7, ఫిబ్రవరి 2011, సోమవారం

Dennise the Menace పుట్టు పూర్వోత్తరాలు

Dennis The Menace సృష్టి కర్త శ్రీ హంక్ కేచ్చం
ఒక్కొక్క కార్టూన్ వెయ్యటం చదువరులను తమ హాస్యంతో చిత్ర కళా నైపుణ్యంతో చదువరులను అలరించటం, వ్యంగ్య చిత్రకారు చేసే పని. ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కార్టూనిస్టులు తాము సృష్టించిన కార్టూన్ పాత్రలకు, కార్టూనిస్టు కంటే ఎంతో పేరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగులో "బుడుగు" పాత్ర అటువంటిది. బాపు గారికి ఉన్నంత పేరు పాత్రకు ఉన్నది. ఇక్కడొక చిత్రం ఉన్నది. బుడుగు పాత్ర సృష్టి కర్త ముళ్ళపూడి గారైతే, రూపకర్త బాపూగారు.

బుడుగు పాత్ర లాంటిదే అమెరికన్ కార్టూన్ ప్రపంచం లో ఉన్నది. పాత్ర పేరు "డెన్నిస్" . డెన్నిస్ ఎలా ఉంటాడో చూడండి.
ఈ డెన్నిస్ కి సృష్టికర్త రూపకర్త ఒకరే. ఆయన పేరే హంక్ కేచ్చం.

డెన్నిస్ పాత్ర విధంగా తయారయ్యిందో చూద్దాం. 1950లో హాంక్ కెచ్చమ్ (అప్పటికే ఒక మంచి కార్టూనిస్టు), తాను సాటర్ డె ఈవెనింగ్ పోస్ట్ (The Saturday Evening Post) పత్రికలో వేయవలసిన వ్యంగ్య చిత్రం గురించి అలోచించుకుంటూ ఉండగా, అతని బెడ్ రూమ్ ప్రాంతంనుండి పెద్ద గడబిడ శబ్దాలు వినబడ్డాయట. ఆ వెనువెంటనే, అతని భార్య, అతను కూర్చున్న గది తలుపులు తటాలున తెరుచుకొని లోపలకొచ్చి, చాలా కోపంగా, "శుభ్రంగా నిద్రపోవలిసిన వెధవ, మన బెడ్ రూమ్ అంతా ధ్వంసం చేసేశాడు. మీ కొడుకు "ఓ బెడద" గా తయారయ్యాడని వాళ్ళ నాలుగేళ్ళ కొడుకు గురించి ఫిర్యాదు చేసింది.
వాళ్ళ కొడుకు పేరు డెనిస్ ల్లాయడ్ కెచ్చమ్. అప్పుడు హాన్క్ కెచ్చమ్ కు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. "డెనిస్ ఓ బెడద" (Dennis the Menace) అని కొన్ని వ్యంగ చిత్రాలను ఎందుకు వెయ్యకూడదు అనుకుని, వెంటనే, చాలా చిలిపిగా కనిపించే ఓ చిన్న పిల్లాడి బొమ్మల్ని డజను దాకా పెన్సిలు తో గీసి, న్యూయార్క్ లో ఉన్న తన ఏజంటుకు పంపించాడు.

పది రోజుల తరువాత, అతని ఏజంటు అయిన జాన్ కెనడీ(John Kennedy)ఒక పెద్ద పత్రిక వాళ్ళకి నీ బొమ్మలు నచ్చాయి, మరో డజను పంపించు, వాళ్ళు కొనేట్లున్నారు అని టెలిగ్రాం ఇచ్చాడు.

