3, ఏప్రిల్ 2011, ఆదివారం

CRICKET WORLD CUP FINALS

నేను ఆఫీసులో ఉండేప్పటికే శ్రీలంక బాటింగ్ అని తెలిసింది. ఇక అక్కడ పని ముగించుకుని, బయటి పనులు చూసుకుని ఇంటికి వచ్చేప్పటికి శ్రీలంక వాళ్ళు చివర చివర బంతుల్ని బాదుతున్నారు, స్కోరు 274 కివెళ్ళిపోయింది. "ఇక మన పని కష్టమే" అని ఒక్కణ్ణే మన బాటింగ్ చూడటానికి నిర్వికారంగా కూచున్నాను. శ్రీమతికి ఈ క్రికెట్ గోల పట్టదు, మా అబ్బాయిలు ఇద్దరూ చెరో దేశంలోనూ ఉన్నారు.

కాసేపటికి
మన వికెట్లు రెండు పోయాయి, పైగా సచిన్ వికెట్ పోయింది. ఇహ ఇక్కడ కూచోవటం వృధా అనిపించి, మన కూడలిలోకి వెళ్ళేప్పటికి, "నాన్న" బ్లాగ్ భాస్కర రామరాజుగారు, లైవ్ బ్లాగింగ్ మొదలుపెట్టి "రండి...రండి" అని పిలుస్తూ కనిపించారు. సరే ఇదేదో బాగుందని అక్కడకి చేరుకునేప్పటికి, కొంత గాంగ్ తయారయ్యి, ఒక కంట లైవ్ క్రికెట్ చూస్తూ , ఆ బ్లాగులో ఒకరికొకరు తీసిపోకుండా కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. చూస్తుండగా సచిన్ సెంచరీ ఏమో గానీ, ఇక్కడ కామెంట్ల సెంచరీ క్షణాల్లో ఐపోయింది. ఇంత వేగంగా ఇన్ని కామెంట్లు ఒక బ్లాగులో పడటం ప్రత్యక్షంగా చూసారు అందరూ.

సరే నేనూ రంగంలోకి దూకి, నా వంతు గోల నేనూ చేసాను. ఒక స్కోర్లు చెప్పటమేనా, ఆట మీద లైవ్ సమీక్షలేనా, పందాలు కట్టటమేనా, ఒకటేమిటి, అనేక రకాలు. పక్క పక్కన లేమన్న మాటేకాని, అందరం కలిసి స్టేడియం లో కూచుని చూసిన థ్రిల్, ఆనందం కలిగినాయి.

సరదాలో అనేకమంది కలిశారు. కుమార్ ఎన్, భాస్కర రామరాజు, రాజేష్ జి, సిరిసిరి మువ్వ ఇంకా మరికొందరు. అందరూ కలిసి బ్లాగులో క్రికెట్ చూసిన ఆనందం పొందాం. కామెంట్లు ఎక్కువయ్యిపోయి, రాజుగారు మరొక పోస్ట్ వెయ్యాల్సి వచ్చింది.

సరదా అంతా చూడాలని ఉందా. కింది లింకులు నొక్కి చదివి ఆనందించండి.


1) కాయ్ రాజా కాయ్ 272 కామెంట్లు

2) 33 రన్లు 34 బంతుల్లో 116 కామెంట్లు

ఇక చివర చివరకి వచ్చేప్పటికి మా ఇంటి దగ్గర హోరు ఎక్కువయ్యిపోయి, టి వి చూడటం కష్టం ఐపోయింది. బయట పిల్లలు, పెద్దలు చేరి ఒకటే గోల డప్పులు, టపాసులు, ఒకటేమిటి ఎన్ని రకాల కూతలు, అరుపులు, అన్ని పశుపక్ష్య జంతు జాలాల అనుకరణలు, ధ్వనులు చేసుకుంటూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మన బారత జట్టు అద్భుతంగా వరల్ద్ కప్ గెలుచుకున్నది. ఆటగాళ్ళు కూడ ఉద్వేగం పట్టలేక ఆనంద భాష్పాలు కార్చారు.

