10, ఏప్రిల్ 2011, ఆదివారం

అవినీతి ఎక్కడ లేదు

(బొమ్మ కర్టెసీ మదురా బీట్స్ బ్లాగ్)

అవును అన్నా హజారే గారి దీక్ష ఫలించింది. ప్రభుత్వం దిగి వచ్చి లోక్పాల్ బిల్లుకు నోటిఫికేషన్ ఇచ్చేసిందట, బిల్లు ప్రవేశ పెట్టటానికి అందులో ఉండవలసిన అంశాల గురించిన చర్చ జరగటానికి కొంతమంది పెద్దలతోఒక కమిటీ వేసేసింది. సంతోషం! మీడియా వాళ్ళు ఇదొక పెద్ద సర్కస్ చేసి పారేసి తెగ చూపించి వాళ్ళ పబ్బం వాళ్ళు గడిపేసుకున్నారు.

కెమెరాల ముందు "అవినీతి" గురించిన మాటలు ఎంరెందరో తెగ ఆవేశంతో ఊగిపోతూ చెప్పి, టి వి లలో కనపడి సంతోషించారు. కొంతమంది అవినీతి పరులుకూడా ఇదే సందని, ఈ ఉద్యమానికి మద్దతు పలికేశారు, తమని కూడ ప్రజలు నీతిమంతులు అనుకోవాలన్న తాపత్రయంతో.

విచిత్రం రాత్రికి రాత్రి ఆత్యయిక పరిస్థితి రాష్ట్రపతి ఆమోదంతో ఆర్డినెన్సు రూపంలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వం, ఈ లోక్ పాల్ బిల్లుకు మటుకు న్యాయ నిపుణులు కావాల్సి వచ్చారు. ఇది మటుకు శాస్త్ర ప్రకారమే చేస్తారుట! ఏది ఏమైనా ఒప్పుకున్నారు.

అంతా సుఖాంతం!

భలే! భలే!! అని చప్పట్లు కొట్టబోయిన నా చేతులు ఆగిపొయ్యాయి. బుర్రలో అనేక ఆలోచనలు. అవినీతి అంతా రాజకీయ నాయకుల దగ్గరేనా మరెక్కడా లేదా? రాజకీయ అవినీతి తప్పకుండా కఠినమైన శిక్షలతో ప్రధాన మంత్రి దగ్గర నుండి పంచాయితీ మెంబరు వరకూ, ఎవరిదగ్గర ఉన్నా అరికట్టవలసినదే.

కాని, ప్రజలమైన మన దగ్గర ఉన్నఅవినీతి మాటేమిటి! మన దగ్గరున్న అవినీతిని అరికట్టటం అనేది అన్నా హజారే కాదు కదా, బ్రహ్మరుద్రాదులు దిగి వచ్చినా జరిగేపని కాదు.

సమాజంలో కలిసిపోయిన అవినీతి, అది అవినీతి అని తెలియకుండా జీవన విధానంలో కలిసిపోయి జరిగిపోతున్న అవినీతి, మనం, అవును మనమే, ఎవరికి వాళ్ళం తరచి చూసుకుని మనలోనే దాగి ఉన్న అవినీతిని గుర్తించి తొలగించటం మొదలుపెడితే, మొదలంటూపెట్టగలిగితే, కొన్నాళ్ళకి, తరువాతి తరం వచ్చేప్పటికన్నా అవినీతి రహిత "సమాజం" వచ్చేఅవకాశం ఉన్నది.

ప్రజల దగ్గర నిజాయితీగా, కష్టపడి మరొకడికి అపకారం తలపెట్టకుండా బతకగలిగే లక్షణం వచ్చేవరకూ, సమాజంలో అవినీతి ఉంటూనే ఉంటుంది. అది పోదు.

రాజకీయ అవినీతి గురించి అందరూ మాట్లాడేసారు, ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు. ఒకప్పుడు యధా రాజా తథా ప్రజా అని నానుడి. కాని కొన్ని దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం, పైగా ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా పేరుపడిన మన వ్యవస్థలో నానుడి మారింది, ఇప్పుడు యథా ప్రజా, తథా రాజా. ఆ రాజు ఐదేళ్లకు ఒకసారి మారతాడు. అలా కొద్దికాలానికి రాజవటానికి వెంపర్లాడతాడు . రాజయ్యి, అలా ప్రతిఐదేళ్లకు మారకుండా ఉండటానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. అలా ఉండటానికి తాను పెట్టినపెట్టుబడికి వెయ్యింతలు సంపాయించుకుంటాడు.

