17, జులై 2011, ఆదివారం

సినిమా ట్రైలర్

తెలుగు సినిమా చరిత్రలో ట్రైలర్లు బహు తక్కువ. అతి కొద్ది సినిమాలకు ట్రైలర్లు తయారు చేసి చూపించారు. పాత సినిమాలకైతే ట్రైలర్ అనే మాట ఉన్నట్టు నాకు తెలియదు. ఎప్పుడన్న ఓ పాత సినిమా తదుపరి రాబోతుంటె, ఆ సినిమాలో ఒక పాటో ఒక హాస్య సన్నివేశమో కొద్దిగా చూపిస్తూ, స్లైడ్ వేసేవారు(నేను వరంగల్లులో పని చేశేప్పుడు అక్కడ థియేటర్లలో ఈ సాంప్రదాయం గనించాను) ఫలానా సినిమా ఈ హాల్లోకే రాబోతొందని. సామాన్యంగా మనం ఒక తెలుగు సినిమా చూస్తుండగా మరొక రాబొయ్యే సినిమా ట్రైలర్ చూపించటం అనే ప్రక్రియ, ఆనవాయితీ మన తెలుగు సినిమా చరిత్రలో లేనేలేదు.

కానీ ఆంగ్ల సినిమాలు చూశే వాళ్ళందరికీ తెలుసు, ఒక ఆంగ్ల సినిమాకి వెడితే అక్కడ ఎన్నెన్ని సినిమాల ట్రైలర్లు చూపిస్తారో! ఒక్కోసారి ఇంటర్వెల్ దాకా కూడా ట్రైలర్లతో కాలం గడిపేసి, ఇంటర్వెల్ తరువాత అసలు సినిమా మొదలు పెట్టటం కూడా జరిగేది. దీనికి కారణం, మనం మూడేసి గంటల సుదీర్ఘ సినిమాలకు అలవాటుపడ్డవాళ్ళం కనుక, ఆంగ్ల సినిమాలు సామాన్యంగా నిడివి తక్కువగా, అంటే మహా ఐతే గంట-గంటా పదినిమిషాలకు మించకుండా ఉండటం వల్ల, ప్రేక్షకుడు తానిచ్చిన డబ్బులకి పూర్తి వసూలు కాలేదని బాధపడి తమ థియేటర్లకు మళ్ళీ రాడేమోనని, బీతిల్లి, ఆయా థియేటర్ల యాజమాన్యం చేసిన ఏర్పాటే తప్ప మరొకటి కాదు.

ఏతా వాతా చేప్పేది ఏమంటే, ఆంగ్లంలో అనేకానేక ట్రైలర్లు చూసి, మళ్ళీ ఆ సినిమాలు చూడటానికి వెళ్ళి, అలా వెళ్ళినప్పుడు, మరిన్ని ట్రైలర్లు చూసి, అందులో సినిమాని చూడటానికి మళ్ళీ మళ్ళీ వెళుతూ, దాదాపుగా మా కాలేజీ జీవితం యావత్తూ వారానికి మూడు సినిమాలుగా నడిచింది. పాకెట్ మనీ దాదాపు అంతా విజయవాడ లీలా మహల్, నవరంగ్ టాకీస్ అప్పుడప్పుడూ ఊర్వసీ,మేనకల(థియేటర్లే సుమండీ) పరమయ్యింది.

కాని ఇక్కడొక సులువున్నది, తెలుగు సినిమాకి నేల క్లాసుకు వెళ్ళలేని నేను, ఈ హాళ్ళల్లో నిర్మొహమాటంగా నేల క్లాసు (అంటే సీట్లే ఉండేవి కాకపోతే తెరకు దగ్గరగా ఉండేవి) తీసుకుని హాయిగా సినిమా చూశేవాణ్ణి. అక్కడ కూడ మన లాంటి మధ్యతరగతి యువరాజులే ఉండే వాళ్ళు కాని అసలు సిసలైన నేల క్లాసు భటులు ఉండేవాళ్ళు కాదు.

ఫొటో శ్రీ తిరుమల రామచంద్ర గారు రచించిన మరపురాని మనీషులు పుస్తకం నుండి
అప్పుడప్పుడూ ప్రముఖ రచయిత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడ అదే హాల్లో (లీలా మహల్) బాల్కనీలో సినిమా చూస్తూనో, పైనుంచి కిందకు దిగుతూనో కనిపించేవారు. ఆయన సినిమాకి వస్తే సరాసరి తన సీట్లో కెళ్ళి కూచోవటమే. హాలువాళ్ళకి ఆయన బాగా తెలుసు కనుక, ఆయన ఏ సీట్లో కూచున్నారో గమనించి, ఆ నంబరు కల టిక్కెట్టు తీసికెళ్ళి ఆయనను వినయంగా అందిస్తే, ఆయన వెంటనే డబ్బులు ఇచ్చేసేవారట,

సరే ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నాని అనుమానం రావచ్చు. నిన్న బ్రిటిష్ లైబ్రరీ పుణ్యమా అని, ఆంగ్ల సినిమాలలో పురాణ గాథ ఐన "టెన్ కమాడ్‌మెంట్స్" (Ten Commandments) సినిమా కలెక్టర్స్ ఎడిషన్ దొరికింది. 1956 లో తీయబడ్డ ఈ సినిమాని మళ్ళి 1989 లో రీ మాస్టర్ చేసి, అద్భుతమైన క్లారిటీలో రెండు డి వి డిలుగా విడుదల చేశారు.

