14, నవంబర్ 2010, ఆదివారం

పేరు తెలియని ఆకాశవాణి వారి నాటిక

ప్రముఖ రేడియో కళాకారులు (ఎడమ నుండి కుడికి)
శ్రీ నండూరి సుబ్బారావు, కుమారి వి బి కనక దుర్గ, శ్రీబి ఆనంద్, శ్రీ సి. రామ్మోహనరావు
**************************************************************************
ఆకాశవాణి విజయవాడ కేద్రం నాటికలకు పెట్టింది పేరు. హాస్య నాటికల పరంపర విజయవాడ కేంద్రంలో ఎంతో కాలం కొనసాగింది. అందులో నండూరి సుబ్బారావుగారు తాను రచించి, దర్శకత్వం వహించి ఆపైన నటించి అందరి మెప్పూ పొందిన అద్భుత కళాకారుడు. ఒకటి రెండురోజులుగా కొన్ని పాత కాసెట్లు తీసి, వాటిని మరమ్మత్తు చేసి (పది పదిహేను సంవత్సరాల బట్టి వాటి జోలికే పోలేదు మరి) వాటిల్లో ఏమున్నాయో వినే ఉద్యమం మొదలు పెట్టాను. ఒక కాసేట్టులో ఒక నాటిక దొరికింది. నాటిక మొదటినుండి రికార్డు అయినా, ఆకాశవాణి వారి ప్రకటన వగైరా లేక పోవటం వల్ల పేరు తెలియదు. చాలా కాలం క్రితం రికార్డు చేసినది అవటం వల్ల నాకూ గుర్తు లేదు. మరొక విపత్తు కూడ వచ్చిపడింది. ప్రసారం జరుగుతుండగా వివిధ భారతి నుండి అనుకుంటాను తెలుగు పాటలు కూడ అదే నాటకం మీద ప్రసారం అయినాయి. సహజంగా నాదగ్గర కూడ అలాగే రికార్డు అయిపోయింది. దాంతో నాటికలో కొంత భాగం గందరగోళంగా ఉన్నది. భాగం తొలగించాను. సరే! నాటికను ఎంపి 3 గా మార్చటానికి కూచుని, మొత్తం విన్నాను. విన్న మీదట నాటికలో ఉన్న పాత్రలు పాత్రదారులు కింది విధంగా ఉన్నాయని కనిపెట్టగలిగాను.

నాటకాల పిచ్చి ఉండి, సినిమాలో తప్పని సరిగా వేషం వేసి ఘోప్ప నటుడు అయిపోవాలని ఉబలాట పడుతున్న వ్యక్తిగా శ్రీ నండూరి సుబ్బారావు గారు నటించారు.

ఆ వ్యక్తి భార్యగా కుమారి వి బి కనక దుర్గ గారు, సినిమా డైరెక్టరు, పై వ్యక్తి బావ మరిది అయిన హామ్ గా (నరసింహం కు హ్రస్వ రూపం!) శ్రీ చివుకుల రామ్మోహనరావు గారు , ఆయనకు సహాయకుడుగా శ్రీ ఎ బి ఆనంద్ నటించారు.

సినీ నిర్మాతగా వేసినాయన పేరు గుర్తుకు రావటం లేదు. ఆయన ఉన్న కాసేపూ నిర్మాత పాత్రకు ప్రాణం పోశారు. సినీ నిర్మాతలకు డబ్బు యావేకాని కళ మీద పెద్దగా దృష్టి లేదని అదోరకమైన యాసతో మాట్లాడుతూ రక్తి కట్టించారు.

