13, ఫిబ్రవరి 2011, ఆదివారం

తోలి వ్యంగ్య చిత్రకారుడు

ఎవరండీ ఈయన ఫోటో లాగ లేదే బొమ్మ గీశారా లేక కార్టూనా అని సంశయం! కాని సమస్య నివారణ వెను వెంటనే జరిగింది. బొమ్మలో ఉన్నది తెలుగులో మొట్టమొదటి కార్టూనిస్టు శ్రీ తలిశెట్టి రామారావుగారు. అప్పుడెప్పుడో అలనాడు భారతి పత్రిక అంతకంటే ముందు ఉన్న తెలుగు పత్రికల్లో ఇవి కార్టూన్లు అని తెలుగు పాఠకులకు తెలియని రోజుల్లో వ్యంగ్య చిత్రాలను ప్రవేశ పెట్టిన ఘనత తలిశెట్టి వారిది.

మరి వారి కార్టూన్లు వారు వేసిన బొమ్మలు ఏమైపోయినాయి అని కార్టూన్ అభిమానులు బాధపడుతుండగా, ఒక చల్లటి వార్త తెలిపారు మన జయదేవ్ గారు. తోలి కార్టూనిస్టు శ్రీ తలిశెట్టి రామారావు గారు కార్టూన్లు దొరికినంత వరకు సేకరించి ఒక పుస్తకరూపంలో తీసుకు రావటానికి నడుంకట్టి విజయం సాధించారు శ్రీ ముల్లంగి వెంకట రమణారెడ్డి గారు. ఆయన కృషి ఫలితమే "తొలినాటి వ్యంగ్య చిత్రాలు" పుస్తకం ప్రస్తుతం పుస్తకం ప్రింటులో ఉన్నది.
సామాన్యంగా రచయితలు సమీక్షకుల అవతారంలో కనపడటం అరుదు. సమీక్షకులు ప్రత్యేకంగా ఉంటారు. కాని రచయితే సమీక్షకుడై ఇతర రచయితరచనల గురించి నిస్పక్షపాతంగా సమీక్షించి పాఠకుల ముందు ఉంచటం అనేది అరుదైన సాహితీ సంఘటనే! అటువంటి అరుదైన సాహితీ సంఘటనే, నా బ్లాగులో ముందుగా ప్రచురించే అవకాశం ఇచ్చిన జయదేవ్ బాబు గారికి నా కృతజ్ఞతలు

