళ్లిపోతుంటే వారికి జాగ్రత్తలు చెబుతూ, వారి కారు తలుపులను తాను మూసి సంతృప్తిగా పంపించేవారు. తన ఇంటికి, తన ఆసుపత్రికి వచ్చిన వారు తన స్వంత మనుషులకిందే లెక్క., చివరివరకూ ఆయన అలాగే చూసుకున్నారు. ఈ రోజు ఆసుపత్రి ఎలా ఉందో తెలియదు కాని, ఈ మహనీయ మూర్తిమత్వం సాయంత్రం పూట ఆసుపత్రిలో నిదానంగా నడుస్తుంటే అతి ఎత్తైన ఆసుపత్రి భవంతులు, వాటి గోడలు కూడా ఆయన ముందు చిన్నపోయేవి.

“మీ స్వంత బంధువులకు ఎలా దగ్గిరుండి చికిత్స చేయిస్తారో, అలాగే రోగులందరికీ మీరు సేవలను అందజేయాలి” అని ఆయన ఆసుపత్రిలో చేరిన వైద్యులకు, సిబ్బందికి పదే పదే చెప్పేవారు. ‘పేదవారికి, మధ్యతరగతి వారికీ సహాయం చేయాలని విజయా ఆసుపత్రి కట్టానయ్యా. దాన్ని మీరు నిలబెట్టాలి’ అంటూ ఆసుపత్రిలో కొత్తగా చేరిన ప్రతి ఒక్కరికీ చెప్పేవారాయన.

ప్రారంభంలో కేవలం 60 పడకలతో ప్రారంబించిన విజయా ఈరోజు 650 పడకలు, వందమంది వైద్యులు, 1600 మంది సిబ్బందితో నడుస్తోంది, సంవత్సరానికి లక్షా 25వేల మంది ఇన్ పేషెంట్లు, 6 లక్షల మంది అవుట్ పేషెంట్లు ఈ ఆసుపత్రి గడప తొక్కుతుంటారు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచే కాకుండా, అస్సాం, బీహార్, బెంగాల్, అండమాన్ దీవులనుంచి కూడా ఈ ఆసుపత్రికి రోగులు వస్తుంటారు.

“అందుకే మరో 200 సంవత్సరాలు గడిచినా విజయా, అపోలో ఆసుపత్రులలో డాక్టర్లు మారతారు కాని ఆసుపత్రులు నిలుస్తాయి. అంతటి చక్కటి పునాదితో వీటిని కట్టాము” అంటూ అప్పోలో హాస్పిటల్స్ సంస్థాపకులు ప్రతాప్ రెడ్డి గారు ఈ సందర్భంగా నాగిరెడ్డిగారిని తల్చుకున్నారు.

“మీరు రెండు నెలలు మీ సిబ్బందికి, ఉద్యోగులకు జీతాలు చెల్లించే స్థితిలో ఉంటే ఆ సంస్థ బాగున్నట్లు లెక్క.. ఇన్‌స్టిట్యూట్ ఈజ్ లైక్ ఎ మదర్, తల్లి బాగుంటే పిల్లలను చక్కగా కాపాడుతుంది” అనే నాగిరెడ్డి గారి కలల సాకారం విజయా ఆసుపత్రి. ఈ మహనీయుడి మూర్తిమత్వాన్ని స్మరించుకోడానికైనా విజయా ఆసుపత్రిలో ఆయన జీవితాంతమూ తిరుగుతూ వచ్చిన ప్రాంగణాలను మనం చూడాల్సిందే.

తీర్చిదిద్దినట్లుగా, నీట్‌గా ఉన్న విజయా ఆసుపత్రి అందచందాలు, చందమామ ప్రింట్ అయ్యే క్రమం చూడాలంటే ఈ డీవీడీని తప్పక చూడాలి.

ఎప్పుడూ రెండో స్థానాన్ని ఆయన అంగీకరించరు. “పని ఎత్తుకుంటే అందరికంటే మనమే మొదట్లో ఉండాలి” ఇది ఆయన ఫిలాసఫీ.