ఏమిటి మనదగ్గర ఉన్న అవినీతి

  • అన్నిటికన్నా పెద్ద అవినీతి ప్రజల దగ్గరే ఉన్నది అదేమిటి అంటే ఓటు వెయ్యకపోవటం. ఒకవేళ వేసినా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన , అంతకంటే ఘోరం డబ్బులు తీసుకునో ఓటు వెయ్యటం. ఈ అవినీతి నుండి ప్రజలు బయటపడనంత వరకూ ఏ లోక్ పాల్ బిల్లూ మనను రక్షించలేదు.
  • సరే సవ్యంగా ఓటు వెయ్యటం అనేది పెద్ద విషయం. అతి చిన్న విషయం ఎక్కడన్నానలుగురికి ఒకే చోట పని ఉంటే, ఎవరూ చెప్పకుండా లైన్లో నుంచుని పని చేసుకోవటం మనకు తెలుసా!! కనీసం గొర్రెలు ఒకదాని తరువాత ఒకటి సోలుపుగా వెళ్తాయి. కాని మనం, పెద్ద పెద్ద ఇనప కచ్చడాలు పెట్టి, ఇరుకు సొరంగాలు కడితే కాని వరుసలో నుంచోము. అక్కడకూడ ఔత్సాహికులైన, దృఢకాయులు, కొండకోచో సామాన్యంగా కనపడేవారు కూడా మన భుజాల మీదగా, నెత్తి మీదుగా నడిచి వెళ్లి వరుసలో ముందుకు వెళ్ళిపోవటం కద్దు.
  • బస్సు కాని రైలు కాని రావటం ఆలస్యం, ఎగబడి ఒకరికొకరు అడ్డం వస్తూ, తోసుకుంటూ ఎక్కకపోతే తృప్తి లేదు. హాయిగా ఒకరి తరువాత ఒకరు ఎక్కటం అనే క్రమశిక్షణ ఎప్పటికి నేర్చుకుంటాం. ఈ తోసుకు ఎక్కే వాళ్ళ కంటే రెండాకులు ఎక్కువ తిన్న వాళ్ళు అలా ఆ పక్కకివెళ్లి, చేతిలో పత్రికో, జేబు గుడ్డో, నెత్తిన ఉన్న కాపో లేదా గొడుగో, చేతిలో బాగ్గో, కిటికీలోంచి ఆ సీట్లోపడేసి, అందరూ భుజబలం చూపి లోపలి తోసుకు వెళ్ళినాక "ఆ చోటు నాదండీ" అంటూఅమాయకంగా వస్తారు.
  • ఒకవేళ కొండవీటి చాంతాడు అంత వరుస ఉంటే, ఆ మొదట్లో కిటికీ దగ్గర తచ్చాట్లాడి మెల్లిగా దూరటం లేకపోతె ఆ ముందుగా ఉన్నవాణ్ణి తన టిక్కెట్టు కూడ తీసుకోమని దేబిరించటం గొప్ప ప్రావీణ్యంగా చలామణీ అవుతున్నది. ఈ మొత్తాన్ని ఏమనాలి, ఏ బిల్లు తెచ్చి ఈ చండాలపు పని ఆపాలి. క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేని సమాజం అవినీతిని ఆపలేదు. పెంచి పోషిస్తుంది.
  • ట్రాఫిక్ లైట్ దగ్గర పోలీసు లేకుంటే ఎంతమంది ఆగుతారు! ఆగుతున్నారు? పోలీసు చుట్టుపక్కల లేకపోతె ఒక్క ఆటో వాళ్ళే కాదు, ఏ సి కారు వాళ్ళు కూడ లైటు పట్టనట్టు వెళ్ళిపోతారు. ప్రతి ట్రాఫిక్ లైటు దగ్గరా పోలీసును పెట్టి ట్రాఫిక్ నియంత్రించాల్సి వస్తున్నది . దానివల్ల పోలీసు బలగాల్లో ఎక్కువ భాగం ఈ పనికే సరిపోయే. వాళ్ళు ఇక దొంగల్ని పట్టుకునేది ఎప్పుడు, నేరనిరోధం ఎలాగూ చెయ్యలేకున్నారు, నేర పరిశోధన ఎప్పుడు చేసేట్టు. అందరి దగ్గరా క్రమశిక్షణ ఉండి , కనీసం ట్రాఫిక్ నియమాలు సవ్యంగా, పోలీసు లేకపోయినా పాటించ గలిగితే ఎంతమంది పోలీసులు నేర నియంత్రణ చెయ్యటానికి మిగులుతారు. ఆలోచించాలి, తప్పదు. ఈ విషయంలో అన్నా హజారే గారు ఏమీ చెయ్యలేరు. మనమే, మనం అందరం పూనుకోవాలి.