రెండు డి వి డి లు కదా, ఆ సినిమా తీస్తున్నప్పటి విశేషాలు, అలనాటి నటీ నటులతో ఇంటర్వ్యూలు వగైరా ఉంటాయని ఉబలాటపడి తెచ్చాను. కాని తీసి చూస్తే రెండు డి వి డి లు సినిమానే. సినిమా అంత పెద్దది (మూడు గంటల పైనే ఉన్నది) కొంత ఆశా భంగమైనా, ఎప్పుడో చిన్నతనంలో చూసిన సినిమా మళ్ళీ నిన్న రాత్రి హాయిగా చూశాను.

కాని రెండో డి వి డిలో నేను ఇప్పుడు చెబుదామనుకున్న విశేషం దాగి ఉన్నది. ఆ డి వి డిలో మూడు ట్రైలర్లు ఇచ్చారు. మొదటి సారి విడుదలైనప్పుడు 1956 లో సినిమా తీసిన సిసిల్ డి మెల్లో వ్యాఖ్యానంతో, 1966 లో మళ్ళి విడుదలైనప్పుటి ట్రైలర్, రీ మాస్టర్ తరువాత 1989 లో వడుదలైనప్పటి ట్రైలర్. చివరి రెండూ తూ తూ మంత్రంగా వచ్చిన ట్రైలర్లే కాని, మొదటి ట్రైలర్లో విశేషం ఉన్నది. ఆ ట్రైలర్ 9 నిమిషాలకి పైగా ఉన్నది, సిసిల్ డి మెల్లో అనేక విషయలు చెబుతారు. చూడండి ఆ మొదటి ట్రైలర్ ఈ కింది ప్లెయర్లో.




సినిమా ట్రైలర్ కదా, కాపీ రైట్ సమస్య ఉండదని ఇక్కడా ప్రచురిస్తున్నాను. దీనివల్ల సినిమాకి ప్రచారమే కాని నష్టం ఉండదని నా భావన.


ఈ విధంగా తెలుగులో, ఏ సినిమాకన్నా దర్శకుడు వివరిస్తూ ట్రైలర్ ఉన్న సినిమా ఉన్నదా అన్న విషయం సినీ పండితులు చెప్పగలరు.





4 కామెంట్‌లు:

  1. శివరామప్రసాద్ గారు,శుభోదయం.ఆనాటి టెన్క్మామ్డ్మెంట్స ట్రయలర్ చూపించారు. ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలన్నీ విశ్రాంతి తరువాతే మొదలయ్యేవి.
    మా చిన్నతనంలో ఆదివారం ఉదయం ఆటలుగా వేసే వారు. మా నాన్నగారు తప్పక నన్నుతీసుకునువేళ్ళేవారు. కార్టూన్ సినిమాలకోసం ఇష్టంగా
    వేళ్ళేవాడిని. ఒక్కోసారి చూపించేవాళ్ళు కాదు. చాలా నిరాశ కలిగేది. అంతేకాదు. ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలకు గమ్మత్తుగా తెలుగు పేర్లు పెట్టే వాళ్ళు.
    ఒక పేరు మాత్రం గుర్తుంది. "లంగా చేసిన గమ్మత్తు". అసలు ఒరిజినల్ సినిమా పేరు గుర్తు రావడం లేదు. మార్లిన్ మన్రో సినిమా అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  2. @రాజేంద్ర
    ధన్యవాదాలు.

    అప్పారావుగారూ,
    అవ్వొక రోజులు. నడుచుకుంటూ లీలా మహల్ కో నవరంగ్ కో వెళ్లి సినిమా చూడటం, ఆ ట్రైలర్లు చూసి వాటికోసం ఎదురు చూడటం బాగుండేది. ఇప్పుడు ఆ ఆనందం రమ్మన్నా రాదు. ఏ సినిమా కావాలంటే అది తెచ్చుకుని చూడగలం, కాని ఆనందాన్ని తెచ్చుకోలెం. దురదృష్ట వశాన ఇదే పెద్దవటం కాబోలు.

    మీరు అన్నట్టు ఆంగ్ల సినిమాలకు ఘోరమైఅన తెలుగు తర్జుమాలు ఉండేవి. For whom bell tolls సినిమాకి అనుకుంటాను, ఘంటారావం అనే అతకని పేరూ, "Our Man in Istanbul" "ఇస్తాంబుల్ లో దొరకని పత్తేదారు" అని ఇలా తలా తోకా లేని పేర్లు, ఇప్పట్లో కొంతమంది ఆంగ్ల పదాలను యదాతథ అనువాదం చేస్తున్నట్టుగా ఎబ్బెట్టుగానే ఉండేవి. కాని, అందులోని హాస్యం నవ్వు తెప్పించేది.

    మీరు చెప్పిన సినిమా Seven Year Itch అయ్యి ఉండవచ్చు, ఎందుకు అంటే మార్లిన్ మన్రో ప్రసిద్ది చెందిన బొమ్మ గాలికి ఎగురుతున్న గౌన్ ఆ సినిమాలోదే.

    రిప్లయితొలగించండి
  3. I was also like you, atleast 3 english movies a week either in Urvasi, Menaka, Navarang or Leelamahal.

    I have seen some telugu movie trailers for movies of Krishna

    Gopal

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.