20, మార్చి 2011, ఆదివారం

ఓట్ల కొనుగోలు

============================================================
ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ బాబు వేసిన అద్భుత కార్టూన్. సామాన్యుడు పాపం ఎంత ఆశగా వ్రాస్తున్నాడో. అతనికి వంటిమీద సవ్యమైన గుడ్డలేదు, ఇంట్లో వెలుగుకోసం కొవ్వొత్తి మాత్రమె, శరీరం చూస్తె శుష్కించి పోయి ఉన్నది. మన రాజకీయ వ్యవస్థ చరిత్ర మొత్తం ఒక్క కార్టూన్లో పొందుపరిచి ఇచ్చిన శ్రీ బాబు గారికి ధన్యవాదాలు .
==========================================================
వాడెవడో వికీలీక్స్ వాడు చెప్పాలా మనకి!! మనదేశంలో ఏమి జరుగుతున్నదో మనకి తెలియదా? అది చూసి, అందరూ మరొకరి వంక వేలు చూపిస్తూ సంభ్రమాశ్చర్యాలు ప్రకటించటం, వీళ్ళేదో పెద్ద మనుషులైనట్టుగా తెగనటించటం. ఓట్లు రాజకీయ నాయకులు కొంటున్నారు అంటే, అమ్మేవాళ్ళు ఉన్నట్లే కదా? వాళ్ళు వాళ్ళ ఓట్లు ఎందుకు అమ్ముకుంటున్నారు??వాళ్ళను ఎవరూ తప్పు పట్టటంలేదు. అదే విచిత్రం!!

ఈరోజున పేపరు చూస్తె, మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఎన్నికలట, అక్కడ ఉన్న ఒక ప్రధాన ప్రాంతీయపార్టీ నాయకుడు (ఈయన సదా కళ్ళకు గంతలు కట్టుకునే ఉంటాడు) ఈ రోజున తన అద్భుత ఎన్నిక విజయ పథకం రచించి అందరి ముందు ఉంచాడు. ఆ మనిషి చెప్పిన కతలు చూస్తే, తన్ను గెలిపిస్తే తాను ఎవరెవరికి ఏమేమి ఉచితం ఇస్తాడో చెప్పాడు. ఒక సారి పరికించండి.
  • గృహిణులు అందరికీ ఉచితంగా గ్రైండరు లేదా మిక్సీ
  • గర్భంతో ఉన్న గృహిణులకు ప్రస్తుతం ఆర్నెల్లపాటు నెలకు ఆరువేల రూపాయలు ఇస్తున్నారట అది ఇక నుంచి వీరిని గెలిపిస్తే పదివేలు చేస్తారుష. ఒకానొకప్పుడు జర్మన్ ప్రభుత్వం వారి జనాభాను పెంచుకోవటానికి ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు ఇలాగే నజరానాలు ఇచ్చేదిట.
  • ఒక కిలో అయోడిన్ ఉప్పు ఉచితం
  • స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే ఋణం నాలుగు లక్షల రూపాయలకు పెంపుట పైగా అందులోరెండు లక్షలు మాఫీనట.
  • నిరుపేదలకు ప్రతి నేలా 35 కిలోల ఉచిత బియ్యం
  • అరవై ఏళ్ళ పైబడిన వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం . వయో వృద్ధులకు ప్రత్యేకంగా ఉచిత బస్సులు.
  • ప్రభుత్వ, ప్రవైటు కళాశాలల్లో వృత్తి విద్య అభ్యసిస్తున్న వెనుకబడిన, దళిత విద్యార్ధులకు చేరిన మొదటి ఏడాదే ఉచిత ల్యాప్ టాప్ లు
  • 2006 - 2009 మధ్య చదువుకోసం తీసుకున్న ఋణాలపై వడ్డీ మాఫీ.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ గంతల నాయకుడే ఇన్నన్ని ఉచితాల ప్రలోభాలు పెడుతుంటే, గత కొన్నాళ్ళుగా అధికారంలో లేని ఆ సినిమాలావిడ మరెన్ని ఇస్తానంటుందొ అని ప్రస్తుతం మన తంబీ లు అంగలారుస్తున్నారుషా !!