విజయా వారి వెన్నెల:
ప్రపంచంలో కల్మషం లేనిది, కల్తీ లేనిది, వివక్ష లేనిది ఉందంటే ఆ ఘనత వెన్నెలకు కూడా దక్కుతుంది. వెన్నెల మంచికీ, చల్లదనానికి, సహాయ గుణానికీ గుర్తు. విజయా వారి సినిమాలు వెన్నెల కుప్పలు.

నాగిరెడ్డి గారు తాము తీసే ప్రతి సినిమాను ప్రేమించారు, బిడ్డలాగా అక్కున చేర్చుకున్నారు. ఇంటిల్లిపాదీ వచ్చి చూసి, సంతోషించాలి, ఇలా జరగాలంటే చెడు అస్సలు చెప్పకూడదు, చూపకూడదు. తెరపై మూడు గంటలపాటు మంచే కనపడాలి. మంచికే విజయం దక్కాలి. విజయా వారి సినిమాలు చేసి చూపించింది దీన్నే మరి.

అసలు విజయా పిక్చర్స్ నేపధ్యమే ఒక విషాద ఘటనతో ప్రారంభమైంది.

1940ల నాటికి అనంతపురంలో మాలా నారాయణ స్వామి అనే ఆయన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎన్నో పరిశ్రమలు స్థాపించారు. లక్షలు గడించారు. తాడిపత్రి, గుత్తి పట్టణాల్లో నూనెమిల్లులు, తాడిపత్రి అనంతపురంలలో కో-ఆపరేటివ్‌ మిల్క్‌ సొసైటీ, తాడిపత్రిలో మార్కెట్‌ యార్డు స్టోర్స్‌, రాయలసీమలో పలుచోట్ల ఖాదీ గ్రామోద్యోగ సంస్థలు అనంతపురంలో కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ స్థాపించారు. కలకత్తా నుండి బర్మాకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసేవారు. ఇన్ని సంస్థల యజమానిగా అతనిని ‘రాయలసీమ’ బిర్లా అనేవారు. కస్తూరిబా స్మారక నిధికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎందరో బీద విద్యార్థు లకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి, ఉచిత వసతి, భోజనవసతి కల్పించిన దాత ఆయన. నారాయణస్వామి ఆర్థిక సహాయంతో జీవితంలో ఎన్నో గొప్ప పదవులందుకొన్న వారిలో ముఖ్యులు దామోదరం సంజీవయ్య గారొకరు.

మద్రాసులో ఉల్లిపాయల వ్యాపారం చేసే బి.నాగిరెడ్డి, బి.ఎన్‌. రెడ్డి గార్లతో నారాయణస్వామి మైత్రిని పెంచుకొన్నారు. వారితో కలిసి సినిమా నిర్మాణం ప్రారంభించారు. ‘అప్పట్లో, ఆసియాలోకెల్లా అతిపెద్ద సినిమా స్టూడియోగా పేరుగాంచిన వాహినీ స్టూడియో (మద్రాసు) మూలపురుషుడు మూలా నారాయణ స్వామి’. నారాయణ స్వామి ఛైర్మన్‌గా, బి.ఎన్‌.రెడ్డి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వాహినీ ఫిల్మ్‌ సంస్థను ప్రారంభించి ‘వందేమాతరం’ చిత్రం నిర్మించారు. సుమంగళి, పోతన, స్వర్గసీమ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించారు. 1947లో వాహినీ స్టూడియో ప్రారంభించారు. వ్యాపార దృష్టితోపాటు కళాదృష్టిని మేళవించి ఉత్తమ చిత్రాలను నిర్మించారు. క్రమంగా కె.వి.రెడ్డి చక్రపాణి గార్లు ఆ సంస్థలో చేరారు.

