29, జులై 2011, శుక్రవారం

1972-1973లో కార్టూన్లు - ఇవ్వాల్టికీ అదే పరస్థితి

అప్పట్లో అంటే 1972-73 సంవత్సరాలలో ఆంధ్ర పత్రిక ఒక్కటే మనకున్న వార్తా పత్రిక. మరింకేవో పత్రికలున్నా అవి ఆంగ్ల పత్రికల తెలుగు అనువాదాలో లేక కొన్ని పార్టీల కరపత్రాలో గానే ఉండేవి (ఇప్పుడు దాదాపు అన్ని పత్రికల పరిస్థితి అదే అనుకొండి). ఆంధ్ర పత్రికలో, తెలుగులో రాజకీయ కార్టూన్లకు ఆద్యుడు శ్రీ ఊమెన్ గారు చక్కటి కార్టూన్ వేసేవారు. ఆయనకు తెలుగు రాదు! కేరళీయుడు. ఆయన కార్టూన్ వేసి, కాప్షన్ ఆంగ్లంలో వ్రాసి పంపితే, పత్రిక సంపాదకుడు శ్రీ శివలెంక రాధాకృష్ణ గారు కాప్షన్ తెలుగుచేసి కార్టూన్ తో కలిపి వేశేవారు.

పాత పత్రికలూ తిరగేస్తుంటే, కొన్ని కార్టూన్లు కనపడ్డాయి. కార్టూన్లు దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వేసినా (మన తెలుగు బ్లాగర్లలో ఎక్కువ శాతం మంది పుట్టక మునుపటివి) రోజుకీ ఇరవై ఒకటో శతాబ్దం, మనం ఎంతో సాధించాం, సాకేతికపరంగా ఎంతో గొప్ప అనుకునే రోజులకీ పరిస్థితులు మారలేదు, మన దృక్కోణాల్లో ఎటువంటి మార్పు రాలేదు అని తెలియ చెబుతున్నాయి.

నల్ల ధనానికి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఎప్పటినుండో తెలియని కాలం నుండి ఉన్నట్టున్నది. అప్పట్లో గుప్త ధనికులు వెనుకనుండి తమ సంపదతో రాజకీయాలకు మద్దతు ఇస్తూ తమను తాము కాపాడుకునేవారు . నాడు వాళ్ళే మరెవరికో మద్దతు ఎందుకు, అని వాళ్లకు వాళ్ళే రాజకీయ నాయకులు, పత్రికాధిపతులు అయిపోయి దేశాన్ని ఏలేస్తున్నారు . ఎవరన్నా ఆక్షేపిస్తే, నిరూపించు (చూస్తాం), రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ బీరాలు పలకటం. అవి నిరూపణ ఎవరు చేస్తారు, అన్ని గుడ్డలూ తానులేవేగా మరి! ఎవరో ఒక మంత్రో, ముఖ్య మంత్రో అవినీతికి పాల్పడ్డాడని నానా గోల చేసి చివరకు ఆ మనిషి రాజీనామా చెయ్యంగానే అందరూ (మీడియా తో సహా) ఇక చాల్లే అని ఊరుకోవటం మరొకడు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నవాడు ఆబగా ఆ పదవి అందుకుని దండుకోవటం మొదలు. అవినీతికి పాల్బడి రాజీనామా చేసిన రాజేకీయ నాయకులకు ఎంత మందికి శిక్ష పడింది, ఎంత మంది నుండి నుండి వాళ్ళు అవినీతి పద్ధతుల్లో సంపాయించిన "నిధులు" ప్రభుత్వం రాబట్టి, ప్రజోపయోగానికి వాడగలిగింది, అన్నది ఒక శేష ప్రశ్నగానే మిగిలిపోతున్నది. ఈ రోజున ఊమెన్ గారు ఉండి ఉంటే మరే కార్టూన్ వేసేవారో కదా.
ఒకప్పుడు తాగినవాడు సాంఘిక బహిష్కృతుడు . ఇవ్వాళ తాగని వాడు వింత జంతువు. కాని 1972 లో వేయబడ్డ కార్టూన్ ఇది. నాకు బాగా గుర్తు, మద్యపాన నిషేధం తీసేయ్యగానే, విజయవాడ గాంధీ నగర్లో, ఒక ప్రముఖ స్కూల్ కు ఎదురుగా (!) ఒక బ్రాందీ షాప్ వెలిసింది. ఆ షాప్ వాడు ఒక బ్రాందీ సీసా నిలువెత్తుది చేయించి తన షాప్ బయట పెట్టాడు. ఇది, మన వ్యాపారులకు ఉన్న "సామాజిక స్పృహ!" పైనున్న కార్టూన్, మద్యపాన నిషేధం తీసేసిన కొత్త రోజుల్లో వచ్చిన కార్టూన్. కార్టూన్లో అన్నట్టుగా, నిషేధం తీసేసిన తరువాత తద్వారా వచ్చినది. వస్తున్న అలజడుల గురించి ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నారు పాపం. ఎక్సైజు డ్యూటీ వస్తున్నది, సేల్స్ టాక్స్ వస్తున్నది అని అసందర్భపు వాగుడే కాని, వచ్చిన టాక్సు, శాంతి బధ్రతలను రక్షించే ప్రక్రియలో అయ్యే ఖర్చులో పదోవంతుకు కూడ సరిపోవటం లేదు అన్న దృష్టే లేదు! పైగా మద్యపానం లేకుండా ఉంటే ఆగిపోయ్యే ఖర్చులు చెయ్యక్కర్లేని ఖర్చులు ఎన్ని అన్న విషయం మీద ఏ మాత్రం అవగాహనే లేదు.

