27, జనవరి 2012, శుక్రవారం

అయ్యప్ప భక్తి యాత్ర లేక సామాజిక ఉద్యమమా!!!

 మా తమ్ముడు రాధాకృష్ణ ఈ మధ్య అయ్యప్ప యాత్ర చేసి వచ్చి ఆ విశేషాలు వ్రాసి పంపితే ఇక్కడ ప్రచురిస్తున్నాను. 
కొన్ని దశాబ్దాలుగా అందరూ వెళ్ళటం చూసి చూసి నాకు చాలా సంవత్సరాల నుండి శబరిమల చూడాలన్న కలిగిన  కొరిక ఎట్టకేలకు ఈ సంవత్సరం తీరింది. నన్ను తీసికెళుతున్న గురుస్వామి [పేరు లక్ష్మీనారాయణ] "మాల వెస్తారా" అని అడిగారు, కానీ నాకు మానెయ్యవలసినంత చెడ్డ అలవాటులు ఏమీ లేనందున మాల వెయ్యలేదు.

కానీ, యాత్ర మొదలైన తరవాత తెలిసింది మాల వెయ్యటం దీక్ష తీసుకొవటం అనేది మనుషులలో ఎంత మార్పు తెస్తుందో.....ఎందుకంటే ఎంతో కఠినమైన మనుషులు కూడా సాత్వికంగా మాట్లాడటం, అందరూ కలిసి ఎటువంటి తేడాలు లేకుండా ఒకలాగా కలిసి మెలిసి భజనలు చేయ్యటం, తినటం మొదలైనవి చూస్తుంటే సమాజంలో మనం కోల్పోయినది తిరిగి అందినట్లైంది. మాతో వచ్చిన వారిలో చిరుద్యోగులున్నారు...ఆఫీసర్లు, లారీ డ్రైవర్లు మొదలైన వారున్నప్పటికీ...ఎవరూ తమ అహంకారం గానీ హొదాని కానీ, లేదా ఒకరినొకరు ఆధిపత్యం చెలాయించటం కానీ చెయ్యాలనుకోలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది చిన్న పిల్లలుగా వచ్చిన "చిరు స్వాములకి" ఇచ్చే గౌరవం...నాకనిపించింది ఇంత చిన్న పిల్లలకి ఈ భక్తి నియమాలెందుకని; కానీ, మాల వేసుకొన్నాక వారికి పెద్ద వారిచ్చే గౌరవం వలన మనం పద్ధతిగా వుంటే పెద్దలు గౌరవిస్తారు అని ఆ పసి మనసులలో నాటుకుంటానికి చాలా దోహద పడుతుందని తెలిసింది.

స్వాములలో అందరూ ఒకటేనన్న భావం తప్ప కులాలకి తావు లేదు. ఎవరు ఎక్కువ సార్లు శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే వారికి అంత ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ముఖ్యంగా ప్రతీ సంవత్సరం దీక్ష తీసుకోవటం వలన వేసిన వారిలో వున్న ఏ దురలవాటైనా, దుర్గుణమైన క్రమంగా నశించవలసిందే మరి.

ఇంతెందుకు ఒక సమాజం కలిసికట్టుగా ఉండటమేమిటో ఈ స్వామి దీక్షల వలన తెలుస్తుంది. ఈ దీక్షా కాలంలో శబరిమలకి వెళ్ళ వలసిన స్వాములు 'అందరూ' రోజుకొకరి ఇంట్లో చేరి అన్ని వర్గాల వారూ కలిసి భజనలు ఒకేరకమైన స్వరంతోచెస్తూ, అందులో పాడేది అరవమా, తెలుగా లేక మళయాళమా అన్న భాషా భెధం లేకుండా చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్ద వారుదాకా 'అందరూ' కలిసి భజనా స్వరం..నాదం వింటుంటే నాకు భక్తితో పాటు "మనందరం ఒకటే, ఒకరికి ఒకరున్నాము" అనే భరోసా బలంగా వినపడింది.

ఇక యాత్ర విషయానికొస్తే సంక్రాంతి పండగ ముందు ఒక చల్లని సాయంత్రం విజయవాడ నుండి బొకారో-అలెప్పీ రైలులో బయలు దేరి మరునాడు సాయంత్రం ఎర్నాకుళం చేరాము. ఈ యాత్రలో మనం కొట్టాయం కూడా దిగవచ్చును. కానీ, చెంగనూరు నుండి శబరిమలైకి వెళ్ళటానికి మొదటి మెట్టైన "ఎరుములై" దగ్గర. ఎరుమలై అంటే మన తిరుపతిలో అలిపిరితో సమానం లాంటిదే. మేము ఎర్నాకుళం నుండి బస్సులో నాలుగున్నర గంటల ప్రయాణం చేసి రాత్రి 11.30 కి ఎరుమలై చేరాము.