ఇవన్నీ కూడ ప్రస్తుతం మనకున్న సాంకేతిక పరిజ్ఞానం వల్లనే కదా. లేకపోతే ఒక చిన్న ట్రాన్సిస్టర్ చెవికి ఆనించుకుని విన్న 1983 ఎక్కడ, ఇప్పుడీ లైవ్ టి విలో / బ్లాగింగ్ చేస్తూ 2011 లో విజయం చూడగలగటం ఎక్కడ! అద్బుతం!!

ఈలోగా మా అబ్బాయి న్యూయార్క్ నుంచి, వాళ్ళు అక్కడ చేసుకున్న ఉత్సవాల ఫొటోలు పంపాడు. చూడండి అవన్నీ.

భారత జట్టుకు అద్భుత విజయానికిగానూ బ్లాగర్లందరి తరఫునా శుభాకాంక్షలు.



అమెరికాలో ఉన్న ఒక బ్రిటిషర్ భారత జెండా ప్రదర్శిస్తూ తన ఆనందాన్ని వ్యక్త పరుస్తున్న చిత్రం

















3 కామెంట్‌లు:

  1. అద్భుతం! అమోఘం..!! అపూర్వం..!!! అసమానం..!!! అనుపమానం!!!! అనిర్వచనీయం..!! అద్వితీయం..!!! we have experienced much more...and short of words to express it.
    మీ లైవ్ బ్లాగ్గింగ్ కూడా బహు చక్కగా ఉంది. కానీ నాకు ఉన్నచోటు నుంచి లేవలేని పరిస్థితి!(ఎవరి పిచ్చి.. సామెత లాగా నా సెంటిమెంట్ నాది. హ..హ్హ..హా.!!)కూర్చున్న సోఫా లోంచీ లేవకుండా చూసాను పాకిస్తాన్ మాచ్ కూడా అలాగే గెలిచేం. కానీ మీరు ఆ కామెంట్స్ అన్నీ మళ్ళీ పెట్టి.. హైలైట్స్ చూసిన ఫీలింగ్ తెప్పించారు. మన బ్లాగ్ మిత్రులందరి తరఫునా ధన్యవాదాలు.
    కొస మెరుపు: నాన్నగారి 'కాయ్ రాజా కాయ్' బ్లాగ్ పోస్ట్ లో ఇంకొక్క మూడు కామెంట్లు వచ్చి వుంటే దానిలో కూడా మనం గెలిచేసే వాళ్ళం. ఇప్పుడు రెండు కామెంట్ల తేడాలో వెనుకబడ్డాం.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారం శివ గారూ,
    వివిధ సూపర్స్టిషియస్ కారణాల వల్ల, నేను ఫైనల్ మాచ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తో కాకుండా, మా ఇంట్లోనే చూద్దామని నిర్ణయిచుకున్నాను. క్వార్టర్స్, సెమీస్ లాగా లోపల భయం లేకుండా, ఫైనల్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, శ్రీలంక 274 కొట్టాక కూడా. కాని మన రెండు బిగ్ గన్స్ అంత తొందరగా తుస్ మనేసరికి, ద గ్రేట్ ఇండియన్ కొలాప్స్, సౌత్ ఆఫ్రికా తో మాచ్ లో లాగా తెర మీద కనపడబోతోందా అని నా గొంతులో ఎలక్కాయ ఏం ఖర్మ, ఏకంగా గుమ్మడి కాయే ఇరుక్కుంది. అయ్యయ్యో ఫ్రెండ్స్ లేరే చుట్టూ అన్న కొరత మీరంతా తీర్చారు. అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

    - శి. రా. రావు
    ఉగాది ఊసులు
    http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.