నాటికలోని కథ సక్షిప్తంగా ఏమిటి అంటే, నాటకాల పిచ్చివాడు సినీ దర్శకుడు ఐన తన బావమరిదిని పీడించి సినిమాలో తనకు చాన్సు ఇప్పిం చుకుంటాడు . బావగారి అబ్యర్ధన, ఏమి చేస్తాడు ఆ బావమరిది, చచ్చినట్టుగా తన బావను మదరాసు రమ్మని ఉత్తరం వ్రాస్తాడు. అది చూసి గంతులు వేసుకుంటూ ఈ నాటకాల పిచ్చి వాడు (అతనికి ఉన్న నాటకానుభవం వీధి నాటకాల్లో జాంబవంతుడు, గరుత్మంతుడు వంటి వేషాలు-అటు నటుని రూపానికి కాని, ఇటు నటన కాని పెద్దగా అవసరం లేని పాత్రలు వేయటం) మదరాసు వెళ్ళటానికి ఉవ్విళ్ళూరుతూ, తాను అప్పుడే పెద్ద నటుడు ఐపోతున్నట్టుగా కలలు కనటం, ఆపైన మదరాసు వెళ్లి అక్కడ ఆ వాతావరణం ఆ లైట్లల్లో అతనికి ఇచ్చిన వేషానికి ఉన్న ఒకే ఒక్క చిన్న డైలాగు కూడ చెప్పలేక అభాసుపాలు అవ్వటం, చాలా సరదాగా ఈ నాటికలో సుబ్బారావుగారు, రామ్మోహన్రావుగారు పండించారు. ఈ నాటికలో, అప్పటి సినీ పరిశ్రమ మీద మన రేడియో వారు మంచి మంచి విసుర్లు వెశారు (అవి ఇప్పటికీ సరిపోతాయి) ఇక ఆలశ్యం దేనికి! ఈ కింది లింకు నొక్కి హాయిగా వినండి.



ఈ నాటిక 1970 లలో ప్రసారం అయినప్పుడు రికార్డు చేసిన జ్ఞాపకం. ఈ బ్లాగు చూసిన వారిలో ఎవరికన్నా ఈ నాటిక గురించిన మరిన్ని వివరాలు, నాటిక పేరు వగైరా తెలిస్తే తెలుపగలరు. ఈ నాటిక పున:ప్రసారం జరిగి అప్పుడు రికార్డు చేసిన వారు పూర్తిగా తమ దగ్గర ఉంటే, దయచేసి నాకు పంపగలరు. నా బ్లాగు ఆర్ఖైవ్ లో భద్రపరుస్తాను (ఆకాశవాణి వారు ఎట్టాగూ ఈ పని చేయలేని స్థితిలో ఉన్నారు కదా!).

ఆకాశవాణి వారు మధ్యన, వారి దగ్గర అలనాటి కార్యక్రమాలు అన్ని లేవు, శ్రోతలు ఎవరన్నా తమదగ్గర ఉన్నవి ఇస్తే వాటిని డిజిటైస్ చేస్తామని (చక్కటి కార్యక్రమాలను పరిరక్షించలేదన్న విషయం ఒప్పేసుకుంటూ) పేపరు ప్రకటన ఇచ్చారు. ఏదో ఒక రోజున పేపరు ప్రకటనతో, అదీ ఒక్క హైదరాబాదు ఎడిషన్లో వేస్తె ఉపయోగం ఏమున్నది?

ఆకాశవాణి వారికి అలనాటి కార్యక్రమాల రికార్డింగులను శ్రోతల దగ్గర నుండి తీసుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆకాశవాణి కేద్రాలనుండి ప్రతిరోజూ ప్రైం టైములో ఒక రెండు మూడు నెలల పాటు ఏకధాటిగా ఈ విషయం మీద ప్రకటనలు ఇవ్వటం మొదలు పెడితే, ఎక్కడెక్కడ ఉన్న శ్రోతలందరూ పూనుకుని ఎవరికి వారు సరదాగా అలనాడు రికార్డు చేసుకుని దశాబ్దాలుగా శ్రద్ధగా దాచి ఉంచిన వాటిని కాపీ చేసి తప్పకుండా పంపిస్తారు.

ఆకాశవాణి
వారు నాటికను తీసుకోవాలంటే, ఇక్కడ నుండి హాయిగా తీసుకోవచ్చు.










**

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.