చందమామ చిత్రకారులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చందమామ చిత్రకారులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జూన్ 2011, ఆదివారం

వపాగారు వేసిన చిత్రా చిత్రం

అపురూప చిత్రకారుడు శ్రీ చిత్రా
తెలుగు చందమామకు అంత పేరు తెచ్చిపెట్టినది ఎవరు? కథా రచయితలా, సంపాదకులా, చిత్రకారులా. మనం మంచి తనంగా, "అందరూ" అని అన్నాకూడా, నిజానికి కొత్తవారిని ఆకర్షించి చందమామను చూసేట్టుగా చేసినది మొదట ఆ పుస్తకంలోని బొమ్మలే కదా. చూడటం అంటూ జరిగితే కదా ఆ పుస్తకంలో ఏమున్నది అని తరచి చూసేది. అసలు పుస్తకానికి బాహ్య రూపం బొమ్మలే.

తెలుగు చందమామ స్వర్ణ యుగంలో అద్భుత చిత్రకారులు వడ్డాది పాపయ్య గారు అట్ట మీద బొమ్మ, చివరి అట్ట మీద బొమ్మ, లోపల కొన్ని ధారావాహికలకు బొమ్మలు వేస్తె, లోపల ఉన్న ముఖ్య ధారావాహికకు బొమ్మలు వేసి ప్రాణం పోసేది "చిత్రా" గా పేరొందిన శ్రీ టి వి వీర రాఘవులు గారు . ఆయన గురించి ఇంటర్నెట్ లో వ్రాయబడిన మొట్టమొదటి వ్యాసం ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు



ఇప్పటికి కూడా చందమామ పేరుతొ బతుకీడుస్తున్న పత్రికలో బొమ్మలు వేస్తున్న శంకర్ గారు పురాణ పాత్రలకు ప్రాణం పోసేవారు.

ఒకే పత్రికలో పనిచేస్తున్న ఈ ముగ్గురు అద్భుత చిత్రకారులు పోటాపోటీగా బొమ్మలు వేసి పిల్లలను పెద్దలను అలరించి, కొడవటిగంటి సంపాదకీయంలో వచ్చిన కథలకు ప్రాణం పోసి దశాబ్దాలపాటు పిల్లల మానసిక పరిణతికి పాటుపడినది అలనాటి చందమామ.

చిత్రాగారు ముందుగా వెళ్ళిపోయారు, చందమామలో ధారావాహికల వన్నె తగ్గిపోయింది. మళ్ళి పాత దారావాహికలనే మళ్ళి మళ్ళి వేసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. చిత్రా వంటి చిత్రకారుడు చందమామకు దొరకనేలేదు.


అలా అందరికంటే ముందుగా వెళ్ళిపోయినా తోటి చిత్రకారుడు శ్రీ చిత్రా గారి బొమ్మను వడ్డాది పాపయ్య గారు  చిత్రించి యువ పత్రికలో అట్ట మీద ప్రచురింపచేసారు అన్న విషయం ఈ మధ్యవరకూ తెలియదు . చందమామ అభిమానులందరినీ అలరించే ఈ అద్భుతాన్ని చూడండి .

వపా వేసిన చిత్రా చిత్రం
పై చిత్రం సేకరణ శ్రీ సత్యం, మనకు అందించిన వారు శ్రీ శ్యాం నారాయణ
తాను వేసిన తోటి చిత్రకారుని బొమ్మకు  చక్కటి వ్యాఖ్య వ్రాశారు శ్రీ వపా. పిన్నలకూ పెద్దలకూ "ఇష్టంగా " బొమ్మలను "చదవడం " నేర్పిన చిత్రాగారు. నిజమే, చిత్రాగారి బొమ్మలు చూస్తే చాలు, కథ చదవాల్సిన పనే లేదు. కథ మొత్తం అర్ధం అయిపోతుంది మరి.
చిత్రాగారి మరికొన్ని అరుదైన చిత్రాలు

