5, జనవరి 2012, గురువారం

నాయకత్వ లక్షణాలు - శ్రీ మానెక్ షా ప్రసంగం



మనదేశం 1971 యుద్ధంలో 90,000 వేల మంది యుద్ధ ఖైదీలను పట్టుకుని పాకిస్తాన్ని చిత్తు చిత్తుగా ఓడించినప్పుడు, సైన్యానికి నాయకత్వం వహించిన కమాండరు మానెక్‌షా, సైనిక కార్యకలాపాలలో మాత్రమే నిష్ణాతుడు కాదు. నాయకత్వం, నాయకత్వ లక్షణాలు వంటి విషయాలమీద విపులంగా అందరికీ పనికి వచ్చే విధంగా సరళమైన భాషలో చెప్పగల నేర్పరి.

ఆయన చేసిన అటువంటి ఒక ప్రసంగాన్ని చూసే అదృష్టం కలిగింది. ఒక కాలేజీ సిల్వర్ జూబిలీ వేడుకలని ప్రారంభించటానికి వచ్చి, అక్కడ ఉన్న విద్యార్ధులను ఉద్దేశించి చేసిన ప్రసంగం నాయకులవ్వాలని ప్రయత్నిస్తున్న వారందరూ తప్పనిసరిగా వినవలిసిందే.

ఆయన చెప్పిన విషయాలలో కొన్ని ముఖ్యమైనవి

  1. పుడుతూనే నాయకులు అవ్వరు ఎవ్వరూనూ!! కొద్దొ గొప్పో తెలివితేటలు ఉంటే చాలు, ఆ మనిషిని నాయకుడిగా మలచవచ్చు.
  2. నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం తాను చేస్తున్న పని మీద పూర్తి అవగాహన, ఆ పని చెయ్యటానికి కావలిసిన పూర్తి సమాచారం, నైపుణ్యం. ఇవి జన్మతః    రావు, మనిషి తనంతటతాను సంపాయించుకోవాలి.
  3. వృత్తి సంబంధిత జ్ఞానం ఉన్నపుడే, సామర్ధ్యం పెరుగుతుంది. వృత్తిపర జ్ఞానం, సామర్ధ్యం లేనివాడు నాయకుడు కాలేడు.
  4. చక్కగా విశ్లేషించి, తగిన నిర్ణయం తీసుకోగల సామర్ధ్యం. నిర్ణయం తీసుకోవటమే కాదు. తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకోవటం,(ఆ నిర్ణయం వల్ల నష్టం జరిగినా సరే) అతి ముఖ్యమైన నాయకత్వ లక్షణం
  5. న్యాయ దృష్టి, నిస్పక్షపాత ధోరణి.
  6. వత్తిడిని తట్టుకునే స్థైర్యం.

ఈ చెప్పిన విషయాలు ఆ చక్కటి ప్రసంగంలో నుండి నాకు అర్ధం అయ్యినంతవరకు, నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఆంగ్లం నుండి తెలుగు భాషలోకి తర్జుమా చెయ్యగలిగినవి.

ఈరోజున మనం గల్లీ దగ్గర నుండి, కార్పొరేటు కార్యాలయాలవరకు అనేక మందిని నాయకుల అవతారంలో చూస్తూనే ఉన్నాం. వారి దురాశలు, అహంకారం, కపటత్వాలనుండి, మీదు మిక్కిలి వారి అసమర్ధత వల్ల ఏదో ఒకరోజున బాధ పడినవాళ్ళమే. ఏదో రెండు సంవత్సరాలు, అంతు చిక్కని సిధ్ధాంతాలు చదివేసి (అవి ఏనాడు నాయకుడిగా ఉండి ఒక సంస్థను కూడ స్థాపించని వాళ్ళు ప్రతిపాదించినవి, వ్రాసినవి) నాయకులుగా ముద్రవేయబడి వేలమంది ఈ మానేజిమెంటు స్కూళ్ళ నుండి ప్రపంచం మీద పడుతున్నారు, తమకుందనుకున్న నాయకత్వ శక్తి యుక్తులను మన మీద వాడేయ్యటానికి. మరికొందరు చాలామంది, వారికి వారే నాయకుడుగా ప్రకటించుకుని పెత్తనం చలాయించటానికి ఉవ్విళ్ళూరుతున్నారు, ముఖ్యంగా రాజకీయాలలో, మరికొందరు వెర్రి మొర్రి  విదేశీ ఇజాల వెర్రెత్తించుకుని .  వీరందరూ ఎంతవరకు వారి నాయకత్వపు పటిమ చూపించగలిగారో, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న రకరకాల ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమస్యలు చూస్తేనే తెలుస్తున్నది, నాయకత్వ పటిమ ఎంతటి దుర్లభమైన  వస్తువుగా మారిపోయిందో. నాయకత్వ లక్షణాలలో ఉండవలసి ముంఖ్యమైన లక్షణం, "నిజాయితీ" అది ఈ నాడు పూర్తిగా కొరవడింది. 


"నాయకత్వం" అన్న మాట తెలిసిన వారందరూ తప్పనిసరిగా వినవలసిన చక్కటి ప్రసంగం శ్రీ మానెక్ షా గారు కొన్ని సంవత్సరాల క్రితం చేశారు. ఇంతటి మిలిటరీ కమాండరు, నాయకత్వ పటిమ గలిగిన ధీరోదాత్తుడు, చివరకు పట్టభద్రుడు కూడా కాదన్న విషయం ఆయన ప్రసంగంలోనే మొట్టమొదటగా ప్రస్తావించారు. ఆయన మాటాలలోనే చెప్పలంటే "నేను ఇంటరు సైన్సు అతి కష్టం మీద మూడొ తరగతిలో గట్టెక్కాను".