  • నియమాలు ఉన్నాయి, అవి పాటించాలి అన్న నీతి మనలో ఉండాలి. ఆ ఆఫీసులో తెలిసినవాడు ఎవడు? మనకు అర్హత లేకపోయినా మనకు పని ఎలా అవుతుంది, ఎవడిని పట్టుకుంటే పని సులువుగా చేయించుకోవచ్చు. ఎవడికి ఇంత పెడితే ఈ పని చులాగ్గా ఇవ్వాళే చేయించుకోగలం , ఇదే ఆలోచన.
  • సవ్యంగా ఉన్న నియమాల ప్రకారం ప్రజలందరూ పని చేసుకు పోతుంటే, అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. మనకు అర్హత లేనిదికావాలి, ఉన్న నియమాలు పాటించ కుండా పనులు అయిపోవాలి, అవినీతి ఉండకూడదు. ఎలా? ఈ రెండూ పరస్పర విరుద్ధమైన విషయాలే!
  • నియమాలు పాటించని ప్రజలు ఎక్కువగాఉన్న సమాజంలో అవినీతి ఎప్పటికీ పోదు. కలకాలం నిలిచే ఉంటుంది.
  • అవినీతి పోగొట్టాలంటే కొంత పని ఆలస్యం అవ్వటానికి, కొన్ని పనులు కాకపోవటానికి, ఆవిధంగా జరిగే నష్టాన్ని భారిమ్చాతానికి సిద్దపడి ఉండాలి. ఇవేమీ లేకుండా, టి వి కెమెరాల ముందు ఆవేశపడితే అవినీతి పోదు, మరింత పెరుగుతుంది. కారణం శిక్షలు ఎక్కువ అవ్వటం వల్ల తీసుకునే వాడు మరింత ఎక్కువ తీసుకుంటాడు. వాడికి రిస్కు ఎక్కువ అయ్యింది కదా మరి.
  • బంధువుల్లో ఉన్న అవినీతి అధికారులు, దొంగ వ్యాపారులని ఎవరన్నా బహిష్కరించి వాళ్ళఇళ్ళకు వెళ్ళకుండా ఉంటున్నారా. అలాంటి వాళ్ళ పిల్లలను సంబంధాలు చేసుకోకుండా ఉంటున్నారా? "అబ్బ మావాడా, భలే తెలివిగల వాడండీ, రెండుచేతులా సంపాదన" అనిచెప్పుకునే వాళ్ళను ఏమనాలి.
  • ఈ ఆలోచనా రీతి ఏ చట్టం మార్చగలదు. ఇది చట్టం చెయ్యలేనిపని. ఎవరికి వారు ఆలోచించుకుని చెయ్యాలి.
  • ఒక సామాన్యమైన కుటుంబంలో పెళ్ళికి ఎదిగిన కూతురు, రెండు సంబంధాలు వచ్చాయి, ఒకటి కుర్రాడు పి జి చేసి జనాభా లెక్కల కార్యాలయంలో పని చేస్తున్నాడు, మరొకడు పట్టభద్రుడు, చెక్ పోస్టులో పని. ఎవరైనా ఏది మంచి సంబంధం అని చేప్పు కుంటారు. ఆ రెండోదే కదా. అక్కడే ఉన్నది అవినీతికి మూలం.
  • ఎక్కడన్నా ఎర్ర లైటు దాటో, వన్-వేలో ఎదురు వెళ్ళో పోలీసు పట్టుకుంటే, సరే నాది తప్పు, ఫైన్ ఎంతో చెప్పండి కట్టేస్తాను రశీదు ఇవ్వండి అనే నీతి ఎంతమందిలో ఉన్నది. తృణమో ప్రణమో ఆ పోలీసుకు ఇచ్చేసి బయటపడదామనే తాపత్రయమే ఎక్కువ.
  • ఇక మన కళ్ళ ముందు జరిగే అవినీతి, మనం పనిచేసే చోట జరిగే అవినీతి "విజిల్ బ్లోయర్" చేసి అన్నా ఆపగలిగే ధైర్యం ఎంత మందిలో ఉన్నది. గుంపులో గోవిందగా ఎవరికో జైకొట్టుకుంటూ తిరిగేయ్యగలం, కాని మన ఒక్కళ్ళమే కనీసం అజ్ఞాతంగానన్నా జరిగే అవినీతిబయట పెట్టటంలో మనవంతు కృషి చెయ్యగలమా! ఆలోచించుకోవాలి.