కుడిపక్కన శ్రీ చిత్రా,  మధ్యలో ఆయన  తోటి చిత్రకారుడు శ్రీ శంకర్ గారు,   పూర్తిగా ఎడమపక్కన మూడవ వ్యక్తీ ఎవరో  తెలియదు   
చిత్రాగారి క్లోజప్
 చిత్రాగారు చందమామ సిబ్బందితో కూర్చున్న వారిలో చిత్రాగారి పక్క శ్రీ ముద్దా విశ్వనాథం గారు అనుకుంటాను 
చందమామ అపురూప చిత్రకారులు శ్రీ శంకర్, శ్రీ చిత్రా
పైనున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను మనకు అందచేసిన వారు శ్రీ రాజశేఖర రాజు






































 

12, ఏప్రిల్ 2011, మంగళవారం

ఈ బొమ్మను చూసి థ్రిల్లయిపోయాను!




           చందమామ జులై 1978 సంచికలో ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్   ప్రారంభ చిత్రం.                                                   (నాకు నచ్చిన బొమ్మ...  ఇది కాదు :-))


నాకు  చిత్రా, శంకర్ ల బొమ్మలు బాగా  ఇష్టమే కానీ, చందమామలో  మరో ఆర్టిస్టు  ‘జయ’ బొమ్మలు కూడా నచ్చేవి.‘చిత్రా’ బొమ్మల్లో కనిపించే  స్వేచ్ఛ గానీ, కదలిక గానీ వీటిలో  ఉండకపోవచ్చు గానీ,

 ఇవి ‘పద్ధతి’గా  ఉండేవి. కట్టడాలన్నీ స్కేలుతో గీసినట్టు  సౌష్ఠవంగా  కనిపించేవి. J అక్షరం  ఎడమవైపునున్న వంపును పైకి  గీసి,Jaya తన సంతకం చేయటం అందంగా తోచేది.

‘మాయా సరోవరం’బొమ్మలు గీయటం పూర్తిచేసి, చిత్రా అస్తమించాక  దాసరి సుబ్రహ్మణ్యం  గారి జానపద సీరియల్  ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కి  చిత్రకల్పన చేసే అవకాశం Jaya నే వరించింది. అప్పటికే చందమామలో  చాలా కథలకు తాను  వేసిన బొమ్మలతో జయ ప్రాచుర్యం పొందాడు.

అయితే  ఆ  సీరియల్ గానీ, ఆ బొమ్మలు గానీ నన్ను పూర్తిస్థాయిలో  ఆకట్టుకోలేకపోయాయి.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... జయ కష్టపడి వేసినప్పటికీ  ఆ  బొమ్మలు  పాఠకులను అంతగా  ఆకర్షించలేదు. అప్రయత్నంగానో, సప్రయత్నంగానో చిత్రా బొమ్మలతో పోల్చిచూడటం వల్లనే  ఇలా జరిగిందనుకుంటాను.

 ఫలితంగా... ఈ సీరియల్ ముగియగానే చిత్రా బొమ్మలతో  రెండోసారి  ‘తోకచుక్క’ పొడవక తప్పలేదు.

అయితే...

‘భల్లూక మాంత్రికుడు’సీరియల్ కి జయ వేసిన  బొమ్మల్లో ఒక్కటి మాత్రం 30 ఏళ్ళుగా  నా స్మృతి పథంలో నిలిచిపోయింది. ఆర్టిస్టు చిత్రించిన  కోణం నన్నెంతో థ్రిల్ కు గురిచేసింది.‘ఎంత బాగా వేశాడు’ అనిపించింది.


ఆ బొమ్మ గురించి  అందరితో  పంచుకోవచ్చని రెండు రోజుల క్రితం తట్టింది. వెంటనే  ఆ బొమ్మ కోసం చందమామ వెబ్ సైట్లో  ఆర్కయివ్స్ లో వెతికాను.

కనపడింది!

