2, అక్టోబర్ 2011, ఆదివారం

ఎన్నేళ్ళు వచ్చి ఏమి లాభం?



సామాన్యంగా లోకంలో ఏ వ్యక్తి ఐనా వయస్సు వస్తున్న కొద్ది, ఆ వయస్సుకు సరితూగే పరిణితి లేనప్పుడు, "ఏన్నేళ్ళు వచ్చి ఏమి లాభం" అని ఎద్దేవా  చెయ్యటం సహజం. కారణం, వయస్సుతో బాటుగా, లోకం చూసిన జ్ఞానం, స్వంత అనుభవాలు కలగలిపి, ఒక వ్యక్తి ప్రవర్తనలో, ఇతరులతో వ్యవహరించే తీరులో ఎంతో పరిణితి, పెద్దమనిషి తరహా వగైరా వస్తాయి. అలా రానివాడు, సమాజంలో తగిన గౌరవం పొందలేడుకదా, పైగా నవ్వుల పాలవ్వటం ఖాయం.


తెలుగు సినిమా ఎనభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయం తరచి చూస్తె బాగుంటుంది అని వ్రాసిన వ్యాసం ఇది. మన తెలుగు సినిమాలు పరిణితి చెందినాయా, కళాత్మక విలువలలో దిగజారిపోయినాయా వంటి విషయాలను ఈ సందర్భంగా బేరీజు వేసుకు చూడవలసిన సమయం అని నాకు అనిపిస్తున్నది.


 తెలుగు సినిమా కథా సరళి:
తెలుగు సినిమా పుట్టుకకు వెళ్ళి చూస్తే,  చాలా కాలం పురాణ కథల మీదనే బతికింది తెలుగు సినిమా. దీనికి కారణం ఆ మొదటి రోజుల్లో రంగస్థలమే సినిమా కళకు దిక్సూచి. అప్పట్లో సాంఘిక నాటకాలు దాదాపు లేవనే చెప్పాలి. రంగ స్థలం నుంచి సినిమాకు కూడ పురాణ కథలే ఎక్కువగా వచ్చినాయి. పురాణ కథలు సినిమాలుగా దాదాపు 1980ల వరకూ మంచి మార్కెట్టు కలిగి ఉండి ఎన్నెన్నో సినిమాలు తీశారు. వాటిల్లో కొన్ని పురాణ కథలే కాదు, చివరికి పుక్కిటి పురాణ కథలు కూడా కాదు, సినీ రచయితల సృష్టి. రెండు పురాణ పాత్రల మధ్య యుధ్ధం అనేది తెలుగు సినిమాకు వారి దృష్టిలో ప్రజాకర్షణమైన విషయం. అందుకనే రామాంజనేయ యుధ్ధం, భీమాంజనేయ యుధ్ధం, కృష్ణార్జున యుధ్ధం వగైరా వగైరా యుధ్ధాల పేరిట అనేకానేక సినిమాలు "సృష్టి" చెయ్యబడినాయి. ఆ తరువాత పతివ్రతలు/భక్తురాళ్ళ కథలు, సతీ అనసూయ, అరుధంతి, సక్కుబాయి, తులసి మొదలైనవి కూడా పురాణ  కథలతో పాటుగా వచ్చినాయి. రామాయణం, భారతం, భాగవతాల్లోనించి అనేక కథలను సినిమాకి అనుగుణంగా మార్చి సినిమాలు తెగ తీశారు. చివరకి, పురాణాల్లో ఉన్న దుష్ట పాత్రలను(కీచకుడు, కర్ణుడు, రావణాసురుడు వగైరా ) ఆ పాత్ర ధరించిన నటుడి ఊహా కీర్తిని అనుసరించి వాళ్ళను మంచి వాళ్ళుగానూ హీరోలుగానూ చూపించే ప్రయత్నంకూడ  చేసి పురాణాలను వక్రీకరించే ప్రయత్నమూ జరిగింది.


ఈ విషయాలు చెప్పుకునేప్పుడు ఒక్క సారి ప్రముఖ రచయిత భమిడిపాటి కామేశ్వర రావుగారు,  1940 ప్రాతాంల్లో అప్పుడప్పుడే ప్రాచుర్యం పొందుతున్న సినిమా  కళా రూపం గురించి వ్రాసిన నాలుగు మాటలు పున:రుశ్చరణ చేసుకోవటం తప్పని సరి.


".....సరి మరి కథ. అది పురాణం అవాలి. లేకపోతే అంధ(అచ్చు తప్పేమో ఆంధ్ర బదులు అంధ అని ఉన్నదనుకోవటానికి వీలులేదు. రచయిత ఉద్దేశ్యం "అంధ" అంటే "గుడ్డి" అని) జనానికి గణ్యత ఉండదు. అంధ జనం నూటికి తొంభై. వాళ్ళంతా హాజరైనప్పుడుగాని టాకీ వర్తకం కిట్టదు. వాళ్ళకి భక్తి కుదిరేందుకు దేవుళ్ళూ, భయం వేసేందుకు అడివి మృగాలూ, హుషార్ కలిగేందుకు సుందరులూ వాళ్ళ స్నానాలూ, ఆటలకి గంభీరమైన శీర్షికలూ-సర్వంగిలాబా చెయ్యడంకోసం కైంయిమంటూ మంచి పీకవాళ్ళు పాటలూ! దాంతోటి జన బాహుళ్యం మొదట తమాషాకోసమున్నూ తరువాత తోచకానూ ఎగపడడం. 'వార ప్రతిష్ఠతో' డబ్బురావడం, డబ్బొచ్చిన టాకీ గనక గొప్పదని చెప్పడం! అందువల్ల అందులో యంత్రిపబడ్డ నటులు అసమానంగా అభినయించారనిన్నీ, వాళ్ళ కీర్తి మిన్ను ముట్టడం రూఢీ గనకనే వాళ్ళని 'తార' లు అంటున్నారనిన్నీ చెప్పుగోడం"


ఎన్ని రోజులు ఆడితే అంత గొప్ప సినిమా అన్న అసమంజసపు వాదన ఇవ్వాళ్టికీ మనం వింటూనే ఉన్నాం. 


ఇక పురాణ కథలు వట్టిపోయినాక, సాంఘికాల మీద పడ్డారు మనవాళ్ళు. సాంఘిక కథనాల్లో కూడ అప్పుడున్న సామాజిక పరిస్థితులనుబట్టి, జమీందార్లు, వాళ్ళ సంతానం, జమీందార్లు వాళ్ళ జమీ లో ఉన్న ప్రజల మధ్య సంఘర్షణ వంటివి సినిమాకు నేపధ్యంగా చాలా వాటిల్లో వాడుకుని మూస ప్రేమ కథలు తీశారు. మెల్లిగా జమీలు పోంగానే, పారిశ్రామిక వేత్తలు ఆ స్థానాన్ని ఆక్రమించారు. ఇలా పడుతూ లేస్తూ తెలుగు సినిమా మూస కథల్లోనే ఇరుక్కుని 1970ల వరకూ దేకుతూ వచ్చింది. సినిమాల రాశి లోనే ప్రాముఖ్యం సంపాయించుకున్నది కాని, తెలుగు సినిమా వాశిలో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది.