రాజకీయ నాయకులు అధికారంలోకి రావటానికి ఓట్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పటానికి మనకి వికీ లీక్స్ కావాలా !! ఇంత బాహాటంగా మానిఫెస్టో పేరున పైన చెప్పినవాన్నే ఏమిటి? ఓట్లు కొనటం కాక. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందుగా మానిఫెస్టో విడుదల చేయటం పరిపాటి. కాని అందులో వారు చెప్పే అభూత కల్పనలకు ఒక పరిమితి అంటూ ఉండాలి.

ఇవన్నీ ఉచితంగా ఇస్తానంటున్న గంతల నాయకుడు, వాటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తాడో చెప్పటంలేదు. తన అనుంగు శిష్యుడు 'రాజా' హవాలా చేసేసిన డబ్బులోంచా ? ఛా... ఛా ... అంతటి నికృష్టపు పని చేస్తే మిగిలిన రాజకీయ నాకులు ఈయన గంతల మీద ఉమ్మేయరూ! ఎంత పరువు తక్కువ పనిచేసావు అని
.

ఓటుకు ఇంత అని డబ్బులిస్తేనేమిటి, ఇలా ఉచితాలు ప్రకటించి ఇస్తేనేమిటి, రెండూ ఒకటే. మొదటిది ఏదో ఘోరమని , రెండోది రాజకీయమనీ మనలాంటి అమాయకులు అనుకుంటున్నన్నాళ్ళూ ఓటర్లుగా పిలవబడుతున్న "మందలు" అమ్ముడు పోతూనే ఉంటాయి.


చదువుకున్నాం, "మా కాలరు ఎప్పుడూ తెలుపే!" అనుకునే ఘరానా మనుషులు, ఎన్నికల పేరున వచ్చే శలవు ఆనందిస్తున్నంత కాలం ఇంతే. "ఎన్నికల్లో ఓటు వెయ్యటమా!!" అని చీదరించుకునే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అలా అని అంటే చదువుకున్న వాళ్ళల్లో డబ్బులకు ఓట్లేసే వాళ్ళు లేరని కాదు. కాస్తోకూస్తో చదువు అంటి ఉంటే, ప్రజాస్వామ్యం, ఎన్నికలు, వాటి ప్రాధాన్యత తెలిసి ఉంటుందేమో అని దురాశ అంతకంటే ఏమీ లేదు.


ఎన్నికల మానిఫెస్టోలో పార్టీలు తమ ఇష్టం వచ్చినట్టుగా ఆకాశాన్ని కూడ కిందకి తెచ్చేస్తాం వంటి ప్రకటనలు లేకుండా మన ఎలక్షన్ కమీషన్ కట్టడి చేసేట్టుగా చట్టాలను సవరించి తీరాలి.

