11, డిసెంబర్ 2011, ఆదివారం

ఎవరి కథలు "భారతి" పత్రికలో ఎక్కువగా అచ్చయ్యాయి!


ఒక మంచి మాస పత్రిక సంపాదకులవారు (మరెవరో కాదు మన రచన శాయి గారు) "ఎవరి కథలు 'భారతి' పత్రికలో ఎక్కువగా అచ్చయ్యాయి!" అని  అడిగి చాలా నెలలు గడిచినాయి , నేను జవాబు చెప్పలేక, జవాబు తెలియదనీ ఒప్పుకోలేక,  చీకట్లోకి రాళ్ళేస్తూ  నాకు తెలిసిన, నా దృష్టిలో భారతి లో కథలు వ్రాయగలిగిన సత్తా ఉన్న అందరి  పేర్లు  చెప్పి అలసిపోయినాక గాని ఆయన అసలు విషయం చెప్పలేదు . విని ఆశ్చర్య పొయ్యాను.ఆయన చెప్పిన పేరు నేను ఎప్పుడూ వినలేదు. రచన సాయిగారు ఆశ్చర్యం బయటకు కనపడనీయలేదు కాని లోపల అనుకుని ఉంటారు, ఈయనేక్కడి  సాహిత్య అభిమాని! అని.

నిజమే కాలక్రమేణా కొందరు రచయితలూ కనుమరుగవుతారు, ఆ తరువాత కాలంలో చదవటం ప్రారంభించిన వాళ్ళు, ఆ రచయితలను  "డిస్కవర్" చెయ్యాల్సిందే కాని, సామాన్యంగా వారి కథలు పుస్తక రూపంలోనో పాత సంచికల సంకలనాలలోనో దొరకటం అసాధ్యం.


ఇంతకీ ఆ రచయిత ఎవరు అంటే, ఆయనే చెప్పుకుంటారు ఆయన గురించి వారి  మాటల్లోనే చూడండి.

1950 లలో  శ్రీ ఆర్ ఎం చిదంబరం  
"అందరూ నన్ను అడిగే ప్రశ్న మీ ఇంటి పేరు ఏమిటి అని. ఆర్ ఎం ఏమిటండీ విచిత్రంగా ఉన్నది! ఆర్ ఎం అనే రెండు అక్షరాల్లో మొదటి అక్షరం" ఆర్" మా ఊరి పేరుకు చెందుతుంది. ఆ ఊరి పేరు "రిషిమంగలం", ఇక్కడే నారద ముని కొంత కాలం తపస్సు చేసాడట, అందుకని ఆ పేరు.  

ఇక రెండవ అక్షరం " ఎం"  మహదేవన్ మా నాన్నగారి పేరు . నా తల్లి తండ్రులు కేరళీయులు  నేను  పుట్టినది తూ గో జిల్లాలోని పిఠాపురం. మా నాయన గారు అక్కడ చిన్న వ్యాపారం చేసే వారు. నేను చదివినది కేరళలోని పాల్ఘాట్ అనే ఒక చిన్న ఊరిలో".ఇక మిస్టరీ విచ్చగొట్టి, అసలు విషయం చెప్తాను (ఇక్కడనుంచి మళ్ళీ నేనే అంటే ఈ బ్లాగు నడుపుతున్న వాణ్ని అన్నమాట). చిత్రంగా లేదూ. ఒక కేరళీయుడు, తన చదువును కేరళలో చదువుకుని ఒక్క తెలుగు ముక్క రాకుండా తల్లి తండ్రుల ఎడబాటు సహించలేక గోదావరి జిల్లాలో ఆరవ తరగతి నుంచి తెలుగు నేర్చుకుని పెరిగి పెద్దైన ఆయన కథలు, ఉద్డండులకే కాని మరొకరికి ప్రవేశం లేని భారతిలో పడటం, పైగా ఆ ఉద్డండులందరి కథల కంటే ఈయనవే ఎక్కువపడటం. ఈయన కూడా ఉద్దండ కథా కథనం చెయ్యగల రచయితే అని నిరూపించబడినది. 


