రచయితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రచయితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఫిబ్రవరి 2011, బుధవారం

మృత్యు లోయ విడుదల మరి చందమామ ధారావాహికలో???


దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల ప్రదర్సన


ప్రస్తుతం, చందమామ అభిమానులందరి మధ్య జరుగుతున్న చర్చ దాసరి సుబ్రహ్మణ్యం గారు వ్రాసిన పన్నెండు చందమామల ధారావాహికలు అన్ని కూడ చిత్రా గారి బొమ్మలతో దాసరి వారి రెండో వర్ధంతి కల్లా రెండవ సంపుటి తీసుకు రాగలమా అని.

తీసుకు రావచ్చు, కాని చందమామ యాజమాన్యం అనుమతించాలి. ఆ అనుమతించటానికి వారికున్న కోరికలేమిటో తెలియాలి. ఈ విషయం తెలిసిన తరువాత, చందమామ అభిమానులందరూ తలుచుకుంటే ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతమవుతుందని నా ప్రగాఢ నమ్మకం.

దాసరి/చిత్రా/చందమామ అభిమానులందరూ మన భవిష్యత్ కార్యక్రమం గురించి వారి అభిప్రాయాలు తెలియచేయగలరు
*********************************************************************
ఇక మృత్యు లోయ విడుదల గురించి చదవండి
*********************************************************************

అవును రచయిత కీర్తిశేషుడుఅయ్యి జనవరికి 27 2011 కు ఒక సంవత్సర కాలం జరిగింది. ఆ రచయితే శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు. చిత్రమైన విషయం ఏమంటే, ఏ రచనల వల్లైతే ఆయనకు కీర్తి ప్రతిష్టలు వచ్చినాయో, ఆయా రచనలకు ఆయన పేరు వేసి ఉండలేదు.

చందమామలో
పన్నెండు అద్భుతమైన జానపద ధారావాహికలు సంవత్సరాల పాటు వ్రాసి అప్పటి పిల్లలను పెద్దలను ఒకే విధంగా ఉర్రూతలూగించారు దాసరి. కాని ధారావాహికలు ఎవరు వ్రాస్తున్నారో ఎవరికీ తెలియదు. రచయిత పేరు ఉండాల్సిన చోట క్లుప్తంగా "చందమామ" అని ఉండేది. అదే పత్రికలో ఎప్పుడో నిర్వహించిన ప్రశ్నలు జవాబుల్లో ఒక్కసారి మాత్రం పాఠకులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పేరు ఇవ్వటం జరిగింది అంతే!


ఆయన అనేక పేర్లతో యువ పత్రికలోనూ, ఇతరత్రా పత్రికల్లోనూ రచనలు చేస్తూనే ఉన్నారు. కాని ఆయన పేరు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియలేదు. కారణం, దాసరి గారికి ఒంటరిగా ఉండటమే ఇష్టమనుకుంటాను. బొమ్మరిల్లు అన్న పిల్లల పత్రిక దాదాపుగా చందమామ పత్రికకు ఒక చక్కటి కాపీగా 1971 సంవత్సరంలో వచ్చింది. ఆ పత్రిక లో వచ్చిన మొట్టమొదటి ధారావాహిక మృత్యు లోయ కూడ ఆయన వ్రాసినదే.

ఈ విషయాలన్నీ ప్రముఖ బ్లాగర్ శ్రీ వేణు (వేణువు) దాసరి గారిని కలిసేవరకు ఎవరికీ తెలియదు. ఆ తరువాత చందమామ అభిమానులందరూ ఎవరికి వారు తమ అభిమాన రచయితను కలుసుకుందామని అనుకుంటూనే ఇవ్వాళ-రేపు అనుకుంటూ ఉండగా దాసరి వారు "ఇక చాలు" అనుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత జరిగినది అంతా ఇప్పుడు ఒక సాహిత్య చరిత్ర.