మూడు  దశాబ్దాల తర్వాత...నాటి  నా  సంభ్రమాన్ని తలపోసుకుంటూ  చూశాను  మళ్ళీ!

అదొక్కటే కాదు; ఆ బొమ్మ కు పూర్వదశలు అనదగ్గ  మరో మూడు బొమ్మలు  కూడా ఆ సీరియల్లో   కనపడ్డాయి.ఈ బొమ్మలన్నిటినీ  వరుసగా  చూపిస్తే చాలా బాగుంటుందనిపించింది!

చూడండి... ఆ  చిత్రాలు!


మనం కొంత  ఎత్తులోనుంచే  చూస్తున్నాం  కదూ  కోటను.  (ఏప్రిల్ 1979).


ఏనుగుల్నీ, భల్లూకాన్నీ తర్వాత చూడొచ్చు; కోట సింహద్వారాన్ని గమనించండి.  మనం  మరి కాస్త ఎత్తు నుంచే  దీన్ని వీక్షిస్తున్నాం.  అవునా? (జూన్ 1979)



ఆర్టిస్టు జయ మనల్ని ఇంకొంచెం పైకి తీసుకువెళ్ళి ఈ కోటను చూపిస్తున్నాడు  (సెప్టెంబరు 1979).  బాగుంది కదా...  
   అందుకే,    తర్వాతి   నెలలో విహంగవీక్షణ చిత్రాన్ని  పతాక స్థాయికి తీసుకువెళ్ళాడు  జయ!
  



                               ఇదేనండీ... నన్ను మురిపించిన ఆ  బొమ్మ !  (అక్టోబరు 1979)

ఇంత ఎత్తు నుంచి చూపిస్తే-  చంద్రశిలా నగర ద్వారం వద్ద మాయా మర్కటుడు గానీ,అతణ్ణి అడ్డగిస్తున్న కాపలా భటులు గానీ మనకు  స్పష్టంగా  ఎలా కనపడతారు చెప్పండి!

కానీ అలా కనపడకుండా  విభిన్నమైన కోణంలో గీయటం వల్లనే కదా, ఈ చిత్రం ఇంతగా బాగుందీ!

1, నవంబర్ 2010, సోమవారం

M T V ఆచార్య గారి బొమ్మల కొలువు

చందమామ మొదటి రోజులలో ముఖచిత్రాలు "చిత్రా" గారే వేశేవారు. ఆ తరువాత ఎం టి వి ఆచార్యగారు కొంతకాలం వేశారు. ఆచార్య గారి బొమ్మలకీ, పాపయ్యగారిబొమ్మలకీ చాలా తేడా ఉన్నది. ముద్రణా సాంకేతికత కూడా పాపయ్య గారు వచ్చి బొమ్మలు వేసే రోజులకుఅభివృద్ది చెందినట్టుగా కనపడుతుంది. పాపయ్య గారు వేసిన బొమ్మలన్నీ "కలర్ రిచ్" ఎన్నెన్నో రంగులు అద్భుతంగా వెలిగిపోతూ ఉంటాయి.

ఆచార్య గారు కూడా తనదైన శైలిలో అనేకానేక పురాణ పురుషుల బొమ్మలు గీశారు, ముఖ్యంగా భారతంలో అనేక ఘట్టాలు ఆయన చిత్రించారు. ఆయన వేసిన కొన్ని బొమ్మలను, డిజిటల్ రీ మాస్టర్ చేసి ఒక స్లైడ్ షో గా అందిస్తున్నాను, చూసి ఆనందించండి.






స్లైడ్ షోలో బొమ్మలన్ని చందమామ వారి సౌజన్యం














*

అద్భుత వర్ణ చిత్రాల స్రష్ట ఎంటీవీ ఆచార్య



ఎంటీవీ ఆచార్య! ...