ఆయన ప్రసంగం విని నాయకత్వపు విషయాలనే కాదు, నలుగురిలో ఒక విషయం మీద స్టేజీ మీద ప్రసంగం(Public Speaking) చెయ్యటంలోని మెళుకువలను చూసి నేర్చుకోవచ్చును.

నేను ఒకసారి ఒక ట్రైనింగుకు వెళ్ళాను. వెళ్ళేప్పుడు, వీలైతే ఈ ప్రసంగం నలుగురికి చూపించవచ్చు అని వెంట సి డిలో పట్టుకుని వెళ్ళాను. రెండో రోజు మధ్యాహ్నం ఆ ట్రైనింగు ఇస్తున్న వారిలో ఒకరు లంచ్ తరువాత క్లాసు తీసుకోవటం కష్టసాధ్యమని వాపోయారు. ఎందుకంటే, చక్కటి భోజనం తరువాత అందరూ కునుకుతూ ఉంటారు, అలా కునుకుతున్న వారి దృష్టిని ఆకర్షించి, చెప్పదల్చుకున్న విషయం మీద మరల్చటానికి ఎంతో నేర్పు కావలి. నేను నాదగ్గర ఒక చక్కటి ప్రసంగం ఉన్నది , మొత్తం చూపించటానికి సమయం చాలదు కొద్దిగా రుచి చూపిస్తాను, అందరూ తప్పనిసరిగా చూస్తారు అని ఆ సి డి మల్టి మీడియా ప్రొజెక్టరులో ప్లే చెయ్యటం మొదలు పెట్టాను. ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు చూపిద్దాం ముఖ్య విషయాలు అని మొదలు పెడితే, ట్రైనింగులో పాల్గొనే వాళ్ళందరూ గోల చేసి (అందరూ మానేజర్లూ ఆపై స్థాయికి చెందినవారే) మొత్తం చూపించమని డిమాండ్  చేశారు. చివరికి, ట్రైనింగు కాలేజీ వారు, ఆరోజున ఉండవలసిన క్లాసు రద్దు చేసి గంట పైగా ఉన్న ఈ వీడియోను చూపించేందుకు అనుమతిని ఇచ్చారు. అందరూ తదేక దృష్టితో చూసి, విషయాలను ఆకళింపు చేసుకున్నారు.

వీడియో ప్రసంగం పూర్తవ్వంగానే, అందరూ లేచి కరతాళ ధ్వనులతో మానెక్ షాకు స్టాండింగు ఒవేషన్ ఇచ్చారు. ఆ సి డి ఇప్పటికీ దాదాపు అన్ని క్లాసులలోనూ చూపిస్తున్నారట, ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి ఆ నాయకత్వపు పాఠాలు.

ముఖ్యంగా చెప్పే విధానం,  చెప్పదలుచుకున్న విషయాలమీదకు మన దృష్టిని తనకు మాత్రమే సొంతమైన శైలిలో అప్పుడప్పుడూ చెళుకులతో, తన సుదీర్ఘ (50 సంవత్సరాలు) మిలిటరీ జీవితంలోని విశేషాలను ఉట్టంగిస్తూ,చేసిన ప్రసంగం, మనకు ఆయన చెప్పే విషయాలను చక్కగా ఆకళింపు చేసుకోవటానికి ఎంతగానో దోహద పడుతుంది.

ఆ చక్కటి వీడియో ప్రసంగాన్ని మన బ్లాగు లోకంలో అందరికీ చూపించాలని ఉన్నది. కాని ఆ వీడియో నలభై నిమిషాల పైన ఉన్నది, బ్లాగులో ముఖ్యంగా, భారత దేశంలో అంతటి వీడియో బఫర్ అయ్యి చూడోచ్చేప్పటికి యుగాలు గడుస్తాయి. అందుకని ఆ వీడియోలో ఉన్న ఆడియో మొత్తం వినటానికి వీలుగా ఈ కింది లింకులో ఇస్తున్నాను.






పైనున్న ప్లేయర్ ద్వారా మానెక్ షా గారి గళంలో నాయకత్వ లక్షణాలు, మరెన్నో ఆసక్తికరమైన  విశేషాలు విని ఆనందించండి.









ఇదే వ్యాసం నా బ్లాగులో కొంత కాలం క్రితం ప్రచురించాను. కాని అందులో ఉండే కష్టం తెలియక ప్రసంగపు వీడియోని రాపిడ్ షేర్ లోకి ముక్కలుగా అప్లోడ్ చేసి అందించాను. డౌన్లోడ్ కావటం కష్టం, పైగా రాపిడ్ షేర్ కొంతకాలానికి ఫైళ్ళు తొలగిస్తారు. అందుకని ఆ వీడియో నుండి  ఆడియో విడగొట్టి ఇక్కడ అందిస్తూ, ఆ వ్యాసాన్ని మళ్ళి ప్రచురిస్తున్నాను. 







3 కామెంట్‌లు:

  1. శివ గారు,
    మానేక్ షా ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకంగా వుంది. దీనిని నేటి యువత వినితీరాలి. మాకు దీనిని వినె అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.