మనకున్న
ఏకైక సాహిత్య పత్రిక "రచన" సంపాదకులు శ్రీ శాయిగారు (ఆయన రచన శాయిగానే ప్రసిద్ధులు ) చొరవ తీసుకుని, దాసరి సుబ్రహ్మణ్య గారి పేరున ఒక ప్రతేక సంచిక తీసుకు వచ్చి, చందమామ అభిమానులందరి చేత దాసరి వారి ధారావాహికలన్నిటి మీద సమీక్షలు వ్రాయించి ప్రచురించి ఒక అరుదైన సాహిత్య సంఘటనకు దారి తీసారు. అప్పుడెప్పుడో, చిన్నతనంలో, ప్రతి నెల అపురూపంగా చదువుకున్న ధారావాహికల మీద, అదే బాలలు ఈ రోజున పెద్ద వారై సమీక్షలు వ్రాయటం ఆ రచయితకు ఒక అపురూప నివాళి.

అందుకే దాసరి రచయితగా కీర్తిశేషుడు కాని ఆయన రచనలు ఎప్పటికీ చిరంజీవులు.

ఇక్కడితో
ఆగలేదు, రచన శాయిగారి మరొక బృహత్కార్యక్రమం మొదలు పెట్టారు. ఎక్కడెక్కడో ఎన్నో పత్రికల్లో రకరకాల పేర్లతో పడి ఉన్న దాసరి వారి రచనలన్నీ గుదిగుచ్చి ఒక్కటే సంపుటిగా తీసుకురావటం ఒక అద్భుత ఆలోచన . ఆ కార్యక్రమంలో ఎందరెందరో పాల్గొన్నారు. అందరూ అభినందనీయులు.

ఈ
సంపుటిలో బొమ్మరిల్లు మొట్టమొదటి ధారావాహిక "మృత్యు లోయ" కూడ చేర్చటం ఒక ప్రత్యెక ఆకర్షణ. ఈ ధారావాహికను ఈ సంపుటిలో చేర్చటానికి బొమ్మరిల్లు అధినేత శ్రీ విజయా బాపినీడు గారు ఏవిధమైన వ్యాపారపరమైన లాభాపేక్ష ఆశించకుండా పూర్తిగా ఉచితంగా అనుమతి ఇవ్వటం ఎంతైనా ముదావహం.


ఈ
అద్భుత సంపుటి హైదరాబాదులో జనవరి 27 2011 న ఆవిష్కరించబడినది. ఆ ఆవిష్కరణ సభకు సంబంధించిన చిత్రాలు చూడండి.



పుస్తక ఆవిష్కరణ సమయం
ప్రసంగిస్తున్న బాల సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ దాసరి వెంకటరమణ
తెలుగు చందమామ అసోసియేటెడ్ సంపాదకుడు శ్రీ రాజశేఖర రాజు
వచ్చిన సాహిత్యాభిమానులలో కొందరు.
శ్రీ విజయా బాపినీడుతో ముచ్చటిస్తున్న శ్రీ దాసరి వెంకటరమణ

మరక్కడా దొరకని దాసరి సుబ్రహ్మణ్యం గారి చిన్న కథలు
"బొమ్మరిల్లు" మొదటి ధారావాహిక మృత్యు లోయ ఎం కే భాషా వేసిన చక్కటి బొమ్మలతో యువ పత్రికలో వచ్చిన ఒక జానపద నవల. దాసరి వారి పాత్రలన్నీ కూడా మన చిత్రాగారి బొమ్మల్లోనే చూశాం
దాసరి పాత్రలను మనం ఈ నవలలో వడ్డాది వారి కుంచే నుంచి జాలువారినవి చూడవచ్చు


పై మూడు పుస్తకాలు హాయిగా కొని చదువుకుంటే, ఇలాంటి చక్కటి పుస్తకాలు మరిన్ని మనముందుకు వచ్చే అవకాశం ఉన్నది.