ఇక కార్టూన్, మన ప్రభుత్వాల సమస్యా పరిష్కార తత్త్వం మీద వేయబడ్డ అద్భుతమైన వ్యంగ్య చిత్రం. గుడు గుడు గుంజంగా సమస్య చుట్టూరా తిరుగుతూ, సమస్య మాయం అయిపొయ్యే రోజుకోసం ఎదురు చూడటమే కాని, సమస్యా పరిష్కారానికి పనిచేసే వాళ్ళు ఒక్కళ్ళూ పార్టీలోనూ లేరు కదా!! ఎప్పటికప్పుడు షార్ట్ టర్మ్ ప్రక్రియలే కాని, సమస్య మూలాలలోకి వెళ్లి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చెయ్యాలన్న కనీస జ్ఞానం కూడ కొరవడింది ఈనాడు.(పైనున్న కార్టూన్లు అన్నీ కూడ ఆంధ్ర పత్రిక దినపత్రిక సౌజన్యం - పి ప్రెస్ అకాడమీ వారి సేకరణ)

3 వ్యాఖ్యలు:

 1. మన దేశం గురించి యేమి వ్రాయాలన్న విరక్తి కలుగుతోంది. నాయకులు దొంగలు. వారికి తగ్గ ప్రజలు. ఇంకేమి వ్రాయాలి. కష్టపడి పైకి రావాలి అని చెపితే అదొక జొక్ క్రింద తయారైంది. ఒకడు తప్పు చెస్తున్నాడని చూపితే, మరొకడు కూడా చేస్తున్నాడని సరి పుచ్చుతున్నారు. మొదటివాడి తప్పును రెండవ వాడి తప్పుతో ఎలా కడిగెయ్యటం...????

  ఎక్కువ మంది రాజకీయ నాయకుల్లా పైకి రావాలని అనుకునే వాళ్ళే.. అది కుదరక కష్టపడి పైకొచ్చిన వాడి మీద పడి ఏడవటమే గానీ, మనం కూడా వాడిలా పైకి రావటం ఎలా అని అలోచించే వాళ్ళే కరువయ్యారు. ఒకరి బాగుకి మరొకరి అడ్డు అనుకునే దిక్కుమాలిన సంకుచిత మనస్తత్వం పోతే గానీ ఎన్ని ప్రత్యేక ఉద్యమాలు నడిచినా ఎవరికీ ప్రయోజనం లేదు. రాజకీయ నాయకులకి తప్ప....

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివగారూ!

  1972-73 నాటికి ఆంధ్ర పత్రిక వొకటే.......అనడం నచ్చలేదు. ఆంధ్ర ప్రభ ఆంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి అనువాదమా అని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. మరి ఆంధ్ర జ్యోతి వంటి మాటేమిటి?

  వూమెన్ (చాందీ కాదులెండి) కార్టూన్లు నచ్చనివాళ్లు లేరు.

  ఇంకో రెండుమూడేళ్లలో, ఎమర్జెన్సీని యెదురొడ్డి పోరాడినవాడు రామ్ నాథ్ గోయెంకా అని మరిచారనుకుంటా.

  "పరస్థితులు", "కాపుడుకోవడం" లాంటివి ప్రచురించేముందు సవరించండి.

  బాగా వ్రాశారు. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కృష్ణశ్రీ గారూ,

  మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. అప్పటికీ ఇప్పటికీ తెలుగులో దిన పత్రిక అంటే ఆంధ్ర పత్రికే. ఆంధ్ర ప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు తెలుగు ప్రతి. ఆంధ్ర జ్యోతి కాంగ్రెస్ కాపు కాసేది.ఆ పత్రిక ఓనర్ కే ఎల్ ఎం ప్రసాదు గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. ఆ తరువాత ఆత్యయిక పరిస్థితిని ఎదుర్కున్న పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆంగ్ల పత్రిక కాని తెలుగు పత్రిక కాదు.

  మీరు చెప్పిన స్పెల్లింగ్ తప్పులు సరిచేసాను

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.