  1. ప్రతి పార్టీ ఎన్నికల మానిఫెస్టోను అందరి ముందు చర్చకు పెట్టాలి. తాము చేస్తామని ప్రగల్భాలు పలికేవాటికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అన్న విషయం తప్పకుండా చెప్పి తీరాలి. ఊరికే ప్రమాణాలు చేసేసి, కుర్చి ఎక్కేసి, మాకు ముందున్నవాడు ఖజానా ఖాళీ చేసేసాడు (వాడూ ఇటువంటి ఉచితాలు ఇచ్చే ఖజానా ఖాళీ చేసి ఉంటాడు) మా వల్ల కాదు అని చేతులు ఎత్తేయ్యకూడదు.
  2. ఇలా చర్చ చేసి చర్చలో ఆమోదం పొందిన తరువాతే మానిఫేస్టోను ప్రకటించాలి. విధమైనచర్చలను చెయ్యటానికి ప్రతి జిల్లాలోనూ అన్ని వర్గాల నుండి ప్రజలను ఎన్నికల కమీషనే నిష్పాక్షపాతంగా ఎన్నిక చేసి చర్చను టి వి లలో లైవ్ టెలికాస్ట్ చెయ్యాలి. ప్రజలు టెలిఫోన్ ద్వారా ఆయాపార్టీలను వాళ్ళు చేద్దామనుకుంటున్న ప్రమాణాలు/వాగ్దానాల మీద నిగ్గతీసే అవకాశం ఉండాలి. ప్రక్రియ మొత్తం ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచే మొదలు పెట్టాలి.
  3. అప్పటికే అధికారంలో ఉన్న పార్టీ ఐతే, ముందు తాము అధికారంలోకి రావటానికి ఇచ్చిన మానిఫెస్టోలోవ్రాసినవి ఎన్ని ఎంతవరకూ చేసారో లెక్కలు తప్పనిసరిగా చర్చలో చెప్పాలి. చెయ్యలేకపోతే, పనిగురించి వాగ్దానం ఎందుకు మానిఫెస్టోలో పొందు పరిచారో ప్రజలకు వివరణ ఇవ్వాలి.
  4. అంతకు ముందటి మానిఫెస్టోలో ఉన్నవి కనీసం 25% చెయ్యలేని పార్టీని తదుపరి ఎన్నికలోనిలబడటానికి అనర్హులుగా ప్రకటించాలి.
  5. కొంగొత్త పార్టీ ఐతే, అప్పటికే అధికారంలో ఉన్న పార్టీ కంటే తాము ఏమి చేసి ప్రజల జీవన సరళిమార్చగలరో నిర్దిష్టంగా చెప్పాలి. అలా చెయ్యటానికి ప్రణాళిక ఏమిటి వివరించాలి. అంతే కాని నోటికొచ్చిన ప్రకటనలు చెయ్యటం నిషేధించాలి. నాన్న పేరు తాత పేరు చెప్పుకుంటూ పార్టీలు పెట్టటం ప్రోత్సహించ కూడదు.
  6. ఏదైనా సరే ఉచితంగా ప్రజలకు ఇవ్వటం పూర్తిగా నిషేధించాలి. ఇలాంటి పనులు సోమరిపోతుల్ని పెంచి పోషించటం తప్ప మరేమీ కాదు.
  7. వాళ్లకు ఇవ్వబడే ఐదేళ్ళల్లో వాళ్ళు చెయ్యబొయ్యే నిర్దిష్ట కార్యక్రమాలు, సామాన్య భాషలో చెప్పాలి, జిడిపి పెంచుతాం, ద్రవ్యోల్బణం తగ్గిస్తాం లాంటి వెర్రి మాటలతో మోసగించకూడదు.
  8. తమ పరిపాలన చేపట్టాక, ఎన్ని ఉత్పాదక ఉద్యోగాలు కల్పించగలిగారో చెప్పాలి. అలా చెయ్యటానికి తాము తీసుకోబోయ్యో చర్యలు పూర్తిగా వివరించాలి. గోడమీది పిల్లివాటంగా మాట్లాడకూడదు, ఆకాశానికి నిచ్చెనలు వెయ్యకూడదు.
  9. ఇజాల గురించి మానిఫేస్టోలలో మాట్లాడకూడదు. ఎందుకు అంటే, ఐదేళ్ళల్లో ఉన్న వ్యవస్థ మార్చటంఎవరి తరం కాదు. ఆపైన ఐదేళ్లకు మాత్రమె అధికారం పొందిన పార్టీలకు, పూర్తి వ్యవస్థను సంపూర్ణంగామార్చిపారేసే హక్కు లేదు. ఐతే గియితే ప్రజలే వాళ్లకు అవసరం అనుకుంటే, ప్రజల్లో నుండే(ఎవరూరెచ్చగొట్ట కుండా ) స్వచ్చందంగా అటువంటి మార్పు క్రమంగా రావాలి. విప్లవం విప్లవం అని అరుచుకుంటూ తమ సంఘ జీవనాన్ని ధ్వంసం చేసుకున్న ఇంకా చేసుకుంటున్న దేశాలు, వాటి చరిత్ర చూశాం కాబట్టి, అటువంటి అవివేకపు పనులు చేస్తామని రాజకీయ పార్టీలు మానిఫేస్టోలలో ప్రకటించటం నిషేధించాలి.
ఏతావాతా ఏమంటే రాజకీయాలు అంటే ప్రతి వెధవా వెళ్ళిపోయి, ఏదో ఒకటి అయిపోవచ్చు అని తెగబడి, ఎగబడేట్టుగా ఉండ కుండా, బాబోయ్ రాజకీయాలు అంటే బాధ్యతతో కూడిన వ్యవహారం, ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రజలకు సేవ చేసే చెయ్యాలి అన్న భావన కలిగించాలి. ఇందులో ప్రజలమైన మనకే ఎక్కువ బాధ్యతా. అన్నిటికంటే, ముందు, అందరూ ఓట్లు వెయ్యటం తప్పనిసరిగా చెయ్యాలి. ఓటు వెయ్యకపోవటం ఒక సిగ్గుమాలిన పనిగా, ఒక సాంఘిక దురాచారంగా పరిగణించాలి . విధంగా ఒక రెండు మూడు దశాబ్దాలు చెయ్యగలిగితే మన రాజకీయాలలో కొద్దో గొప్పో మార్పు వచ్చే అవకాశం ఉన్నది. లేకపోతె మూడు స్కాములు, ఆరు వికీ లీక్సు గానే సాగుతుంటాయి ఎప్పటికైనా సరే!