కాబట్టి, ఆసక్తి కలవారు, వివరాలకు ఈ కింది లింకు ద్వారా సమాచారం పొందవచ్చు

వివరాలు



29, డిసెంబర్ 2010, బుధవారం

చందమామలో మహా మహుల రచనలు

ఈ రోజున నాకు ఒక ఆలోచన వచ్చింది అలనాటి పత్రికల్లో వచ్చిన కథలు, కవితలు, గేయాలు, గేయ కథలుఎవరెవరు వ్రాసి ఉంటారో చూసి, వారిలో ఆ తరువాత పేరు ప్రఖ్యాతులు సంపాయించిన వారి రచనలు వెతకాలిఅని. మనకు అందుబాటులో పాత సంచికలు ఉంచిన ఏకైక తెలుగు పత్రిక "చందమామ" . పాత సంచికలు వెతుకుతుంటే ఆశ్చర్యం, చలం కృష్ణ శాస్త్రి , శ్రీ శ్రీ రచనలు మొట్టమొదటి సంవత్సరాలలోనే కనిపించినాయి .

చందమామ మొట్ట మొదటి సంచిక 1947 జులై సంచిక చూస్తె "చలం-దీక్షితులు" అన్న జంట పేరుతొ ఈ కింది గేయం కనపడింది. అది కూడా చందమామ మొదటి సంచిక మొదటి పుటలో.

చలం గారి స్నేహితుడు దీక్షితులు గారు. చలం గారికి అరుణాచలం పరిచయం చేసినది దీక్షితులు గారే. అప్పట్లో వీళ్ళిద్దరూ కలిసి ఈ గేయం అల్లారా.

అదే సంచికలో పక్క పుటలు చూస్తె కృష్ణ శాస్త్రిగారు రచించిన "ఉడుత పాటలు".

ఇలా పాత చందమామలను తిరగేస్తుంటే 1949 డిసెంబరు సంచికలో ఒక రచయిత పేరు చూసి ఆగిపోయ్యాను. ఆ రచయిత పేరు శ్రీ శ్రీ . అక్కడ ప్రచురించబడినది గేయ కథ. ఆ కథ పేరు "సీనూ భానూ". ఈ గేయ కథను ఈ కింది బొమ్మలను నొక్కి చదువుకోవచ్చు.


మనకు తెలిసిన చలం, కృష్ణ శాస్త్రి, శ్రీ శ్రీ గార్లు అప్పట్లో చందమామకు రచనలు చేసి ఇచ్చారా! లేక మరింకెవరివన్నానా ఈ పేర్లు? తరువాత్తరువాత ఎంతో ప్రాచుర్యం పొందిన రచయితల పేరు పోలి ఉన్నాయా.

మిగిలిన ఇద్దరి సంగతి తెలియదు కాని, చలం గారు అప్పటికే చాలా పేరొందిన రచయిత. కొత్తగా మొదలు పెట్టిన బాలల పత్రికకు దీక్షితులు గారితో కలిసి సరదాగా ఒక బుల్లి పాట రాసి ఇచ్చి ఉంటారా. సరే కృష్ణ శాస్రి గారు శ్రీ శ్రీ సినిమాల్లో ఉన్నారు (వీళ్ళిద్దరూ అప్పటికే సినీ రంగంలో ఉన్నారా? ఇదొక సందేహం!) చక్రపాణి గారు, నాగిరెడ్డి గార్లు అడిగితె వారి రచనలను పిల్లలకు అర్ధమయ్యే భాషలో, శైలిలో చందమామ కోసం ఈ రచనలు చేసారా.

చందమామ కథలు-బాల సాహిత్యం మీద పరిశోధన చేస్తున్న శ్రీ దాసరి వెంకట రమణ గారే ఈ సమస్య నివృత్తి చెయ్యాలి. ఇంకా మరింకేవరికన్నా తెలిసి ఉంటే చెప్పగలరు.