ఈయన జీవితం చిన్నతనంలో కష్టాల మయమే. తల్లి ఈయన ఎనిమిదో తరగతి చదువుతుండగా హఠాత్తుగా   మరణించింది. తండ్రి మనస్సు వికలమై, కొడుకు కోసం కొంత కాలం మనసు రాయి చేసుకుని, కొడుకు చదువుకు సాయపడ్డారు కాని,  ఈయన స్కూలు ఫైనలు పూర్తి చేసుకుని, కాకినాడ ఫై ఆర్ కాలేజీలో చదువు కొనసాగించే  సమయంలోనే   భార్య పోయిన దు:ఖం భరించలేక కేరళలోని తన స్వగ్రామానికి  వెళ్ళిపొయ్యారు. చిదంబరం గారు ఒంటరి అయిపోయ్యారు. ఆయన నిస్పృహకు లోనుకాలేదు. రచనా వ్యాసంగం చేపట్టారు.

చిదంబరం గారు వ్రాసిన మొట్టమొదటి కథ ఆంధ్ర పత్రికలో పిల్లల కథల శీర్షికలో వెలువడి ఆయనకు మూడు రూపాయల పారితోషికం సంపాయించి పెట్టింది. ఇక అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు చిదంబరం గారు. సుమారు 350 కి పైగా కథలు వివిధ పత్రికల్లో, బారతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, తెలుగు స్వతంత్ర, జయంతి, ఆనందవాణి, చిత్రగుప్త వంటి అలనాటి ప్రముఖ పత్రికల్లో ప్రచురించారు.  ఆ క్రమంలోనే, బారతిలో అందరి కంటే ఎక్కువ కథలు వ్రాసిన రచయితగా (ఎవరికీ పెద్దగా తెలియని) కీర్తి సంపాయించుకున్నారు. 


చిదంబరం గారి  అభిమాన ఆంగ్ల రచయితలు  ఓ హెన్రీ, గై డి మొపాసా, సోమర్సెట్ మాం, (మాఘం అనకూడదని  తెలిసిన వారు ఘోషిస్తున్నారు) ఆస్కార్ వైల్డ్. తెలుగులో బుచ్చిబాబుగారు వ్రాసిన చివరకు మిగిలేది ఒక అఖండ కావ్యం అంటారు ఈయన. చివరకు మిగిలేది నవల, తనకు మనసు బాగాలేనప్పుడల్లా చదివేవాణ్ణి అని ఆయన చెప్పుకొచ్చారు. 

సరే మళ్ళి ఆయన జీవిత విశేషాలకు వస్తే, ఆయన చదువు పూర్తయ్యాక అక్కడా ఇక్కడా కుగ్రామాల్లో కూడా టీచరు ఉద్యోగాలు చేసి, చివరకు 1956లో బొంబాయి చేరారు. అక్కడ లెక్కల మాష్టారుగా సెయింటు జేవియర్ హైస్కూల్లో పనిచేశారు. అక్కడే హిందీ మాష్టారు ఐన చౌధరి గారితో మిత్రత్వం సంప్రాప్తించింది.  చౌధరిగారు మంచి హిందీ కథకుడు, కాని ప్రాప్తం లేక ఆయన కథలు ఏమీ ప్రచురితం కాలేదుట. ఈ లెక్కల మాష్టారు పని వదిలేసి, అఖిల బారతీయ ప్రత్తి మిల్లుల ఫెడరేషన్ లో  33 సంవత్సరాలు పనిచేసి, ఆ సంస్థ కార్యదర్శిగా 1992 లో రెటైర్ అయ్యి, బొంబాయిలో స్థిరపడిపోయారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నారు కాని ఏమీ వ్రాస్తున్నట్టు లేదు. 
శ్రీ గుడిపూడి సుబ్బారావు 
అసలు ఈ విషయాలన్నీ  బయటకు రావటానికి ముఖ్య కారకులు,చిదంబరంగారి వీరాభిమాని గుడిపూడి సుబ్బారావుగారు. ఆయన గురించి వ్రాయకపోతే ఇదంతా ఉప్పులేని కూరలాగ చప్పగా ఉంటుంది అనేశారు చిదంబరం గారు. చిదంబరం గారి కథా సంపుటి తీసుకురావటానికి శ్రీ గుడిపూడి సుబ్బారావుగారు ఎంతో కృషిచేసి సాధించారు. ఆయనకు ధన్యవాదాలు. ఇప్పుడు గుడిపూడి సుబ్బారావుగారిని చిదంబరం గారి గురించి అడిగితే, ఆయన తన్మయత్వంలో "చదువు పోతే పోయింది, నేను బుధ్ధిమంతుడుగానూ, చదువుకునేవాడిగానూ, కనిపించడానికి దోహదపడిన రచయితలు-మంచి కథలు వ్రాసి, నాకు రంగు రంగుల ప్రపంచాన్ని అందంగానూ-మరింత ఆత్మీయంగానూ చూపించిన ఆర్ ఎం చిదంబరంగారికి కేవల పాఠకులే ప్రచురించి తెలుగు పాఠకులందరి తరఫున సమర్పిస్తున్న కానుకల్లో మొదటిది ఇది, త్వరలో రెండవ, మూడవ సంపుటాలు, పాఠకుల చేతిలో ఉంచాలని అనుకుంటున్నాను" అన్నారు.  


