14, అక్టోబర్ 2011, శుక్రవారం

కే బి కే మోహన్ రాజుగారు :: లలిత సంగీతం


మొట్టమొదటి  సారి  మోహన్ రాజు గారి గళం నా చిన్నతనంలో 1966-67 లో అనుకుంటాను పూల రంగడు సినిమాలో శోభన్ బాబు పాడుతున్నట్టుగా కనిపించిన సినీ గీతంలో విన్నాను. 



ఆయన గొంతు ఎంతో విలక్షణంగా ఉండి వినసొంపుగా అనిపించింది. కాని ఆయన చక్కటి గళాన్ని సినిమా వారు  పెద్దగా వాడుకోలేదు.  ఆయన పాడిన  సినిమా  పాటలు దాదాపు అన్నీ కూడా బహుళ ప్రాచుర్యం పొందినవే. రాసి కన్నా వాసి ప్రధానంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఒక చక్కటి గాయకుడు మన మోహన్ రాజు గారు.


సినిమా పాటలు కాకుండా ఆయన  ఆకాశవాణి లో అనేక పాటలు (లలిత సంగీతం) పాడారు అలా వారు పాడిన పాటల్లో ఆకాశవాణి నుండి ప్రసారమైన పాట విని ఆనందించండి.



పై విశేషాలు వ్రాసిన కొద్దిసేపటికి శ్రీ శంకర్ గారు మంచి సమాచారం ఇచ్చారు.  తృష్ణ గారి బ్లాగులో మోహన్ రాజుగారి ప్రత్యేక వెబ్ సైటు కు లింకు ఉన్నదని. మోహన్ రాజు గారి వెబ్ సైటు ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు, ఆయన పాడిన అనేక పాటలు పద్యాలు వినవచ్చు.
మోహన్ రాజు గారి వెబ్ సైటులో ఉంచిన రేడియో ఇంటర్వ్యూ వింటే చాలా బాధ కలిగింది. ఆ ఇంటర్వ్యూ చేసినాయనకి కొత్తో, లేక ఆయన తీరే అంతో తెలియదు. మోహన్ రాజు గారు ఏదో చెప్పబోతుంటే చాలా అమర్యాదగా కట్ చేసి పారేసి , తన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అదేదో హార్డ్ టాక్ లాటి కార్యక్రమం అయితే అలా ఎగ్రసివ్ గా ఉంటే నప్పుతుంది కాని, కళాకారులను అందులో సీనియర్ కళాకారులను ఇంటర్వ్యూ చేసేప్పుడు అలా దురుసుగా ప్రవర్తించటం చాలా తప్పు. ఆ ఇంటర్వ్యూ చేసినాయన తెలుసుకుని  భవిష్యత్తులో  పెద్దవాళ్ళను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఆయనకు ఇస్తే ఆ చెయ్యబోయే ఇంటర్వ్యూలలో ఇదే తప్పు జరుగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. 

ఇంతకు ముందు ప్రముఖ నటుడు గుమ్మడి గారితో ఒక ఇంటర్వ్యూ(క్లిక్)  గురించి విపులంగా వ్రాశాను. చూడండి.
 మీకు తెలుసా! 
  • మోహన్ రాజు గారు భగవద్గీత కూడా గానం చేసారు 
  • అనేక ఘజల్స్ పాడారు. ఆయన అభిమాన గాయకుడు తలత్ ఆపైన తెలుగులో ఘంటసాల 
  • ఆయన పాట మొట్టమొదటి సారి రికార్డ్ అయినది చింతామణి సినిమాకోసం, భానుమతి గారు ఆవకాశం ఇచ్చారు. కాని ఆ పాట సినిమాలో లేదు. 
  • రామదాసు కీర్తనలను చక్కటి  గళంలో హాయిగా పాడుకున్నారు. 
  • బలిజేపల్లి కవి వ్రాసిన అనేక పద్యాలను మోహన్ రాజుగారు గానం చేసారు 
  • మోహన్ రాజు గారు జాషువా పద్యాలను ఆలపించారు 
  • జానపద సంగీత కూడా అందించారు 
  • ఆయన ఐదు వేలకు పైగా పాటలు పాడారు, ఆరువేలకు పైగా స్టేజి కార్యక్రమాలు ఇచ్చారు. 
  • 1959 నుండి రేడియోలో లలిత సంగీతం పాడుతున్నారు. 
  • 1957 లో జరిగిన MURPHY METRO – Indian Singing Contest లో  దక్షిణ భారత దేశానికి ప్రధమ బహుమతి తెచ్చుకున్నారు.  ఉత్తర భారత దేశానికి మహేంద్ర కపూర్ మొదటి బహుమతి సంపాయించారు. 
  • సంపూర్ణ తీర్థ యాత్ర సినిమాకి 55 నిమిషాల పాట (మాంటేజ్ సాంగ్) పాడారు అదొక రికార్డ్.
మోహన్ రాజు గారు  ఆలపించిన రామదాసు కీర్తనలలో ఒకటి మీకోసం . 