  • ఆఫీసుల్లో పని చెయ్యకుండా బాతాఖానీతో కాలం గడపటం . ఉద్యోగం వచ్చేవరకూ ఒక గోల. ఉద్యోగం వచ్చిన తరువాత ప్రమోషన్ రాలేదని. పనిచేసేప్పుడు మనసు పెట్టి ఇచ్చిన పని సవ్యంగా చేసే వాళ్ళు ఎంతమంది? ఉద్యోగంలో "కరీర్ ఓరియంటేషన్" పేరుతొ సకల గడ్డీ కరవటం, చెయ్యకూడని పనులు చెయ్యటం అవినీతి కాదూ. వీటితో వచ్చే ఒత్తిడికి బి పిలు షుగర్లు తెచ్చుకోవటం. ఇదేనా మనకు మన పూర్వీకులు నేర్పినది!
  • చేసే వ్యాపారాల్లో కల్తీ, నాణ్యం లేని వస్తువులను అంటగట్టటం ఎటువంటి నీతి? ప్రతి వాడి దగ్గరకూ వెళ్లి తనిఖీ చేసి ఎవరు ఆపగలరు. ఆ వచ్చినవాడికి "ఆమ్యామ్యా" ఇచ్చేసి పంపటం, వాడు తీసుకోకుండా కేసు వ్రాస్తే, వాడి పైవాడి మరికొంత ఎక్కువ పారేసి కేసు మాఫీ చేయించుకోవటం, ఇదంతా నీతేనా. కాదు నాణానికి మరో పక్కన ఉన్న దృశ్యం. అది కూడ చూడాలి, తప్పదు.
  • నిజాయితీ లేని వ్యాపార ప్రకటనలు గుప్పించి ప్రజలను బ్రెయిన్ వాష్ చేసేయ్యటం, వాళ్ళను తోచుకో నివ్వకుండా, తమ వస్తువే కోనేట్టుగా చేసే వ్యాపార ప్రకటనలూ ఈ అవినీతిలో భాగమే.
  • ఇక ఇంకా అనేకం:- మన దొడ్లో చెత్త వేరే వాళ్ళ వాకిట్లోకి తోయ్యటం, నో పార్కింగ్ అన్న చోట నిర్భీతిగా వాహనాన్ని సైడు స్టాండు వేసి మరీ పార్కింగ్ చేసేయ్యటం, ఏమిరా అంటే అడ్డంగా వాదించటం, ఎట్టాపడితే అలా వాహన చోదకం, సమయ పాలన చెయ్యకపోవటం, వద్దన్న పనులే చెయ్యటం (బాహాటంగా పొగ తాగటం, మద్యం సేవించటం, వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటం), ఎవరన్న గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించటం, నలుగురిలో లేకితనపు మాటలు మాట్లాడటం ఇలా చెప్పుకుంటూ పొతే సవాలక్ష.
  • లంచం ఇచ్చేవాడు లేకపోతె అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. పది రూపాయలు ఒకడు లంచం ఇచ్చాడు అంటే, వాడికి ఆ పదిరూపాయల కంటే వెయ్యి రెట్లు లాభం లేకుండా ఇవ్వడు. ఆ లాభం పాటించవలసిన నియమాలు పాటిస్తే రాదు. అందుకని లంచంతో ఆ నియమాలను పాటించకుండా అధిగమించటం. ఇది తగ్గాలి ముందు. అవినీతి నిరోధక శాఖ వారు లంచాలు ఇవ్వచూపే ప్రభుద్దుల్ని కూడ వల పన్ని పట్టుకుని జైళ్ళల్లో పారెయ్యటం మొదలు పెట్టాలి.
మొత్తం మొత్తం మీద, మనిషిలో దురాశే అవినీతికి మూలం. మనకు అర్హత లేనివి సంపాయించాలన్న తపన, అవినీతికి పునాది. పునాదులను పగలగొట్టాలి. ప్రజలందరిలోనూమార్పు రావాలి. అది చట్టాలతోనూ, బిల్లులతోనూ రాదనీ నా అభిప్రాయం.