1985 లో శ్రీ చిదంబరం  
ఎవరికీ పెద్దగా తెలియకపోయినా, ఒక అరుదైన రికార్డ్ సంపాయించిన ఈ రచయిత పూర్తి పేరు    శ్రీ రిషిమంగలం మహదేవన్ చిదంబరం.


చిదంబరం గారి కథల తోలి సంపుటి
 కొందరు రచయితలు ఎంతో అదృష్టవంతులు. వాళ్లకి భగీరధుడు వంటి అభిమానులు ఉంటారు. అలాంటి అదృష్టమే చిదంబరం గారిది. వీరి రచనలకు వీరాభిమాని మదిరకు చెందిన శ్రీ గుడిపూడి సుబ్బారావుగారు. ఈయన పూనుకుని ఎక్కడెక్కడో దశాబ్దాలనాటి  పాత సంచికల్లో మరుగున పడిపోయిన  చిదంబరం గారి కథలను ఎన్నో కష్టపడి ఒక సంపుటిగా తీసుకు రావటంలో ప్రధాన కృషి వీరిదే.
 

ఈ కథా సంపుటిలో 15 కథలు ఉన్నాయి.  అవి:
 1. అక్కయ్య
 2. చీకటి తెర
 3. కెరటాలు
 4. లోయలు
 5. సమానాంతర రేఖలు
 6. కనిపించని ముల్లు
 7. పర్యవసానం
 8. పరీక్ష
 9. తీరని సమస్య
 10. గమ్యస్థానం
 11. మిధ్యాబింబాలు
 12. అనురాగం-ఆత్మహత్య
 13. ముగింపు దొరికింది
 14. అన్వేషణ
 15. మూగమనసు.
ఈ కథలు సంపుటి దొరకపుచ్చుకుని  చదవాలి కాని సమీక్షల మీద ఆధారపడి కొనచ్చా లేదా అనే మీమాంసలో పడితే ఒక మంచి రచయిత వ్రాసిన చక్కటి కథలు చదివే అద్భుత అవకాశం  కోల్పోతారు  అని మాత్రం చెప్పగలను. అందుకనే ఆయన కథల మీద నా అభిప్రాయం చెప్పే సాహసం చెయ్యలేదు. కాని ఒకటి రెండు ముక్కల్లో చెప్తాను, ఈ కథలు చదువుతుంటె 1940, 1950 దశకాల్లో మన తెలుగునాట ఉన్న పరిస్థితులు, అప్పటి మనుషుల ఆలోచనా ధోరణి, ఆచారాలు, నమ్మకాలు వగైరా వగైరా బాగా తెలుస్తాయి.  చిదంబరం గారికి పాఠకులు ఊహించలేని విధంగా కథను ముగించటం చాలా ఇష్టం.

ఈ కథల్లో నాకు నచ్చిన కొన్ని భావాలు:
 • తెగేవరకూ తాడు లాగటమే మంచిది
 • ప్రేమ ఉన్నా వెల్లడించటం చేతకాదు
 • సమస్యలను చేదించటానికి మార్గం వెతుక్కుంటూ ఉంటే, జీవిత కాలం సరిపోతుంది, మోకాలు వరకూ గెడ్డం పెరుగుతుంది, జుట్టు తెల్లబడుతుంది.
 • జంతువులకైనా, కుక్కకైనా కృతజ్ఞత ఉంటుంది, మానవుడికి ఉండదు.
 • ప్రతి మనిషిలోనూ కొన్ని భావాలు పైకి రాకుండా అణగి ఉంటాయి. నొక్కి ఉంచి అనేక వేషాలు వేస్తాం. చివరకు మేక్-అప్ చేసుకుంటూ ఉంటే తెరకాస్తా పుటుక్కున  తెగిపోతుంది.
 • మనిషికి పరిస్థితులు ఓ స్థిరమైన మనస్థత్వాన్ని ఇస్తాయా? లేక స్థిరమైన  దృక్పథం అభిప్రాయాలు, భావాలు స్వతంత్రంగానే తమ స్థానాన్ని ఏర్పరుచుకుంటాయా?
 • ప్రేమకూ  వాంచకూ సంబంధం లేదని వాదించే వాళ్ళ మాటల్ని నేను విశ్వసించను. అవన్నీ సరైన పునాది మీద నిలబడవు. దూరదూరంగా కూర్చుని మనసులో ఊహలు సృష్టించుకుని ప్రేమను అనుభవించటం అసందర్భం
 • ప్రతివ్యక్తీ తన రహస్య మందిరంలో ఇతరులకు తెలియకుండా కొన్ని దాచుకుంటాడు. నిజానికి అవే అతని ప్రవర్తనను, శీలాన్ని నిర్ణయించే గీటురాళ్ళు కావచ్చును.   


