12, డిసెంబర్ 2011, సోమవారం

విశ్వనాథ సాహిత్య సాగరం



మనకు ఆంగ్లంలో ఒక మాట ఉన్నది OMNIBUS అని. అంటే ఒక రచయితకు సంబంధించిన రచనలు దాదాపు అన్నీ ఒకే సంపుటిలో కాని, ఒక్క పాక్ లోకాని చదువరులకు అందించే విధానాన్ని ఆమ్నిబస్ అని అంటారుట. తెలుగులో మనకి ఇప్పుడిప్పుడే అంటే గత నాలుగైదేళ్ళ బట్టి ఈ ప్రక్రియ ఊపు అందుకున్నది. 

అదృష్టం బాగుండి, ఆ ఆంగ్ల పదాన్ని పట్టుకుని ఒక  తెలుగు కంకర్రాయిని తయారుచేసే లోపలే, మన ముళ్ళపూడి వెంకటరమణ గారు "రచనాసాగరం" అనే పద సృష్టి చేసి మన్ని బతికించారు. లేకపోతె ఆమ్నిబస్  కి తెలుగు చేస్తున్నామన్న భ్రమలో  "ఏక వాహిక" వంటి ఏ అపభ్రంశపు  పదమో  పుట్టించే వాళ్ళే   . విశ్వనాథ వారు అటువంటి అప శబ్దాలు వింటే, ఆయన సహజ శైలిలో థూ... థూ...ఇవేమి మాటలు అని ఎవగించుకుని ఉండే  వారే. 

ఈ ఆమ్నిబస్ ను స్పురిస్తూ   విశ్వనాథ పావని శాస్త్రి గారు (విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారుడు) ఒక మాట ప్రతిపాదించటమే కాదు, తన తండ్రి గారి నవలలు అన్నీ కలిపి ఒక్కటే పెద్ద పెట్టెలో పెట్టి చదువరులకి అందిస్తూ, చక్కటి పేరు ఆ పెట్టె మీద అచ్చువేసేసారు. ఆ పేరే "విశ్వనాథ వారి సంపూర్ణ నవలా నిధి". 

ఇక ఈ ఎటిమాలజీ వదిలి విషయంలోకి రావాలంటే, కొంత గతంలోకి కూడా వెళ్ళాలి, వీలైనంతవరకూ తొంగి చూసి గుర్తున్నంతవరకూ చెప్పుకోవాలి. 

oooOooo


 శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన మొట్టమొదటి జ్ఞాపకం మా పెద్ద మామయ్యతో వారింటికి వెళ్ళటం.  అప్పటికి నాకు పన్నెండు పదమూడు ఏళ్ళు ఉండి ఉండవచ్చు. మా మేనమామగారు విశ్వనాథ వారి శిష్యులలో ఒకరు. అప్పుడప్పుడూ వారింటికి వెళ్లి అక్కడి సాహిత్య చర్చల్లో ఎక్కువగా శ్రోతగా ఉండేవారు. అక్కడి విశేషాలు మాకు చెబుతుంటే నాక్కూడా ఆయన్ని చూడాలని అనిపించింది. 

ఆ విధంగా మా మేనమామతో  విశ్వనాథ వారింటికి వెళ్ళటం జరిగింది.ఆ రోజు జరిగిన విశేషాలు  పెద్దగా గుర్తు లేవు కాని, విశ్వనాథ సత్యనారాయణ గారు ఇతర పెద్ద వాళ్ళందరూ  అప్పటికి నాకు అర్ధం కాని ఏదో విషయం మీద తెగ మల్లగుల్లాలు పడ్డారు. అంతవరకే నాకున్న జ్ఞాపకం. 

ఆ తరువాత మా ఇంటిదగ్గర 1972-73  వచ్చేప్పటికి రోజుకు పదిపైసల అద్దెతో (అబ్బో పదిపైసలే  అనిపించేది అప్పట్లో) ఒక లెండింగ్          లైబ్రరీ-కం-కిళ్ళీ షాప్ తయారయ్యింది. ఆ షాపుని అప్పారావు కొట్టు అని ఆ బడ్డీ కొట్టు యజమాని పేరున పిలిచేవాళ్ళం. అందులో విశ్వనాథ వారి రెండు పుస్తకాలు 'దిండు కింద  పోక చెక్క' ,  'దంతపు దువ్వెన' చదివిన జ్ఞాపకం. రెండో రోజుకి వెళితే మరో పదిపైసలు ఇవ్వాలి అని దబదబా చదివేయ్యటమే, అర్ధం చేసుకున్నది అతి కొద్ది. పైగా విశ్వనాథ వారి భాషను ఒక్కరోజులో చదవటమే! అదీ ఆ వయస్సులో.

