27, జనవరి 2012, శుక్రవారం

శిధిలాలయం - ఒక సమీక్ష

   నేను వ్రాసిన ఈ సమీక్షా వ్యాసం క్రితం సంవత్సరం (2010) "రచన" దాసరి ప్రత్యెక సంచికలో ప్రచురించ బడింది.రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా పున:ప్రచురణ 
దాసరి సుబ్రహ్మణ్యంగారు వ్రాసిన 12 ధారావాహికలలో రెండవ పెద్ద ధారావాహిక శిధిలాలయం. 33 నెలల పాటు  ఏకధాటిగా కొనసాగి,  పాఠకుల ఆదరణ పొందినది. చందమామ పత్రికలో,  మాయలు మర్మాలు లేని ధారావాహికలు వెయ్యాలని,  చక్రపాణిగారు దుర్గేశ నందిని, నవాబు నందిని వేసి,  ఆ ధాటికి పత్రిక సర్కులేషన్ కోల్పోయి, మళ్ళి దాసరి వారి ధారావాహికలను పునరుధ్ధరించిన తరువాత,  పాతాళ దుర్గం మొదటిదైతే, రెండవ ధారావాహిక శిధిలాలయం. 

అందుకనే కాబోలు, ఈ ధారావాహికలో మాయలు, పిశాచాలు, దయ్యాలు ఎగిరే కపాలాలు వగైరా వగైరా కనపడనే కనపడవు. ఒక సామాన్యమైన శబర పల్లె నాయకుని  కొడుకు,  అతని స్నేహితుడైన ఒక రాకుమారుడు కలసి ప్రతినాయకుడు శిధిలాలయ పూజారి ఆట ఎలా కట్టించారు అనేదే ముఖ్య కథ. తూర్పు కనుమలలోని కుంభారమిట్ట పల్లె ప్రాంతంలో మొదలైన కథ ఎక్కువభాగం అలా అడవులలోనూ నదీ పరివాహిక ప్రాంతాలలోనూ తిరుగాడి, చివరకు అస్సాం అడవులలో సుఖాంతం అవుతుంది. 

సామాన్యంగా దాసరి వారి ధారావాహికలలో ఒక ట్రావెలోగ్ లక్షణం ఉంటుంది.  ఏ ధారావాహిక తీసుకున్న నాయకుని లేదా నాయకులను ఎదో ఒక పనిమీద బయలుదేరతీస్తారు.  వాళ్ళు అలా కష్టాలు ఎదుర్కొంటూ ఎన్నో ప్రాంతాలు తిరిగి, మనకు తెలియని విశేషాలను చూపించి, చదివించి,  చివరకు వారి గమ్యస్థానం చేరుకుని,  అనుకున్నది సాధిస్తారు.  శిధిలాలయం ధారావాహిక కూడ అందుకు భిన్నం ఏమీకాదు. ఈ ధారావాహికలో అనేకానేక ప్రదేశాలను చుట్టుముట్టి తాము అనుకున్నది సాధిస్తారు ఈ కధా నాయకులు.     

ఈ ధారావాహికలోని ముఖ్య పాత్రలు
  1. శిఖిముఖి
  2. విక్రమకేసరి
  3. శివాలుడు
  4. శిధిలాలయ పూజారి
  5. నాగుమల్లి
  6. గండుపోతు
  7. జాంగ్లా
తదితరులు

ఈ పాత్రలను వారి  పరిచయం వారినే చేసుకుంటూ కోంత కథ చెప్పమందాం. 

శిఖిముఖి:

నేనొక శబర కుర్రాణ్ణి. మా నాన్న శివాలుడు, మంచివాడు నెమ్మదస్తుడు. కుంభారమిట్ట మా పల్లె, హాయిగా కష్టపడి పనిచేసుకుంటూ అడవి తల్లి ఒడిలో సుఖంగా బ్రతుకుతున్న మాకు ఒక దుష్ట గ్రహం దాపురించింది. వాడే శిధిలాలయ పూజారి. ఓ రోజున నేను నా మంచి అనుచరుడు ఎర్రగండు తో కలసి వేట సాగిస్తున్నాను . ఎవరో రాజకుమారుడల్లే ఉంది, కవచం, శిరస్త్రాణం ధరించి, ఆయుధాలతో గుర్రం మీద వస్తున్నాడు. ఆయన మీదకి ఒక దొంగల గుంపు దాడి చేయ్యటం చూసేప్పటికి నా రక్తం మరిగింది. నేను అతనికి సహాయం వెళ్లాను. ఇద్దరం కలిసి ఆ దొంగలను తరిమి కొట్టిన తరువాత అతన్ని , మా పల్లె తీసుకెళ్ళాను. అప్పటినుంచి మొదలయ్యిన మా స్నేహితం ఎల్ల కాలం కొనసాగింది. పల్లె చేరినాక, అతను మా నాన్న స్నేహితుని మనవడని తెలిసింది.

మా మధ్య తిరుగుతూ, లేనిపోనివన్ని బోధించి ఇతర తెగల కుర్రాళ్ళని చెడగొడుతున్న దుష్ట గ్రహం వ్యక్తే అతనిమీద దాడి చేయించాడట. అతనిదగ్గర మరింకెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న ఆడవిలో శిధిలాలయం గురించిన ఆనవాళ్ళు,  వెళ్ళే మార్గపు రేఖలు ఉన్నాయట వాటికోసరం. సరే, మా అయ్యా తన స్నేహితుడి మనవడికి సాయం చెయ్యమని చెప్పాడు. ఈలోగా ఈ పూజారిగాడు, మా గ్రామంలో అగ్ని ప్రమాదం సృష్టించి నాకు పూర్తి కోపం తెప్పించాడు. వాడికి ఆశ్రయం ఇస్తున్న గండుపోతు పని పట్టి (ఆయనే నాకు పిల్లనిచ్చిన మామ అయ్యాడు తరువాత), ఆయన కూతురు, నాగుమల్లిని పూజారి బారినుంచి కాపాడి, విక్రమకేసరితో ప్రయాణం కట్టి, మధ్యలో పూజారి కుక్క పెట్టిన అన్ని అడ్డంకులు తొలగించుకుని, శిధిలాలయం కనుగొన్నాము. వారి తాతగారి కోరికను తీర్చాం. నాకు నాగుమల్లికి జరిగిన వివాహానికి రాజుగారుకూడ వచ్చి ఆశీర్వదించారు. నాగుమల్లి ఇప్పటికీ  అలుగుతుంటుంది, మా అయ్యను తన్నావుగా, నేను నీతో మాట్లాడను ఫో అని. అన్ని ఉట్టుట్టి కోపాలు! మరంతేగా.