మరి కొన్ని మహా మహుల రచనలు మరొక రోజున. సమయాభావం వల్ల ఒకే రోజున ఈ పని చెయ్యలేని పరిస్థితి.
=============================================
శ్రీ దాసరి వెంకట రమణ గారు చదమామ పత్రిక, అందులో వచ్చిన కథల మీద పరిశోధన చేస్తున్న వారు ఆయన ఈ చిన్ని వ్యాసం చదివి స్పందించి తెలియని విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన వివరణాత్మక వ్యాఖ్య ఈ కింద ఇవ్వబడింది.
=============================================

ఆ రచనలు వారివే అందులో ఎలాంటి సందేహం లేదు.
చందమామకు పూర్వం నుండి ప్రచురించ బడుతున్న ‘బాల’ (ప్రారంభం ఆగస్ట్-1945) లో శ్రీశ్రీ, ఆరుద్ర, బాపు, రమణ, నార్ల వెంకటేశ్వరరావు, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి, నండూరి రామమోహనరావు, బుచ్చిబాబు, తాపీ ధర్మారావు, మునిమాణిక్యం వంటి మహామహుల రచనలు ప్రచురించ బడినవి. శ్రీ రచన శాయి గారు తాను సంపుటీకరించిన, ‘బాల’ విహంగ వీక్షణ సంపుటిలోని ముందుమాట లో ఇలా అంటారు.
పెద్ద రచయితల బాల రచనలు:
తెలుగు సాహితీ లోకంలో నిష్ణాతులైన రచయిత లెందరో ‘బాల’లో పిల్లలకోసం రచనలు చేశారు. వారి స్థాయి ఎంతటి గొప్పదయినా ‘బాల’లో వారి రచనలు పిల్లల స్థాయిలో ఉండడం విశేషం.

యువ బుక్స్ బేనర్లో బి.ఎన్.కే. ప్రెస్ లో చలం గారి పుస్తకాలు ప్రచురించారు. ఆ పరిచయంతో ఆయనతో చందమామ తోలి సంచికలో గేయం రాయించి వుండవచ్చు.
ఉడుత పాటలు శీర్షికన కృష్ణశాస్త్రి గారు చందమామలో కొన్ని గేయాలు రాశారు.
‘బాల’ లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కుమారుడు బుజ్జాయి (దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి) గారి రచనలు వస్తే, చందమామలో ఆయన తండ్రి గారితో గేయాలు రాయించి వుండవచ్చు.
చలం:దీక్షితుల జంట రాసినట్లే శ్రీశ్రీ:ఆరుద్ర జంటతో ఆగస్ట్1948 ‘బాల’లో ఒక గేయం వచ్చింది.
అది చూడండి.



జేజే

మేలుకలుగు గావుత
తెలుగు నాడుకి
గెలుపుకలుగు గావుత
తెలుగు వాడికి


గురుజాడ, కందుకూరి,
కొమర్రాజు, గిడుగు
తెలుగువారి వేలుగుదారి
తెలివెన్నెల గొడుగు

గోదావరి, కృష్ణవేణి,
పెన్ననదుల నిండి
పైరుపండ, కడుపునిండ
అందరికీ తిండి

ఈ గేయాన్ని శ్రీశ్రీ రాసి వుండవచ్చు. లేదా ఆరుద్ర రాసి వుండవచ్చు. ఇద్దరి పేర్లు ప్రకటించడానికి ప్రత్యెక కారణాలేమైనా వుండవచ్చు.
చందమామలో జనవరి 1948 సంచిక నుండి గేయ కథలు రాస్తున్న కవిబ్రహ్మ ఏటుకూరి వెంకట నర్సయ్య గారు తేది 10-11-1949 మరణించినారు. డిసెంబర్ 1949 సంచికలో శ్రీశ్రీ గారి సీనూ-భానూ గేయకథ వేశారు . ఆ తర్వాత అయిదారు సంచికల వరకు సముద్రుడు, ఆలపాటి సుబ్బారావు, కవిరావు వంటి వారు గేయ కథలు రాసి నప్పటికి జూన్ 1950 సంచిక నుండి చాలా కాలం పాటు ఆ గేయ కథలను బైరాగి రాశారు.(బైరాగి పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి – చక్రపాణి గారి అన్న ఆలూరి వెంకట్రాయుడి గారి కుమారుడు. మొదటినుండి చందమామ హిందీ సంచిక చూసుకునే వారు.)