మరికొన్నాళ్లకు కాలేజీకి వచ్చేప్పటికి, మా తెలుగు లెక్చరర్ ఆచార్యులు గారి పుణ్యమా అని, లైబ్రరీలో సభ్యునిగా చేరటం జరిగింది. డిపాజిట్ పది రూపాయలు. రెండు పుస్తకాలు, ఒక మాగజైన్ తీసుకోవచ్చు. పుస్తకాలు రెండు వారాలకు  ఇచ్చేవారు. దుర్గా కళామందిరం వెనుక వీధిలో ఉండేది. అదే ఇప్పుడు టాగూర్ లైబ్రరీగా మారి బందరు రోడ్డులో స్వంత భవనంలో ఉన్నది. 

ఇక్కడ విశ్వనాథ వారి పుస్తకాలు చాలానే చదివాను.(ఇది  జరిగి మూడు దశాబ్దాల పైనే గడిచిపోయింది). ఇది కాక ప్రతి ఆదివారం అలంకార్ థియేటర్ ప్రాతం లో  బాటా షాపు బైట సెకండ్  హాండ్ పుస్తకాల్లో పాత చందమామలు, మంచి నవలలు కోసం పహారా. 

ఆ వెతుకులాటలో, ఆ మర్నాటి  నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరిక్షలు మొదలవుతాయి అనగా, 'వేయి పడగలు' నవల దొరికింది. పద్నాలుగు రూపాయలు, 1978 సంవత్సరం లో. నా దగ్గర ఉన్న నిధి అంతా పోగేసినా కూడా చాలదు. అందుకని ఆ మొత్తాన్ని మా నాన్నగారి దగ్గర ఎలాగోలాగ బెల్లించి  సంపాయించి వేయి పడగలు కొనేసాను. కాని పరీక్షలు. వెంటనే ఒక నియమం పెట్టుకున్నాను. పరీక్షలు అయ్యేవరకూ వేయిపడగలు పుస్తకం తెరిచి కూడా చూడ కూడదు  అని, పుస్తకం చుట్టూ ఒక న్యూస్ పేపర్ చుట్టేసి అంటించి పారేశాను, ఏదన్నా బలహీన క్షణాన, ఒక పేజీ చదివటం మొదలుపెట్టి, పరీక్షలు మర్చిపోతానేమో అన్న భయం. 

పరీక్షలు బాగానే వ్రాశాను  ఫస్ట్ క్లాస్ రావటం ఖాయం అనుకుని ఆనందిస్తూ, ఆ శలవల్లో (1978 వేసంకాలం), వేయిపడగలు పఠనా కార్యక్రమం మొదలు పెట్టాను. అప్పట్లో మా ఇంట్లో రెండు కొబ్బరి చెట్లు ఉండేవి. ఎప్పుడు చూసినా ఇంట్లో కొబ్బరికాయలు. దాదాపు ఈ పుస్తకం చదివినప్పుడల్లా, ఒక కొబ్బరికాయ ప్రేష్ గా  ఒలిచి (అంటే పైనున్న పీచు గట్రా ఒడుపుగా  తీసి) కొబ్బరికాయ కొట్టుకుని, కొబ్బరి  చిన్న చిన్న ముక్కలు చేసి తినటం, లేదా కొబ్బరి కోరి, అందులో పంచదార కలుపుకుని తింటూ ఈ పుస్తకం చదవటం. అందుకనే వేయి పడగలు అనంగానే పాలూరుతూ పంచదార కలిసిన  తీపి కొబ్బరి  జ్ఞాపకమే వస్తుంది నాకు. 

విశ్వనాధ వారేమో ఇరవై తొమ్మిది రోజుల్లో ఆశువుగా చెబుతూ ఉంటే ఆయన తమ్ముడు శ్రీ వెంకటేశ్వర్లు  గారు 999 అర ఠావుల మీద వ్రాసారు. నాకు  చదవటానికి మాత్రమె మూడు నెలల పైన బట్టింది. 