విక్రమకేసరి: 
 
కుంభారమిట్ట, శివాలుడు గారు, శిఖిముఖి ఎంత హాయిగా ఉన్నారు ప్రకృతి  ఒడిలో.  నేను వచ్చి వాళ్లకు కష్టాలు తెచ్చిపెట్టాను . శిఖిముఖి వంటి సాహసవంతుణ్ణి  ఇంతవరకూ చూడలేదు. అతనిలాంటి వాళ్ళు ఒక్క పదిమంది మా సైన్యంలో ఉంటేనా !! మా తాతగారిని వెతుక్కుంటూ నేను శిఖిముఖి, శిధిలాలయం ఉన్న ప్రాంతానికి బయలుదేరాం. దారిలో ఎన్ని అడ్డంకులు , అన్ని పూజరి ఏర్పాటు చేసినవే! శిఖిముఖి సాహసం, కొంత నా యుక్తి వాడుకుని అన్నిట్లోంచి బయటపడి చివరకు అనుకున్నది సాధించాం. అమాయకపు పిల్ల నాగుమల్లి, శిఖిముఖిని పూజారి శిఖ కోసి తెమ్మన్నది. అడవితల్లి పిల్ల అయిన నాగుమల్లి అమాయకమే కాని, కోపం కూడ జాస్తే. ఆమె  కోపం చూస్తే నాకు కూడా భయమేసిన మాట నిజం. శిఖిముఖి, ఆ చిన్నదానికిచ్చిన మాటకోసం ప్రాణాలమీదకొచ్చినా సరే, తెగించి ఆమే కోరిన కోరిక తీర్చాడు.

శివాలుడు:
మాది కుంభారమిట్ట పల్లె. నేను ఆ పల్లెకు పెద్దను. ఈ ప్రాతంలో కొద్దిగా
చదువుకుని, చదువను వ్రాయను వచ్చినవాడిని నేనొక్కడినే.  నా యవ్వనపు రోజులలో, శూరసేన రాజకుమారుడు విక్రమకేసరితో పాటుగా దేశదేశాలు తిరిగాను.  ఆ దొరే నాకు చదువు నేర్పాడు. అనేక నాయకత్వ లక్షణాలు  నాకు అబ్బినాయి. నాకు మధ్య వయస్సులో కలిగిన ఏకైక సంతానం శిఖిముఖి. మంచి చదువు ఎంత చెప్పిద్దామన్నా వాడికి అబ్బలేదు. అదే నా బెంగ.  కాని వాడు వేటలో ఈ ప్రాతం మొత్తంలోకి మొనగాడు అని అందరూ చెప్పుకుంటుంటే నాకు గర్వంగా ఉంటుంది. 

హాయిగా ఉన్న మా మధ్యకు శిధిలాలయ పూజారి వచ్చిపడ్డాడు,  మాకు సవరలకు గొడవపెట్టబోయాడు. మా శిఖిముఖి గండుపోతును తన్ని పాతరలో పడేశాడు. ఆరోజున మా శబరులకు, గండుపోతు సవరలకు పెద్ద యుధ్ధమే జరిగేది, కాని సకాలంలో నేను అక్కడకు చేరుకుని అలా జరగకుండా ఆపగలిగాను. ఇక నా పాతకాలపు దొర, స్నేహితుడు అయిన  విక్రమకేసరి జాడలేకుండా వెళ్ళిపోయినట్టుగా తెలిసి చాలా బాధ పడ్డాను. ఆ తాత పేరే పెట్టుకున్న కుర్ర విక్రమకేసరి తెచ్చిన తాళపత్ర గ్రంధాలు చదివి ఆ ప్రాంతాలకు వెళ్ళాల్సిన ఆనుపానులు తెలియచేశాను. చిన్న విక్రమకేసరికి తోడుగా మా అబ్బాయి శిఖిముఖిని పంపాను. విజయం మా వాళ్ళనే వరించింది. ఆ శిధిలాలయ పూజారి ఆటలన్ని కట్టించి, మా శిఖిముఖి-విక్రమకేసరి విజయవంతంగా తిరిగొచ్చారని శూరసేన రాజుగారు జయపాలుడు నాకు సమాచారం అందగానే సంతోషంగా వెళ్ళాము. అక్కడే గండుపోతు కూతురు నాగుమల్లితో మా అబ్బాయికి పెళ్ళి కూడ అయ్యింది. 

