29, డిసెంబర్ 2010, బుధవారం

భక్తి రంజని

శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారు మరియు కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారు
(Photos courtesy nadaprabha.org)

రేడియో వింటూ ఉన్నప్పటి నా జ్ఞాపకాలు అని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తే, మొట్టమొదటిగా తలపుకువచ్చేది 'భక్తి రంజని" కార్యక్రమమే. కారణం, పొద్దున్నే ఆరుగంటలకు మొదలయ్యే చక్కటి కార్యక్రమం, చిన్నతనంలో నన్ను లాలిస్తూ నిద్రలేపటమే. మా నాన్నగారు, తెల్లవారుఝామునే లేచి వ్యాయామం చేసి, ఆరుగంటలకల్లా రేడియో పెట్టేవారు. శ్రావ్యమైన భక్తి పాటలు వింటూ నిద్ర లేవటం ఎంతటి ఆనందాన్నిచ్చేది! ఆయన తన దగ్గర ఉన్న రెండు చేతి గడియారాలు, ఒక అలారం గడియారం వీటన్నిటికి కీ ఇవ్వటానికిసమయం ఏడుగంటల వార్తలు వింటూ. సరిగ్గా తెలుగు వార్తలు మొదలవ్వటం, ఆయన గడియారాలకు కీ ఇస్తూ వాటి టైము సరిచూడటం. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొచ్చినా, అవ్వొక చక్కటి రోజులు.

భక్తి రంజని అనగానే వెంటనే గుర్తుకు వచ్చెవారిలో మొట్టమొదటి వారు శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు గారు కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారు. వీరిద్దరూ పాడినన్ని భక్తి రంజని పాటలు మరెవ్వరూ పాడలేదు. ముఖ్యంగా వోలేటి వెంకటేశ్వర్లుగారు పాడిన భజగోవిందం ఎంత శ్రావ్యంగా, రాగయుక్తంగా ఉందేది. అద్భుత గానంనుండి కొద్దిగా విని ఆనందించండి.


అలాగే బాలాంత్రపు రజనీ కాంతరావుగారు, అధికారి మరియు కళాకారుడు. సామాన్యంగా రోజుల్లోకళాకారులైనవారే స్టేషన్ డైరక్టర్లుగా ఉండేవారు. గుమాస్తాలు ప్రమోషన్లు సంపాయించి డైరక్టర్లు అయ్యేవారు కాదు. స్వతహాగా సంగీత కళాకారుడైన రజనీ కాంత రావుగారి ఆధ్వర్యంలో ఎన్నో చక్కటి భక్తిరంజని గీతాలు తయారు చెయ్యబడినాయి. వాటిల్లో బహుళ ప్రజాదరణ పొందినవి "సూర్యాష్టకం" చక్కటి అష్టకాన్ని గానంచేసినవారు శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీ జగన్నాధాచార్యులు శ్రీ రమణమూర్తి, శ్రీ బాలాంత్రపురజనీకాంతరావు, శ్రీమతి వింజమూరి లక్ష్మి తదితరులు. ప్రతక్ష్య దైవమైన సూర్యభగవానుడిని కీర్తిస్తూ పాడిన అష్టకంలో రజనీ కాంతరావుగారి గాన మాధుర్యం ఒక్కసారి వినండి.



ఇదే
విధంగా "శ్రీ సూర్యనారాయణా" అన్న ఒక రమణీయమైన బృందగీతం. పాట సామాన్యంగా ఆదివారాల్లోమాత్రమే వేసెవారు (ఆదివారం సూర్యుని రోజు కావటం వల్ల కాబోలు). పాటకోసం వారమంతా వేచి ఉండి. ఆదివారమైనా సరే పొద్దున్నే లేచి వినటంలో ఉన్న ఆనందం, ఇప్పుడు పొద్దున్నే వచ్చే చద్ది వార్తలు వింటూలేవటంలో లేదు. ఒక్కసారి పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవటానికి "శ్రీ సూర్యనారాయణా" అంటూ మనంకూడ గళం కలిపి ఆనందిద్దాం!