ఈ పుస్తకం గురించిన వివరాలు తెలుసుకోవాలని  ఆసక్తి ఉన్నవారు 'రచన' శాయి గారిని సంప్రదించవచ్చు     
  6 వ్యాఖ్యలు:

  1. శివ గారు,
   శ్రీ చిదంబరం గారి గురించి మీరు వ్రాసిన వ్యాసం చాలా ఆసక్తికరంగా వుంది. ఇదొక 'మంచిపని 'అని నా అభిప్రాయం.

   ప్రత్యుత్తరంతొలగించు
  2. 'రచన' శాయి ఈ మెయిలు ద్వారా11 డిసెంబర్, 2011 12:27:00 PM ISTకి

   From: sai yvsrs
   Date: 2011/12/11
   Subject: Re: MAIL FROM SIVARAMAPRASAD KAPPAGANTU
   To: SIVARAMAPRASAD KAPPAGANTU


   A Nice analysis. Pl send the word file of the text for possible publication in Rachana at the appropriate time.

   ప్రత్యుత్తరంతొలగించు
  3. 'బాబు' గారూ. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇలా మన తెలుగులో ఎంతమంది మంచి రచయితలు మరుగునపడి ఉన్నారో కదా! పాత పత్రికలన్నీ వెతికి బాగున్న కథలను ఎంచుకుని సంకలనాలుగా వెయ్యగలిగే ఆర్ధిక బలం మనకు లేదు, ఆర్ధిక బలం ఉన్న వాళ్లకి, ఈ ఆసక్తి ఉండదు. ఫలితం, మన సాంస్కృతిక సంపద కాలగార్భాన కలిసిపోవటం.

   @శాయి గారూ

   మీకు వర్డ్ ఫైల్ పంపాను. రచన పత్రికలో నా వ్యాసం వేస్తానని అన్నందుకే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నిజంగా ప్రచురితం అయిన రోజు మరెంత ఆనందంగా ఉంటుందో కదా.

   ప్రత్యుత్తరంతొలగించు
  4. శివ గారు,
   మీరు చెప్పింది నిజం. ఇలాంటి విషయాల్లో శక్తి వున్నవాళ్ళకి ఆసక్తి లేదు, ఆసక్తి వున్నవాళ్ళకి శక్తి లేదు. రచయిత సొంతగా పుస్తకం వేసుకుని అమ్ముకోవాలన్నా - పరిస్థితులు నిరుత్సాహంగా వున్నాయి.

   ప్రత్యుత్తరంతొలగించు
  5. శివరామప్రసాదు గారు నమస్కారం....

   ఈ పోస్టు చదవడం ద్వారా ఒక మంచి పుస్తకం మరియు ఒక కొత్త రచియుత గురించిన వివరాలు తెలుసుకోగలిగాను, కృతఙ్ఞతలు. ఇటువంటి అరుదైన పుస్తకాలను / కధలను ఒక చోట చేర్చే ఆ మహానుభావులు ఎంతో అభినందనీయులు. నేను నిన్ననే బెంగుళూరు నుండి భాగ్యనగరం వచ్చాను. ఇప్పుడే "రచన సాయి" గారితో మాట్లాడాను, వెళ్లి పుస్తకం తీసుకోవడమే తరువాయి...!

   కృతఙ్ఞతలు
   రాజేష్ దేవభక్తుని

   ప్రత్యుత్తరంతొలగించు

  1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
  2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
  3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
  4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.