శ్రీ కే బి కే మోహన్ రాజుగారు ఫేస్ బుక్ లో అందుబాటులో ఉన్నారు, ఈ కింది లింకు నొక్కి (ఆయన్ను నిన్నటివరకు పలకరించ గలిగేవాళ్ళం) ఆయన పేజీ చూడవచ్చు. 

కే బి కే మోహన్ రాజుగారి ఫేస్ బుక్


మోహన్ రాజు గారు స్టేజి మీద సాక్షి సినిమాలో పాట  పాడుతున్న వీడియో 
 
===============================================
ఇక్కడ  ఆడియో ఉంచటంలో  ఏ విధమైన ధనాపేక్ష లేదు. కేవలం మోహన్ రాజుగారి గళం మీద ఉన్న అభిమానం  ఆపైన ఆయన సినిమా పాటలే కాదు ఎన్నో అద్భుతమైన పాటలు గానం చేశారని తెలియచెయ్యటానికి మాత్రమె  
===============================================


(ఏడు సంవత్సరాల క్రితం వ్రాసిన వ్యాసం ఇది. మోహన్ రాజుగారి మరణవార్త 15 03 2018న సాయంత్రం ఆరు గంటలు ఆయన మరణించారని తెలిసిన తదుపరి, మళ్ళీ అప్డేట్ చెయ్యటం జరిగింది.)



3 కామెంట్‌లు:

  1. శివరామప్రసాద్ గారూ మంచి గాయకుడిని మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఆ మధ్య తృష్ణ గారు రాసిన ఒక పోస్ట్ లో (http://trishnaventa.blogspot.com/2011/09/blog-post_13.html) మోహన్ రాజు గారి పాటల సైట్ లింక్ ఇచ్చారు. మంచి కలెక్షన్ ఉంది అక్కడ. వీలయితే ఒక సారి చూడండి

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు శంకర్ గారూ., మంచి సమాచారం ఇచ్చారు. తృష్ణ గారికి కూడా ధన్యవాదాలు మోహన్ రాజుగారి బ్లాగ్ వివరాలు లింకు ఇచ్చినందుకు.

    రిప్లయితొలగించండి
  3. మోహన్ రాజుగారి గురించి శివరామప్రసాద్ గారు ,ఇతరులు ఇచ్చిన సమాచారం కి ధన్యవాదాలు.తెనాలిలో ఒక పెళ్ళిలో ఆయన కచేరి విన్నాను.అప్పట్లో సినిమాల్లో కొత్త వాళ్ళకి అవకాశం దొరకడం చాలా కష్టం.బాలు కూడా పది ఏళ్ళు స్త్రగుల్ అయ్యారు. మోహన్రాజు సుశీల తో పాడిన 'చిగురులు వేసిన కలలన్నీ'పాట ఒక్కటే నాకు జ్ఞాపకం.ఆయనకంఠ స్వరం చాలా బాగుంటుంది.సినిమాల్లో కాకపోయినా రేడియో గాయకునిగా మంచి పేరు గడించారు.==రమణారావు.ముద్దు

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.