ఈ చిత్రకారుడి పేరు 2006 ఆగస్టులో తొలిసారి నాకు  తెలిసింది. (మడిపడగ బలరామాచార్య అనే చిత్రకారుడి బొమ్మలు మాత్రం అప్పటికే తెలుసు. ఆయన ఎన్నో ఏళ్ళ క్రితం పాఠశాల పాఠ్యపుస్తకాలకు చక్కటి బొమ్మలు వేశారు)

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ‘ఈ మాట’లో  ‘చందమామ జ్ఞాపకాలు’ వ్యాసంలో ఆచార్య గారి గురించి చాలా గొప్పగా రాశారు. ఇలా...

‘‘మహా భారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించారు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీసినట్టు గుర్తు. భీష్మ సినిమాలో ఎన్‌.టి.రామారావు మేకప్‌ అంతా “చందమామ”కు కాపీ అని నా ఉద్దేశం.’’


చందమామలో ‘మహా భారతం’ అంటే నాకు శంకర్ బొమ్మలే తెలుసు. ఆచార్య గారు అంతకుముందే మహాభారతానికి ఇంత సుదీర్ఘ కాలం అద్భుతమైన బొమ్మలు వేశారనే సంగతి అప్పుడే తెలిసింది. విపరీతమైన ఆసక్తి ఏర్పడి, ఆయన వివరాల కోసం నెట్ లో అన్వేషించాను. కొన్ని వివరాలే తెలిశాయి. తర్వాత నాగమురళి బ్లాగు ద్వారా www.ulib.org లో పాత చందమామల ఆచూకీ తెలిశాకే ఆచార్య గారి వర్ణచిత్రాలను చూసే అవకాశం కలిగింది.

కానీ ఆయన ఫొటో దొరకనే లేదు!


తాజాగా అక్టోబరు నెల చందమామ ముఖచిత్రంగా ఆచార్య గారి బొమ్మనే ప్రచురించారు. ఈ సందర్భంగా   టపా రాద్దామనుకునేలోపే రాజశేఖరరాజు గారు చందమామ చరిత్ర.లో రాసేశారు.:)


పైన ‘కీచక వధ’ ఘట్టాన్ని ఎంత  బాగా చిత్రించారో చూడండి. అస్పష్టమైన చీకటి నేపథ్యంలో భీమ, కీచకుల పోరాటం, ద్రౌపది హావభావాలు గమనించండి!


ఆచార్య గారి చిత్ర కళా వైభవం ‘చందమామ కలెక్టర్స్ ఎడిషన్లో’ ఇచ్చిన ఈ రెండు బొమ్మల్లో చూడవచ్చు. 

                         

మరికొన్ని బొమ్మలు చూడండి....

ఉత్తరకుమారుడి యుద్ధ భీతి

 కంకుభట్టు రక్తం చిందకుండా సైరంధ్రి ప్రయత్నం

యమధర్మరాజుతో సావిత్రీ సత్యవంతులు

అజ్ఞాతవాసంలో ద్రౌపదీ, పాండవులూ

31, అక్టోబర్ 2010, ఆదివారం

పాపయ్య గారి అద్భుత చిత్రాలు

చందమామ పత్రిక చేసుకున్న అదృష్టాలలో ఒకటి వారికి వడ్డాది పాపయ్య గారు చిత్రకారునిగా దొరకటం, నెలసరి జీతానికి ఆయన పని చేయటానికి ఒప్పుకోవటం. పాపయ్య గారికి ఆ నెల జీతమే దక్కింది కాని, రావలిసిన పేరు ప్రఖ్యాతులు అంతగా రాలేదు. చాలామంది పాపయ్యగారు పురాణ చిత్రాలు మాత్రమె వేశారని అనుకుంటూ ఉంటారు. కానీ, నిజానికి, పాపయ్య గారు సాంఘిక కథలకు, జానపద కథలకు కూడ బొమ్మలు వేశారు. చక్రపాణి గారు బెంగాలీ నుండిఆంధ్రీకరించిన శరత్ నవలలు అన్ని 'యువ' పత్రికలో ప్రచుచేవారు. వాటన్నిటికి బొమ్మలు వేసినది పాపయ్య గారే. చందమామలో వేసిన చిత్రాలలో, అరణ్య పురాణం ధారావాహిక కు వేసిన చిత్రాలు అమోఘం. బొమ్మలు చూస్తె చాలు కథ చదవాలిసిన అవసరం లేదు. పూర్తిగా అర్ధం అయిపోతుంది. పైగా, ఆ బొమ్మలు రంగుల్లో, ఆయన కుంచే నుండి అద్భుతంగా జాలువారాయి. ఆ బొమ్మలలో కొన్ని చూడండి.



