23, డిసెంబర్ 2010, గురువారం

మరో హుషారైన ఆకాశవాణి వారి పాట

ఆకాశవాణి లో వచ్చే పాటలన్నీ కూడ నీరసంగా ఉంటాయి అనుకోవటం పొరబాటే. చాలా హుషారైన పాటలు కూడ అప్పుడప్పుడూ ప్రజలకు వీనుల విందుగా వదులుతూ ఉండేవారు. అలా వచ్చిన పాటే "వయ్యారం వలకబోస్తావా" అంటూ పల్లె పడుచును ఉద్దేసించి పాడబడినపాట.

పాటను పాడినవారు ప్రసిద్ధ ఆకాశవాణి గాయకుడు మల్లిక్ గారు అనుకుంటాను. గాయని ఎవరో తెలియటంలేదు. పాట వింటుంటే రోజంతా పొలం పనులు చేసి ఇంటికి వెళ్తున్నా కుర్ర రైతు జంట కళ్ళముందు కదులుతూ ఉంటుంది. ఇంక ఆలస్యం దేనికి విని ఆనందించండి.



పాటకు సంగీతం సమకూర్చిన వారెవరో తెలియదు. మల్లిక్ గారేనేమో! వినటానికి ఎంతో వినసొంపుగా, వింటున్నంతసేపూ హుషారుగా సాగే పాట ఇది.






****
***
*

11 కామెంట్‌లు:

  1. శివ గారూ,

    మీరు చేస్తున్నది మంచి ప్రయత్నం. అవును. అది మల్లిక్ గారు పాడిన పాటే. స్త్రీ గొంతుక మాత్రం ఎవరిదో పోల్చుకోలేకపోయాను. మల్లిక్ గారిదంటే మాత్రం స్పెషల్ వాయిస్ .

    ఇలా ఆకాశవాణి కి సంబంధించిన రికార్డింగ్ లు మీరు భద్రంగా దాచాడమే కాకుండా మళ్ళీ వోపికగా మాకు కూడా అందించటం మంచి ప్రయత్నం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. సాహిత్య అభిమాని అన్నది సరైంది కాదు.

    సాహిత్యాభిమాని అని రాయడమే కరక్టు.

    తెలుగో అంటూ గొంతుచించుకునే పెద్దలు, ఇలాంటి చిన్నవి పట్టించుకోకపోతే ఎలా?

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శివరామ ప్రసాద్ గారికి నమస్కారం!

    మీరు చేస్తున్న ఈ పసందయిన పని బహుదా ప్రశంసనీయం. ఈ పాట నేను వినడం మొదటిసారే ... వింటూంటే చాల వుత్సాహంగా వుంది. అలాగే ..
    మీ దగ్గర వేదవతి ప్రభాకర్ గారూ పాడిన "మధూదయంలో మంచి ముహూర్తం"
    ఇంకా "ఓహో ఓహో వసంతమా ...." (పాడింది ఎవరో గుర్తు లేదు) అనే పాటలు వుంటే అందచేయ గలరు ఆ పాటలు నాకు చాల ఇష్టం వాటిని వింటూ ఆకలి దప్పులు మరిచి పోవచ్చు.

    రిప్లయితొలగించండి
  4. చూడండి సుబ్బారావుగారూ. ఇది మీరు తగిలించుకున్నపేరల్లే ఉంది. మీకు తెలిసిందే సరైనదని ఒక నిర్ణయానికి వచ్చేసి ఆవతలి వాళ్ళని ఎద్దేవా చెయ్యటమేనా? ప్రస్తుతం బ్లాగులోకంలో చాలామంది బాధపడుతున్న విషయం ఇది. మీరు చెప్పదలుచుకున్న మాట చెప్పండి అంతే.

    మీరు సంధి చేసి చెప్తున్నమాట నేను సంధి చెయ్యకుండా నా బ్లాగుకు శీర్షికగా వాడుకున్నాను. అందులో తప్పేమీ లేదు. రెండు మాటలు ఉంటే సంధి చేసి తీరాలని మీ అభిప్రాయం ఐతే మీరు ఆవిధంగా పాటించండి. ఇలా పిడివాదాలు చెయ్యటం వల్లే తెలుగు వాడకం తగ్గిపోయి ఆంగ్ల మాధ్యమానికి ఎక్కువ ప్రాముఖ్యం పెరుగుతున్నది. చెప్పవలసిన మాట ఆవతలివారిని ఎద్దేవా చెయ్యకుండా చెప్పగలిగితే బ్లాగులోకంలో ఎంతైనా బాగుంటుంది. అజ్ఞాతగా వ్రాస్తే వ్యాఖ్యలు చేస్తే నేను వెయ్యనని "సుబ్బారావు" పేరు తగిలించుకు వ్రాయటం. ఆపేరుకూ వివరాలు లేవు. స్వంత పేరుతో వ్యాఖ్యలు చెయ్యలేనివారు ఎదుటివారికి చెప్పటానికి అనర్హులు.

    రిప్లయితొలగించండి
  5. కల్పన, సుజాత గార్లకు ధన్యవాదాలు.