1950ల నుండి 1970ల వరకూ మరొక మూస కథా వస్తువు జానపద కథలు, మంత్రాలు, మాత్రికులు. ఈ మూస మీద దాదాపు ఒక జనరేషన్ సినిమా నటులు బతికేశారు. కథల్లో పెద్ద మార్పేమీ లేకుండా హీరో పేదవాడైతే, రాజకుమారినే వలచి తీరుతాడు, రాజ కుమారుడు హీరో ఐతే, మంత్రో, సేనాధిపతో (ఒక్కోసారి వీళ్ళు హీరోకి దగ్గిర బంధువు బాబాయో, మేనమామో అయ్యి ఉంటాడు) కుట్రతో మహారాజుగారిని హతమార్చో జైల్లో  పారేసో రాజ్యం అపహరిస్తే, రాకుమారుడు ఎవరో నమ్మిన బంటు ద్వారా అరణ్యాల పాలవ్వటం, ఆ తరువాత పెద్దయ్యి రాజ్యాన్ని తిరిగి సంపాయించటం. కొండకచో ఆ దుర్మార్గ మంత్రి లేదా సేనాధిపతి కూతుర్ని ప్రేమించటం లేదా ఆ అడవిలో ఉన్న ఒక అడివి తెగ నాయకుడి కూతుర్ని (సామాన్య ఆదివాసి కూతురు జోలికి మన హీరోలు వెళ్ళిన దాఖలాలు తక్కువ). నాయిక అవ్వటం వంటివి చాలా పేలవమైన కథాంశాలు. ఆదివాసీల జీవన సరళిని స్టీరియో టైపు చేసేసి ఒకే రకపు మేకప్, ఒకే రకపు దేవతా పూజ వంటివి చూపించేసి, తెలుగు ప్రేక్షకులకు అసలు ఆడవుల్లో ఉండే రకరకాల తెగల ప్రజల జీవన విధానం మీద ఒక తప్పుడు భావన కలిగించారు ఈ సినీ దర్శకులు. 


జానపదాల కథలు జరుగుతుండగానే, దాదాపు అవే కథలను సాంఘికాలుగా అంటే మహారాజు పాత్రను ఒక పెద్ద జమీందారుగా లేదా పారిశ్రామిక వేత్తగా, విలన్ పాత్రను ఆయన దగ్గర దివాను లేదా మానేజరుగా మార్చి కథలను యధాతధంగా తీశారు. ఈ సినిమాల్లో హీరో సామాన్యంగా వామపక్ష సిధ్ధాంతాలను లీలగా వల్లిస్తూ ఉంటాడు. కారణం అప్పుడప్పుడే కమ్యూనిస్టులు తెలుగు ప్రాంతాల్లో కనిపించటం మొదలు పెట్టారు. ఆ హీరో కూడ నేల క్లాసు వాళ్ళు ఎంతవరకూ ఈ  వామపక్షపు "పడికట్టు మాటలు"  వాడితే  ఈలలు వేస్తారో అంతవరకే వాడుతూ/చూపిస్తూ జాగ్రత్తపడి తమ సినిమాకు డబ్బు పెట్టుబడి పెట్టే వాళ్ళు తమకు దూరం కాకుండానూ , మధ్యస్థంగా ఉండి తగు జాగ్రత్త పడ్డారు.  పూర్తి వామపక్ష పంథా సినిమాలు 1980లలో కొంత కాలం మాదాల రంగారావు ప్రయత్నించి కొంత పాటుపడ్డాడు , కాని పెద్ద విజయం సాధించలేక పొయ్యాడు . తరువాత్తరువాత,  1990లలో వచ్చిన నారాయణ మూర్తే ఈ తరహా సినిమాలను బాగా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చి, వామ పక్ష సినిమాలకు ఒక ఒరవడి, తనకంటూ ఒక ప్రేక్షక ఆదరణను సంపాయించుకున్నాడు .ఆ సినిమాల్లో వాళ్ళు చెప్పే విషయం మీద ఆసక్తి లేనివారికి కూడా తన హావ భావాలతో నారాయణ మూర్తి మంచి వినోదం  అందించటం మాత్రం జరిగింది.


చాలా విచిత్రంగా, తెలుగులో చారిత్రక సినిమాలు అతి కొద్ది. పల్నాటి యుధ్ధం, బొబ్బిలి యుధ్ధం మినహాయించి పెద్దగా చారిత్రక సినిమాలు తీయలేదు. ఇటీవలి చరిత్రను చూపిస్తూ అల్లూరి సీతారామరాజు, ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు వంటి సినిమాలు వచ్చినాయి . ఆ తరువాత చారిత్రిక విషయాల మీద సినిమాలు లేవు. కారణం ప్రేక్షకులు ఆదరించరేమో అన్న భయం, ఆ పైన చారిత్రిక సినిమాలు తీస్తే సినీ ఫార్ములా మసాళాలు వెయ్యటానికి అవకాశం బహు కొద్ది. పైగా సినిమాలో చరిత్ర ప్రకారంగా చిన్న మార్పు చేసినా, లేదా ఒక చారితాత్మక పాత్ర మలిచే పంధాలో ఏ కొద్ది పొరబాటు చేసినా అనేక అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉన్నది. అందుకని, మనకెందుకు వచ్చిన గోల, అని ఊరుకున్నారు. 


రుద్రమ దేవి, శాతవాహన రాజులు గురించి, సినిమాలు ఇప్పటికీ రాలేదు. కృష్ణ దేవరాయలు పాత్రను ఒకటి రెండు సినిమాల్లో వాడుకుని వదిలేశారు కాని, నిజమైన రాయల చరిత్ర సినిమాగా తియ్యలేకపొయ్యారు. మన గురజాడ, వీరేశలింగం, విశ్వనాథ, చలం గురించిన సినిమాలు, ఆ రచయితలూ వ్రాసిన చక్కటి రచనలను వీళ్ళు సినిమాలుగా తీస్తారనుకోవటం ఎండ మావిలో నీళ్ళకోసం పరిగెట్టటం వంటిదే. అలాగే కొడవటి గంటి వారి "సీతప్ప" పాత్రను పొట్టి ప్రసాద్ బతికి ఉండగా సినిమా తీయగలిగి,  అలనాటి అంటే 1940-50 నేపధ్యాన్ని సినిమాలోకి తీసుకు రాగలిగి ఉంటే ఒక మంచి సినిమా వచ్చి ఉండేది.  హాస్యంతో బాటుగా ఒక మనిషి పిరికితనంతో ఎంతవరకూ సద్దుకు పోయి వంగి వంగి బతకకలడో చూపిస్తూ,  మనిషన్నవాడు ఎలా బతుక కూడదో సమాజానికి తెలియచేసిన  వాళ్లయ్యి ఉండేవారు, ఈ సినిమా వారు.  కాని, ఈ సినిమా వారికి అటువంటి అభిరుచీ లేదు ,  ప్రేక్షకులకి అటువంటి ప్రాప్తమూ  లేదు, ఏమి చేస్తాం.


1980లు వచ్చేప్పటికి శంకరాభరణం ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యిందనే చెప్పక తప్పదు. తెలుగు సినిమాకు ఒక కొత్త మూస దొరికింది. అది పట్టుకుని తిరగేసి బోర్లేసి ప్రేక్షకులకు విసిగెత్తేవరకూ అనేక సినిమాలు వచ్చినాయి. 1980లలో ఒక మంచి పరిణామాన్ని  మనం గమనించవచ్చు. పూర్తి హాస్య సినిమాలకు అప్పుడే అంకురార్పణం జరిగింది. ఈ పరిణామం చాలా శుభప్రదమైనది. అప్పటికే మూస కథలు, ఫార్ములా హీరోలతో విసుగెత్తిన ప్రెక్షకులకు పన్నీటి జల్లులాగ అనిపించినాయి. సినిమాలో నటులు ఎవరు అన్న దానిమీద కాకుండా, దర్శకుడు ఎవరు అని సినిమాలు చూడటం మొదలు పెట్టారు. జంధ్యాల, ముత్యాల సుబ్బయ్య, యి వి వి వంటి దర్శకులు తమకంటూ ఒక మార్కెట్ సృష్టించుకోగాలిగారు. రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్ వంటి వారు హీరోలుగా వెలుగొందారు. ఇది చూసి పెద్ద హీరోలుగా చెలామణి అయ్యే వాళ్ళు కూడా హాస్యం చెయ్యబోయి అపహాస్యం పాలయ్యారు. కాని వీళ్ళల్లో వెంకటేష్ హాస్యం పండించటంలో విజయం సాధించ గలిగాడు. 