శ్రీశ్రీ మాటలు,పాటలు రాసినా మొదటి సినిమా ఆహుతి (నీల్ ఔర్ నందా అనే హిందీ సినిమాకు తెలుగు డబ్బింగ్) 1950 లో వచ్చింది.

దేవులపల్లి కృష్ణశాస్త్రి మాటలు, పాటలు రాసినా మొదటి సినిమా బి.ఎన్. రెడ్డి గారి మల్లీశ్వరి1951లో వచ్చింది.
చందమామ కు సంబంధించి ఒక అరుదైన\ ఆశ్చర్యకరమైన విషయం చెప్పి నా వ్యాఖ్య ను ముగిస్తాను. చందమామ మొదటి సంచికలో నేటి ప్రముఖ రచయిత శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు పొట్టి పిచిక కథ పేరున ఒక కథ రాశారు. నాకు తెలిసి నంత వరకు చందమామ మొదటి సంచిక తయారిలో పాలు పంచుకున్న వారిలో జీవించి వున్నది వారొక్కరే. (శ్రీ విశ్వనాథరెడ్డి గారికి అప్పుడు మూడేళ్ళు. ఆర్టిస్ట్ శంకర్ గారు అప్పటికి చందమామలో చేరలేదు.) అలా కాకుండా ఎవరైనా జీవించి వున్నట్లు గా ఎవరికైనా తెలిసి వుంటే బ్లాగు ముఖంగా తెలియ చేయ గలరు.

25, డిసెంబర్ 2010, శనివారం

54 ఏళ్ళు దాసరిగారు ఉన్న ఇంటి కథ

ఇంటర్నెట్లో దాసరిగారి పేరు వ్రాయగానే గూగుల్ లో వచ్చే ఫొటోలన్ని ఒక్కటే ఫ్రేం లో ఉంచాను. ఫోటోలలో ఎక్కువ భాగం అందించిన వేణు గారికి కృతజ్ఞతలు
********************************
మనకు అభిమానపాత్రులైన రచయితలు కాని, గాయకులూ కాని , నటులు కాని, వారున్న ఇల్లు, చదువుకున్న బళ్ళు, తిరుగాడిన ప్రదేశాలు చూసుకోవటం కొంత తృప్తి ఇస్తుంది. ఆ వ్యక్తిని చూడలేకపోయినా, ఆయన తిరుగాడిన ప్రదేశాలు చూసి ఆయన్ని చూసినంత సంతోషం కలుగుతుంది.

చందమామ ధారావాహిక రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు తాను చందమామలో ఏకధాటిగా 54 సంవత్సరాలు పని చెయ్యటమే కాదు, అంతకాలమూ కూడా ఒకే ఇంట్లో ఉన్నారన్న విషయం తెలిసి ఆశ్చర్యం కలిగింది. ఒకే సంస్థను నమ్ముకుని (వాళ్ళెంత తనకు గుర్తింపు ఇవ్వకపోయినా) ఆ సంస్థ ఎదుగుదలకు ఎంతో కృషిచేస్తూ ఐదున్నర దశాబ్దాలపాటు అక్కడే పనిచెయ్యటం ఇప్పటి తరానికి విచిత్రమైన విషయం. కాని పాత రోజుల్లో, ఇలా దశాబ్దాల పాటు ఒకే యజమానికి సేవచేసి జీవితాలు గడిపినవాళ్ళు అనేకమంది ఉన్నారు.

దాసరి వారు ఈ ఐదున్నర దశాబ్దాలూ ఒకే ఇంట్లో ఉన్నారన్న విషయం మన చందమామ రాజశేఖర రాజుగారు చెప్పినప్పుడు, ఇక ఆయన వెంటపడటం మొదలు పెట్టాను, ఆ ఇంటి ఫోటో పంపమని. అదృష్టవశాన , చందమామ ప్రస్తుత కార్యాలయం, ఆ ఇంటి పక్కకే ఈ మధ్యనే తరలించబడటం బాగా కలిసి వచ్చింది. రాజశేఖర రాజుగారు, ఆ ఇల్లు, ఆ పరిసర ప్రాంతాలు, దాసరి గారు పొద్దున్నే ఉపాహారం తీసుకున్న హోటళ్ళు, మందులు కొనుక్కున్న షాపు అన్ని కూడా ఫోటోలు తీసి మంపారు. ఆయనకు చందమామ అభిమానుల తరఫున కృతజ్ఞతలు.