    సుజాతగారూ ఎవరి అభిప్రాయాలు వారివి. ఒకరి అభిప్రాయాలు మరొకరి నచ్చాలని నిబంధన లేదు. ఎస్పి అన్న మాటలో చాలావరకు నిజం ఉన్నది. కాని పాపం ఆకాశవాణివారు, వారికి ఉన్న కొద్దిపాటి వనరులలో మీరన్నట్టుగా ఒక తబలా, హార్మోనియం, ఒక వేణువు వంటి వాటితో వాళ్ళూ చెయ్యగలినంతమేర వారు చేస్తూనే ఉండేవారు. ఎస్పి అన్నది పాటల సంగీత కూర్పు విషయంలో దాదాపుగా అన్నీ ఒకే మూసలో ఉన్నట్టుగా ఉండి నీరసంగా ఉంటాయని, వైవిధ్యం ఉండదని. ఈ మాట చాలావరకు నిజమని నాకు అనిపిస్తున్నది.

    రిప్లయితొలగించండి
  6. దాసరి వెంకటరమణగారూ. నమస్తే.

    మీరు అడిగిన పాటలు నా దగ్గర లేవని చెప్పలేను, ఉన్నాయని ఘంటాపధంగా చెప్పి ఒకటి రెండురోజుల్లో ఇక్కడ ఇవ్వలేను. నా దగ్గర, మా తమ్ముడి దగ్గర ఉన్న అనేకానేక కాసెట్లు 1970లనుండి రికార్డు చెయ్యబడినవి ఉన్నాయి. మా దగ్గర ఉన్న రికార్డింగులకు ఒక ఇండెక్సు లేదు. పూర్తిగా మా గుర్తే ఆధారం. ఆరోజుల్లో కొన్ని కొన్ని కాసెట్లల్లో, టేపు ఆదా చెయ్యటం కోసం రెండు చానెళ్ళల్లో రెండు విడి విడి కార్యక్రమాలు రికార్డు చెయ్యటం కూడ జరిగింది. అవన్ని అప్పుడప్పుడూ వింటూ డిజిటైజ్ చేయ్యటానికి వీలైనవన్ని కాలక్రమాన బ్లాగులో అందరితో తప్పకుండా పంచుకుంటాను. ఒక దశాబ్దం పాటు బి బి సి వారి ఆంగ్ల వార్తల ముక్యాంశాలు మా తమ్ముడు రికార్డు చేసి, ఆ పది సంవత్సరాల్లో జరిగిన చరిత్ర మొత్తం టేపుల్లో నిక్షిప్తపరిచాడు.

    ఈ విధంగా దాదాపు రేడియో అంటే అభిమానం ఉన్న వాళ్ళ అందరిదగ్గరా కొద్దో గొప్పో రికార్డింగులు ఉండే ఉంటాయి. చాలా తక్కువమంది వాటిని బయటకు తీసి అందరితో పంచుకుంటున్నారు. రికార్డింగులు ఉన్నవారందరూ, తమ తమ దగ్గర ఉన్న పాటలు వగైరా అందరితో వాళ్ళ వాళ్ళ బ్లాగుల్లో పంచుకుంటే, ఆకాశవాణివారి దగ్గరకూడ ఉండి ఉండని (పాపం ఆకాశవాణి వారు పేపర్లో కూడ ప్రకటించారు పాత రికార్డింగులు తాము భద్రపరచలేదని) పాటలు, నాటికలు మళ్ళి అందరికీ అందుబాటులోకి వస్తాయి, రేడియో కార్యక్రమాల అప్పటి నాణ్యం ఇప్పటి వాళ్ళకు తెలుస్తుంది.

    మీ బంధువులు, స్నేహితులు ఆపైన తెలిసినవాళ్ళ దగ్గర ఆకాశవాణి ప్రోగ్రాముల టేపులు ఉంటే, నాకు పంపగలిగితే వాటిని డిజిటైజు చేసి కాసెట్ట్ వెనక్కి పంపగలను.

    నేను కూడ చాలా కాలం నుండి, కొండమీద కోయిల ఒకటి కూసిందీ" అనే పాట కోసం తెగ వెతుకుతున్నాను. ఈ పాటా నా దగ్గర లేదు. మీ దృష్టిలో ఎక్కడన్నా ఉండి ఉంటే చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  7. సుజాతగారూ,

    మీరు వ్రాసిన వ్యాఖ్య తొలగించినట్టుగా ఉన్నది. మీరే తొలగించారా. కారణం తెలియదు!

    రిప్లయితొలగించండి
  8. నేనే తొలగించానండీ! నేనే ఒక పోస్టు రాద్దామనుకుంటున్నా దీనిమీద! తను లలిత సంగీతానికి పెద్దగా చేసిందేమీ లేకపోయినా బాలూ అలా ఆకాశవాణి లలిత గీతాల మీద వ్యాఖ్యానించడం నాకు బొత్తిగా నచ్చలేదు.ఇక్కడ వ్యాఖ్య రాయడం మళ్ళీ దాని మీద చర్చ.. ఎందుకని....!

    రిప్లయితొలగించండి
  9. @సుజాత

    చర్చ ఎక్కడ జరిగితేనేమిటి? ఎవరి అభిప్రాయాలు వారివి. ఒకరి అభిప్రాయలు ఒకరు గౌరవించుకోగలిగితే చాలు.

    రిప్లయితొలగించండి
  10. మంచి పాట, హుషారైన పాట పంచుకున్నందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.