30, జనవరి 2011, ఆదివారం

మా చందమామయ్య


"అవ్వొక రోజులూ" అని మా చిన్న తనంలో పెద్ద వాళ్ళు అంటూ ఉంటే పెద్దగా అర్ధం అయ్యేది కాదు. ఐదుపదులు దాటిన ఇప్పుడు పాత రోజులు తలచుకుంటే, అసంకల్పితంగా అవే మాటలు వస్తున్నాయి.

మా చిన్న తనంలో అంటే 1960, 1970 లలో చందమామ కొనాలంటే మేముండే చోట రెండే షాపులు ఒకటి చెవిటి దుర్గయ్య కొట్టు (పెద్ద డిపార్టుమెంటు స్టోర్ లాంటి కిళ్ళీ కొట్టు) లేదంటే పక్కనే ఉన్న రెడ్డిగారి కొట్టు. తరువాత్తరువాత జగ్గారావు షాపు.

చందమామ రావటం ఆలస్యం వారి వారి షాపుల ముందు చందమామలన్ని చక్కగా ఆలంరించేవాళ్ళు , వడ్డాది పాపయ్య గారి బొమ్మలతో ధగధగా మెరిసిపోతూ చందమామల్తో వాళ్ళ షాపులు వెలిగిపోయేవి. ఒక్క రోజు కంటే ఎక్కువసేపు కాపీలు మిగిలేవి కాదు. అందుకని, మేము వెంటనే ముప్పావలా కోసం ఇంటికి పరుగులు పెట్టి వెంటనే కొత్త కాపీ తీసుకుని బొమ్మలు చూసుకుంటూ ఇంటికి వెళ్ళేవాళ్ళం. కొంత కాలానికి రెడ్డిగారి షాపులో మాకు గుర్తింపు వచ్చింది. మాకోసం ఒక కాపీ ప్రత్యేకంగా ఉంచేవారు. కాబట్టి సాయంత్రం లోపల ఏదో ఒక టైములో చందమామను సంపాయించే అవకాశం చిక్కేది.

అలా పరిచయం అయిన రెడ్డిగారు మా కంటే చాలా పెద్ద వాడైనా మాకు మంచి స్నేహితుడు అయ్యాడు. మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు ఆయన షాపు కనపడలేదు. ఏమయ్యిందో అని ఆరా తీస్తే వయోభారంతో షాపు తీసేసినట్టు తెలిసింది. ఈయన్ని కలుసుకోవటం ఎలా అని ఒకటి రెండు రోజులు అనుకుంటూ ఉండగా ఒకరోజున "మా చందామామయ్య" రెడ్డిగారు రోడ్డుమీదే మాకు తారస పడ్డారు. వెంటనే ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగాం.

నా చందమామ జ్ఞాపకాల్లో ఉన్న రెడ్డిగారి తో ఫోటో తీయించుకోవటం ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోతుంది.

2 కామెంట్‌లు:

  1. ఇన్నేళ్ళ తర్వాత మీ‘చందా మామయ్య’ గారిని రోడ్డుమీదైనా కలుసుకున్నారన్నమాట! ఆయనతో ఫొటో తీసుకుని, ఇలా బ్లాగులో పెట్టటం బాగుంది. ఇంతకీ విజయవాడలో ఈ షాపు ఏ ఏరియాలో ఉండేది?

    రిప్లయితొలగించండి
  2. వేణూ గారూ. రెడ్డిగారి షాపు సత్యనారాయణపురంలో శివాజీకేఫ్ సెంటర్లో ఉండేది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.