ఈలోగా నారాయణ స్వామి గారి వ్యాపారాలు ఇన్‌కమ్‌టాక్స్‌ వారి దృష్టిలో పడినాయి. ఆ అధికారిని బదిలీ చేయించడానికి యత్నించారు, కానీ అధికారి కూడా చాలా పట్టుదల, నిజాయితీ కలవాడు. నారాయణ స్వామి వ్యాపారాల్లోని లావాదేవీలను పరిశీలించి దాదాపు 30 లక్షల ట్యాక్స్‌ విధించాడు. నారాయణ స్వామి వ్యాపారాలన్నిటినీ సీజ్‌ చేశాడు.

నారాయణ స్వామికి ‘అప్పులు పుట్టని స్థితిని గమనించిన మిత్రులు అతనికి దూరమయ్యారు. మహాదాత నారాయణ స్వామి మనోవ్యాధితో పాటు క్షయ వ్యాధికి గురై మదనపల్లి శానిటోరియంలో చికిత్స పొందుతూ 1950 ఆగస్టు 20న కన్నుమూశారు.

తర్వాత నారాయణ స్వామి కుమారుడు రంగయ్య వాహినీ స్టూడియోను నాగిరెడ్డికి అమ్మివేశారు.

ఉన్నట్లుండి 30 లక్షల రూపాయల పన్ను జరిమానా కట్టవలసిందిగా ఆదేశించడంతో ఆయన ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలిపోయిన ఈ సందర్భంలోనే ఆయన నాగిరెడ్డిగారిని సంప్రదించి వాహినీ స్టూడియోస్‌పై కూడా ఐటీ వారి కన్ను పడుతుందేమో అనే భయంతో, వీలైతే స్టూడియోను మీరే లీజుకు తీసుకుని నడపవలసిందిగా సూచించారు. తర్వాత తాను నష్టాలనుంచి బయటపడినప్పుడు స్టూడియో గురించి ఆలోచిద్దామని చెప్పారట.

ఈ విషయం నాగిరెడ్డి గారు చక్రపాణిగారి చెవిన పడేశారు. “ఈ తెల్ల ఏనుగును మనమెలా భరించేది, అయినా మనకు సినిమాలెందుకు” అని మొదట్లో చక్రపాణి గారు కొట్టిపడేశారు. కాని నాగిరెడ్డి గారు వదల్లేదు. ఇప్పటికే నారాయణ స్వామిగారు స్టూడియోపై అయిదు లక్షలు ఖర్చుపెట్టారు కాబట్టి మనం అంత పెట్టుబడి పెట్టాలన్నా సాధ్యం కాదు కాబట్టి లీజుకు తీసుకుంటే ఉన్న నిర్మాణాల్లోనే సినిమా ప్రారంభించవచ్చు గదా అని పట్టు పట్టారు.

ఈ లోపలే ఈ విషయం తెలిసిన ఎల్వీ ప్రసాద్ గారు ఈయనను కలిసి సినిమా తీయడానికి అవకాశం ఇవ్వండని కోరారు. ‘మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సినిమా తీస్తాను’ అని చెప్పారట. దీంతో మనదేం పోయిందిలే అనుకుని వాహినీ స్టూడియోను లీజుకు తీసుకుని 15 వేల రూపాయలతో సినిమా మొదలెట్టేశారు. అదే.. విజయా వారి తొలి సినిమా ‘షావుకారు.’ తర్వాత పూర్ణచంద్రరావు గారు మరో 75 వేల రూపాయల సహాయం చేయడంతో ఇక వీరు వెనుదిరగలేదు.

వాహినీ స్టూడియోతో బి.ఎన్‌.రెడ్డి, బి.నాగిరెడ్డి, కె.వి.రెడ్డి మున్నగు వారితో సన్నిహితులుగా ఉండిన సినీ రచయిత డి.వి. నరసరాజు గారు, వాహినీ స్టూడియో, నారాయణ స్వామి జీవిత ప్రస్థానాన్ని తమ ‘తెరవెనుక కథలు’ పుస్తకంలో చక్కగా చిత్రించారు.

షావుకారు, పాతాళభైరవి, గుండమ్మకథ, మాయాబజారు, గుణ సుందరి, సిఐడి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గంగ-మంగ, రాజేశ్వరీ విలాస్ కాపీ క్లబ్, బృందావనం, ఇవి విజయావారి వెన్నెల కుప్పల్లో కొన్ని.