చిత్రాలు చందమామ వారి సౌజన్యంతో
అరణ్య పురాణం చిత్రాలతో చేసిన ఒక స్లైడ్ షో చూడండి.










30, అక్టోబర్ 2010, శనివారం

వడ్డాది పాపయ్యగారి విగ్రహం

మన తెలుగు వారు గర్వించగల (అలా గర్వించగల శక్తి తెలుగు వారు కోల్పోయి చాలా కాలం అయ్యింది అనుకొండి!) మహా చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు. అటువంటి అద్భుత చిత్రకారుడు, తమ సిబ్బందిలో ఉన్న ప్రజ్ఞను గౌరవించలేని ఒక మాసపత్రిక చట్రంలో ఇరుక్కుపోయి బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోయారనిపిస్తుంది. వపాగారు కూడా ప్రచారానికి వైముఖ్యంగా ఉండేవారని వారి ఉత్తరాల వల్ల తెలుస్తున్నది. ఇప్పుడిప్పుడే ఆయన అభిమానులు వపా గారి విశేషాలు సేకరించి బయట ప్రపంచానికి తెలియచేయాలని తపనపడటం ప్రారంభించారు. ఆ తపనలో భాగమే ఆయన విగ్రహావిష్కరణ.

వడ్డాది పాపయ్య గారి సొంత ఊరైన శ్రీకాకుళం లో కొత్తవంతెన సమీపాన ఆయన విగ్రహం స్థాపించారని తెలుస్తున్నది . ఆ విషయం కూడా ఘనులైన మన మీడియా వారు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు . ఆయన విగ్రహ చిత్రాన్ని చూడండి .



ఈ విగ్రహ స్థాపన గురించిన వివరాలు SRIKAKULAM EMINENT PERSONS బ్లాగునుండి తీసుకోబడినవి. ఈ కింది లింకు నొక్కి అక్కడ అతి కొద్ది వివరాలు, ముఖ్యంగా వపాగారి విగ్రహం చూడవచ్చు.


వడ్డాది పాపయ్యగారి ఉత్తరాలు-విశేషాలు .