నాగుమల్లి:

మా అయ్యను తన్ని వడ్ల పాత్రలో పడేసిన వాడెవడు అని కోపంగా వెళ్ళాను. మా నాన్న గండుపోతేమో ఆ కుర్రాడితో, వాళ్ల తండ్రితో సరదాగా కబుర్లాడుతున్నాడు. మా నాన్నెప్పుడో ఇంతే వస్తే పిచ్చి కోపం, పొగరు లేకపోతే బోళాతనం . అందుకనే శిధిలాలయ పూజారి మాటలు విని, లేనిపోని గొడవలకు కారణమయ్యాడు. శిఖిముఖి మీద ఇప్పటికీ కోపమే, మా నాన్నను అలా అవమానించి, కొట్టి పడేసినందుకు. కాని పాపం నామీద ఎలుగుబంటి దాడి చేసినప్పుడు మాత్రం, చిన్న చురకత్తి తప్ప ఇంకేమీ లేదు తన దగ్గర, అయినాసరే వెనుక ముందు చూడకుండా దానిమీద కలియబడి,  నన్ను రక్షించాడు, ఒళ్లంతా గాయాలు చేసుకున్నాడు. నన్ను పూజారి ముఠావాళ్ళు ఎత్తుకెళ్ళినప్పుడు,  ఆ రాజయ్య కొడుకు విక్రమకేసరితో కలసి, యుక్తిగా విడిపించాడు శిఖిముఖి. అందుకే అతనంటే ఇష్టం. నేను కోరంగానే, నాకోసం శిధిలాలయ పూజారి శిఖ కూడ కోసి తెచ్చాడు. ఇప్పుడంతా స్నేహమే, మా రెండు పల్లెలు కలసిపోయి సవర శబరలు ఒక్కటైపోయారు.

గండుపోతు:
నాగురించి చెప్పుకునేది ఏమున్నది. చాలా తక్కువ. సవరలకు
నాయకుణ్ణి. మతిలేని పనులు చేస్తూ ఉంటాను. బలం ఉన్నదికదా అని పొగరు. కొంచెం మంచిగా ఎవరన్నా మాట్టాడితే, బోళాగా వాళ్ళని నమ్మేస్తాను. ఈ మధ్య శిధిలాలయ పూజారినని చెప్పుకుని ఒక వెధవ నాచేత తప్పుడు పనులు చేయించాడు. పక్కనే ఉన్న తిమ్మగూడెం ధాన్యాన్ని బలవంతాన తీసుకుపోదామని ప్రయత్నించాను. విక్రమకేసరి  మీద దాడికి, శిఖిముఖిని పట్టుకోవటానికి నా మనుషులను వాడుకోవటానికి శిధిలాలయ పూజారికి ఇచ్చాను. ఆ పూజారి గాడు,  ఏమాత్రం కృతజ్ఞతలేకుండా, నేను శిఖిముఖి చేతిలో ఓడిపోయి, తన్నులుతిని, గాయాలతో వడ్లపాతరలో పడి ఉంటే, నాకు సహాయం రాకపోగా, నా కూతురు నాగుమల్లిని ఎత్తుకుపోయాడు. కాని శిఖిముఖి మంచి కుర్రాడు, సాహసి, నైపుణ్యంగలవాడు. అతను మా అమ్మాయిని రక్షించి మళ్ళి తీసుకు వచ్చాడు. ఆ అబ్బాయే లేకపొతే నేను ఈ శిధిలాలయ పూజారి చేతిలో తొత్తునై ఎన్నెన్ని వెధపనులు చెసేవాడినో తలుచుకుంటేనే భయంగా  ఉన్నది. శిఖిముఖి, రాకుమారుడు విక్రమకేసరి కలిసి ఆ శిధిలాలయ పూజారి అంతుచూసి, శిధిలాలయంలో ఉన్న నిధులు, ధనరాసులు పట్టుకుని శూరసేన దేశ రాజధానికి వచ్చారు. అంతా మంచిగానే జరిగింది. మా అమ్మాయి నాగుమల్లికి, శిఖిముఖికి చూడ ముచ్చటగా రాజుగారే పెళ్ళి జరిపించారు.  

శిధిలాలయ పూజారి: 

 హా హ్వాహా! నేనే శిధిలాలయ పూజారిని, కాళీమాత ఉపాసకుణ్ణి. ఆ కాళీ మాత ప్రసన్నం కోసరం మళ్ళీ ఆవిడకు పూజారినవ్వాలన్న(కిందటి జన్మలో నేనే శిధిలాలయంలో పూజారిని) తపనతో నేను కొన్ని పనులు చెయ్యాల్సి వచ్చింది. ఆ శబర కుర్రాడు, శిఖిముఖి,  ఏమో అనుకున్నాగాని, మంచి సాహసి. అతనికి తోడు విక్రమకేసరి. ఇద్దరూ కలసి నా పని పట్టారు. నేను వేసిన పన్నాగాలన్నీ విఫలమైపొయ్యాయి. చివరకు నా ప్రాణమే పొయ్యింది. చివరలో జ్ఞానోదయమయ్యింది, నే తలపెట్టిన కార్యం మంచిదే, గొప్పదే. కాని నేను అవలంభించిన మార్గాలు ఒట్టి దగాకోరువి, అమాయకులను   రెచ్చగొట్టి నేను మంచి అనుకున్న పనికోసం వాళ్ళ చేత వెధవ పనులు చేయించాను. ఎంత అంచి పనికైనా మార్గం కూడా మంచిది  కావాలని అప్పుడు నాకు తెలియలేదు. నా కాళ్ళు రెండు పచ్చడి అయిపోయి, అలా డోలీలో పడుండి, నా తల్లి కాళీమాత విగ్రహం  కపడుతుండగానే,  ఇక ఆగలేక దూకేశాను, ఆ శిఖరం మీదపడి పైకొచ్చేశాను. ఇప్పుడంతా ప్రశాంతమే. ఈ బుధ్ధి నాకు మొదట్లోనే ఉంటే దాసరి వారు కథ ఎలా నడిపేవారో మరి.

జాంగ్లా:
నేను పూజారి కి గూఢచారిని. మెరమెచ్చు మాటలతో శిఖిముఖి,
విక్రమకేసరి చెంత చేరాను. వారికి మోసం తలపెట్టాను, ఫలితం అనుభవించాను. నా కాలు పోయింది. శిఖిముఖి తోటి అడవి బిడ్డనైన నామీద ఎంత కనికరం చూపించాడు! తమకు ద్రోహం తలపెట్టినా నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను రక్షించాడు. అదే నాలో స్వామి భక్తిని పుట్తేట్టుగా చేసింది. 