రాముడు  అనే మాటను పేరులో ఉంచి అనేక సినిమాలు తీసిన  తెలుగు సినీ పరిశ్రమ, అదే పేరు వాడుకుని రెండు సినిమాలు తియ్యలేదు అవే  "వెర్రి రాముడు", "కీర్తి శేషుడు రాముడు".  ఆ రాముడు,  ఈ రాముడు అంటూ అనేక వెర్రి సినిమాల్లో  నటించిన  ఒక వయసు మళ్ళిన హీరో   నవ్వులపాలయ్యాడు, ఆ సినిమాలు రెండో విడుదలకు దశాబ్దాల తరువాత కూడ నోచుకోలేదు, ఆ అవకాశం కూడ ఉన్నట్టు లేదు. అదే నటుడు తన సినీ జీవనపు రెండో భాగంలో అంటే 1975 తరువాత నటించిన కొన్ని కొన్ని సినిమాలలోని (వారి దృష్టిలో "మెగా  హిట్"లు) హీరోయిన్ ను అటూ ఇటూ తంతూ, తోస్తూ,పడేస్తూ తనదైన  శైలిలో స్టెప్పులు వేసిన పాటలను , ఆడియో పూర్తిగా తీసిపారేసి  చూస్తూ, లారెల్ అండ్ హార్డీ సినిమాలు చూస్తున్నప్పుడు కన్నా పడీ పడీ నవ్వేవాళ్ళు ఉన్నారు, అందులో నేను ఒకణ్ణి . సాంకేతిక పరిజ్ఞానం, మనకు కొత్త వినోదం అదించగలగటం   ముదావహం. ఒక్క సారి ట్రై చేసి చూస్తే, అందులో ఉండే మజా తెలుస్తుంది.


మన తెలుగు సినిమాల్లో కొన్ని మంచి లక్షణాలు లేకపోలేదు. కాని అవి బహు స్వల్పం. సినిమాలు తియ్యాలని ఉబలాటపడి వచ్చేవాళ్ళల్లొ సినిమాల మీద అవగాహన ఏ మాత్రమూ లేక , తాము చేస్తున్న వ్యాపారాల్లో కంటే సినిమాల్లో ఐతే బాగా డబ్బులు సంపాయించుకోవచ్చు అన్న ముఖ్య ధ్యేయంతో  మాత్రమె రావటం  దురదృష్టకరం. కళలు ఏ రూపాన ఉన్నా, ఆ కళా రూపం యెక్క ముఖ్య ధ్యేయం డబ్బు సంపాదన మాత్రమె ఐనప్పుడు, ఆ కళా రూపం కళ తప్పుతుంది.అదే జరిగింది మన సినిమాకి. 


ఈ ఎనిమిది దశాబ్దాల తెలుగు సినిమాలో కాల క్రమేణా అనేక అవలక్షణాలు వచ్చిపడినాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని.


అభిమాన సంఘాలు-వాటి వెర్రిపోకడలు: ఏ కళా రూపానికైనా అభిమానులు ఉండటం అనేది ఆశ్చర్య పోవలసిన విషయమేమీ కాదు. కాని ఆ అబిమానం ఆ కళ మీదే కాని, ఆ కళను పోషిస్తున్న వ్యక్తి మీదకు మళ్ళి, అతను చేసేదే కళ అన్న పిడివాదానికి వచ్చేసింది మన తెలుగు సినిమా అభిమాన సంఘాల తీరు. పేడ సుద్దలు విసరటం దగ్గిరనుంచి మొదలెట్టి, నిలువెత్తు కట్ ఔట్లు పెట్టి దేవుణ్ణి కూడా  పూజించనంత  పూజించే    అధమ స్థాయికి వెళ్ళిపోయి, ఇది అభిమానం  కాదు  "పిచ్చి" అని నిర్ధారణకు వచ్చేట్టు చేసింది.

ఇదెంతవరకూ నిజమో కాని, తమ అభిమాన నటుడి సినిమాలకు అసలు ప్రేక్షకులు ఆదరించకపోయినా, తామే అన్ని ఆటల టిక్కెట్లూ కొనేసి, వందరోజుల వరకూ దేకించిన సందర్భాలు ఉన్నాయట. ఇదే నిజమైతే, ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఏ సినీ పరిశ్రమకూ పట్టకూడదు. చివరకు ఈ అభిమాన సంఘాలు ఎంతవరకూ వెళ్ళినాయి అంటె, ఒక్కొక్క హీరో పాత్రను శాసించే స్థాయికి వెళ్ళి సినిమా  కథల్లో ఉండాల్సిన సృజనాత్మకత మాయమై పోయి, సినిమా కథలో పాత్ర బదులు, ఆ హీరోనే దర్శనం ఇవ్వటం మొదలవ్వటమే కాకుండా, ఇంకా కొనసాగుతూ ఉండటం, తెలుగు సినిమా దురదృష్టం.
విషయం మీద ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ "బాబు" వేసిన ఒక చక్కటి కార్టూన్.



సమీక్షా తత్వాన్ని ఆదరించకపోవటం: తెలుగు సినిమా వారు,సినీ సమీక్షకులను తమలో ఒకరిగా గుర్తించకపోవటం, పైగా వాళ్ళను శతృవులుగా పరిగణించటం, తెలుగు సినిమా దౌర్భాగ్యం. తమకు నచ్చని సమీక్షలు వ్రాసిన పత్రికలకు తమ సినీ ప్రకటనలే కాక, తమకున్న ఇతర పరిశ్రమలు/వ్యాపారాల ప్రకటనలు కూడ బందు చేసిన దురాచారం అలనాటి నుండి వస్తున్నదే. ఆపైన, మనకు పత్రికలు కూడా ఈ సినీ సమీక్షల మీద తగిన శ్రధ్ధ చూపలేదు. కారణం, ఇక్కడ కూడా వ్యాపార పరమైనదే. ఒక హీరో సినిమా గురించి నిజమైన సమీక్ష వ్రాస్తే, అతని అభిమానులు తమ పత్రికను కొనరేమో అన్న బెంగే దీనికి కారణం. అయినా, పత్రికలు తలా ఒక రాజకీయ పార్టీ గొడుగు పట్టేసిన ఈ రోజున, సినిమా వంటి అల్పమైన విషయంలో నిస్పక్షపాతంగా ఉండాలని అనుకోవటం దురాశే అవుతుంది. కొన్నాళ్ళు "విజయ" అనే పత్రిక వచ్చేది. అందులో కొద్దో గొప్పో సినీ సమీక్షలు బాగుండేవి, కొంత కాలం గుడిపూడి శ్రీహరి గారనుకుంటాను, మంచి సమీక్షలే వ్రాశారు. కాని ఈ రోజున, మనకు పత్రికల్లో సవ్యమైన సమీక్షలు అందించేవే లేవు. అసలు పత్రికలే ఒకటి రెండే అయినాయి. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమంటే, కళారూపానికి గీటురాయి సద్విమర్శ, ఆ సద్విమర్శను, సవ్యంగా తీసుకుని తమ కళకు పదును పెట్టుకోవాల్సిన సినీ పరిశ్రమ, డబ్బులిచ్చి "బాగుంది" అనే సమీక్షలు వ్రాయించుకోవటం వంటి అనాగరిక చర్యలకు పూనుకుని, తామున్న కొమ్మను తామే నరుక్కున్నారు.