ఇప్పుడు ఆ ఇంటి బొమ్మలను చూస్తుంటే, విచిత్ర అనుభూతి కలుగుతుంది. చిన్నప్పుడు మనం ఆరాధించిన పాత్రలు అన్ని కూడ ఇక్కడనుంచేకదా సృష్టించబడినాయి అనిపిస్తున్నది. ఎన్నెన్ని పాత్రలు ఆయన కలం నుండి సృష్టించారు! తలుచుకుంటేనే ఆశ్చర్యం. విచిత్రం ఏమంటే ఆయనకు రావలిసినంత పేరు రాలేదు. ఆంగ్లంలో వస్తున్న చౌకబారు రచనలను నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఐపోయ్యారు. దాసరిగారి కథలు ఆంగ్ల సాహిత్యానికి ఏమి తక్కువ, హారీ పోటర్లు, లార్డ్ ఆఫ్ రింగ్ లు ఈయన వ్రాసిన ధారావాహికల ముందు ఏపాటి అని ప్రశ్నిస్తే, దురభిమానం అని రాగాలు తీసే అమ్మలక్కలు, అజ్ఞానులు కూడా తయారయ్యారు.
దాసరి సుభ్రహ్మణ్యం గారు 54 సంవత్సరాలు నివసించినది వడపళని లోని ఈ భవనంలోనే. ప్రస్తుతం దాదాపుగా పాడుపడినట్టుగా ఉన్నది కాని అందులో, అలనాడు దాసరి గారితో బాటుగా కొంతకాలం నివసించినవారు ఇంకా అందులోనే ఇప్పటికీ ఉన్నారుట.


దాసరిగారు నివసించిన ఏడో నెంబరు గది. ప్రస్తుతం అందులో ఉంటున్నాయన లేకపోవటం వల్ల లోపల ఫోటో తీయటం కుదరలేదట

ఆ భవనానికి వెళ్ళే దారి. శిధిలాలయ పూజారి, విక్రమకేసరి, ఖడ్గవర్మ, ధూమక సోమకుల సృష్టికర్త తన పాత్రల గురించి ఆలోచించుకుంటూ ఈ దారిలో అనేక దశాబ్దాలు నడిచి ఉంటారు.

దేవుణ్ణి నమ్మని మన దాసరి గారు ఈ గుడి పరిసర ప్రాంతాలలోనే ఐదు దశాబ్దాలు గడిపారు




దాసరి సుబ్రహ్మణ్యం గారు భోజన, ఉపాహారాలకు ఐదు దశాబ్దాలు అలవాటుగా వెళ్ళిన హోటళ్ళు


దాసరిగారు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తరచుగా వెళ్ళిన మందుల షాపు

దాసరిగారు చాలా చిత్రమైన వ్యక్తి. చందమామ చరిత్రలో మొట్టమొదటిసారిగా తనకు యాజమాన్యం ఎక్స్‌లెన్స్ అవార్డు ఇస్తే, ఆ అవార్డును ఫోటో కట్టించి, తనకు రెండు దశాబ్దాలు పైగా మందులు సరఫరా చేస్తున్నమురుగన్ మెడికల్ షాపు శ్రీనివాస్ గారికి ఇచ్చేసారు. విజయవాడ వెళ్లిపోతున్నప్పుడు కూడ తనతో తీసుకువెళ్ళలేదు. శ్రీనివాస్ గారు, దాసరి గారి గుర్తుగా ఇప్పటికీ ఆ ప్రశంసాపత్రాన్ని తనవద్ద ఉంచుకుని రాజశేఖర రాజుగారికి చూపించి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారుట
********************************************
ఫోటోలను పంపుతూ శ్రీ రాజశేఖర రాజుగారు వ్రాసిన విషయాలు, విశేషాలు కొన్ని