అన్నా హజారే ఆ వయస్సులో ఇచ్చిన స్పూర్తితో మన ఆలోచనా విధానం లో మార్పు రావాలి. ఊరికే ఇంకెవరో అవినీతిపరులన్నట్టుగా ఆవేశపడటం తగ్గించి మనలోనే పొంచి ఉన్న అవినీతిని గుర్తించి (ముందు గుర్తించటం ఎంతో ముఖ్యం, అది లేనట్టుగా ఉండటం కల్తీ లేని నటన) అటువంటిఆలోచనలు పోగొట్టుకోవటానికి కృషి చెయ్యాలి. అప్పుడే మనం అన్నా హజారేకి జై కొట్టటానికి అర్హులం. అటువంటి ఇంగితం లేనప్పుడు ఇప్పుడు టివిల ముందు జరిగేదంతా ఇచ్చకాలే తప్ప మరేమీ కాదు. (పై బొమ్మ కర్టెసీ ZEROCURRENCY.ORG)


నెట్లో అవినీతి గురించి గూగులిస్తూ ఉంటే, ఒక చక్కటి వెబ్ సైట్ కనపడింది. ప్రజాస్వామ్యానికి ఉన్ననాలుగు స్తంభాలతో పాటుగా, ఐదో స్తంభం ఉండాలి. అదే "అవినీతి నిర్మూలన". మిమ్మల్ని లంచం ఇవ్వమని అడిగినవాడికి ప్రతివాడికీ జీరో కరెన్సీ ఇవ్వమని కొత్త నినాదంతో ముందుకు వస్తున్నారు ఒక బౌతిక శాస్త్రవేత్త. లింకు ఈ కింద మీకోసం.


=====================================
అవినీతి నిర్మూలించాలంటే వేలు మరోకరివంక చూపిస్తూ ఆవేశపడినంత మాత్రాన అది పోదు. ప్రజలందరం ఆత్మ విమర్శ నిజాయితీగా చేసుకోవాలి. ప్రతిరోజూ అవినీతి ఆలోచన కూడ దరి చేరనివ్వకుండా జీవించగలగాలి. ఇదే ఆలోచనా పద్ధతిలో వచ్చిన వ్యాసాలు ఈ కింది లింకుల ద్వారా చూడగలరు.




10 కామెంట్‌లు:

  1. చక్కగా చెప్పారు - కేవలం నాయకుల అవినీతిని ఎండగట్టడంతో ఈ సమాజము బాగుపడదు, ప్రజలు కూడ మారాలి. దిగజారుతున్న నైతిక విలువలుకూడ ఈ దుస్థితికి కారణము.

    - లైసెన్స్ కావలన్నా,పెళ్ళానికి/పిల్లలకి పాస్పోర్టు కావాలన్నా తెలిసిన బ్రోకరు ఉంటే చెప్పండి అనడగుతారుగానీ, తెచ్చుకునే పద్దతి తెలుసుకోరు.

    - తిరుపతికెళ్ళి ఎమ్మెల్యే రికమండేషనుతో గంటలో దర్శనం ఎలా చేసుకొచ్చామో చెప్తారు

    - సీదా రిజర్వేషను బోగీ ఎక్కేసి టీసికి ౨౦౦ ఇచ్చి సుఖంగా ఎలా వచ్చారో చెప్తారు.

    ఇలాంటివి విన్నపుడు గట్టిగా నిట్టూర్చడం తప్పితే ఏం చేయలేను.

    ఇదే విషయంపై కొన్నేళ్ళ క్రితం నా ఇంగ్లీషు బ్లాగులో‌రాసినది (చాలా పెద్దది - సమయమున్నపుడు చూడండి) - http://jb-journeyoflife.blogspot.com/2007/10/moralethical-values-start-thinking.html

    రిప్లయితొలగించండి
  2. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు జే బి గారూ. మీరు చెప్పిన వ్యాసం తప్పక చదువుతాను.

    ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ బాబు గారు, తన బ్లాగులో చక్కటి కథ (పూర్వం తానూ కలం పేరుతొ 1987 లో ఆంధ్ర సచ్త్ర వార పత్రికలో ప్రచురించినది) ఉంచారు. ఈ కింది లింకు సహాయంతో చదువగలరు.

    http://babucartoon.blogspot.com/2011/04/blog-post_5596.html

    రిప్లయితొలగించండి
  3. శివగారు: మీ అంత బాగా కాదు కానీ నేనూ ఇంచుమించు ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ఇటీవల ఒక టపా రాసాను. కొన్ని ఉదాహరణలు కూడా అవే.

    మీ పొస్ట్ చదివాక నా టపాలొ వ్యక్తపరచిన నా అలొచనలకి చాలా బలం చేకూర్చినట్టు అనిపించింది. యాదృచ్చితం గా అయినా మీలాంటి పెద్దలు నా అలొచనలు సమర్ధిస్తున్నట్టు అనిపించే టపా రాయడం చాలా సంతొషం కలిగిస్తుంది.



    http://manchupallakee.blogspot.com/2011/04/blog-post.html

    రిప్లయితొలగించండి
  4. @MAMCHU:- Thank you for your comment.

    Excellent piece of writing in your blog. Well Written with apt examples. The kind of utterances made before the TV Cameras during the last week are mind boggling and I am just flabbergasted. Are we all so honest and only Politicians are corrupt and they only need to be controlled and punished?! Nay! all of us in one way or other corrupt in many ways. Politicians are nothing but a reflection of majority of us. After all we are in democracy.

    రిప్లయితొలగించండి
  5. చెసే ఉద్దేశం ఉన్నవాటికి ఆర్డినెన్సులు.......చేద్దాం చూద్దాం అన్నవాటికి కమిటీలు, కమీషన్లు వేస్తారు. ఇంతకి అసలు సంగతి ఎమిటంటే ఈమధ్య కాలం లో అరబ్బు దేశాలలో జరుగుతున్న ప్రజా చైతన్య ఉద్యమాలు మన రాజకీయ నాయకులకి కళ్ళు తెరిపించినాయి. ఇక్కడ కళ్ళు తెరవటమంటే జాగ్రత్త పడటం అని అర్ధం. అందుకనే వెంటనే రీయాక్ట్ అయ్యారు. అవినీతి ఉద్యమానికి అంతకంతకూ పెరిగిన ప్రజా చైతన్యం చూసీ... రాజకీయ నాయకులకి తెగేదాకా లాగటం ఎందుకు అనిపించి వెంటనే మనం ఒప్పేసుకున్నట్లు నటిస్తే పోలా అనుకున్నారు. మన రాజకీయ నాయకులకి అరబ్బు నాయకులకి వున్నంత డబ్బే కాదు బోనస్సుగా మాంచి తెలివితేటలు కూడా వున్నాయి. అందుకని ఈ ఉద్యమం ద్వారా ప్రజలు పూర్తిగా చైతన్యవంతులు అయ్యే లోపలే రాజకీయ నాటకానికి తెర లేపారు. దాని ఫలితమే పేద్దాయనను గెలిపించేసారు. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు అన్నది మన రాజకీయ నాయకులకి తెలుసు.

    ఇక చాలా మందికి కావల్సింది కాలక్షేపమే కానీ దేశోధరణ గురుంచి కాదు. దీని ఆధారంతోనే మన రాజకీయ న్యుస్ టీ వీ వారు ఇదే సందని వారి రేటింగ్స్ వారు పెంచుకొనే ప్రయత్నం చేసారు.

    మనది పేద్ద రాజ్యంగం అవటం వల్ల కూడా అవినీతికి అవకాశం కలుగుతోంది. అందులోని క్లాజులు మరియు సబ్ క్లాజులు అర్ధంకాని ప్రజలకి ఎదో తప్పు చేస్తున్నామనే భావన మన పాలకులు కలిగిస్తున్నారు.