వడ్డాది పాపయ్య గారు దీపావళి "యువ" లో 
దశాబ్దాల క్రితం వేసిన  కార్టూన్
స్టెప్పుల గోల: ఆయనెవరో ఒక పెద్ద నటుడుట, ఈ స్టెప్పుల్ని కనిపెట్టాడుట, అదేదో వినోదానికి, వెరైటీగా ఉంటుందని, మొదలుపెడితే చాలా వెర్రి తలలు వేసింది అని ఆ నటుడు గారే దు:ఖించారు అని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఈ "స్టెప్పులు" గా చెలామణీ అయ్యే శారీరక కదలికలు కొత్తల్లో చాలా మృదువుగా ఉండి, సామాన్యంగా పాటలో ఉండే శ్రావ్యతతో బాటుగా దృశ్య పరంగా కూడా ఆ పాటను ఆనందించే అవకాశం ఎక్కువ చేసే ఒక "ట్రిక్" గా ఉండేది. కొన్ని కొన్ని పాటల్లో ఈ స్టెప్పులు బాగుండేవి కూడానూ. కాని రాను రాను, పాటల్లో పస తగ్గిపోయి, ఈ "స్టెప్పుల" వెర్రి ముదిరిపోయి, ప్రస్తత వికార రూపానికి వచ్చేసింది. వీటికి తోడు "మూక" పాటలు. అప్పటిదాకా మామూలు మనుషుల్లాగానే మాట్లాడుకున్న నాయకా నాయికలు, ఒక విచిత్రమైన ముఖ కవళికలు పెడతారు (అంటే పాట వస్తోంది అన్న హెచ్చరిక చేస్తారు) ఇక గుభీ గుభీ మంటూ శబ్దం మొదలు, హీరో వెనుక ఒక ఇరవై మంది, హీరోయిన్ వెనుక మరొక ఇరవై మంది, ఎవరో అదృశ్య మిలిటరీ సార్జెంటు డ్రిల్లు చేయిస్తున్నట్టుగా సొలుపుగా నిలబడటం, చేతులు అల్లల్లాడించటం, నడ్డి మామూలు మానవమాత్రులకు అసాధ్యమైన రీతిలో ఊపటం లాంటి విపరీతపు పనులు చేస్తూనే, ఆ హీరో - హీరోయిన్ ల వెంట పడుతూ వాళ్ళ ఏమిటో ఊహూ వెనక్కి లాగుతూ ఉంటారు. సామాన్యంగా ఇలాంటి మూక పాటల్లో సాహిత్యం సగటు ప్రేక్షకుడికి అర్ధం కాదు. ఎవరన్నా పాత రోజుల్లోలాగ హాల్లో ఒక బల్లేసుకు నిలబడి, మైకెట్టుకుని చెప్పాల్సిందే. ఈ మూక పాటలు ఏ దశకు చేరాయంటే, ఒక హీరో వెనుక ఏభై మంది మూక ఉంటే, మరొక హీరోకి అంతకు తక్కువ కాకుండా ఒక మంద ఎగురుతూ ఉండాల్సిందే . లేకపోతె ఆ హీరో అభిమానులు ఊరుకోరు. తమ అభిమాన హీరో వెనుక ఉండే మూక ఆవతలి హీరో వెనుక ఎగిరే వారికంటే  ఎక్కువ మందైతే, ఈ అభిమానులు ఆ మూకను లేక్కేసుకుని  హాయిగా ఉంటారు"ట". ఇదెక్కడి అభిమానమో గాని, చివరికి సినిమాల అధోగతికే కారణం అయ్యింది.


మూస నటన: తెలుగులో మిమిక్రీ కళ దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు (ఇప్పుడు ఈ కళా రూపం అంత ప్రాచుర్యంలో ఉన్నట్టుగా లేదు) విజయవంతంగా నడిచింది. దీనికి కారణం, ఆ రెండు మూడు దశాబ్దాల్లోనూ ఉన్న నటుల మూస నటనే కారణం. అదే డైలాగ్ డెలివరీ, చేసేది ఏ పాత్ర అయినా సరే, అదే మానరిజం, , వేలు చూపటం, ఒక పక్కకి ఒరగటం, ఒక చేత్తొ తన మెడే పట్టుకోవటం, స్టెప్పులు చేతకాకపోయినా, విపరీతపు పోకడలతో వంటి కాలి మీద గెంతటం, ఏ డైలాగు అయినా సరే ఎదుటివారిని నిలదీస్తున్నట్టుగా పొగరుగా ఖాండ్రిస్తూ  చెప్పటం వంటి విశేషాలు, మిమిక్రీ ఆర్టిస్టుల పట్ల వర ప్రసాదాలు అయ్యి, ప్రేక్షకులకు ఈ మిమిక్రీ ద్వారా మంచి హాస్యం అందింది. ఇటువంటి మూస నటన, నటుల నటనకు ఎంత మాత్రం దోహదపడలేదు. ఒక సినిమాలో అబ్బో బాగా చేశాడు అనుకునేసరికి, మరొక ఇరవై సినిమాల్లో అట్లాగే చెయ్యటం, అలా చెయ్యకపోతే, ప్రేక్షకులు చూడరని ఒక అపోహలో బతికెయ్యటం, వారి నటనా చాతుర్యపు పెరుగుదలను మేకు కొట్టి ఆపేసినాయి. ఇప్పటి నటుల్లో కూడా అలాంటి మూస పధ్ధతి నటన కనపడుతూనే ఉండటం, సినీ నటులు ఈ మూస దాటలేక పోతున్నరని చెబుతున్నది. 


డాంబికపు  బిరుదులు : 1960 లు వచ్చేప్పటికి సినిమా పరిశ్రమ దాదాపుగా ఇద్దరి మధ్యే నడిచింది అనే కన్నా నలిగిపోయింది అనవచ్చు. వీళ్ళిద్దరికీ కొద్దిగా వయసు మళ్ళుతున్నది  అనిపిస్తూ ఉండగా   మరొక ఇద్దరు వచ్చి చేరారు. వీళ్ళందరికీ విపరీతపు పోకడలతో అభిమాన సంఘాలు, వాళ్ళు చేసే అల్లరి ఎక్కువయ్యింది. వీటికి తోడూ ఒక్కోక్కళ్ళకి డాంబికపు  బిరుదులు. ఈ విచిత్ర పదజాలంతో ఉన్న బిరుదులు వీళ్ళకి ఎవరన్నా ఇచ్చారో, వాళ్లకి వాళ్ళే తోడిగేసుకున్నారో తెలియదు కాని, ఇప్పుడు ఆ బిరుదుల లోని పదజాలం వింటూ వాళ్ళ నటన గుర్తుకు వస్తే  నవ్వు రావటం తప్ప మరే భావమూ కలగటం లేదు. 