మిగిలిన విషయం వ్యంగ్య చిత్రాల చరిత్రగా మారింది.డెనిస్ ఓ బెడద (Dennis the Menace) అనే వ్యంగ్య చిత్రాల సంపుటి జన్మించింది. ప్రారంభంలో, ఎకంగా పదహారు వార్తా పత్రికలలో ఏక కాలంలో మార్చి 12 1951న ప్రారంభించబడింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ప్రజాదరణ పొందిన వ్యంగ చిత్రాల సంపుటి ఇది. 1952 కల్లా, అంటే ప్రారంబించిన సంవత్సరానికల్లా, ఆ వ్యంగ్య చిత్రాలన్నీ ఒక పుస్తక రూపంలో ప్రచురించబడి లక్షా ఇరవై ఒక్క వేలు అమ్ముడు పొయినాయట. ఆ సంవత్సరానికి, కెచ్చమ్ కు "అద్భుత కార్టూనిస్ట్" బహుమతి నేషనల్ కార్టూనిస్ట్ సొసైటీ వారిచే ఇవ్వబడింది.

1959లో జే నార్త్ అనే నటుడు "డెనిస్" పాత్రలో నటించగా , ఒక టి.వి ధారావాహిక మొదలయ్యింది. "డెనిస్" పేరు మీద ఆటబొమ్మలు, పుస్తకాలు బొమ్మలు మొదలయినవి రావటం మొదలయ్యింది. ఇప్పటికి, దాదాపు వెయ్యికి పైగా వార్తా పత్రికలలో, 48 దేశాలలో ఈ వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడుతున్నాయి. ప్రముఖ నటుడు వాల్టర్ మథావ్, అల్లరినంతా పళ్ళ బిగువున భరించే పొరుగింటి ముసలాయన మిస్టర్ విల్సన్ పాత్రలో నటించిన చక్కటి చిత్రం 1993 లో వచ్చింది.

అమెరికాలో
డెన్నిస్ కార్టూన్ ఎంత పాపులర్ అంటే, 2010 సంవత్సరంలో అక్కడి తపాలా శాఖ వారు డెన్నిస్ స్టాంప్ విడుదల చేసారు.

ఇదే విధంగా డెన్నిస్ పాత్రతోబాటుగా, స్టాంపులుగా విడుదలైన గౌరవాన్ని పొందిన ఇతర కార్టూన్ పాత్రలు.ఇవన్ని కూడా Sunday Funnies అనే పేరుతొ జులై 16 2010 అమెరికన్ పోస్టల్ సర్వీస్ స్టాంపులుగా విడుదల చేసింది .
ఈ అల్లరి డెన్నిస్ పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంటే, ఈ కార్టూన్ పాత్రకు ఉన్న ప్రత్యెక వెబ్ సైటును చూడవచ్చు. ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా ఆ వెబ్ సైటును దర్శించ వచ్చును.
= = = = = = = = = = = = = = = = = = = = = = = = =

వివరాలన్నీ(స్టాంపు విడుదల విషయం మినహా) నేను ముంబాయిలో ఉన్నప్పుడు ముచ్చటపడి కొనుక్కున్న డెన్నిస్ ది మేనాస్ పుస్తకం నుండి సేకరించబడినవి


(పూర్వం నేను తెలుగు వికీపీడియాలో వ్రాసిన వ్యాసం కొద్ది మార్పులు చేర్పులతో పున:ప్రచురణ)



2 కామెంట్‌లు:

  1. ఈ కార్టూన్ స్ట్రిప్ ను హిందూలో రెగ్యులర్ గా చూస్తుండేవాణ్ణి. ఈ అల్లరి ఇంగ్లిష్ బుడుగంటే నాక్కూడా చాలా ఇష్టం! బుగ్గ మీద చుక్కలూ, వెరయిటీ తలకట్టూ, బూట్లతో డెనిస్ ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఈ పాత్రపై స్టాంపులూ, వెబ్సైటూ ఉన్నాయని మీ టపా ద్వారానే తెలుసుకున్నాను.

    రిప్లయితొలగించండి
  2. వేణూ గారూ ధన్యవాదాలు. నా చిన్నప్పుడు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో డెన్నిస్ ది మేనాస్ చూసేవాడిని.

    ఈ కార్టూన్ పాత్రతో రెండు రకాల సినిమాలు దాదాపు ఒకే టైములో వచ్చినాయి. కాని వాల్టర్ మథావ్, మిస్టర్ విల్సన్ గా వేసిన సినిమానే బాగున్నది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.