    ఇక "అవినీతికి మూలం ప్రజల అవసరానికీ అవకాశానికీ మధ్య వున్న అగాధమే". అవినీతి పురుగుల ఉత్పత్తి కేంద్రాల [రాజకీయ పార్టీలు] నుండి పురుగులు బయలు దేరి ఆ అగాధాన్ని మరింత పెద్దదిగా చేసి తమ స్థావరాలు ఏర్పాటు చేసుకొని ప్రజలని ఆకర్షించడం మొదలు పెట్టాయి. ప్రజలు తమ దురాశ వల్లనో, అందరికన్న ముందరే అవకాశం పొందుదామనే ఆదుర్ధా వల్లనో, మనమే అందరినీ శాసించాలి అన్న దుగ్ధ వల్లనో ఈ అవినీతి అగాధంలో పడిపోతున్నారు. ఒకసారి పడిన తరవాత ఆత్మ సంతృప్తి కొరకు పైకి ఎదగటానికి అవినీతి తప్పితే వేరే మార్గం లేదని ప్రచారం చేస్తున్నారు.

    కాబట్టి, ఇది పార్లమెంటులో బిల్ అవటమో, లేక రాజకీయ నాయకులందరిని ఇందులో చేర్చడమో కాకుండా శివా గారు చెప్పినట్లు ప్రజల దగ్గర నుండే అవినీతి అంతం మొదలవ్వలి. ఎవరికి వారు అవినీతి అంతం అంటూ బయలు దేరితే ఇంతకీ అవినీతి ఎక్కడ వున్నట్లు? అందరికీ తెలియదా?? ఆత్మ వంచనతో ఎక్కడో వున్నట్లుగా అనుకునే బదులు అందరం ఎవరికి వారు కొంత సమ్యమనం పాటించి రాత్రికి రాత్రే ఎదిగి పొవాలనుకోకుండా, మనస్పూర్తిగా "తోటివారు కూడా తమలాంటి వారే" అనుకుని వుంటే చాలు దేశంలో అవినీతి తగ్గుతుంది. ప్రజలలో ఈ మార్పు రానంత వరకూ ఎదో గెలిచామన్న విజయగర్వం కూడా ఆత్మ వంచనే అవుతుంది...

    రాధకృష్ణ,
    విజయవాడ.

    రిప్లయితొలగించండి
  6. @రాధాకృష్ణ

    బహుబాగా స్పందించారు.

    రిప్లయితొలగించండి
  7. పొడి అక్షరాలతో వ్యాఖ్య ప్రొఫైల్ లేని కారణాన తొలగించటం జరిగింది.

    కాని ఆ వ్రాసినవారికి సమాధానం ఇద్దామంటే మెయిలు చిరునామానే లేదు. అందుకని వారి ఆక్రోశానికి ఒక్కటే జవాబు

    "క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేని సమాజం అవినీతిని ఆపలేదు. పెంచి పోషిస్తుంది."

    మనలో లేని క్రమశిక్షణ, లేని నీతి మన నాయకులలో ఉండాలని అనుకోవటం పూర్తిగా భ్రమ, పగటి కలలు కనటం. సమాజలో ఉండే అందరూ కలిస్తేనే సమాజ నీతి ఏర్పడేది. ఎవరికీ వాళ్ళు వాళ్లకు సౌకర్యవంతంగా ఉన్నది చేసేసుకుంటూ అవినీతి పోవాలి అని ఎంత అరిచినా అది పోదు. అవినీతికి మూలం అత్యాశ, దురాశ అవి పోకుండా అవినీతి ఎక్కడికీ పోదు కలకాలం ఉంటుంది ఎన్ని బిల్లులు పెట్టినా.

    రిప్లయితొలగించండి
  8. మీటపా సమగ్రంగా ఉంది.

    నిజమే కదా!! మనకఖ్ఖర్లేని "నీతి" అనే గుదిబండను ఇంకొకరు మాత్రం ఎందుకు భరించాలి?

    రిప్లయితొలగించండి
  9. Well said. The shapes the scourge called corruption assumes are so manifold that tonnes of printing paper will not be adequate to descibe them in proper perspective.

    రిప్లయితొలగించండి
  10. < "......... tonnes of printing paper will not be adequate to describe them ,,,,,, . "

    patil obi reddy గారు సరిగ్గా చెప్పారు. షేక్స్పియర్ నాటకం Macbeth లో Lady Macbeth గారి "All the perfumes of Arabia will not sweeten this little hand" అనే మాటలు గుర్తొస్తున్నాయి.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.