అప్పట్లో ఒక సంఘటన చెబుతారు. ప్రసిద్ది చెందిన ఒక హిందీ నటుడు, మన తెలుగు ప్రాతం లో జరుగుతున్నా ఏదో ఒక ఫంక్షన్ కి వచ్చి, ఇక్కడి హీరోల బిరుదులు విని, బెదిరిపోయి, వీళ్ళు అఖిలాండకోటి బ్రహాండకోటి మొత్తానికి రకరకాల ఆధిపత్యం వహిస్తూ ఉంటే, హాలీవుడ్ లో ఉన్న నటులు, బాలీవుడ్ లో ఉన్న నటుల మాటేమిటి అని వాపోయ్యాడుట. అయ్యో ఫలానా ఆయన ఇలా అని బాధపడ్డాట అనుకోవటమే కాని, ఈ డాంబికపు బిరుదుల ఔన్నత్యాన్ని ఎవ్వరూ ప్రశ్నించిన  పాపాన పోలేదు. 



పాపం ఈ బిరుదుల గోల 1980 - 1990 లలో వచ్చిన హీరోలకు కూడా తప్పలేదు. వీళ్ళూ ఏవో కొన్ని పదజాలాలు తమ పేర్ల ముందో, తరువాతో తగిలించుకుని, మేమేమన్నా తక్కువ తిన్నామా అని ఊరుకున్నారు. ఆ తరువాతి తరం అంటే 2000 లో మొదటి దశాబ్దం దాటినా,ఆ పది సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు ఏమన్నా బిరుదులు "సంపాయించారా" అన్న విషయం మీద ఇదమిద్ధంగా తేలటం లేదు. 



పాటలు: సినిమాల్లో పాటలు అసలు ఎందుకు ఉండాలి అంటే నాటకాల్లో పద్యాలు ఉండేవి కాబట్టి అనే సమాధానం వస్తుంది. సినిమాల్లోకి వచ్చిన వాళ్ళకి, సినిమా వల్ల సంఖ్యాపరంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన ప్రేక్షకులకీ, పద్యాలు అంతగా వంటికి పడవు కనుక, పాటలే ఎక్కువగా వాడుకలోకి వచ్చాయని ఒక వాదన. ఏది ఏమైనా, సినిమాలో పాట అనేది, కథా పరంగా ఉన్న అతి కొద్ది రోజులు పోయి, చివరికి ఈనాడు. సినిమా విడుదలకు ముందు ఆడియో విడుదల అనే ఒక లాంచనానికి బలైపోయింది. ప్రతి వాడూ మా ఆడియో అద్భుతం అనేవాడే. అలా అన్నవాణ్ణి దబుక్కున వడేసి పట్టుకుని, ఏరా నీ సినిమాలో ఉన్న పాటకు అర్ధం ఏమిటిరా అంటే, గుడ్లు మిటకరిస్తాడు కాని చెప్పలేడు. అర్ధం అంటూ ఉంటే కదా చెహ్ప్పటానికి. అలా అని అన్ని పాటలూ అలా ఉన్నాయని కాదు. సామాన్యంగా 90 శాతం పాటలు అదే కోవకు చెందినవి. వీటికి తోడు డబ్బింగ్ సినిమాలకు తెలుగులో పాటలు ఆ తమిళ సినిమా పెదవుల కదలికకు సరిపొయ్యే పదాలను పెడుతూ వ్రాసే అలవాటులో పడ్డాక, సాహిత్య పరంగా మంచి పాటలు మృగ్యం అయిపోయి, ఎప్పుడో ఒకటో అరో అలా మెరిసి పోతూ ఉంటాయి. 1970 లలో చాలా సార్లు పాట వస్తే చాలు కొంతమంది దబుక్కున లేచి బయటకు వెళ్ళిపోయి, పాట అయిపోయినాక (కొండకచో, సిగిరెట్ కంపు కొట్టుకుంటూ) తిరిగి వచ్చే వాళ్ళు. అప్పటి పాటలకే వాళ్ళు అంత హింస పడి ఉంటే, ఇప్పుడు వస్తున్న పాటలు చూడవలసి వస్తే ఏమైపోతారో కదా!


పోటీ సినిమాలు: అబ్బో!  ఆయన్ను పెట్టి ఫలానా కథతో సినిమా మొదలుపెడతారుట అనుకునేప్పటికి మరొకాయనకు సంబంధిచిన మనుషులకి అది వారి పరువుకు సంబంధించిన విషయం అయిపోయి, ఏమైనా సరే ఆవతలి హీరో సినిమా విడుదల సమయానికి, మనమూ మరొక సినిమా తియ్యాలి అన్న దుగ్ధ ఎక్కువైపోయి, సినిమాలో ఉండాల్సిన సృజనాత్మకత క్రమంగా నశించింది. ఇప్పుడిప్పుడే వస్తున్న కొద్దిమంది యువ దర్శకులు ఈ మూసల్ని పగలగొట్టుకుని మంచి సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక సంతోషించతగ్గ విషయం. కాని అలా వస్తున్న సినిమాల శాతం అతి కొద్ది.

బలవంతపు హాస్యం: సినిమాల్లో పాటల్లాగానే, హాస్యం అనేది కూడ ఉండవలసిన దినుసుల్లో ఒకటని ఒక మూఢాచారం.ఆ సినిమా ఎట్టిదైనా సరే, విషయం ఏమైనా సరే, హాస్యం అనేది ఉండి తీరాలి అనేప్పటికి, కథా పరంగా కాకుండా, కృత్రిమంగా మధ్యమధ్యలో వచ్చిపొయ్యే కామేడీ ట్రాక్‌ల గోల ఎక్కువై పోయింది. కొన్ని కొన్ని సార్లు, అసలు కథ కన్నా ఈ కామేడీ ట్రాకే ప్రేక్షకులకి ఎక్కువగా నచ్చి, వాటివల్లే సినిమా ఆడిన సందర్భాలు లేకపోలేదు. కాని హాస్యం అనేది కథలో సహజంగా ఉండాలి, అలా ఉంటెనే నప్పుతుంది. ఏదో మనం పెట్టే సినీ హింసకు ప్రతిఫలంగా, పాపం ప్రేక్షకుణ్ణి కనీసం నవ్వేట్టుగానైనా చేద్దాం అన్నట్టుగా అయిపోవటం శోచనీయం. 1970 లలో అలనాటి హాస్య నటులు అందరూ ఒక్కరొక్కరే దాటి పోవటంతో ఒకరిద్దరే ఈ హాస్యపు "బరువు" మోశారు. పాపం వాళ్ళు మటుకు ఎంతకాలమని చేస్తారు. ఒకాయన అకాల మరణం పొంది, రాజమండ్రిలో ఈ మధ్యనే విగ్రహ రూపం పొందాడు, మరొకాయన పూర్ణాయుష్కుడై, చివరి వరకూ నటిస్తూ, కాలవశాన పైలోకాలకి వెళ్ళిపొయ్యాడు. రాజ బాబు హాస్యమే చేశాడు, ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. కాని అల్లు రామలింగయ్య, హాస్య నటుడి నుంచి, విలన్, విలన్ పక్క మనిషిగా ప్రమోట్ అయ్యినా, ఆయన మీద హాస్యం రుద్దుతూనే ఉండి, ఆయనకు కూడా విసుగెత్తి  ఒకే రకమైన హాస్యాన్నే అభినయించేట్టుగా చేశారు, ఆయా దర్శకులూ, నిర్మాతలూ. ఇదంతా కూడా ప్రేక్షకులకి "ఇదే" నచ్చుతుంది అనే అపోహ వల్ల. ఈ అపోహలనుంచి సినీ పరిశ్రమ బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.