నాగిరెడ్డి గారు మొదట టీటీడీ సభ్యుడు, తర్వాత ఛైర్మన్‌ అయ్యారు, “తిరుపతిలో అయిదేళ్లు వర్షం కురవకపోయినా ఒక్కసారి కల్యాణి డామ్ నిండిందంటే అయిదేళ్లు నీళ్లు సరఫరా ఆవుతాయి. అది నా హయాంలోనే జరిగింది.. క్యూ కాంప్లెక్స్ కట్టి వందలాది మంది భక్తులకు సౌకర్యం కల్పించాను. దీంట్లో నేను చేసిందేమీ లేదు. ఇది కేవలం భగవత్ కృప.”

మాట తప్పవద్దు
:
“మాట తప్పవద్దు అనేది మా కుటుంబం నాకు నేర్పిన విలువ. నేను నష్టపోయినా నన్ను నమ్మి వ్యాపారంలోకి దిగిన వారు నష్టపోకూడదనేది నా తత్వం.” ఇచ్చిన మాట తప్పవద్దు. ఇది ఆయన జీవితాంతం వదలకుండా పాటించిన మాట. అందుకే సత్య హరిశ్చంద్రుడు అంటే ఆయనకు అంత ఇష్టం.

“మ్యాన్ మైనస్ ఈగో ఈజ్ గాడ్
గాడ్ మైనస్ ఈగో ఈజ్ మ్యాన్”
నాగిరెడ్డి గారు వీటిలో తొలి కోవకే చెందుతారు అనేది విజయా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్ గారి అభిప్రాయం.

సర్వశ్రీ అక్కినేని నాగేశ్వరరావు, డివిఎస్ రాజు, రామానాయుడు, కె.విశ్వనాధ్, సింగీతం శ్రీనివాసరావు, రామోజీరావు, జమున, డివీ.నరసరాజు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిశ్రీ, కృష్ణ, విజయనిర్మల, పద్మనాభం, జయంతి, లక్ష్మి, ఎస్.వి.కృష్ణారెడ్డి, రావి కొండలరావు, రాజేంద్రప్రసాద్, పి.లీల. (మలయాళీ), పసుమర్తి కృష్ణమూర్తి, డాక్టర్ సత్యభామా రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ పి.చిన్నస్వామి, డాక్టర్ ఎం.ఆర్ రెడ్డి, డాక్టర్ సి. రంగారావు, డాక్టర్ ఎన్ ఎస్ రెడ్డి -సినిమా ధియేటర్ ఓనర్ కూడా- డాక్టర్ బాబూ రాజేంద్రన్. డాక్టర్ కె.ఎన్. రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ జయం, డాక్టర్ బి. సతీష్ రెడ్డి, (నాగిరెడ్డి గారి మనవడు), డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి -అప్పోలో హాస్పిటల్స్- డాక్టర్ పి.నంజుండయ్య, డాక్టర్ రాంబాబు, డాక్టర్ చంద్రమౌళి రెడ్డి ఐఎఎస్, వి.వెంకట్రామిరెడ్డి, బి. వేణుగోపాల రెడ్డి, బి విశ్వనాధ రెడ్డి, శ్రీమతి ఎ.విజయలక్ష్మి, తదితర ప్రముఖులు నాగిరెడ్డి గారి గురించిన తమ జ్ఞాపకాలను ఈ డీవీడీ డాక్యుమెంటరీలో పంచుకున్నారు.

నేటి తరాలు మర్చిపోయిన, చూడలేకపోయిన నాటి అమృత గాయని పి.లీల గారిని లైవ్‌లో చూడాలంటే ఈ డీవీడీలోనే సాధ్యం. గుండమ్మ కథ సినిమాలోని పాట లేని 10 నిమిషాల సంగీత ఝరి -ఎల్ విజయలక్ష్మి నృత్యం-లో ఒక బిట్‌ను ఈ డీవీడీలో చూపించారు. ఆ రోజుల్లో ఎల్ విజయ లక్ష్మి మా ఆరాధ్య నృత్య తార అని చెప్పడానికి సందేహించవలసిన పనిలేదు. మూర్తీభవించిన శిల్ప సౌందర్యం ఆమె స్వంతం. ఇప్పడు తన గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు.