అక్కడ అంతా పండగ వాతావరణం నెలకొని వున్నది. ఎరుమలై అనేది ఒకప్పుడు శ్రీ అయ్యప్ప స్వామి తిరుగాడిన మరియు వేటాడిన ప్రదేశమట...అందుకని అక్కడికి చేరిన భక్తులు చేతులో విల్లంబులు, కత్తులు[చెక్కవి..అక్కడ దొరుకుతాయి]చేతబట్టి, రకరకాలైన డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలు చేస్తూ అక్కడ ఉన్న అయ్యప్పస్వామి ఆలయ వీధిలో సంచరిచటం చూస్తే మనలో కూడా ఆనందం పెల్లుబుకుతుంది. అలా నృత్యం చేస్తున్నవారిలో అనేకమంది సామాజిక హొదా కలిగినవారే....వారు దేవుడిదగ్గర, సమాజంలోనూ ఒకరికంటే మరొకరు ఎక్కువ కాదూ అని నిరూపించారు.

ఇరుములై నుండి రెండురకాలుగా యాత్ర విభజించబడుతుంది. ఒకటి పెద్ద పాదం అనగా "వనయాత్ర". దీనిలో భాగంగా ఇరుములై నుండి పూర్తిగా అరణ్యం, కొండల మార్గాన 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి పంబ చేరవలసివుంటుంది. దీనికి కనీసం 18 నుండి 24 గంటల సమయం పడుతుంది. పూర్వం కాలంలో అందరూ ఆ మార్గానే వేళ్ళ   వలసి వచ్చేదట. రెండవది చిన్న పాదం...అనగా ఇరుములై నుండి  రోడ్డు మార్గాన బస్సులో పంబ వెళ్ళటం. పంబ దగ్గర నుండి పూర్తిగా కొండ మార్గానా శబరిమలైకి 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళ వలసివుంటుంది. మాతో వచ్చిన వాళ్ళు మొదలు అనుకున్న ప్రకారం వనయాత్ర చేద్దామనుకున్నారు. కానీ, అక్కడి అడవుల్లో పెద్ద గా వర్షం పడుతోందని వార్త తెలిసి మానుకున్నారు.

అందరూ కలసి బస్సులో పంబ వెళ్ళాము. ఇక్కడే పవిత్ర పంబా నది ప్రవహించేది.  ఇక్కడ చల్లటి పంబా నదిలో స్నానం చేస్తే ప్రయాణపు బడలిక మొత్తం మాయమవుతుంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి కానీ సహజంగా మిగిలిన పుణ్య క్షేత్రాలకిమల్లే ధరలెక్కువ. [ఈ విషయంలో విజయవాడ దుర్గమ్మ భక్తులు అదృష్టవంతులు; కొండ దిగి క్రిందకు వస్తే ఏ రకమైనా వస్తువులైనా చవుకైన ధరల్లో దొరికే విజయవాడ 1 టవును వున్నది.]

ఇక్కడనుండి ఏటవాలుగా వున్న కొండ ఎక్కుతుంటే దేవుడు కనిపిస్తాడు. ఇది చాలా కష్టమనిపించింది [వనయాత్రకంటే కాదుట]ఈ   కొండ ఎక్కటాని మొగవాళ్ళందరూ అర్హులే. కానీ, 10 నుండీ 50 సంవత్సరాల లోపల వయస్సు వుండే ఆడవారికి మాత్రం అర్హత లేదు. అటువంటి వారు వస్తే క్రిందనే వున్న అన్ని సదుపాయాలున్న వసతి గృహంలో పోలీసుల రక్షణతో ఉంచుతారు. తరవాత, ఈ కొండ ఎక్కలేని వారికి డోలీ  సదుపాయం కూడా వున్నది. వాటికి ధరలు ఎక్కటానికి 1200/-, దిగటానికి కూడా కలిపితె 2300/- ధర ఎక్కువనిపించినా పైకెక్కుతుంటే తెలుస్తుంది; మన బరువు మనమే మొయ్య లేకుండా వుంటే, ఆ డోలీ మోసేవారు ఎలా మోస్తారా అని ఆశ్చర్యమేస్తుంది.

పైకెక్కే దారంతా కొంరాళ్ళూ, దానిపైన కాంక్రీటుతో కప్పివున్నది. దీనిని చేయింఛినది "మాలవ్య" అని అక్కడ శిలాఫలకం ఉన్నది. ఎన్నోవందలకోట్లు ఆదాయం వచ్చే ఆలయానికి ఆయన చేత చేయించుకోవలసిన అవసరమేమిటో నాకర్ధం కాలేదు. ఇలా చెయ్యకముందు ఈ పైకెక్కే దారి మట్టితోనూ, మొక్కలతోనూ ఉండేదట. యాత్రికులు వచ్చే సమయానికి కొన్నిచెట్లు నరికి దారికి అడ్డంగా వేసి మట్టి జారకుండా చేసేవారుట. దీనికి తోడు కొండల్లో వచ్చే నీరు, వర్షం....పైకెక్కటమంటే చాలా కష్ట సాధ్యంగా వుండేదని నాతో వచ్చిన ఒక పెద్దాయన [పేరు రంగారావుగారు] చెప్పుకొచ్చారు.