ఒక్కే ఆట సినిమాలు: చాలా కాలం రోజూ మూడు ఆటలు, పందుగలకు ఆదివారాల్లో నాలుగు ఆటలు అనేది ఒక మంచి ఆచారంగా ఉండేది. ఈ ఆచారం, 1970 ల వరకూ కొనసాగింది. మ్యాటినీ అంటే మధ్యాహ్నం దాదాపు మూడు గంటలకు మొదలయ్యేవి. అంతకు ముందు పండుగలకూ, ఆదివారాలకే పరిమితమైన నాలుగవ ఆట, పొద్దున్న తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర కు ఎగబాకి, ప్రతి రోజూ ఉండటం మొదలయ్యింది. పైగా ఈ పదకొండు గంటల ఆటకు, వేసిన సినిమా ప్రతి రోజూ ఒక్కటే ఆట. ఈ ఆటకు జనాదరణ బాగుండటంతో, చాలా భాగం డబ్బింగ్ సినిమాలు, ఇంకా పేరు తెచ్చుకోని నటుల సినిమాలు ఈ పదకొందు గంట ఆట పాలన పడేవి. వాటికీ డబ్బులు రావటం వల్ల, అవి కూడా  గొప్ప సినిమాలే  అన్న ఒక నమ్మకం ఏర్పడి, అదొక మూసగా కూడ తయారయ్యింది.

స్లాబ్ సిస్టం: చాలా కాలం, సినిమా హాల్లో ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోతే అన్ని టిక్కెట్ల వరకే వినోదపు పన్ను ఉండేది. దీనివల్ల హాలువాళ్ళు సేల్స్ టాక్స్ అధికార్లు అవినీతికి పాల్బడి, ప్రభుత్వానికి వెళ్ళవలసిన పన్ను, వాళ్ళె పంచుకునే వారు. అటువంటి అవినీతిని, కఠినమైన శిక్షలు వేసి ఆపవలసినది పోయి,  స్వతహాగా సినీ నటుడైన ఒక ముఖ్య మంత్రి గారు, "స్లాబ్ సిస్టం" మొదలు పెట్టారు. దీనివల్ల, సినిమా హాల్లోకి వచ్చిన ప్రేక్షకుల సంఖ్యకు సంబంధం లేకుండా, ఆయా హాళ్ళల్లో ఉన్న సీటింగ్ కెపాసిటీని బట్టి, హాలు నిండినా, ఒక్క టికెట్టు అమ్ముడవకపోయినా సరే, మొత్తం హాలు కెపాసిటీని అనుసరించి టాక్సు హాలు వాళ్ళు కట్టాల్సి వచ్చింది. దీనివల్ల వాళ్ళ రోజువారీ ఖర్చు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. పూర్వం, కరెంటు ఖర్చు, సిబ్బంది జీతం వస్తే చాలు సినిమా నడపగలిగే వారు. అలాంటిది, మొత్తం టాక్సు కట్టాలిసి వచ్చేప్పటికి, గిట్టుబాటు కాక, కలెక్షన్ కొద్దిగా తగ్గినా సరే, ఆ సినిమా ఎత్తేయటం మొదలు పెట్టారు. దీనివల్ల, ఏమైనా సరే హాలు నిండుగా కనీసం మూడు నాలుగు వారాలు ఆడేట్టుగా సినిమాలు తియ్యవలసిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామం, సినిమా తీసే పధ్ధతినే మార్చేసి, సినీ కళా రూపాన్ని, కళకు దూరంగా నెట్టేసి, పూర్తి నేల బారు సినిమాలు రావటం మొదలయ్యింది. ఇటువంటి దుర్మార్గపు టాక్స్ నిబంధనలు ఉన్నప్పుడు కూడ మంచి సినిమాలు తీసిన వాళ్ళు లేకపోలేదు. వాళ్ళకి సినీ పరిశ్రమ ఎప్పటికీ ఋణపడి ఉండాలి. కాని మొత్తం మీద స్లాబ్ పధ్ధతి , సినిమా పరిశ్రమకు చేసిన కీడు మరింకే పరిణామమూ చెయ్యలేదు.



ప్రేక్షకులను తక్కువగా అంచనా వెయ్యటం: మన దర్శక నిర్మాతలకు ప్రేక్షకులు అంటే చాల్ల తక్కువ అభిప్రాయం. వాళ్ళకు క్లిష్టమైన మలుపులు ఉన్న కథలు అర్ధం కావు అని ఒక నిర్ధిష్టమైన అభిప్రాయం. అందుకని, మన సాహిత్యంలో ఉన్న అనేక ఆణి ముత్యాలు సినిమాలుగా మలచబడలేదు. తమ కంటితో తెర మీద జరుగుతున్న చూస్తున్నా కూడా ప్రేక్షకులు అది అర్ధం చేసుకోలేరని ఒక అలోచన కూడా వాళ్ళకు ఉండటం వల్ల, అక్కడ జరుగుతున్నదే, ఒక పాత్ర చేత పలికిస్తారు. ఇటువంటి లేకి చేష్ట వల్ల సినిమా చూస్తుంటే ఉండాల్సిన ఆనందం, వినోదం తగ్గిపోయి, చాలా మంది సినిమాల వైపు చూడటం మానేశారు.


సినిమా హాళ్ళ కొరత ఎన్ని సినిమాలు తీసినా వాటిని చూపించటానికి సినిమా హాళ్ళు ఉండాలి. ఉన్నాయి, మనకు ఎవరికీ లేనన్ని సినిమా హాళ్ళు ఉన్నాయి. డజన్ల కొద్దీ సినిమా హాళ్ళు స్లాబ్ సిస్టం వల్ల ఫంక్షన్ హాళ్ళుగా రూపాంతరం చెందినా, ఇప్పటికీ మనకు అసంఖ్యాకమైన హాళ్ళు ఉన్నాయి. కాని ఆ సినిమా హాళ్ళన్నీ అతి కొద్ది మంది అధీనంలోనే ఉండి వాళ్ళు తీసే సినిమాలే చూపించవలసిన దుస్థితిలో పడిపోయాయట. దీనివల్ల ఎవరన్న కొత్త నిర్మాత సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, ఒక మంచి సినిమా తీసినా సరే, ఆ సినిమా విడుదల చేసుకోవటం గగనం అవుతున్నది. దీనివల్ల అభిరుచి ఉన్న కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు ధైర్యంగా సినీ పరిశ్రమకు వచ్చి, మంచి చిత్రాలు అందించే అవకాశం పోతున్నది.


టెక్నాలజీని సవ్యంగా వాడుకోలేని స్థితి: ఏమయ్యా హాలీవుడ్ తరహాలో సినిమాలు ఎందుకు తియ్యలేకపోతున్నారు అని 1970 లలో అడిగితే, "ఆ వాళ్ళకు ఉన్న సాకేతిక పరిజ్ఞానం, మనకేది" అని చప్పరించే వాళ్ళు . 1960ల్లో బెన్ హర్ సినిమా తీసేప్పటికి, టెన్ కమాండ్ మెంట్స్ తీసేప్పటికి వాళ్ళకు ఉన్న సాకేతిక పరిజ్ఞానం ఎంత. అంతకు మించి ఉన్నదే మనకు ఈ రోజున. అవ్వి వాడి మన కథల్ని చక్కగా తీస్తున్నారా? ఒక్క జానపద సినిమాలో యుధ్ధం సీను సవ్యంగా తియ్యరు, ఊరికే డిప్పలు నెత్తిన పెట్టుకున వాళ్ళు కత్తుల్లాంటివి పట్టుకు అటూ ఇటూ పరిగెట్టటమే. రధాలు సామాన్యంగా నడవ్వు, నడిచిన  ఆ  వంద గజాలు కూడా ఊగుతూ ఊగుతూ పోతాయి. విచిత్రం ఏమంటే, మన తెలుగు సినామాల్లోనే 1950లు 60ల్లో తీసిన సినిమాల్లో చూపించిన అద్భుత దృశ్యాలు ఇవ్వాళ్టి దర్శకులు తియ్యగలరా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు . 