ప్రముఖ
కార్టూనిస్టు జయదేవ్ గారిని పుస్తకం గురించిన సమీక్ష వ్రాయమని కోరగా ఆయన తన కార్టూనిస్టు దృష్టితో పాఠకులకు చక్కటి తన సమీక్షతో, ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు. జయదేవ్ గారి సమీక్ష నుండి కొన్ని ముఖ్యాంశాలు:
  • తలిశెట్టివారి కార్టూన్లు పరిశీలిస్తే, ఒక నిఘంటువే వ్రాయవచ్చుననిపించింది. ప్రతి కార్టూనూ ఆ నాటి సామాజిక వ్యవస్థ, వృత్తి, ఆచార వ్యవహారాకు దర్పణంగా కనిపిస్తుంది. తలిశెట్టివారి ఊహాశక్తి వైశాల్యాన్ని ఎత్తి చూపుతుంది. వారి సూక్ష్మ దృష్టి, దూరదృష్టి ఎంత వాడివైనవో, సుదీర్ఘమైనవో విపులీకరిస్తాయి.
  • తెలుగు నేటివిటీ ఉట్టిపడేలా తలిశెట్టివారు తమ కార్టూన్లను మలిచారు. ఆనాటి జనం, బట్ట, కట్టు, కుర్చి, బల్ల, గొడుగు, విసినకర్ర, యధాతథంగా చిత్రీకరించారు. అప్పటి మదరాసులో ట్రాం బండి, డ్రైవరు, ట్రాఫిక్ పోలీసు కానిస్టేబులు ఎలా ఉంటారో మద్రాసువాడినైన నేను బాగా ఎరుగుదును. ఆ నాటి విశేషాలు ఇలా ఈ నాటికి కార్టూన్లలో చూడగలగటం అప్పటి ఫోటోలు లేని లోటు తీర్చింది.
  • తలిశెట్టి వారి కార్టూన్లు చూస్తూ కూర్చుంటె, కాలచక్రం ఎనభై ఏళ్ళు వెనక్కి పోయిన "దివ్యానుభూతి" కలుగుతుంది. ఆ నాటి జీవితాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు తలిశెట్టివారు.
  • ముఖ్యంగా నేపధ్య చిత్రీకరణ (67,72,88 పుటలలో) అద్భుతం. అంతేకాదు, ఆ రోజుల్లోని వస్తువులు, వ్యక్తులు, వస్త్రధారణ, ఆచారాలు, వ్యవహారాలు, కులాలు, మతాలు, వృత్తులు, విహారాలు, విలాసాలు, వాహనాలు అన్నీ కార్టూనుల్లో సాక్షాత్కరిస్తాయి.
  • కార్టూనిస్టులు గమనిచవలసిన ముఖ్యమైన అంశం ఒకటుంది. తాము గీసే కార్టూన్ సందర్భోచితంగా ఉండాలని అనుకుంటే, నేపధ్య చిత్రీకరణ చాలా ముఖ్యం. అందువల్ల, ఆ కార్టూన్ భావం ఏకాలానికి సంబంధించినదో స్పష్టమౌతుంది. అందులో దాగిన వ్యంగ్యం అవగతమవుతుంది.......తలిశెట్టివారు ఎక్కడెక్కడ కూర్చుని బొమ్మలు గీశారో, ఎంతగా 'అబ్జర్వ్' చేశారో!
  • కార్టూనిస్టు తన బొమ్మల్లో జీవకళను నింపాలని అనుకుంటే 'లైఫ్ స్కెచ్చింగ్' ప్రాక్టీసు చేయాలి......ఈ ప్రాక్టీసు ఫలితంగా గీసిన బొమ్మల్లో సహజత్వం, జీవం కనిపిస్తాయి,......ఈ అంశాలు లేకపోతే కార్టూన్ నిర్జీవంగా ఉంటుంది. భావం పేలవంగా ఉండి, హాస్యం పండదు. తలిశెట్టి వారి పలు కార్టూనుల్లో జీవకళ ఉట్టిపడుతుంది. 18, 19, 55 56,70, పుటలలోని అల్లుడు మామల కలయిక, బంతి ఆట, గ్రీష్మ రాత్రి, హాస్య చిత్రాలు, లైఫ్ స్కెచ్చింగ్, క్షురకర్మ చిత్రీకరణలో, తలిశెట్టివారు బొమ్మల్లో చలనం అంటే ఏమిటో చూపించారు.
  • ప్రతి కార్టూనిస్టుకి తన చుట్టూ ఉన్న సమాజం పట్ల ఒక బాధ ఉంటుంది, కోపం ఉంటుంది. దాన్నే ఎంతోసున్నితంగా తన కార్టూనుల్లో వ్యక్తం చేస్తాడు. తలిశెట్టివారు కూడ తమ "ఊహా ప్రపంచమున" ఇదే ప్రయత్నం చేశారు. 32,33 పుటల్లోని కార్టూన్లు చూస్తే ఆయన తన బాధను ఏ విధంగా వెలిబుచ్చారో అర్ధం అవుతుంది.
  • ఆయన ఏనిమేషన్ సూత్రాలని, ఆ రోజుల్లోనే అధ్యయనం చేశారా అనిపిస్తుంది. 'మార్ఫింగ్' మొదలుకొని (92వ పుట) సీక్వెన్షియల్ ఏక్షన్ (89, 97 పుటలు) దాకా, లైట్ బాక్స్ మీద స్కెచ్ చేసినట్లు పరమాధ్బుతంగా చూపించారు. ఆ బొమ్మలు చూస్తే చలన దౄశ్యం చూసిన అనుభూతి కలుగుతుంది.
  • తలిశెట్టివారు తమ కార్టూన్లద్వారా భావి తరాల వారికి నీతిబోధ చేశారు. ధూమపానం, మద్యపానం, గంజాయి, వరకట్నం, బానిసత్వం వీటిమీద తమ విముఖతను వ్యక్తం చేశారు. 96వ పుటలో, 2030 సవత్సరం లో మన వస్త్రధారణ ఎలా ఉంటుందో ఊహించారు ముఖ్యంగా తెలుగు భాషను కాపాడమని (40వ పుటలో) వేడుకున్నారు. నినాదం చేశారు. కార్టూనిస్టుగా తన బాధ్యతను నిర్వర్తించారు.
  • ఐతే కార్టూనిస్టు ఎంత మొత్తుకున్నా కొన్ని వ్యవస్థలు మారవు, వ్యక్తుల్లో మార్పు రాదు.

వివరాలు

పుట సంఖ్య

డబ్బు విలువ తరిగిపోతుంది

13

మద్యపాన నిషేధం జరగదు

15

ఏక్సిడెంట్లు లేకుండా ట్రాఫిక్ సాగదు

23

పొగడ్తలంటెనే జనం ఇష్టపడతారు

29

శ్రీమంతుడు ఎప్పుడూ సోమరిపోతే

27

రైల్వే కూలీకి తృప్తి ఉండదు

30

వకీలు ఫీజు వద్దనడు

32

భాష తెలియకపోయినా వ్యక్తులు పుస్తకాలు వ్రాస్తారు*

33

దొంగవేషాలు వేయని వారు బతకరు

34

దొంగస్వాములు ఉంటూనే ఉంటారు

39

మామూళ్ళిచ్చుకోవడాలు

42

కమీషన్లు కొట్టడాలు జరుగుతూనే ఉంటాయి

45

కట్నాలు కానుకలు ఇచ్చి తీరవలసిందే

53

అనర్హులకే బిరుదులు లభ్యమౌతాయి

54

బస్సు ప్రయాణంలో సుఖముండదు

83

విదేశీ వ్యామోహం మనల్ని వదలదు

86

*(బ్లాగులు కూడానా!)

తలిశెట్టివారి కార్టూన్లు గొప్ప ఉదాహరణలు. కార్టూన్ సంకలనం మీద నేనింతవరకు వ్రాసినది ఒక ఎత్తు, 37 పుటలోని కార్టూన్ గురించి వ్రాయాలంటే మరొక ఎత్తు ఔతుంది. వ్రాసేముందు నన్ను పగలబడినవ్వుకోవడానికి అనుమతివ్వండి ప్లీజ్! ( జయదేవ్ గారు తన సమీక్షలో కొసమెరుపుగా ఒక టీజర్తో ముగించారు)ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందా అని కదా మీ ఆలోచన. వివరాలు ఈ కింద ఇవ్వబడినాయి.
తలిశెట్టి రామారావుగారి కార్టూన్లలలో రెండు
పై రెండు కార్టూన్లూ 'రేఖా చిత్రం' అప్పారావుగారి సౌజన్యం


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.