********************************************
మార్వాడీల యాజమాన్యంలో ఉండే ఆ పాత భవంతిలో మొత్తం 12 అద్దె ఇళ్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువమంది తెలుగు వారే. 1952 నుంచి 2006 వరకు దాసరి గారు ఇక్కడి గ్రౌండ్ ప్లోర్ లోని 7వ నంబర్ ఇంటిలో అద్దెకు ఉండేవారు. అనారోగ్య కారణాలతో ఇక్కడి నుంచే ఆయన 2006లో విజయవాడలోకి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇక్కడ ఇతర ఇళ్లలో ఉన్నవారు కూడా గత 35 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అందరిలోకీ సీనియర్ దాసరి గారే. 54 ఏళ్లుగా ఇదే ఇంటిలో ఆయన ఉంటూ వచ్చారు. 54 ఏళ్లు ఒకే ఇంటిలో ఉండటం, ఒకే ఆఫీసు -చందమామ-లో పనిచేయడం. దాసరి గారికే చెల్లింది. శంకర్ గారు కూడా చందమామలో గత 58 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయన చాలా ఇళ్లు మారారు. కాబట్టి ఇల్లు, ఆఫీసుకు సంబంధించిన దీర్ఘకాలిక రికార్డు ప్రపంచంలో బహుశా దాసరిగారికే దక్కవచ్చు. ఇది ఖచ్చితంగా గిన్నెస్ రికార్డుకు ఎక్కవలసిందే.

చెన్నయ్లో 54 ఏళ్ల పాటు దాసరి గారు గడిపిన ఈ ఇంటికి ఆయన సోదరులు ఈశ్వర ప్రభు తరచుగా వచ్చేవారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రభుగారి కుమార్తె మణి తన చిన్నాన్నను కలవడానికి ఇక్కడికి వచ్చేవారు. ఈ భవంతిలో ఉన్న ఇళ్ళల్లో ఉన్న తెలుగు, తమిళ, కన్నడ కుటుంబాల వారికందరికీ దాసరి గారు సుపరిచితులు. ఇక్కడ ఉంటున్న తమిళ మహిళ మణివాలన్, కన్నడ మహిళ గౌరి -తెలుగు బాగాతెలుసు- తదితరులందరికీ దాసరి గారి జ్ఞాపకాలు ఈనాటికీ మెదులుతుంటాయి. కదిపితే చాలు ధారాళంగా చెప్పుకుంటూ పోతారు. ‌

ఒక్కటి మాత్రం నిజం. దాసరి గారు చెన్నయ్ నగరంలో చివరి వరకూ మద్యతరగతి జీవితమే గడిపారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో సామాన్య కుటుంబాలే ఉండేవి. చందమామలో జగత్ప్రసిద్ధి పొందిన 12 ధారావాహికలు రచించి లక్షలాది పాఠకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన దాసరి గారు ఇక్కడి ఇరుకుగదిలోనే నివసిస్తూ చందమామ దారావాహికలకు పాత్రల రూపకల్పన చేసి ఉంటారు!

‌
వడపళని మురుగన్ కోయిల్ స్ట్రీట్లో దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఇంటికి దగ్గరగా, మురుగన్ కోయిల్కి అతి సమీపంలో ఉన్న మురుగన్ మెడికల్ షాపు దాసరి గారు దశాబ్దాలపాటు మందులు తీసుకున్న మెడికల్ షాపు ఇదే. బోర్డు కూడా రోడ్డుకు పైన కాకుండా లోపల కనీ కనిపించకుండా ఉండటంతో పెద్గగా దీన్ని పట్టించుకోలేకపోయాము. చందమామ ప్యాకింగ్ విభాగంలో ఉన్న రవి చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు దీన్ని పట్టేశాము. ‌‌