చివరలో పూజారి గాడు పారిపోతుంటే నేనే వాడి శిఖపట్టుకుని, వాడు కత్తితో నా చేతులో పొడిచినా సరే వదలకుండా శిఖిముఖికి వప్పచెప్పి, నా ఋణం  తీర్చుకున్నాను. ఇప్పుడు, శికిముఖి చల్లని నీడలో హాయిగా బతుకుతున్నాను.

ఎర్రగండు: 

నేను మనిషిని కాదండోయ్. నేను శునకాన్ని, మీరు  భైరవుడు  అనికూడ అంటారుట. నేను వేటకుక్కల వంశానికి చెండినవాడిని. శిఖిముఖి  నేను కళ్ళు తెరవనప్పటినుండి దగ్గరుండి పాలుపోసి పెంచాడు. నాకు శిఖిముఖి అంటే ఎంతో విశ్వాసం, భక్తి అపైన ప్రేమ. మా జాతికి ఉన్న సహజ గుణాలు అయిన సాహసం, విశ్వాసం దాసరిగారు నాలో బాగా రంగరించారు. చెప్పుకోకూడదుగాని, మా శిఖిముఖి ప్రాణాలు చాలా సార్లు కాపాడాను.

కథలో జరుగకుండా నేపధ్యంగా తెలిసే విషయాలు:
కథలో వినపడుతూ మాత్రమే ఉండి కనపడని పాత్ర పెద్ద విక్రమకేసరిది. మనకు కనపడే  విక్రమకేసరి తాతగారు ఈయన. తండ్రి మీది గౌరవంతో కొడుకుకు ఆ పేరే పెట్టుకుంటాడు   శూరదేశ  రాజుగారు జయపాలుడు. గందరగోళంలేకుండా, మొదటి విక్రమకేసరిని పెద్ద విక్రమకేసరి   అనుకుందాం. శివాలుడు ఒక శబరపల్లె అయిన కుంభారమిట్టకు నాయకుడు. ఆయన కొడుకే మన ప్రధాన పాత్రధారి శిఖిముఖి. శివాలుడు పెద్ద విక్రమకేసరి వారి యవ్వన కాలంలో కలసి అనేక రాజ్యాలు అవి తిరిగి  చాలా జ్ఞానాన్ని సంపాదిస్తారు అని నేపధ్యంగా చెప్పబడుతుంది. శివాలుడు వ్రాయను చదువను అలాగే నేర్చుకుని ఉంటాడు.  

కథ స్థూలంగా:
పెద్ద విక్రమకేసరి మళ్ళీ  మరొకసారి బ్రహ్మపుత్రానది  లంకలలోకి వెళ్ళి ఎంతకాలమైనా తిరిగి రాడు. కొంతకాలాని, బ్రహ్మ పుత్రానది ప్రాంతంవాళ్ళు వచ్చి,  ఆయన వదిలి వెళ్ళినదిగా ఒక పెట్టె ఇస్తారు. అందులో కొన్ని తాళ పత్ర గ్రంధాలు ఉంటాయి. ఆ పత్రాలలో శిధిలాలయానికి ఎలా వెళ్ళాలి అనవాళ్ళు అవి ఉంటాయి. ఈ తాళ పత్రాల జాడ తెలిసిన ఒక దుర్మార్గుడు శిధిలాలయ పూజారిగా చెప్పుకుంటూ శబర-సవర పల్లెలలో కొంతమందిని డబ్బుతోనూ  తానూ తన వెర్రి నమ్మకాలనూ వాళ్లకు బోధించి లొంగతీసుకుని, ఆ తాళ పత్రాలు సాధించాలని పన్నాగం పన్నుతాడు.  శివాలుని సహాయం తీసుకుని, తన తాతగారి అచూకి తెలుసుకుందామని విక్రమకేసరి కుంభారమిట్ట వస్తుండగా పూజరి అతని మీద దాడి చేయిస్తాడు. అదే సమయంలో శిఖిముఖి అడవిలో వేట పనిలో తిరుగుతూ, ఈ అకృత్యం చూసి అడ్డుకుంటాడు. హీరోలిద్దరికీ పరిచయం  అలా జరిగి కథ చిరివరకూ కొనసాగుతుంది. శిధిలాలయ పూజారి రకరకాల పన్నాగాలు పన్నుతాడు, ఆ తాళ పత్రాలను సంపాయించటానికి. శబర పల్లెను తగులపెట్టిస్తాడు,  హీరోయిన్  నాగుమల్లిని ఎత్తుకుపోతాడు.  కాని అన్నిసార్లు  విజయం సహజంగానే శిఖిముఖి-విక్రమకేసరి ద్వయానికే చెందుతుంది.   చివరకు,  19 ఎపిసోడులు అయినాక, శివాలుడికి ఆ తాళ పత్ర గ్రంధాలలో ఏమి ఉన్నదో చూడటానికి అవకాశం దొరికి, విక్రమకేసరికి, శిఖిముఖికి వివరిస్తాడు.  విక్రమకేసరితోపాటుగా బ్రహ్మపుత్రానది ప్రాంతాలకు వెళ్ళి పెద్ద విక్రమకేసరి ఆనవాలు కనుక్కునే ప్రయత్నానికి తన కుమారుడైన శిఖిముఖిని వెంట పంపిస్తాడు. శిఖిముఖి తన పెంపుడు కుక్క ఎర్రగండు తో పాటుగా అతనితో వెడతాడు. తాళ పత్రాలు తన దగ్గర లేకపోయినా, శిధిలాలయ పూజారి వీళ్ళను వెంటాడి వెడితే సరిపోతుందిగదా అని భావించినట్టుగా, కథలో తరువాత తరువాత మనకు తెలుస్తుంది.  వాళ్ళు అలా ప్రయాణించి, ప్రయాణించి, పూజారి పెట్టిన అనేక అడ్డంకులు అధిగమిస్తూ, శిధిలాలయ ప్రాంతాలకు విజయవంతగా వెడతారు అంతకుముందే వీళ్ళను వెంబడిస్తూ అక్కడికి చేరిన  శిధిలాలయ పూజారి తన చివరి ప్రయత్నంగా హీరోలకు హాని తలపెట్టబోయి, ఫలించక పారిపోతూ, పూర్వం  తన గూఢచారి అయిన జాంగ్లా చేత చిక్కుతాడు.  జాంగ్లా తనకు పూజారి చేసిన అపకారం గుర్తుంచుకుని, అతన్ని గట్టిగా పట్టుకుని తనను పూజారి కత్తితో పొడిచినా  సరే  శిఖిముఖికి అప్పగిస్తాడు. శిఖిముఖి, నాగుమల్లి కోరిక ప్రకారం  శిధిలాలయ పూజారి శిఖ కోస్తాడు, ఆ దెబ్బతో వాడు లోయలో పడిపోతాడు.