(పైన ఉదహరించిన ఆడియో క్లిప్పుల్లో వినపడే భక్తిరంజని పాటలు అన్ని కూడ ఆకాశవాణి వారు సిడిలుగా వేసి అమ్ముతున్నారు. అభిరుచి ఉన్నవారు, ఆకాశవాణి కేంద్రానికి వెళ్లి కొనుక్కోవచ్చు)

ఇలా
చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని భక్తి గీతాలు. ఒక్క హిందూ మత కీర్తనలు, బృద గీతాలే కాకుండా వారాన్నిబట్టి శుక్రవారం ఖురాను పఠనం, ఆదివారం బైబిలు నుండి సూక్తులు ఎంతో చక్కగా వినిపించేవారు. ఖురాను పఠనం 1960లు 1970 మొదటి రోజులలో ఒక సాయిబు గారు హాయిగా చక్కటి తెలుగులో వినిపించేవారు. అదేమీ ఎబ్బెట్టుగా ఉండేది కాదు. మనకు సంబంధించినదే వింటున్నట్టుగా ఉందేది. ఇక పండుగలు వస్తే పండుగకు సంబంధించిన పాటలు, దుర్గాదేవి, వినాయకుడు, తిరుప్పావై ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు.

ఇన్ని జ్ఞాపకాల్లో ఏవో కొన్ని మాత్రమే ఆకాశవాణిలో ఉన్న పుణ్యాత్ముడు పూనుకుని సి డి లు వేసి అమ్మారో, వారి దయతో కొన్ని మనం మళ్ళి వినగలుగుతున్నాం. కాని భక్తి రంజని మొత్తం ఒక డి వి డి కింద తయారు చేసి ఆకాశవాణివారు అమ్మితే ఎంత బాగుండును. నిజం! అనేక మంది ప్రముఖులు, వాళ్ళు భక్తిరంజని అభిమానులమని అనేక కార్యక్రమాలలో వేదిక మీదనుండి చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఆకాశవాణి వారు మరొక్కసారి పూనుకుని, మొత్తం భక్తిరంజని పాటలు అన్ని కూడ ఒక డి వి డి వేసి, అందులో అలనాటి కళాకారుల వివరాలు ఫొటోలు, ఇంకా జీవించి ఉన్నవారితో పరిచయాలు కలిపి విడుదలచేస్తే ధర ఎంతైనా సరే కొనుక్కోవచ్చు. అంతటి మంచి ఆలోచన ఆకాశవాణి వారికి కలుగాలని, భక్తిరంజనిలో మనకు వినపడే దేవుళ్ళందరినీ నేను ప్రార్ధిస్తున్నాను.

అదే విధంగా అలనాటి భక్తి రంజని, ముఖ్యంగా ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి ప్రసారమైన పాటలు ఎవరి దగ్గరైనా రికార్డింగులు ఉంటే వాటిని తమ బ్లాగుల ద్వారా పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను.









***
*

4 కామెంట్‌లు:

  1. మంచి మంచి ఆడియో లు అందిస్తున్నారు. నెనర్లు

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు భానూ గారూ. ఆడియో మొత్తం అందించటం కుదరదు. రుచి చూపించటానికి కొద్ది కొద్దిగా అందించాను. ఆకాశవాణి వారు ఈ పాటలు అన్ని మరికొన్ని కలిపి సి డి లు వేసి అమ్ముతున్నారు. ఇలా అమ్ముతున్న ఆకాశవాణివారిని మన ఆ సి డి లు కొని ప్రోత్సహిస్తే మరిన్ని సి డి లు వేసే అవకాశం పెరుగుతుంది.

    "నెనర్లు" అంటే ఏమిటండీ భానూగారూ. చాలా చోట్ల చూస్తుంటాను. "నెట్ నమస్కారాలకి" హ్రస్వరూపమా?

    రిప్లయితొలగించండి
  3. ఈ సారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూడాలి. నెనరులు మీరన్నట్టు అయ్యి ఉండవచ్చు. నేను కొత్త పాళీ గారి నుంచి కాపీ చేశా. సరి అయిన అర్థం వారినే అడగాలి.

    రిప్లయితొలగించండి
  4. Sir,

    Suryasthakam is available in youtube with lyrics:

    http://www.youtube.com/watch?v=vicJ9EmIPXI

    Best Regards,
    Jawahar

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.