విశ్వనాథ వారిదే మరొక జ్ఞాపకం. పైన చెప్పిన విషయానికి రెండేళ్ళ ముందు మాట. ఆయన మరణించిన రోజుది. 1976 లో ఆయన పరమపదించారు .  నేను కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం లో ఉన్నాను. అప్పటికి ఇందిరా గాంధీ విధించిన ఆత్యయిక పరిస్థితి అమల్లో ఉన్నది. అటువంటి సమయంలో, మేమందరమూ ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి, విశ్వనాథ వారి మరణానికి సంతాపంగా కాలేజీ శలవ  ఇవ్వాలని పట్టుబట్టాం. అలా చేస్తే అసలే  ఎమర్జెన్సీ  రోజులు,  ఏమి ముంచుకు వస్తుందో అని ఆయన సంశయిస్తూ ఉండగానే , కాలేజీ ప్రేయర్ మీటింగునే విశ్వనాథ వారికి నివాళి సమర్పించే సమావేశంగా మార్చి, కాలేజీకి డుమ్మా కొట్టేసి, చాలా మందిమి ఆయన ఇంటికి వెళ్ళాము. కాలేజీలో విద్యార్ధులు లేక, కాలేజీ ఆరోజుకి మూతపడింది. ఎమర్జెన్సీఅయినా సరే ఏమీ కాలేదు. ఆయన భౌతిక కాయం అప్పటికే ఒక లారీలో ఉంచి తీసుకు వెళ్తున్నారు. మేము సైకిళ్ళ మీద  ఆ ఊరేగింపును అనుసరించి, చిన్నవాళ్ళు ఎంతవరకూ వేళ్ళవచ్చో  అక్కడిదాకా వెళ్ళి, విశ్వనాథ వారికి వీడ్కోలు పలికాం. ఆ లారీ వెనుక వెళ్తున్నంత సేపూ ఆయన తల మాత్రమె కనపడింది.  ఈ తల నుంచే  కదా మనం చదువుకున్న పాత్రలన్నీ పుట్టినాయి అనిపిం చింది.

ఆ తరువాత ఉద్యోగ ధర్మాన   దేశాలు పట్టిపోవటం వల్ల, విశ్వనాథ దర్శనం అంటే  వారి పుస్తకాలు చదవగలగటం  అడపాదడపా  మాత్రమె. ఈ మధ్య కాలంలో నాలుగేళ్ల క్రితం  లేదా అంత కంటే ఎక్కువే అయ్యిందో మరి,  విశ్వనాథ పావని శాస్త్రి గారు శ్రీ విశ్వనాథ వారి సమగ్ర సాహిత్య ప్రచురణ అందచేస్తున్నారని  తెలిసి, నేను కూడా ఒక బాక్స్ కొనేశాను . కోన్నానే కాని, ఒక్క పుస్తకం తెరిచింది లేదు. అన్ని పుస్తకాల మీద పేర్లు వ్రాసుకుని, ఆ పెట్టెను విజయవాడలోనే జాగ్రత్త పరిచి ముంబాయి వెళ్ళిపోయాను. ఈనెల మొదటి వారంలో విజయవాడ వెళ్ళినప్పుడు, అక్కడ భద్రంగా దాచి ఉంచిన "విశ్వనాథ వారి సంపూర్ణ నవలా నిధి" వెంట తెచ్చుకున్నాను. మొత్తం రెండు వేల చిల్లరకో మూడువేల రూపాయలకో  కొన్న గుర్తు. ఇప్పుడు ఒక్కొక్క పుస్తకం మళ్ళీ చదవాలని ఆకాంక్ష. ఈ నవలలు దాదాపు అన్ని చదివినవే కాని పెద్దగా గుర్తు లేవు. వయసుతోబాటుగా వచ్చింది అనుకుంటున్న పరిణితి తో మరో సారి చదవాలని కోరిక. 