పై ఫోటో కర్టెసీ దీప్తి ధార బ్లాగ్ సి బి రావ్ గారు

బాపు గారు, వపా గారు ఇద్దరూ శ్రీ న్యాయపతి కామేశ్వరరావు గారి 'బాల' లో బొమ్మలు వేస్తున్నప్పటినుంచి చూస్తే బాలవటువుగా వున్న ఇద్దరూ త్రివిక్రమావతారులుగా పరిణతి చెందడం స్పష్టంగా కనిపిస్తుంది..! ఇద్దరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని నిర్మించుకొని విస్తరించి.. శిఖరాగ్రాన నిలచిన వారే. బాపుగారు తన ప్రతిభను వివిధరంగాలకు (కార్టూన్లు, సినిమాలూ, టి వి సీరియల్స్, లాంటివి.. ) విస్తరించి..తన అభిమానులనూ, కళారాధకులనూ ఇంకా మురిపిస్తూనే వున్నారు. కానీ స్వతహాగా అంతర్ముఖులూ..ప్రదర్శనలు బొత్తిగా ఇష్టపడని వ్యక్తీ ఐన వపా గారు.. తనచుట్టూ తానే గిరిగీసుకొని..అదే లోకం లో ఉండిపోయారనిపిస్తుంది. వారు తన సన్నిహితులైన కొందరికి వ్రాసిన ఉత్తరాలు వారి అంతరంగానికి అద్దం పడతాయి.వారి బొమ్మలను చూసి వారి వ్యక్తిత్వాన్ని ఊహించడానికి ప్రయత్నించే వారికి వారి తాత్వికత, లోతైన భావజాలం ఆశ్చర్యాన్ని కలిగించక మానవు.
******
"కశింకోట, 23 -12 -1980
....'ఎందుకు?' అన్నది నాకు మూలమంత్రం.! ఆ గీత, ఆ వంపు, ఆ అస్పష్టత ఎందుకు అన్న ఆలోచనే చిత్ర రచనకు ఎంత దోహదమో..అదే 'ఎందుకు' నాకు చాలా ఉపయోగకరంగా ఇంతవరకూ ఉంది..!!
ఇక - చిత్రాలు ప్రదర్శింపజేయటమూ , ముఖ్య అతిధి ఆహ్వానానికి నేను పూర్తిగా విముఖుడినని వెంటనే తెలియ జేయడం చాలా అవసరమైనదిగా ఎంచుతూ ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. మీరు వస్తే పరిషత్ ప్రతినిధి గా కాక కేవలం స్నేహితునిగా రాగోర్తాను.' ......'చందమామకూ యువ కూ తప్ప ఏ బొమ్మ ఇతరులకు వెయ్యను.'..... ..'మొన్న మీరు వచ్చినప్పుడు బిరుదుల గురించీ, సన్మానాల గురించి వింటున్నప్పుడు నాకు నవ్వు వచ్చిందే తప్ప మరేమీ రాలేదు. ఇలాటి అన్నిటికీ అతీతంగా ఉండాలనే చిరకాలం క్రిందటే ఒక మార్గాన్ని ఎన్నుకొన్నవాడిని....మీరేదో పేపర్ పబ్లికేషన్ కోసం రాసి,పరిచయ వ్యాసం పంపాలన్నారు. పంపక పొతే సరే, ఒకప్పుడు పంపితే ఈ క్రింది వాక్యాలు చేర్చండి. ' యితడు మొండి వాడు.. గర్విష్టి..?? కూపస్థ మండూకం అన్నా అనవచ్చు . బయటి సంఘాన్ని చూడడు . చూడమని కొరడు . ఇలాంటి తలబిరుసు తనకు మేలో కీడో అన్న విచక్షణా జ్ఞానం ఉన్నట్టు కూడా తోచదు. ఇలాంటి బిరుసుకి తన ఆత్మ విశ్వాసం ఇరుసు అంటాడు. అది ఎంత నిజమో అది అప్రస్తుతం."
********
"కశింకోట, 23 -12 -1980
'మనతరం అనుభూతిని మన తరువాత తరం వారికి చెప్పబూనే ప్రయత్నమే' కళ...! - ఎవరిదీ?? ఎక్కడిదీ బాబూ ఈ స్లోగన్..??!!
నలుగురు గుడ్డి వాళ్ళూ, ఏనుగూ ..కథ ఇది. నా మట్టుకు అనుభవం లో - తాత్కాలికంగానైనా మానసిక అశాంతిని తెమ్మనేర్ప గలిగేది మాత్రమే అది ఎలాంటిదైనా..బూతు అయినా అదే అర్ధమున్న కళ . ఈ మానసిక అశాంతికి కాలమూ స్థాయీ మారుతూ ఉంటాయి. జగత్తు స్వభావం పరిణామం. నిన్నటి కళ ఈ రోజు కళ అనిపించుకోదు. అనుకుంటే అది కుంటి నడక.' ...
