12, జూన్ 2011, ఆదివారం

ఇద్దరు మోసగత్తెలు - చందమామ మినీ సీరియల్

అరేబియా కధల పరంపరలో భాగంగా ముందొక బ్లాగులో వ్రాసిన 'గంధర్వ చక్రవర్తి కూతురు' మినీ సీరియల్ లాగే దాని కన్నా ముందు వచ్చిన సీరియల్ " ఇద్దరు మోసగత్తెలు". చాలామట్టుకు పోగా నా దగ్గర ఇంకా మిగిలి వున్న చందమామ సీరియల్స్ పుస్తకాలలో ఇది ఒకటి. రచయిత ఎవరో తెలియదు. తొమ్మిది భాగాలలో ఎన్నో మలుపులతో చాలా పకడ్బందీగా పట్టుగా నడుస్తుంది కథ.




ఖలీఫా
గారి పావురాలటపా నడుపుతున్న వ్యక్తి మరణానంతరం టపానీ నీగ్రోబానిసలనీ, దివాణంతో సహా మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అతని భార్య దిలైలా, కూతురు జీనాబ్ లే మన కథానాయికలు. దిలైలా పావురాలటపా తాను నిర్వహించగలనని వుద్యోగం తనకిప్పించామనీ అర్జీ పెట్టుకున్నా అది బుట్టదాఖలౌతుంది. తీరాచూస్తే టపా నిర్వహణ పూర్వాశ్రమంలో గజదొంగలుగా బాగ్దాదు నగరాన్ని హడలెత్తించి ప్రస్తుతం కొత్వాళ్లుగా పనిచేస్తున్న అహ్మద్, హసన్ లకు అప్పగించ బడుతుంది. దొంగలుగా వాళ్ళని పట్టుకోలేక వాళ్ళని కొత్వాళ్లుగా కొలువులో ఉంచుకుంటాడు ఖలీఫా.


దానితో భగ్గుమన్న దిలైలా..దొంగలకీ, మోసగాళ్ళకీ ఉద్యోగాలిచ్చేట్టయితే మన ప్రతాపం కూడా నగరానికి మరీ ముఖ్యంగా కొత్వాలుకి తెలిసోచ్చేలా చెయ్యాలని బయలుదేరుతుంది. అదిమొదలు ఆమె చేసే మోసాలు..దొంగతనాలూ..నగరాన్ని హడాలెత్తిస్తాయి. ఒకదానికి కొనసాగింపుగా మరొకటీ దానికి తోడుగా ఇంకొకటీ..దానికి తగ్గట్టు ఆవిడ వేసుకొనే వేషాలూ..మనల్ని ఆపకుండా చదివిస్తుంది.


మొదటగా ఒక రక్షక భట నాయకుడి భార్యకి పిల్లలు కలిగే మార్గం చెప్పే ఒక సాధువు దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి పెళ్ళికోసం ఎదురుచూస్తున్న ఒక వర్తకుడి దగ్గరకి తీసుకెళ్తుంది. ఆమెని చూపించి నీకు పెళ్లిచేస్తాని చెప్పి వెయ్యి వరహాలు నొక్కేస్తుంది. యువకుడిని గదిలో ఒంటరిగా కూర్చోపెట్టి ఇతడే సాధువని చెప్పి నగలు తీసి ఒంటరిగా వెళ్ళమంటుంది. నగలు దాచేస్తుంది. ఒక కలంకారీ వ్యాపారి వద్దకు వెళ్లి, వీళ్ళిద్దరూ తనపిల్లలనీ కొత్త ఇంటికోసం చూస్తున్నాననీ అడిగితే, ఖాళీగా వున్న వాళ్ళ ఇంటి తాళాలు ఇస్తాడు. అతని కన్ను చాటుచేసి... కొట్లో వున్న సామానంతా దాటించేస్తుంది.





ఇలా సీరియల్ లాగా సాగుతాయి ఆమె మోసాలు. మొత్తానికి దిలైలా ఇల్లుచేరింతరువాత..ఇక కూతురు జీనాబ్ మొదలెడుతుంది. తమను పట్టుకోవటానికి ఖలీఫా చేత నియోగించబడిన అహ్మద్, అతని భటులనీ మోసం చేసి ఒంటిమీది బనియన్, చెడ్డీ తప్ప మిగతాదంతా ఊడ్చేస్తుంది. ఇంకో కొత్వాలు హసన్ ద్వారా వీరిద్దరూ మోసాలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకొన్న ఖలీఫా పావురాల టపాకు సంబంధించిన దివాణాన్ని మళ్ళీ దిలైలా పరం చేస్తాడు.







అయితే తనకు జరిగిన అవమానం మర్చిపోలేని అహ్మద్ తన శిష్యుడైన పాదరసం అలీ ని బాగ్దాదుకు రప్పించి తల్లీ కూతుళ్ళ మీదకి పంపిస్తాడు. జీనాబ్ వాడిని కూడా చిత్తు చెయ్యడంతో పాదరసం ఆలి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి జీనాబ్ మేనమామ పెట్టిన షరతులని ఎలా సాధించాడన్నదే మిగతాకథ.

ఈ కథలో మోసపోయినవాళ్ళు దిలైలా చెప్పే కథలని యిట్టె నమ్మేస్తారు. వాళ్ళ అమాయకత్వాన్ని చూస్తే నవ్వొస్తుంది. అలాగే ఒకదానితో ఒకటై కుదిరేలా సంఘటనలనీ, సన్నివేశాల్నీ రచయిత ఊహించిన తీరు కూడా అబ్బురపరుస్తుంది. పాత్రల పేర్లూ, శంకర్ గారి బొమ్మలూ అన్నీ అరేబియన్ నేపధ్యాన్ని మన కళ్ళకు కట్టిస్తాయి. 'అమరచిత్ర కథ' వాళ్ళది ఈనాడు పేపర్లో డైలీ కామిక్ సీరియల్ గా వచ్చిన 'చోర శిఖామణి' (ఇంగ్లిష్ లో SAHASRA MALLA) అని వచ్చిన కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. కానీ నేపథ్యం జైన జానపదం. ఇతివృత్తం ఒకటే కానీ పాత్రలూ సన్నివేశాలూ, చిత్రణ అన్నీ వేరు. అదికూడా చాలా బాగుండేది. ఈ మధ్య ఇంగ్లిష్ లో కనిపిస్తే కొన్నాను. దానిగురించి తరువాతి పోస్టులో వ్రాస్తాను.

- రాధేశ్యాం

1 కామెంట్‌:

  1. వావ్! నాకు చాలా నచ్చిన రెండు సీరియళ్ళ గురించి మీరు రాయడం చాలా సంతోషంగా ఉంది.
    గంధర్వ చక్రవర్తి కూతురు గురించి మీరు రాసినది ఇంతకు ముందు ఏదో ఫాంటు సంస్య ఉన్నట్లుండి చదవలేకపోయాను. ఇప్పుడు బానే కనిపిస్తోంది.
    ధన్యవాదాలు. ఆ బొమ్మలు, కథ, ఒక దానితో ఒకటి పోటీ పడి బలే బావుంటాయి. ఇవి మళ్ళీ ప్రచురిస్తే బావుండును.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.