నాగిరెడ్డి గారి విజన్:
“ఉన్న మంచినే చెబుతాం. ఉన్నా చెడును మాత్రం చెప్పం…” ఇది నాగిరెడ్డి గారి విజన్. చందమామ, విజయా సినిమాలు, విజయచిత్ర సినీ పత్రిక, ఎప్పుడూ మంచినే చెప్పాయి. ఉన్నా చెడు చెప్పలేదు. మంచిని మాత్రమే చెప్పాలని, చూపాలని, ముద్రించాలని ఒక మహా దార్శనికతను ప్రకటించడం, చివరి క్షణం వరకు దానికి కట్టుబడటం ప్రపంచంలో ఎవరికి సాధ్యం?

రావికొండల రావుగారి సంపాదకత్వంలో విజయచిత్ర సినీ పత్రికను స్థాపించినప్పుడు నాగిరెడ్డి గారి ఆయనకు ఒకే సలహా చెప్పారట. “చూడయ్యా సినిమా పత్రిక ఎలా నడపాలనేది మీరే నిర్ణయించుకోవాలి. కానీ ఇంటిల్లిపాదీ వచ్చి పత్రికను చూసి, చదివేలాగా తీర్చిదిద్దండి. అందరిచేతా బాగుందనిపించుకోవడమే మన పత్రిక లక్ష్యం కావాలి.”

హిమాలయ పర్వతభారాన్ని ఎంత సులువుగా చెప్పేశారో. విజయచిత్ర ప్రారంభం అయ్యేనాటికీ తెలుగులో సినీ పత్రికలు రకరకాలుగా కంపు కొడుతున్నాయని రావి కొండలరావు గారి ఉవాచ. పత్రిక ఎలా పోతుంది, ఏం వేస్తున్నారు అనే విషయాలు పట్టించుకోని నాగిరెడ్డిగారు ‘ఇంటిల్లిపాదీ చదివేలా తీసుకురండి’ అని మాత్రమే సలహా ఇచ్చారు. అదీ ఒక సినిమా పత్రికమీద ఈ భాధ్యత పెట్టారు.

తదనంతరం విజయచిత్ర సాధించిన అపూర్వ విజయం మనందరికీ తెలిసిందే. కొడవటిగంటి కుటుంబరావు గారి ఆధ్వర్యంలో గతంలో 1950ల మొదట్లో మూడేళ్ల నడిచిన ‘కినీమా’ సినీ పత్రిక తర్వాత అంతటి ఘన కీర్తి, ప్రజాదరణ ఒక్క విజయచిత్రకే దక్కిందంటే అతిశయోక్తి కాదు. 53 ఏళ్ల చందమామలను ఆన్‌లైన్ చందమామ భాండాగారంలో పెట్టి తరతరాలకూ అందిస్తున్నట్లుగా, కినీమా, విజయ చిత్ర, యువ పత్రికలను కూడా ఆర్కైవ్స్‌లో పెట్టి అందించాలని చందమామ పాఠకులు ఈనాటికీ కోరుతున్నారంటే వాటి విలువ ఎవరికయినా బోధపడుతుంది.

నాకోసం ఓ కంటినీరు…:
“ఈ ఆస్తి ఈ పిల్లలూ, ఈ ఇళ్లూ ఇవేవీ మిగలవు, వీళ్లెవరూ మనకు మిగలరు అనేది నాకు తెలుసు, ఊరికే వేషధారిగా బతకటం సాధ్యంకాదు. పదిమందికి మంచి చేసి పోవడం ఇదే నాకు తెలిసింది. నా మిత్రులే కాకుండా నా బంధువులే కాకుండా నా అనేవారు కానివారు కూడా నాకోసం ఒక కంటి నీరు వదిలినారంటే… అదే నాకు తృప్తి.”