చివరకు మన హీరోలు అక్కడకు వెళ్ళేప్పటికి పూజారిని  ఒక పెద్ద కొండచిలువ మింగుతూ ఉంటుంది వాడు నేలలో ఉన్న ఒక వస్తువుని గట్టిగా పట్టుకుని ఉంటాడు.  శిఖిముఖి-విక్రమకేసరి ఆ  కొండచిలువను సంహరించి, పూజారిని కాపాడుతారు. లోయలో పైనుంచి పడటం వాళ్ళ  ఆ కొండచిలువ మిం గటం  వల్ల   రెండు కాళ్ళు నజ్జు నజ్జు అయిపోయిన పూజారి తాను పట్టుకున్న వస్తువు మీదనుంచి చేతులు తొలగిస్తాడు. 
అదే శిధిలాలయ బంగారు శిఖరం, కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ కనపడుతుంది. ఆ శిధిలాలయం ఏళ్ళక్రితం వచ్చిన భూకంపాల  వల్ల భూమిలోకి దిగబడిపోయి ఒక్క శిఖరమే బయటకు కనపడుతూ ఉంటుంది.   అక్కడి వృశ్చిక జాతి వారిని తమవారిగా చేసుకుని, అఘోరీల ఏనుగులను వాడుకుని, శిధిలాలయం మీద పడి ఉన్న రాళ్ళను తొలగిస్తారు శిఖిముఖి-విక్రమకేసరి.  శిధిలాలయం బయట పడుతుంది.  శిధిలాలయ పూజారి ఆ పై ఎత్తుమీదనుండి శిధిలాలయ  శిఖరం మీదకి  దూకి మరణిస్తాడు. అక్కడ ఉన్న ధనరాసులన్ని తీసుకుని, మధ్యలో పెద్ద విక్రమకేసరి సమాధి దర్శించుకుని, విక్రమకేసరి, శిఖిముఖి శూరసేన రాజ్యానికి చేరుతారు. అక్కడే శిఖిముఖి నాగుమల్లిల వివాహంతో కథ ముగుస్తుంది.

దాసరివారి శైలి భాష:
దాసరి గారి భాష బహు సులభం. చక్కటి పదజాలంతో, పిల్లలకు ఏ విషయమైన చక్కగా బోధపడే పధ్ధతిలోనే ఉంటుంది. విలన్ ఎప్పుడూ విక-విక మనే నవ్వుతాడు. ఇద్దరు హీరోలలో ఒకడు కొద్దిగా సుద్దులు చెపుతూ ఉంటాడు. ఆ చెప్పేప్పుడు. "ఉంటవి", అన్న పదజాలం ఎక్కువగా వాడతాడు.  అదే కాకుండా, దాసరి వారి వ్రాసే పధ్ధతి, సంఘటనలను ఒకదాని తరువాత పేర్చటం, కథలలో కలిగే కష్టాలు, ఆ కష్టాలను ఉపాయంతో అధిగమించటం, ఎంతో నేర్పుగా వ్రాశారు. చిన్న పిల్లలకు చదువుతుంటె, ఈ గొప్ప కార్యాలను తాము కూడ కొంత సాహసంతో చెయ్యవచ్చు అని తడుతుంది. ఎంతటి కష్ట సాధ్యమైన పని అయినా మానవ ప్రయత్నంతో సాధించ వచ్చు అన్న సందేశం కథలో అంతర్లీనంగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నది.పిరికితనం, అబధ్ధాలాడటం దొంగపనులు చేయటం, మోసపూరిత స్వభావం  అనేవి దాసరి వారి కథలలోని హీరో కు ఉండవు. ఈ దుర్లక్షణాలన్ని, ప్రతి నాయకునికి పెట్టి , అలాంటి చెడ్డ  అలవాట్లు, ఆలోచనా పధ్ధతులు ఉన్నవారు ఎలా చెడిపోతారో, జీవితంలో ఏవిధంగా ఓడిపోతారో కథలోని సంఘటనలద్వారా నేర్పుగా పిల్లల మనస్సులలోకి ఎక్కిస్తారు దాసరి సుబ్రహ్మణ్యంగారు.