===============================================
వ్యాసం వ్రాసి నేను ప్రచురించిన కొన్ని గంటలలోనే ఒక ప్రత్యెక కార్టూన్ వేసి పంపిన శ్రీ బాబు గారికి ధన్యవాదాలు.
===============================================

1 కామెంట్‌:

  1. శివగారు రాజకీయ కుళ్ళు బాగుచెయ్యటం ఎలాగో బాగా వివరించారు. ముఖ్యంగా చట్టాలు చెయ్యాలి అన్న దానిలో 4, 7, 9 పాయింట్లు చక్కగా వివరించారు. వీటివలననే సామాన్య ప్రజలు మనకి కాకపోయినా సమాజానికైనా మేలు జరుగుతున్నదేమో అన్న అపోహలో మొసపోయేది. వీటిని చట్ట పరిధిలోనికి తెచ్చి ప్రతీ 5 సంవత్సరాలలో ఏమి అభివృద్ధి జరిగిందో ఒక సారి ప్రజలందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పినట్లైతె ప్రతీవారికీ దీనిమీద ఒక అవగాహన వుంటుంది. లేకపోతే వేరొక ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్నదేమోనన్న అపోహలో గొడవలు పడే అవకాశం వున్నది. మన రాజకీయ నాయకులకి కావల్సినది కూడా అదే అనుకోండి!!!

    దొంగలు గార్లు కూడా ఆశ్చర్యపోయినప్పుడే కదా అసలు దొంగలు దొరకకుండా వుండేది. పదవులని వదలడమే ఒక త్యాగంగా అంటున్నప్పుడు అవి ఎంత లాభదాయకంగా వున్నయో తెలుస్తోంది కదా. అలాగే, ఎవరైనా తప్పు చేస్తె వారిని పదవిలో నుండి తొలగించటమే శిక్ష క్రింద రాజకీయ వేత్తల పరిభాషగా వున్నది. ఇంకా, పదవులని "తృణప్రాయంగా" వదిలేస్తాము అని అంటే దాని అర్ధం అవి ఇప్పుడు "తృణాలు" కావనేగా.... పార్లమెంటులో "లాభదాయక పదవుల బిల్లుకి" అందరు రాజకీయ ఉద్దండులు నిస్సిగ్గుగా తలూపారు. ఆ మాటలో ఎంత నీచమైన అర్ధం వున్నదో వారికి తెలియదనుకోవాలా......... వెరశీ, ఈ రోజున రాజకీయాలలో వుండటంకన్నా వాటిని వదిలి వెయటమే ఒక గొప్ప "త్యాగంగా మారింది".

    దీనికి ప్రజలే కర్తలూ - కర్మలూ.. ఎందుకంటే మన అమాయక జనానికి ఈ రోజు గడిస్తే చాలు, మనకెందుకులే, మన పని అయిపోయింది కదా, అన్నీ మనకే పట్టిందా. అయినా ఈ గొడవలు మనకెందుకు అనే ఉదాశీనత వల్లనే ఈ రాజకీయ నాయకుల ఆటలు సాగుతున్నాయి. ప్రజలలో చైతన్యం రానంతవరకూ ఈ రాజకీయ నాటకం కొనసాగుతూనే వుంటుంది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.