12, ఏప్రిల్ 2011, మంగళవారం

ఈ బొమ్మను చూసి థ్రిల్లయిపోయాను!




           చందమామ జులై 1978 సంచికలో ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్   ప్రారంభ చిత్రం.                                                   (నాకు నచ్చిన బొమ్మ...  ఇది కాదు :-))


నాకు  చిత్రా, శంకర్ ల బొమ్మలు బాగా  ఇష్టమే కానీ, చందమామలో  మరో ఆర్టిస్టు  ‘జయ’ బొమ్మలు కూడా నచ్చేవి.‘చిత్రా’ బొమ్మల్లో కనిపించే  స్వేచ్ఛ గానీ, కదలిక గానీ వీటిలో  ఉండకపోవచ్చు గానీ,

 ఇవి ‘పద్ధతి’గా  ఉండేవి. కట్టడాలన్నీ స్కేలుతో గీసినట్టు  సౌష్ఠవంగా  కనిపించేవి. J అక్షరం  ఎడమవైపునున్న వంపును పైకి  గీసి,Jaya తన సంతకం చేయటం అందంగా తోచేది.

‘మాయా సరోవరం’బొమ్మలు గీయటం పూర్తిచేసి, చిత్రా అస్తమించాక  దాసరి సుబ్రహ్మణ్యం  గారి జానపద సీరియల్  ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కి  చిత్రకల్పన చేసే అవకాశం Jaya నే వరించింది. అప్పటికే చందమామలో  చాలా కథలకు తాను  వేసిన బొమ్మలతో జయ ప్రాచుర్యం పొందాడు.

అయితే  ఆ  సీరియల్ గానీ, ఆ బొమ్మలు గానీ నన్ను పూర్తిస్థాయిలో  ఆకట్టుకోలేకపోయాయి.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... జయ కష్టపడి వేసినప్పటికీ  ఆ  బొమ్మలు  పాఠకులను అంతగా  ఆకర్షించలేదు. అప్రయత్నంగానో, సప్రయత్నంగానో చిత్రా బొమ్మలతో పోల్చిచూడటం వల్లనే  ఇలా జరిగిందనుకుంటాను.

 ఫలితంగా... ఈ సీరియల్ ముగియగానే చిత్రా బొమ్మలతో  రెండోసారి  ‘తోకచుక్క’ పొడవక తప్పలేదు.

అయితే...

‘భల్లూక మాంత్రికుడు’సీరియల్ కి జయ వేసిన  బొమ్మల్లో ఒక్కటి మాత్రం 30 ఏళ్ళుగా  నా స్మృతి పథంలో నిలిచిపోయింది. ఆర్టిస్టు చిత్రించిన  కోణం నన్నెంతో థ్రిల్ కు గురిచేసింది.‘ఎంత బాగా వేశాడు’ అనిపించింది.


ఆ బొమ్మ గురించి  అందరితో  పంచుకోవచ్చని రెండు రోజుల క్రితం తట్టింది. వెంటనే  ఆ బొమ్మ కోసం చందమామ వెబ్ సైట్లో  ఆర్కయివ్స్ లో వెతికాను.

కనపడింది!

మూడు  దశాబ్దాల తర్వాత...నాటి  నా  సంభ్రమాన్ని తలపోసుకుంటూ  చూశాను  మళ్ళీ!

అదొక్కటే కాదు; ఆ బొమ్మ కు పూర్వదశలు అనదగ్గ  మరో మూడు బొమ్మలు  కూడా ఆ సీరియల్లో   కనపడ్డాయి.ఈ బొమ్మలన్నిటినీ  వరుసగా  చూపిస్తే చాలా బాగుంటుందనిపించింది!

చూడండి... ఆ  చిత్రాలు!


మనం కొంత  ఎత్తులోనుంచే  చూస్తున్నాం  కదూ  కోటను.  (ఏప్రిల్ 1979).


ఏనుగుల్నీ, భల్లూకాన్నీ తర్వాత చూడొచ్చు; కోట సింహద్వారాన్ని గమనించండి.  మనం  మరి కాస్త ఎత్తు నుంచే  దీన్ని వీక్షిస్తున్నాం.  అవునా? (జూన్ 1979)



ఆర్టిస్టు జయ మనల్ని ఇంకొంచెం పైకి తీసుకువెళ్ళి ఈ కోటను చూపిస్తున్నాడు  (సెప్టెంబరు 1979).  బాగుంది కదా...  
   అందుకే,    తర్వాతి   నెలలో విహంగవీక్షణ చిత్రాన్ని  పతాక స్థాయికి తీసుకువెళ్ళాడు  జయ!
  



                               ఇదేనండీ... నన్ను మురిపించిన ఆ  బొమ్మ !  (అక్టోబరు 1979)

ఇంత ఎత్తు నుంచి చూపిస్తే-  చంద్రశిలా నగర ద్వారం వద్ద మాయా మర్కటుడు గానీ,అతణ్ణి అడ్డగిస్తున్న కాపలా భటులు గానీ మనకు  స్పష్టంగా  ఎలా కనపడతారు చెప్పండి!

కానీ అలా కనపడకుండా  విభిన్నమైన కోణంలో గీయటం వల్లనే కదా, ఈ చిత్రం ఇంతగా బాగుందీ!

4 కామెంట్‌లు:

  1. చందమామ కథలు, సీరీయల్స్ నాకు చాలా ఇష్టం. యాభై ఏళ్ళు దాటినప్పటికీ , చిన్నప్పుడు చదివిన కథలు, రామాయణం, మహాభారతం ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉన్నాయి.( చిత్ర పటాలతో సహా) చందమామ సాహిత్యం మంచి సంస్కారాన్ని, మంచి చెడ్డల వివక్షత నేర్పిస్తుంది అంటే అతిశయోక్తి కాదు.
    గౌరీ కృపానందన్
    tkgowri@gmail.com

    రిప్లయితొలగించండి
  2. జయ ఆ చిత్రాలను వివిధ కోణాలలో చూపించడం వల్ల ఆ బొమ్మలకు
    అందం వచ్చిందన్న మీ మాటలు ముమ్మాటికీ నిజం. ఎందుకో గానీ
    జయ బొమ్మలు కాలక్రమేనా చందమామలోగాని మరో పత్రికలోగానీ
    అగుపించలేదు. ఏప్రియల్ నెల చందమామ గమనించారా?31 పేజీలోని
    వీరయ్య గోదానము అన్న కధ శీర్షిక బొమ్మ శంకర్ గీశారు. కాని ముగింపు
    చిత్రాన్ని"వెంకీ" అనే అతను వేశాడు! శంకర్ గారి బొమ్మ చూశాక ఈ బొమ్మ
    వికారంగా అగుపించింది. ఈ నెల ముఖ చిత్రం , అట్టచివరి బొమ్మ చిత్రా
    వేసినది వేసి పాతకాలాన్ని గుర్తు చేశారు. అలానే 39 పేజీలోని "దొరికిన
    దొంగ" కధకు రెండు బొమ్మౌ చిత్రా గారివి వుండి కధ చివర మాత్రం "వెంకీ"
    గీసిన బొమ్మ వుంది. బహిశ: చిత్రా, శంకర్ల బొమ్మలు మిస్సయ్యాయనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  3. చాలా చాలా బాగున్నాయి .....చందమామ అన్నా, ఆ పుస్తకం అన్నా ఎవరికీ అభిమానం ఉండదు .......!!!!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.