ఈ మెడికల్ షాపుతో దాసరి గారికి 50 ఏళ్లపైబడిన బంధం ఉంది. 1952లో చెన్నయ్కి వచ్చిందిమొదలుకుని దాసరి గారు తమ వైద్య అవసరాలకు ఈ షాపుకే వచ్చేవారు. మేము వెళ్లేటప్పటికి షాపులో ఉన్న శ్రీనివాస్ గారిని దాసరి గారి గురించి ప్రస్తావిస్తే 22 ఏళ్లుగా ఆయన తనకు తెలుసని చెప్పారు. ఎందుకంటే ఇతను గత 22 ఏళ్లుగా ఈ షాపులోనే పనిచేస్తున్నారు. దాసరి గారి జ్ఞాపకాలను పంచుకోమని అడిగితే ముందుగా ఆయనకు చందమామ 2000 సంవత్సరంలో జీవితకాల సాధనకు -లైఫ్ అచీవ్మెంట్‌- గాను అందించిన చందమామ ఎక్స్లెన్స్ అవార్డు ధ్రువపత్రాన్ని దాసరిగారు స్వయంగా ఫ్రేమ్ కట్టించుకుని తర్వాత తమకు ఇచ్చారని చెప్పి షాపులోనే ఉన్న ఆ ఫోటోను మాకు అందించారు.
‌ ‌‌

చందమామ చరిత్రలో ఎక్స్లెన్స్ అవార్డు ఇద్దరికి మాత్రమే లబించింది వారు దాసరి, శంకర్ గార్లు. 1999లో చందమామ బయటి వ్యక్తుల సహాయం తీసుకుని తిరిగి ఉనికిలోకి వచ్చాక, దశాబ్దాలుగా పత్రిక అభివృద్ధికి దోహదం చేసిన మాన్యులను గౌరవించాలని పత్రిక మనుగడకు ఆర్థిక సహాయం అందించిన సుధీర్ రావు తదితరులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఇద్దరు మహనీయులకు చందమామ ఎక్స్లెన్స్ అవార్డు అందించారు. వడపళనిలో ఉన్న ప్రముఖ హోటల్ ఆదిత్యలో జరిగిన ఓ ఫంక్షన్లో ఈ అవార్డును బహూకరించారు. ‌‌‌

చందమామ ఆవిర్భవించిన 50 ఏళ్ల తర్వాత ఆ సంస్థకు చెందిన సిబ్బందికి అవార్డులు ప్రకటించిన చరిత్ర అదే మొదటిదీ, చివరిదీ కూడా కావడం గమనార్హం. వ్యక్తుల కంటే సంస్త ముఖ్యమే కాని జగత్ప్రసిద్ది గాంచిన కథల పత్రికలో పనిచేసిన సిబ్బంది జీవితాలు ఇంత సుదీర్గకాలం అజ్ఞాతంలో ఉండిపోవడమే బాధాకరం. చందమామ ఎక్స్లెన్స్ అవార్డు వీరిద్దరికీ వచ్చినా, రాకున్నా వారి ఘనతర చరిత్రకు జరిగే లాభం, నష్టం ఏమీ ఉండవనుకోండి. కాని ఎక్కడో బాధ. ‌

దాసరిగారికి చందమామ బహూకరించిన ఎక్స్లెన్స్ అవార్డు ఫోటో ఫ్రేమును మాకు చూపించిన మురుగన్ మేడికల్స్ శ్రీనివాస్ గారు సాయంత్రం 4 గంటల తర్వాత వస్తే దాసరిగారితో తమ పరిచయం విశేషాలుచెబుతానని చెప్పారు. పక్కనే ఉన్నాము కాబట్టి మళ్లీ కలుద్దామని చెప్పి మా వద్ద ఉన్న చందమామలనుగౌరవంగా అందించి ఆఫీసుకు వచ్చేశాము.
‌

********************************************

ఇవండీ మన అభిమాన రచయిత, చందమామలో అత్యంత ప్రసిద్ది పొందిన డజను ధారావాహికలు వ్రాసిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి ఇంటి కథ ఆపైన ఆయన ఐదున్నర దశాబ్దాలు తిరుగాడిన పరిసరాల కథ
********************************************