సినీ కథా కాలం
సినీ కథా కాలం ఎప్పటికప్పుడు ఆ తీసే రోజుదే (సాంఘికాలవరకూ). ఒక్కటంటే ఒక్క సినిమా 1930లు 40ల నేపధ్యంలో తీసినవి లేవు. సినిమా 2011 లో  తీస్తుంటే కథ ప్రకారం, హీరో తాత 1950 లో కథాంశం ప్రకారం చేసిన పనులు చూపించటం అనేది ప్రయత్నించటం అన్న మాటే . ఏదో ఒక పాత్ర చేత ఆ  కథంతా సంభాషణా పూర్వకంగా చెప్పేసి చేతులు దులుపుకోవటమే!   ఒక వేళ సినిమాలో పాత కాలం అంటే , బుట్ట జాకెట్లు, పాత పెంకుటిళ్ళు, పాత కుర్చీలు, పాత మొడల్ కారొకటి పట్టుకు ఊరేగటమే కాని, పాత కాలం సృష్టి చెయ్యలేని అశక్యత అలుముకుని ఉన్నది. దీనికి కారణం, అంత శ్రమపడాల్సిన పనేమిటి? ఈ మాత్రం చూపిస్తే చాలులే అన్నటువంటి తెంపరితనం. చేతకాక కాదు, ఎందుకు అనవసరపు ఖర్చు అని. కాని మళ్ళీ అదే నిర్మాతలు, పాటలను చరణానికో దేశంలో తీస్తారు. అదే  విచిత్రం. ఒక వందేళ్ళు పోయినాక, ఇప్పుడు వస్తున్న సినిమాలు అప్పటి వాళ్ళు చూస్తే మన గురించి ఏమనుకుంటారో కదా అని భయం వేస్తుంది. ఇప్పటి సామాజిక పరిస్థితి , మనుష్యుల మానసిక స్థితి, ఈ సినిమాలతో అంచాన వేస్తే, ఎంతటి అబధ్ధం ప్రచారంలోకి వస్తుందో కదా. 


ఎం బి ఎం ప్రసాద్ గారు ఇదే విషయం మీద, వరల్డ్ రేడియో నెట్ వర్క్ లో "పడకుర్చీ కథలు" శీర్షికలో మన సినిమాల్లో చరిత్ర పరంగా ఎన్నెన్ని తప్పులు వస్తున్నాయో ఎత్తి చూపుతూ, రాబొయ్యే తరాలు ఇదే గొప్ప నిజమని నమ్ముతారని బాధ పడ్డారు. ఆయన  అభిప్రాయం   వారి  గొంతులోనే వినండి:


 


ప్రేక్షకుల పాత్ర: మనకు సవ్యమైన సినిమాలు రాకపోవటానికి ముఖ్య బాధ్యత వహించల్సినది ప్రేక్షకులే. హీరో వర్షిప్ ఎక్కువైపోయి, తమకు ఇష్టమైన హీరో ఎటువంటి చెత్త చేసినా చూసేసి వంద రోజులు ఆడిస్తే మంచి సినిమాలు ఎక్కడ నుంచి వస్తాయి. ప్రేక్షకుల అభిరుచి రోజు రోజుకీ మారిపోయి, ఏదో కాలం గడవటానికి సినిమాగానే ఉన్నది కాని, మంచి వినోదం పొంది,ఆ వినోదం వల్ల మానసిక ఆనందం పొందాలన్న ఆలోచన చాలా కొద్ది మందికి ఉండటం కూడా మంచి సినిమాలు రాకపోవటానికి ఒక ముఖ్య కారణం.




ఏది ఏమైనా, ఎనభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, తెలుగు సినిమా మంచి పరిణితి పొందాలనీ, మంచి సినిమాలు తీసి, దేశం మొత్తంలో అగ్రగామి కావాలని మనకి ఉంటుంది. కాని వాళ్ళకు ఉండద్దూ! 


*********************


"బాబు", వడ్డాది పాపయ్య గార్ల కార్టూన్లు కాక(వారి సంతకాలు ఉన్నాయి వాటిమీద) మిగిలిన కార్టూన్ల బొమ్మ వేసినాయన ఎవరో తెలియదు. ఆ అజ్ఞాత ఆర్టిస్టుకు ధన్యవాదాలు.  ఏ పి  ప్రెస్ అకాడమీ వారు ఉంచిన పాత పత్రిక ప్రతులు (ఆంధ్ర పత్రిక 1972లో)నుండి  ఈ కార్టూన్లు గ్రహించబడినవి. శ్రీ బాబు గారికి, వడ్డాది పాపయ్య గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏ పి  ప్రెస్ అకాడమీ వారికి అనేక ధన్యవాదాలు. పాత పత్రికలూ ఎంతో శ్రమకోర్చి అందుబాటు లోకి  తీసుకువచ్చారు.  


 *********************
కొంత కాలం క్రితం, ఇదే బ్లాగులో, ప్రముఖ రచయిత "చలం" గారు విజయవాడలో ఒక సినిమా హాలు పక్కనే కాపురం ఉండి అప్పట్లో వచ్చిన ఒక సినిమా (1950 దశకం అయ్యి ఉండాలి)  రోజూ విని (చూసి కాదు), వ్రాసిన ఆయన భావాలు ప్రచురించటం  జరిగింది.  ఆసక్తి ఉంటే ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు;









12 కామెంట్‌లు:

  1. శివగారు!
    విమర్శించిన విషయాన్ని విమర్శించకుండా విమర్శించారు!!

    రిప్లయితొలగించండి
  2. 'పరిణితి' గురించి చాలా చక్కగా చెప్పారు. పత్రికల కంటే అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా వెళ్ళగలిగినవి సినిమాలు. వీటి ప్రభావం ప్రజా జీవన సరళి మీద వ్యక్తిత్వ వికాసం మీద చాలా వుంటుంది. అటువంటి కీలకమైన రంగాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోవడం ఒక విధంగా నేరం. ఒక వ్యవస్థ సమాజ శ్రేయస్సు గురించి పాటుపడాలి కాని ఇలా స్వలాభాల కోసం కాదు. ఇక ప్రస్తుతం వస్తున్న సినిమాల్లోని 'స్త్రీల వస్త్రాలంకరణ', ఇది యావత్ భరత్ దేశం తలదించుకోవాల్సిన విషయం.మన౦ గొప్పగా చెప్పుకుంటున్న మన సంస్కృతికి గొడ్డలి పెట్టు.
    విషయాన్ని వివర౦గా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. బాబు గారూ ధన్యవాదాలు. మన సినిమాలు చాలా తేలిపోతూ ఎక్కడా కూడా పేరు తెచ్చుకోకుండా చౌకరకంగా పడి ఉండటం అనే విషయం నాకు చాలా బాధ కలిగిస్తున్నది. అందుకనే ఈ విమర్శ. సినిమాల్లో ఉన్న మంచి విషయాల గురించి మరొక వ్యాసం త్వరలో.