విశ్వనాథ సత్యనారాయణ గారు మా ఇంటికి వచ్చే అదృష్టం మాకు పడితే ఆయన్ను ఏ విధంగా  గౌరవించి సుఖాసీనులను చేస్తామో అదే విధంగా ఆయన సంపూర్ణ నవలా నిధిని (మొత్తం 57 నవలలు, 54 పుస్తకాలుగా వేశారు) ఈ రోజు ఆదివారం కదా ,  పొద్దున్నే  ముచ్చటగా సోఫాలో ఉంచి చూసి సంతోషించాము. 
 ఒక్కొక్క పుస్తకం చదివి (ఎన్నాళ్ళు పట్టునోకదా!) ఆ పుస్తకం గురించి వ్రాయాలని సంకల్పం. ఎంతవరకూ సఫలీకృతం అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

ఈ పుస్తకాలు ఇప్పుడీ ఇదే పద్ధతిలో దొరుకుతున్నాయా అంటే దొరకవచ్చు అనే సమాధానం. విజయవాడ ప్రముఖ పుస్తక విక్రేతలను కాని మారుతీ నగర్లో  ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడిన విశ్వనాథ వారి  ఇంట్లో కాని సంప్రదించవచ్చు.  
oooOooo
విజయవాడ నడిబొడ్డున ఉన్న శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహ పీఠం
 విజయవాడ రైవస్ కాలవకు ఆనుకుని ఒకదానికొకటి దగ్గరలో రెండు విగ్రహాలు ఉన్నాయి. ఒకటి విదేశీయుడిది , రెండవది కవేసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారిది. ఆ కూడలిపేరు ఆ విదేశీయుడి పేరన ఉన్నది. ఆ విదేశీయుడి దేశంలోనే ఆ మనిషి విగ్రహాలకు గతిలేక పీకి ఆవతల పారేస్తే, ఇక్కడమటుకు సెంటర్లో పెట్టి మనవాళ్ళను కాదని విదేశీయుని పేరుతొ కూడళ్ళు! దీనినే అయిన వాళ్ళకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో అంటారు.

విశ్వనాథ  వారి విగ్రహాన్ని టాంక్ బండ్ మీద ఎన్  టి రామారావు ఎందుకు ప్రతిష్టింప చెయ్యలేదు  అని ఇన్నాళ్ళూ బాధపడేవాడిని. కాని గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు చూసినాక, అక్కడ ఆయన విగ్రహం పెట్టకపోవటమే పెద్ద గౌరవం అనిపిస్తున్నది. 
oooOooo

విశ్వనాథ  వారి పేరు చెప్తే చాలు మా మేనమామ కీర్తి శేషులు శ్రీ శుద్ధపల్లి వెంకటేశ్వర్లు  గారు పరవశించిపొయ్యేవారు .  ఆయన బాగా పెద్దవారు అయిపోయిన తరువాత (అప్పటికి  ఆయన వయస్సు 86 సంవత్సరాలు)  2007 లేదా 2008 లో ఏదో ఫంక్షన్ కు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన విశ్వనాథ వారి మీద జంధ్యాల పాపయ్య  శాస్త్రి  గారు వ్రాసినట్టుగా చెప్పబడుతున్న పద్యం ఒకటి చదివి వినిపించారు. మీరు కూడా విని ఆనందించండి.


 






3 కామెంట్‌లు:

  1. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మీ జ్ఞాపకాలు అందరికీ పంచినందుకు సంతోషం,అభినందనలు
    డా.యస్వి.రాఘవేంద్రరావు (సుమశ్రీ)

    రిప్లయితొలగించండి
  2. బాగా రాశారు... మీరు ఇంకా సరిగ్గా చూడలేదేమో! అవి మొత్తం యాభై ఏడు నవలలు..రెండు కలిపి ఒకే పుస్తకంగా కొన్ని ఉన్నాయనుకుంటా! మీరు చదివాక మంచి రివ్యూలు అందించండి, ఎదురు చూస్తుంటాం..
    నవలల సెట్టు, ఇంకా మిగతా సాహిత్యం అంతా కూడా మూణ్ణాలుగు సెట్లుగా(నాటకాలు, సాహిత్య విమర్శలు, లఘు కావ్యాలు, కల్పవృక్షం) దొరుకుతున్నాయి..

    రిప్లయితొలగించండి
  3. చాలా బావుంది. ఈ సెట్టు నేను కూడా కొన్నాను. అప్పుడప్పుడూ ఒకటి చదువుతున్నాను.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.