దాసరివారు పరమపదించేవరకు ఆయన ఒక కరడుగట్టిన వామ పక్ష వాది అని చాలా మందికి తెలియదు. ఆయన పోయిన తరువాత నలుగురూ చెప్పుకునే విశేషాలలో ఈ విషయం బయటికి వచ్చింది. అంతగా తాను నమ్మిన విషయాలను పిల్లల మీద రుద్దటానికి ఆయన తన కథలలో ఎక్కడా ప్రయత్నించినట్టు కనపడదు. అదే ఆ వ్యక్తిలోని  నిబధ్ధత. తాను చేసేది ఒకరి దగ్గర ఉద్యోగం, ఆ ఉద్యోగ ధర్మంగా ఈ కథలను  వ్రాస్తున్నారు. తాను నమ్మేదే ఇతరులు నమ్మాల్సిన పని లేదని, రచయితగా తనకున్న శక్తి యుక్తులను, తన పార్టీ సంబంధిత భావాలను అందరిమీద రుద్దటానికి  వాడకూడదని  నియమం చేసుకున్నట్టుగా కనబడుతుంది.  ఇటువంటి ఓర్పు చాలామంది రచయితలలో ఉండదు. వారికొచ్చిన వెర్రి మొర్రి అలోచనల్న్ని ఎదో ఒక ఇజం పేరిట పాఠకుల  నెత్తిన రుద్ది గాని వదలరు. 


 ధారావాహికలలో స్త్రీ పాత్రలు:.
సామాన్యంగా దాసరి వారు తమ ధారావాహికలలో స్త్రీ పాత్రలను  పరిమితంగానే ప్రవేశపెడతారు. ఆ పాత్రలుకూడ తెర  వెనుకే ఉండి  అప్పుడప్పుడు తళుక్కుమని పోతారు తప్పిస్తే కథా గమనంలో పెద్దగా పాల్గొనరు. కాని,  దానికి భిన్నంగా, శిధిలాలయం ధారావాహికలో, నాగుమల్లి పాత్రను, స్వాభిమానం కలిగి, సాహసి అయిన ఒక మహిళా   పాత్రను  సృష్టించారు. కాకపోతే,  సాహసిగా కనపడినా,  నాగుమల్లి, పూజారి బృందం తనను అపహరించగానే స్తబ్దుగా అయిపోతుంది. తనను  తాను విడిపించుకోవటానికి ఎమాత్రం చొరవ చూపదు. పైగా తనను కష్టపడి విడిపించటానికి  నానా యాతనలు పడిన శిఖిముఖిని చూసి "ఈ శబర కుర్రాడికి ఆ శిధిలాలయ పూజారి ఎంత జిత్తులమారో తెలిసినట్టు లేదు. వాడు మీకంటే ముందుగా  ఆ బ్రహ్మపుత్రా లోయల్లోని శిధిలాలయన్ని చేరతాడు" అని  అతి తెలివి మాటలు అంటుంది .  అప్పుడు ఆ విధంగా తనను తాను తనకంటే బలవంతుడైన  శత్రువునుండి విడిపించుకోలేని నాగుమల్లి, శిఖిముఖిని చాటుకు పిలిచి తనకు  శిధిలాలయ పూజారి శిఖ కోసి పట్టుకురమ్మంటుంది. అప్పుడు  శిఖిముఖి ".....ఆపైన నువ్వు మరొక సవరవాడి పెళ్ళాం అయిపోతే, వాడు నామీద ఈటె ఎత్తుతాడు" అన్న మీదట అతనికి అర్ధంకాని రీతిలో "నన్ను సవరవాడే కాదు, మరే శబరవాడూ కూడ చేసుకోలేడు" అంటుంది. పాపం శిఖిముఖి కళవెళపడతాడు అర్ధంకాక. ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అని దాసరి మరొకసారి చూపించారు.    

కథ సాగతీపుడు ఉన్నదా??
నాగుమల్లి పాత్రను కధ కోంత పొడిగించటానికి కూడ వాడుకున్నట్టుగా కనపడుతుంది. నాగుమల్లిని అపహరించి  శిధిలాలయ పూజారి ఎత్తుకుపోవటం సంఘటన శిధిలాలయ పూజారి దుష్టత్వాన్ని మరొకసారి చూపించే ప్రయత్నమే  అయినా, కథకు అంతగా అవసరంలేదు అనిపిస్తుంది. కాని తన తండ్రిని తన్ని పాతరలో పడవేసిన హీరో శిఖిముఖి ని చూసి చిటపడలాడుతున్న హీరోయిన్, హీరో  మీద అనురాగం కలగటానికి ఈ సంఘటన దాసరివారు కల్పించి రక్తి కట్టించారు. హీరోని ఇష్టపడకుండా హీరోయిన్ ఉంటే కథ సాగేదెలా?? ఆపైన, తనను అపహరించి బాధపెట్టి, తన తండ్రిని వాడుకుని చెడ్డపేరు తెచ్చిన  శిధిలాలయ పూజరి శిఖను కోసి పట్టుకు రమ్మంటుంది శిఖిముఖిని. తాను ఇష్టపడ్డ నాగుమల్లి కోరిక తీర్చటం కూడ ఒక మంచి ప్రోత్సాహంగా(STIMULANT)  శిఖిముఖిని  నడిపిందని చూపటం కూడ రచయిత ఉద్దేశ్యం అయి ఉంటుంది.   కాని ఈ నాగుమల్లి అపహరింపు ఆపైన ఆమె విడుదల దాదాపు 6-7 ఎపిసోడులు తీసుకున్నది. 33 ఎపిసోడులలో దాదాపు ఐదో వంతు ఈ సంఘటన ఉండాలా అన్న సందేహం ఇప్పుడు కలుగుతున్నది కాని చిన్నతనంలో చదువుతున్నప్పుడు మజా గానే ఉండి రంజింపచేసింది. 


కథా గమనం
1968 వ సంవత్సరంలో  33 భాగాలుగా రచించబడిన ఈ ధారావాహిక, మొదలు పెట్టినప్పటినుండి, చివరివరకూ ఉత్కంఠభరితంగా జరిగింది. ప్రతినెలా, ఒక ఆకస్మిక  సంఘటన  తరువాత ఏమి జరుగుతుంది అన్న విషయం ఊహకు అందని చోట ఆగిపోవటం తరువాతి నెలలో ఒక చక్కటి ఉపాయంతో పాత్రలు తమకు జరగబోయే అపకారంనుండి  బయటపడటం జరుగుతుంది.