.......అంచేత కళా నిర్వచనాల కంటే నిర్వాక్కుగా కళ అనిపించినదాన్ని ఆస్వాదించ గలగటమే తపస్సు..మునులంటే వాళ్ళే...!'......
చిత్రకళా తపస్వి అని మరో అభాండం వేశారు. ఏదీ కాను, 'కోటివిద్యలు కూటికే'' తపస్విని .. అంతే...!! ....
......ఆంధ్ర దేశం లో పుట్టడం వల్ల నాకు అంతగా మేలు జరగలేదన్నారు...ఇదే మనసులో వుండే అజ్ఞానం ఒకడి గురించి అతడికి జరిగిన కీడు మేళ్లను కొలబద్దలుగా అంచనా వేస్తారు. నేనెప్పుడూ ఇప్పుడూ అలాగ అనుకోలేదు. మనకు కావలసిన మేలు మన చేతిలోనే ఉంది. దేముడు కూడా మేలు చేయక్కర్లేదని నమ్మే వాడిని నేను. దేముడిని ప్రార్ధిస్తే - ఒరే దేముడూ నువ్వు ఎలాంటి మేలూ చెయ్యకు. అదే నువ్వు చెయ్య వలసిన కార్యం - అని.
......"
**********
"కశింకోట, 8-9 -1981
................
'ఎందుకూ పనికిరానివాళ్ళు విమర్శకూ వ్యాఖ్యానాలకూ దిగుతారనేది తరతరాల సంస్కృత కావ్యాల నాటి నుంచీ వస్తున్న మనదేశపు సంస్కృతి, కాళిదాసు లాగ వ్రాసే వాళ్ళు లేరు గానీ వ్యాఖ్యాతలు కోకోల్లలున్నారు.' ...... ' ఇది కమర్షియల్ , ఇది క్రియేటివ్ అని చిలక పలుకులు పలికే వాళ్ళు నిజానికి ఏమీ తెలియని భూతాలు. ' బ్రహ్మజెముడు మొక్కలోనూ, శతపత్ర కుసుమంలోనూ ఒకే సౌందర్యం కనిపించినప్పుడే అది నిజమైన విమర్శ అవుతుంది.. కలలో తేడాలూ, జాతులూ, శైలీ ఎంచడం అంత సంకుచితత్వం మరేదీ లేదు..! ఎందులో ఏముందో తెలుసుకున్న సొంత అనుభవం తర్వాతే - ప్రకర్ష.' .........."
***********
"కశింకోట, 21-6 -1982
.............
ఆధునిక లేదా నవీన చిత్ర కళ అంటే ఇది అని లేదు. ఈ రోజు నవీన రేపటికి పాతదైపోతుండగా, ఒకవంక కంప్యూటర్ల చేత డ్రాయింగులు చేయిస్తూ ఉంటే.. మరో ప్రక్క కలర్ ఫోటోగ్రఫి ట్రిక్కులతో అన్నీ సాధిస్తున్నై. కొంతమంది విజ్ఞులని పించుకుందామని ఆధునిక చిత్రకళ అవగాహన చేసుకోలేకపోయినా తెగనాడడమో , పొగడ్డమో చేస్తున్నారు. ఈ రకం విదూషకులు జోకర్ల కంటే.. ఏమాత్రం సారం వున్న గ్రహించ గలిగే మూగ ప్రేక్షకుడు ఒక్కడుంటే చాలుకదా..??....
నా మట్టుకు చెప్పాలంటే - మనుగడ కోసం సాంప్రదాయకంగానే బొమ్మలు వేస్తున్నాను. ( ఈ దేశం లో ఆధునిక చిత్రకళకు పైసా సంపాదించే యోగం లేదుకాబట్టీ) అత్యంత ఆధునిక చిత్ర కళ పట్ల పరిపూర్ణమైన అభిమానమూ, ఆసక్తి గల వాడిని..! నమ్మండి మానండి...!! "
*****************
వపా గారు చిత్రకళ పట్ల వారికి వున్న అభిప్రాయాలను..నిర్మొహమాటం గా కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు ఆ ఉత్తరాలలో..!!
ఒక చోట ఇలా వ్రాసారు: "ఈ రోజులు గడపటానికి ఇబ్బంది లేని ఆర్ధిక స్థోమత నిలవాలి వుంటే, నేను చిత్ర రచన జీవనోపాధిగా పెట్టుకోకుండా ఒకటో రకం ఆధునిక చిత్రకారుడిగా ఉండేవాడిని."
*****************