    రిప్లయితొలగించండి
  4. జ్యోతిర్మయి, సినిమాలు పూర్తిగా సంఘ సేవనమే చెయ్యాలని నేను అనలేను కాని, సమాజం లో అంతకు ముందు లేని అవలక్షణాలను తీసుకు వచ్చేవిగా మటుకు ఉండకూడదని నా భావన. ప్రేక్షకులంకు ఆరోగ్యకరమైన వినోదాన్ని ఇస్తూ తమ వ్యాపార లాభాలను గ్రహించటం మమ్చి పనే. కాని లాభాలు మాత్రమె వారి గమ్యం అయినప్పుడు సినిమా అనారోగ్యం పాలు అయ్యింది అని చెప్పక తప్పదు. వయస్సుతో సంబంధం లేకుండా ఏభై అరవై ఏళ్ళు వచ్చినాక కూడా కుర్ర వేషాలు వేస్తూ గేంతటం వంటివి ఎంతో ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా ఉంటూనే ఉన్నాయి. అలాంటి హీరోలను ఎగబడి చూసే ప్రేక్షకులూ ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  5. 'వీటికి తోడు "మూక" పాటలు. అప్పటిదాకా మామూలు మనుషుల్లాగానే మాట్లాడుకున్న నాయకా నాయికలు, ఒక విచిత్రమైన ముఖ కవళికలు పెడతారు (అంటే పాట వస్తోంది అన్న హెచ్చరిక చేస్తారు)'

    '
 ప్రతి వాడూ మా ఆడియో అద్భుతం అనేవాడే. '

    '1970 లలో చాలా సార్లు పాట వస్తే చాలు కొంతమంది దబుక్కున లేచి బయటకు వెళ్ళిపోయి, పాట అయిపోయినాక (కొండకచో, సిగిరెట్ కంపు కొట్టుకుంటూ) తిరిగి వచ్చే వాళ్ళు. అప్పటి పాటలకే వాళ్ళు అంత హింస పడి ఉంటే, ఇప్పుడు వస్తున్న పాటలు చూడవలసి వస్తే ఏమైపోతారో కదా! ' 


    ' ఒక వేళ సినిమాలో పాత కాలం అంటే బుట్ట జాకెట్లు, పాత పెంకుటిళ్ళు, పాత కుర్చీలు, పాత మొడల్ కారొకటి పట్టుకు ఊరేగటమే కాని, పాత కాలం సృష్టి చెయ్యలేని అశక్యత అలుముకుని ఉన్నది. '

    చాలా బాగుంది సార్ మీ విశ్లేషణ. సినిమా చూసిన ప్రతి సారీ నేను పడే ఇబ్బందులు మీరు బాగా రాశారు.

    రిప్లయితొలగించండి
  6. శివ గారు మన తెలుగు సినిమాలు గురుంచి చాలా చక్కగా వ్రాసారు. పాతవాళ్ళు సినిమాలు తీసి పేరు సంపాయించారు, ఇప్పటి వాళ్ళు కేవలం డబ్బు సంపాయించాటానికి మాత్రమే సినిమాలు తీస్తున్నారు. అప్పట్లో పెద్ద పెద్ద సంస్థలలో ఉద్యోగులుగా ఉన్న కలాకారులు ఉద్యగులులాగా కాకుండా కళాకారుల్లాగా ఉన్నారు. ఇప్పటి వారు కళాకారులమని చెప్పుకుంటూ "10 టూ 5 ఉద్యోగుల్లాగా" ఉన్నారు. పాత సినిమాలు ఇంటి భొజనం అయితే, ఇప్పటి సినిమాలు కేటరింగ్ భోజనం చేసినట్లే.....అన్ని హంగులూ వుంటాయి కాని అవి మన మనస్సుని తాకవు.

    అయితే కేవలం సినిమావాళ్ళే కారణం అని చెప్పలేము. అప్పట్లో అర్ధరూపాయ క్లాసుకి లీలామహల్లో లోని ఇంగ్లీషు సినిమాకి వెళితే క్లాసు జనమే వుండేవారు...ఇప్పుడు ఐమాక్షు దియేటరుకి రూ.150/-,రూ.200/- పెట్టి వెళ్ళినా ఎక్కువమంది క్లాసుగా కనపడే మాసుగాళ్ళే ఉన్నారు.

    ఇప్పటి సినిమాలు ఇలా కావటానికి ముఖ్యమైన కారణం వంశ చరిత్రలు మరియు కుల పిచ్చి గాళ్ళు. సినిమాలు తీస్తే మేమే తియాలనే వర్గాలు...హీరోలుగా వుంటే మేమే వుండాలనే వీరివల్లనే కధ చిన్నబోయి "ఇమేజి ముదిరి పోయింది". వీరు ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారంటే బయట వచ్చే కుర్ర హీరోలను[వశపరంపర వాళ్ళు కాదు]డ్రగ్గ్సు కేసుల్లోనో, ప్రేమల్లోనో ఇరికించి వారిని తగ్గించి తమ వంశాకురాలని పైకి తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన సినిమాలు బాగుపడాలంటే వీరి కభంధ హస్తాలలోనుండి తప్పించాలి.

    రిప్లయితొలగించండి
  7. @Chandu

    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    @రాధాకృష్ణ Thankq

    రిప్లయితొలగించండి
  8. A well researched and detailed article. The efforts put in by Shri Sivaramprasad gaaru needs to be appreciated. At places, his criticism was very relevant and straight to the point though it may appear controversial to some. hough there To some extent, the loyal fans associations (like property, they are also inherited and transferred to their next generations!)/ Super Star & Mega Star Images and the hype created around these stars / teir families, TV shows etc also contributed to the downfall of Telugu film industry - Kumar

    రిప్లయితొలగించండి
  9. శివ గారు,
    మీరు మరి రెండు విషయాలను ప్రస్తావించడం మరిచిపోయారు. Hype సృష్టించడం ఆపైన మరీ ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్ చేయటం.

    రిప్లయితొలగించండి
  10. మన సినిమాలగురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనే అభిప్రాయం నాది.

    కానీ మీరు వ్రాసింది చదివాక, ఇంత విషయం వుందా--యెంత వోపికగా వ్రాశారు! అనిపించింది.

    ఇంక సినిమాల్లో వున్న మంచి విషయాలగురించి యేమి వ్రాస్తారా అని ఆసక్తిగా వుంది.

    రిప్లయితొలగించండి
  11. కృష్ణ శ్రీ గారూ, మీరు కూడా "ఓపికగా" చదివినందుకు, కామెంటినందుకు ధన్యవాదాలు. తెలుగు సినిమాల్లో మంచి గురించి వ్రాద్దామనే ఉన్నది కానీ, ఆ మంచి వెతకటానికి చాల రిసెర్చ్ చెయ్యాలి. కొన్నాళ్ళు పొయ్యాక గాని వ్రాయలేను.

    జవహర్ గారూ, మరవ లేదండీ. గ్రంధ విస్తారణ భీతి చేత కొంతన్నూ, ఆపైన, ఎన్నెన్ని సినిమా హాల్లల్లో విడుదల చేసినా ఆ సినిమా క్వాలిటీ మీద ప్రభావం ఏమున్నది, సినిమా అయ్యాక కదా ప్రకటనల హైప్, సినిమా హాల్ల సంఖ్య అన్న దృక్పథం తో ఆ పాయింట్లు వదిలేశాను.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.