డీవీడీ ఇంటర్వ్యూలో ఈ మాటలంటున్నప్పుడు ఆయన కళ్లలో నీటిపొర. మూగపోయిన కంఠం..

నిజంగానే… ఆయన 2004లో పోయినప్పుడు అఖిలాంధ్రమూ, తమిళనాడు ప్రజానీకమూ, యావత్ భారత దేశమూ నిజంగానే.. ఆయనకోసం విలపించింది.

చందమామ కథలు, వాటిని చదివే తరతరాల పాఠకులు, విజయా సినిమాలు, వాటిని చూసే తరతరాల ప్రేక్షకులు, విజయా హాస్పిటల్, అక్కడికి వచ్చి చికిత్స చేయించుకునే తరతరాల రోగులు ఉన్నంతవరకు నాగిరెడ్డి గారు చరిత్రలో వెలుగొందుతూనే ఉంటారు.

అరుదైన వ్యక్తులపై డాక్యుమెంటరీలు తీయాలంటే ఇలా తీయాలనేంత చక్కటి నాణ్యతతో ఈ డీవీడీ రూపొందింది. చూస్తున్నంత సేపు ఇది డాక్యుమెంటరీలా కాకుండా విజయా వారి సినిమాలాగే చల్లని అనుభూతి కలిగిస్తుంది.

ఈ డీవీడీని చందమామ అభిమానులు, విజయా పిక్చర్స్ సినిమాల అభిమానులు కాకపోతే మరెవ్వరు చూడాలి?

‘జ్ఞాపకాల పందిరి’ – ‘ఆనాటి ఆనవాళ్ళు’ :
తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం కేటాయింపజేసుకున్న ..మహా వ్యక్తి బి.నాగిరెడ్డిపై ‘జ్ఞాపకాల పందిరి’ పేరుతో రెండేళ్ల క్రితం ఓ పుస్తకం వెలువడింది. బి.నాగిరెడ్డి తనయుడు బి.విశ్వనాధ్‌ రెడ్డి ఈ బృహత్‌ కార్యాన్ని చేపట్టారు. నేటితరం వారికే కాకుండా, భావి తరాలవారికీ ఉపయోగపడేలా నాగిరెడ్డి జ్ఞాపకాలన్నింటినీ గుదిగుచ్చి పుస్తకంగా వెలువరించారు.

దీనితోపాటు ప్రముఖ యువ సినీ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ గారు రచించిన ‘ఆనాటి ఆనవాళ్లు’ పుస్తకం కూడా రెండేళ్ల క్రితం విశ్వనాధరెడ్డి గారు ప్రచురించారు. తెలుగు సినిమా మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన వజ్రోత్సవాలలో భాగంగా ఈ పుస్తకం ప్రచురించారు. గత 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో 75 ఆణిముత్యాల్లాంటి సినిమాలను ఈ పుస్తకంలో సమీక్షించారు. ఇవి రెండూ చందమామ అభిమానులను అలరించే అద్భుత సమాచార గనులు. చదవకపోతే తప్పక తీసుకోండి.

*********************

ఇంతవరకూ మన చందమామ సంపాదకులు శ్రీ రాజశేఖర రాజుగారి బ్లాగులో ప్రచురించబడిన కొద్దిగా ఎడిట్ చేసిన వ్యాస భాగం

*********************

చందమామ అభిమానులందరి తరఫునా, బ్లాగు నిర్వాహకుల అభిప్రాయం మరియు అభ్యర్ధన ఏమంటే, విజయా ఆసుపత్రి వారు డి వి డి ని సరసమైన ధరతో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని. వారు తప్పక ఆపని చేస్తారని, అందరూ చక్కటి డి వి డి చూడగలరని ఆశిద్దాం.


1 వ్యాఖ్య:

  1. ఈ వ్యాసం మీరు మీ బ్లాగ్లో ప్రచురించినందుకు చాలా ధన్యవాదాలు. జీవితం లో మనమందరం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాగిరెడ్డి గారి చరిత్రలో. థాంక్స్.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.