"కశింకోట, 21-6 -1982
.............
నేను ఇప్పటివరకు అవలంబించిన మార్గాన్నే ఉండాలని తలచి మీకు మీ షిప్ యార్డు వాళ్ళ ఎగ్జిబిషన్ కి బొమ్మలు ఇవ్వనని, ఇక ఆ ప్రశస్తి వద్దని వ్రాశాను. నేను ఒకటి సంకల్పించాను... అది నెరవేరాలి...ఇక్కడే మంచివన్నీ తీసి అన్నిటికీ అద్దాలూ, ఫ్రేములూ వేసి, రెండు చిన్న గదుల్లో గాలరీ లాగ తగిలించి ఉంచాలని..అది నెరవేరితే ఇదొక్క ప్రదర్శనా ఎల్లప్పుడూ ఉండాలనీ. ఇది నాకు నాగులచవితి నాడు కలిగింది. ఎవరు చూడాలని ఇంట్రెస్టు ఉన్నా చూడగలరు.
***********
'చందమామ'కీ , 'యువ' కీ తప్ప బొమ్మలు గీయను..ప్రదర్శనలకు దూరం అన్న వారి సిద్ధాంతం అభిమానులకి వారిని అందుబాటులో లేకుండా చేసింది. అందువల్లేనేమో..బాపు బొమ్మలు, వివరాలూ దొరికినంత సులువుగా వపా గారివి దొరకటం లేదు..వారు ఎక్కువగా బొమ్మలు గీసిన చందమామ ముఖ చిత్రం గా తప్ప మరెక్కడా వారి బొమ్మ కనిపించదు. కానీ వారే ఒక గ్యాలెరీ ఏర్పాటు చేద్దామని తలచినా అది ఎందుకో సఫలం అయినట్టు లేదు. చందమామ ఇంకో మూల స్తంభం ఐన దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక సంచికను 'రచన' వారు పూనుకొని తయారు చేసినట్టు మన వడ్డాది పాపయ్యగారిది కూడా ఎవరైనా ఒక సంచిక విడుదలైతే ఎంత బాగుంటుందో కదా!! అదే సంకల్పం తో వపా గారి వీరాభిమానీ, వారికి ఆప్త మిత్రుడూ, వారు కశింకోటలో వున్న పన్నెండేళ్ళ పాటూ వారిని ఎంతో దగ్గరగా గమనించి, వారి స్వహస్తాలతో ఉత్తరాలూ, గ్రీటింగ్ కార్డులూ, అందుకున్న అదృష్టవంతులు.. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ చిత్రకారులు శ్రీ సుంకర చలపతి రావుగారు( చిత్ర కళా పరిషత్), వపా గారిమీద 'The waking dreamer in colours' పేరిట ఒకటీ, 'లేఖలు' పేరిట ఇంకొకటీ పుస్తకాలు ప్రచురించారు. అంతే కాక వపా గారి చిత్రాలు వారికి సాధ్యమైనన్ని సేకరించి ఒక ప్రదర్సన కూడా ఏర్పాటుచేసి విశాఖ వాసులకి కన్నుల పండుగ చేసారు. అలాగే ఆ బొమ్మలన్నిటినీ వాటిని స్కాన్ చేసి ఒక సి డి గా కూడా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వారు చేస్తున్న కృషికి వారిని వపా గారి అభిమానులంతా మనస్పూర్తి గా అభినందించాలి వీలయితే సహకరించాలి
( నీలి రంగులో వ్రాసిన పంక్తులు వపా గారి ఉత్తరాలలోనివి...శ్రీ సుంకర చలపతి రావు గారి సౌజన్యం తో)








వపా గారి మరిన్ని చిత్రాలు ఇక్కడ చూడండి.

రాధేశ్యాం
(సొంతఘోష )