అంతేకాదు, ఎక్కువ భాగం కథ అరణ్యాలలోనే  జరిగింది. పూర్తి సాహసోపేతమైన కథ. ఈ కథా గమనంలో, మన హీరోలు వారి బృందం తూర్పు ఆంధ్ర అడవులనుండి, అస్సాం అడవులవరకూ వెడతారు. ఆ వెళ్తున్నప్పుడు, ఆయా చోట్లలో ఉండే రక రకాల మనుషులను, తెగలను చక్కగా పరిచయం చేశారు దాసరి. ఈ కథలో మనకు కనపడే అడవి జాతుల వాళ్ళు, శబరులు, సవరులు, అఘోరీలు, ఇభ్యులు చివరగా వృశ్చిక  జాతి వాళ్ళు. ఎక్కడికక్కడ ఈ ధారావాహికలో పెద్ద విక్రమకేసరి మంచితనం, ఆయన ఈ అడవి జాతివాళ్ళకు చేసిన మేలు మన హీరోలను వెన్నంటి ఉండి, ఇక వీళ్ళ పని అయిపోయింది అనుకున్నప్పుడు, వాళ్ళను కాపాడుతుంది. 

మొదట చెప్పుకున్నట్టుగానే ఈ కథలో మాయలు, మర్మాలు, మాంత్రికుల మంత్రాలు మచ్చుకైనా కనపడవు. శిధిలాలయ పూజారి తానెంత మంత్రగాణ్ణొ అని ఊరికే వదరుపోతులా వాగుతాడేకాని, తనకు వచ్చిన ఆ మంత్ర శక్తేదో ఒక్కసారీ చూపించడు. మంత్రాల పేరు చెప్పుకుని బతికే మోసగాడు అన్న విషయం చక్కగా విశదం అవుతుంది.  శిధిలాలయ పూజారిని ఒక చోట 6-7 అడుగుల పొడుగు బాగా సన్నటివాడు, నెత్తిమీద గుడ్లగూబ ఆకారంలో ఉన్న శిరస్త్రాణం  ధరించినవాడుగా దాసరి వర్ణించారు.ఆ తరువాత ఒక్క విక్రమకేసరి గురించి కొద్దిగా వర్ణన  ఉన్నది.  ఇది  మినహా మిగిలిన పాత్రలను ఎక్కడా వర్ణించింది లేదు. చిత్రాగారు వేసిన బొమ్మలే మనకు పాత్రలను చక్కగా పరిచయం చేసినాయి

ధారావాహికకు బొమ్మలు:
 
ఘంటసాలగారు  పాడటం వల్ల జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు వ్రాసిన పుష్ప విలాపానికి, కుంతీ విలాపం పద్యాలకు ప్రసిధ్ధి మరియు  పేరు వచ్చిందా,  లేక ఆ పద్యాలను పాడటం వల్ల ఘంటసాలగారికి పేరు వచ్చిందా అని ఒక మీమాంస  కొంతకాలం క్రితం  జరిగిందని పెద్దలు చెబుతుంటారు.ఇదమిద్ధమని చెప్పటం కష్టం. అలాగే దాసరి వారి శిధిలాలయానికి వచ్చిన ప్రాశస్తి బొమ్మల వల్లన వచ్చిందా, లేక దాసరి వారి వర్ణనా చాతుర్యం ఆ బొమ్మలకు వన్నె తెచ్చిందా. చెప్పటం కష్టం. ఏది ఏమైనాగాని, చందమామ పత్రిక వైసిష్ట్యా నికి ముఖ్య కారణం బొమ్మలు. ఈ ధారావాహికకు మొదటి నుండి  చివరివరకూ బొమ్మలు వేసినది చిత్రాగారు. వారి అసలుపేరు టి వి రాఘవులు. ఆయనకు ఉన్న ముఖ్య ప్రతిభ ఒక పాత్రను మొట్టమొదటి భాగంలో ఎలా వేస్తారో, 33 భాగాలలోనూ అలాగే వెయ్యటం. అదేకాదు, రచయిత చెప్పని, వర్ణించని అనేక విషయాలను బొమ్మలలోకి జొప్పించటం, కథను అలవోకగా అర్థం చేసుకునేట్టుగా బొమ్మలు వేయటం. కథ జరుగుతున్న స్థలాన్ని  బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆ నేపధ్యం , పాత్రల దుస్తులు వగైరా  ఎంతో చక్కటి ప్రావిణ్యంతో వేసి, దాసరి గారి శిధిలాలయానికి,  బంగారానికి సువాసన అబ్బినట్టుగా చేశారు చిత్రాగారు.

సినిమా తీసి ఉంటే:
ఈ ధారావాహిక చందమామలో ప్రచురితం అవుతున్న రోజులలో విద్యార్ధుల మధ్య వాదోపవాదాలు జరిగేవి, ఈ శిధిలాలయం సినిమాగా తీస్తే ఎవరు ఏ పాత్ర వెయ్యాలి. కొంతకాలం గడబిడ జరిగి, అభిప్రాయ బేధాలు సమసినాక, ఈ కింది విధంగా ఏకాభిప్రాయం కుదిరిందట:

