26, జనవరి 2011, బుధవారం

రిపబ్లిక్ దినోత్సవాలు జరుపుకోవటమేనా.......


రిపబ్లిక్ దినోత్సవాలు జరుపుకోవటమేనా....... రోజున కొంత ఆలోచన చెయ్యగలమా !

క్రితం సంవత్సరం ఇదే రోజున రిపబ్లిక్ దినోత్సవాల గురించి నా అభిప్రాయాలు వ్యక్తపరిచాను. ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు.


అప్పటికి ఇప్పటికి ఆ అభిప్రాయాలు మారలేదు, మరింత బలపడ్డాయి. ఈ వ్యాసానికి రాజశేఖర రాజుగారు ఈ విధంగా స్పందించారు:
"కొత్త రాజ్యాంగమా, మళ్ళీ రాయడమా, మన రాజకీయ'వేత్త'లా. పోండి సర్, భలేవారు. ఒక్క పుట విషయంలో కూడా మనవాళ్లు ఏకాభిప్రాయానికి రాలేరని నాది గ్యారంటీ. ఏదో 60 ఏళ్ల క్రితం వాళ్లు ఆమాత్రం రాయబట్టి బతికిపోయాం.కథనం ఆలోచనాత్మకంగానే ఉంది. కానీ.... "
నిజమే మనకు చర్చకీ, వాదనకీ తేడా తెలియకుండా పోయింది. ఎవరికి వారు తమకున్న సొంత ఎజెండా చెడకుండా దానికిసరిపొయ్యే వాదనలు చేస్తూ, తమదే సరైన ఆలోచన అని, మిగిలినవారి వన్ని స్వార్ధపూరితమైన అలోచనలని తెగడటమే సరిపోతున్నది కాని, దేశం మొత్తం ఒకటి, ప్రజలందరూ ఒక్కటే అన్న భావనతో అలోచనలు ఏ రాజకీయ పక్షం కూడ చేయటం లేదు.

ఈ కారణంగా దేశం మొత్తం కూడ ఒక విధమైన రాజకీయ అయోమయంలో ఉన్నది. రాజకీయాల్లోకి ఎవరు రాకూడదో, స్వంత లాభం కోసం ఎంతకైనా తెగించగలరో, వాళ్ళే ఎక్కువమంది తోసుకు వచ్చేశారు. ఇది చెయ్యచ్చు, ఇది చెయ్యకూడదు అన్న విచక్షణ ఉంటుందన్న విషయం కూడ చాలా మంది రాజకీయ జీవులకు తెలిసినట్టుగా కనపడదు.

ప్రస్తుతం మనకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎంతవరకూ విజయవంతమైనది తరచి చూసుకోవాల్సిన సమయం ఎప్పుడో ఆసన్నమైనది అని నా అభిప్రాయం. రిపబ్లిక్ దినోత్సవం రోజున
ఊరికే జెండాలు ఎగరెయ్యటం, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం, ప్రతి రాష్ట్ర రాజధానికిలోనూ, ఢిల్లీలోనూ కవాతులూ, వందన సమర్పణలూ.... అంతేనా రిపబ్లిక్ డే అంటే?

ప్రతి రిపబ్లిక్ డే రోజున జాతి మొత్తం ఒక్కసారి మనకున్న రాజ్యాంగం ప్రస్తుత పరిస్తితులకు ఏ విధంగా అనుగుణంగా ఉన్నది అని ఒకసారి అవలోకించుకోవాల్సిన అవసరం లేదూ? ఈ దశగా ఎక్కడా చర్చలు జరుగుతున్న దాఖలాలు కనపడటం లేదు.

రాజకీయ నాయకులు, ఇప్పటికే టైపు పరీక్షల్లో ఉండే సెకడ్ పేపర్ ప్రశ్న పత్రం లాగా అనేక హంసపాదులతో ఉన్న మన రాజ్యాంగానికి, తమ పబ్బం గడుపుకోవటానికి మరెన్ని తూట్లు పొడుద్దామా అన్న యావే కాని, రాబొయ్యే తరాలకు, మన రాజ్యాంగాంలో ప్రజా స్వామ్య పరిరక్షణకు చేబట్టవలసిన మార్పుల గురించి ఆలోచనే లేదు కదా.


మన రాజ్యాంగం ఇప్పటికే అనేక మార్పుచేర్పులకు చోటు చేసుకుంది. ఆ రాజ్యాంగం వ్రాసి ఆరు దశాబ్దాల పైన అయిపోయింది. మళ్ళి మరొక్క సారి మొత్తం రాజ్యాంగాన్ని పరిశీలించి, ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతవరకూ దేశ ప్రగతికి, ప్రజల బాగోగులకు ఉపయోగపదుతున్నదో సమీక్షించాల్సిన సమయం వచ్చిందని నా అభిప్రాయం. అద్యక్ష తరహా పాలన ప్రవేశ పెడితే ఎలా ఉంటుంది? రాజకీయ సుస్థిరత తద్వారా ప్రజా శ్రేయస్సు, దేశ ప్రగతి ముఖ్య సూత్రాలుగా మరొకసారి రాజ్యాంగాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయటం మొదలుపెడితే ఎంతైనా సముచితంగా ఉంటుందని నా అభిప్రాయం.













*

1 కామెంట్‌:

  1. రాజ్యాంగం...కనీసం సంవత్సరానికి ఒక రోజైనా తలుచుకొనే రోజు. విడదీసి పరిపాలిస్తున్న బ్రిటీష్ వారు తమకు అనుగుణంగా తమ కోసం వ్రాసుకున్న 1935 చట్టాన్ని, మన స్వతంత్ర సమరయోధులు /పాత రాజకీయ నాయకులందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించిన 1935 చట్టన్ని మనవారు ప్రతి పాదికగా చేసుకొని రాజ్యాంగాన్ని వ్రాసినప్పుడే మనము అనేక హక్కులను కోల్పోయాము. మనని ముప్పు తిప్పలు పెట్టిన అనేక యురొపియన్ దేశాలను ఆదర్శంగా తీసుకున్నప్పుడే భారత ప్రజల గౌరవం ఏమిటో తేలిపోయింది. మనకు మన రాజ్యాంగంలో భారతీయత కంటే మనని పీడించిన యూరోపు వారి లక్షణాలే కనపడినప్పుడే మనది ఎంత ప్రజా సామ్యమో అర్ధం అయిపోతుంది. సరేలే, ఎదో ఒకటి వుండాలిలే అనుకున్నా.... మన రాజులు........ అదే మంత్రులకి ఎప్పుడు అడ్డం వస్తే అప్పుడల్లా రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేసినప్పుడే ఏకాస్తో వున్న ప్రజాధికారం కాస్తా మంత్రాధికారంగా మారిపోయింది. ఇంత తమకు అనుకూలంగా వున్న రాజ్యాధికారాన్ని ఏ రాజకీయ వ్యవస్త మరల ప్రజలకి ఇస్తుంది? ఏమో...చూద్దం మరల అటువంటి మార్పులు వచ్చే రోజు కోసం.......


    రాధాకృష్ణా.
    విజయవాడ.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.