  • శిఖిముఖి                  ::      ఎన్ టి రామారావు
  • విక్రమకేసరి                ::       కాంతారావు
  • నాగుమల్లి                  ::       కాంచన
  • శివాలుడు                 ::      నాగయ్య
  • గండుపోతు               ::      ఎస్ వి రంగారావు
  • సవర భేరుండం         ::       పద్మనాభం
  • శిధిలాలయ పూజరి  ::        రాజనాల
  • జాంగ్లా                      ::        నాగభూషణం
  • పెద్ద విక్రమకేసరి        ::       ముక్కామల (ఫొటోలో)
కాని ఈ కోరిక నెరవేరలేదు. అనేక చక్కటి చిత్రాలు తీసిన విజయా సంస్థ అధిపతులే, చందమామను నడుపుతున్న వారు  అప్పట్లో ఒకరే అయినప్పటికీ ఈ మంచిపని జరుగలేదు. చక్రపాణిగారికి ఈ కథ మీద మక్కువ కలుగలేదు . మరింకెవరూ సాహసించనూ లేదు. మనం ఒక చక్కటి చిత్రాన్ని కోల్పోయాం. ఈ కథను  కొంచెం శ్రమకోర్చి అయినా సరే,  పూర్తిగా ఔట్ డోర్ షూటింగులో మన విఠలాచార్య గారి దర్శకత్వంలో తయారు చేసి ఊంటే, హాలీఉడ్ చిత్రాల తలతన్నేదిగా తయారు అయ్యేది.

కొసమెరుపు:
ఇంత చక్కటి ధారావాహిక, జానపద కథ మనదగ్గరే ఉన్నదని గ్రహింపులేక ఎక్కడో ఎవరో వ్రాసిన హారీ ఫోటర్ నవలను తెల్లవారుఝామునే వెళ్ళి లైనులో నిలబడి కొనుక్కున్నాం  అని గర్వంగా చెప్పుకునే  తెలుగు వాళ్ళను కూడ ఇవ్వాళ చూస్తున్నాం. అదే "ఇంటి మొక్క ఔషధానికి పనికిరాదు అంటే"  లేదా " అయిన వాళ్ళకు ఆకుల్లోను, కాని వాళ్ళకు కంచాలలో పెట్టటం అంటే". తెలుగువారికి ఉన్న భాషా అభిమానం (అదే అస్సలు లేకపోవటం) అందరికీ తెలిసిందే,  ఇలా జరగటంలో ఆశ్చర్యం ఏమీలేదు. దాసరి సుబ్రహ్మణ్యంగారు తెలుగువాడిగా పుట్టడం తెలుగు బాలల అదృష్టం. కాని ఆయనకు రావలిసిన పేరు రాలేదు. ఇదే ఏ యూరోపులోనో అమెరికాలోనో  ఉండి ఆంగ్లంలో వ్రాసి ఉంటే, ఈ హారీ పోటర్ నవలలు సోదిలోకి లేకుండా పోయేవి.  కాని ఇలా ఈ జానపద కథా బ్రహ్మను పొగిడినా బాధపడే విచిత్ర మానవులు, ఆపైన వారికి కూడ వంత పాడే అమ్మలక్కలు కూడా  ఊంటారని ఈ మధ్యనే తెలిసింది.    


ఈ "సమీక్షా వ్యాసం" లోని ధారావాహిక బొమ్మలు కర్టెసీ చందమామ పత్రిక 

 దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రత్యెక సంచిక మే నెల 2010 "రచన" సాయిగారు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తీసుకు వచ్చారు. అందులో ఇలాంటి సమీక్షా వ్యాసాలూ దాసరి గారు వ్రాసిన అన్ని ధారావాహికలకూ ఉన్నాయి. ఆపైన మరెన్నో ఆసక్తి కరమైన విషయాలూ, ఫోటోలూ వగైరా  ఉన్నాయి. ఆ ప్రత్యెక సంచిక కాపీలు ఇంకా ఇప్పటికి ఉన్నాయో లేదో తెలియదు. ఆసక్తి ఉన్నవారు "రచన శాయి" గారిని సంప్రదించవచ్చు. 

e mail    :  rachanapatrika@gmail.com
Phone    : 040 - 2707 1500






3 కామెంట్‌లు:

  1. ఎంచక్కా నన్ను నా బాల్యం లోకి తీసుకెళ్ళి
    నేను మిస్ అయిన బంగరుతునకల్ని అందించారు
    ధన్యవాదాలు శివరాం ప్రసాద్ గారూ

    రిప్లయితొలగించండి
  2. >>ఇదే ఏ యూరోపులోనో అమెరికాలోనో ఉండి ఆంగ్లంలో వ్రాసి ఉంటే, ఈ హారీ పోటర్ నవలలు సోదిలోకి లేకుండా పోయేవి.

    కరెక్ట్ గా చెప్పారండీ.. నేను లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కథకు పెద్ద అభిమానిని, కానీ "విచిత్ర కవలలు", "శిథిలాలయం" చదివాక ఆ కథ mediocreగా అనిపించింది. I dont mean to belittle LOTR but in my opinion these two stories are way ahead than that.

    మొన్నటికి మొన్న చూసిన అవతార్ సినిమా కూడా 2-3 చందమామ కథలు కాపీ కొట్టి చేసినదిగా అనిపించింది.. అందరూ ఆహా, ఓహో అన్నారు కానీ నాకేమాత్రం నచ్చలేదు.

    ఒక స్పిల్బర్గ్ చేతిలోనో లేక జేంస్ కామెరూన్ చేతిలోనో ఈ కథలు పడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.. (మనవాళ్ళకు ఇలాంటివి తీసేంత సాహసం లేదని నా నమ్మకం)

    -Karthik

    రిప్లయితొలగించండి
  3. ఇప్పడు మన రాజమౌళి చేతిలో పడి ఈ ధారావాహికలు సినిమా రూపం పొందితే ఎలా ఉంటుంది అనిపిస్తున్నది. లేనిపోని గ్రాఫిక్స్, సినిమాటిక్ ట్విస్టులు లేకుండా ఎలా ఉన్నది అల్లా తీస్తే అద్భుతమైన సినిమాలుగా ఈ ధారావాహికలు వస్తాయి.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.