సరే, మనం కోండ ఎక్కుతుంటే దారిలో అన్ని రకాల తినేవి దొరుకుతాయి. ఇంకొకటి ఏమంటే పైకెక్కే వాళ్ళకి క్రిందికి దిగే వాళ్ళు సపర్యలు చేయ్యటం కనపడుతుంది. తినటానికి గ్లూకోసు లేక ఏమైనా తినేవి ఇవ్వటం, చేతిలో వున్న తువ్వాలుతో విసరటం మొదలైనవి చేస్తుంటారు. ఇలా వారికి అనిపించటమే శబరిమలై అయ్యప్ప యాత్రలోని సార్ధకత అని వేరే చెప్పనక్కరలేదు.


ఇలా ఆయాసపడుతూ పైకెక్కిన తరవాత మొట్ట మొదటిగా చెయ్యవలసిన అయ్యప్ప  స్వామివారి దర్శనమే తప్ప మరొకటి కాదు. ఇలా పాద ధూళితో స్వామివారిని దర్శిస్తే చాల పుణ్యమని గురుస్వాములు చెప్పారు. దీక్షలో ఉన్నవారంతా ఆలయం ఎదురుగా వున్న 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అక్కడితో వారి దీక్ష పూర్తైనట్లు అవుతుంది. దీక్ష తీసుకోని నాలాంటి వారు సూటిగా ప్రక్కనుండి ఆలయం ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే దీక్ష తీసుకోని వారు తక్కువ ఉండటం వలన తొందరగా దర్శనం అవుతుంది. ఇక్కడ మంచితనం ఏమిటంటే స్వామి వారి దర్శనం కాకుండానే "రూము ఎక్కడ", "లడ్డూలు ఎక్కువ ఎక్కడ దొరుకుతాయన్న "ఆబ్లిగేషను భక్తుల" గోలండదు. పైన తిరుమలలో ఉన్న అన్ని సౌకర్యాలున్నప్పటికీ స్వామివారి దర్శనం తరువాత ప్రసాదం తీసుకొని క్రిందికి దిగి వెళ్ళే భక్తులే ఎక్కువ.

మేము పైన "అన్నదానం" మరియు "మెడికల్ క్యాంపు" నిర్వహించటానికి వెళ్ళటం వలన శబరిమలైలో 8 రోజులు ఉండటం జరిగింది. మరునాడు నాతోటి వచ్చిన[లారీ ఫీల్డు]ఇద్దరు పెద్దవారితో వెళ్ళి దర్శనం చేసుకొన్నాను. నాతోటి వచ్చిన ఒకాయన[పేరు శివాజీగారు] నన్ను అక్కడి ప్రధాన పూజారి[మేల్కోటి]దగ్గరకు తీసుకుకెళ్ళారు. ఇలా వేరొక చోట ప్రధాన పూజారిని మాములు వారు కలవటం సాధ్యమేనా....అందుకనే అయ్యప్ప యాత్ర అన్ని వర్గాల వారినీ, సామాన్యులనీ ఆకర్షించిందని నాకనిపించింది.

మరో దర్శనం మకర జ్యోతి చూసిన తరవాత అయినది. క్రింద నుండి ఆభరణాలు వస్తే వాటిని స్వామి వారికి అలంకరిస్తారు. ఆ సమయములోనే మకర జ్యోతి కనపడుతుంది. అయ్యప్పని రాజువి కమ్మని ఆయన తండ్రి కోరగా, స్వామి నిరకరించటంతో తండ్రి గారు విచారపడి "నీ కోసం నగలన్నీ చేయించి పెట్టాను" అనగా, దానికి స్వామి వాటిని "మకరసంక్రమణం" రోజున అలంకరించి చూసి ఆనందించమని తండ్రికి చెపుతాడు. కానీ చిన్న వాడైన తనను చూసి తండ్రి నమస్కరించ కూడదు కనుక మకరజ్యోతిలో తన తండ్రికి దర్శనమిస్తాడని గురుస్వాముల ద్వారా తెలిసింది. ఆ అడవి మార్గాన నగల రక్షణ కోసం ప్రజలను మరలించటం కోసం మకరజ్యోతిని వెలిగిస్తారేమో అని నాకనిపించింది. ఎందుకంటే మకరజ్యోతి సమయంలోనే క్రిందనుండి నగలు రావటం జరుగుతుంది.

జ్యోతి దర్శన సమయంలో మరొక విచిత్రం జరిగింది. క్రిందటేడు ఏదో జరిగిందనీ, కాటేజీల పైకి ఎవరూ వెళ్ళకుండా తాళాలు వేశారు. భక్తులకి ఆ సంగతి చివరి సమయంలో అనగా సాయంత్రం ఆరు అవుతుండగా తెలిసింది. ఈ చర్యని నిరసిస్తూ భక్తులందరూ అయ్యప్ప భజన మోదలు పెట్టారు. అది చూస్తే నాకు టీవీల్లో చూపించే ఇతర దేశాల ఉద్యమాల నినాదల హొరు లాగా వినపడింది...టీవీల్లో చూస్తున్నప్పుడు నేననుకునేవాణ్ణి, ఇలా మన దేశంలో కలిసికట్టుగా తమకోసం నినదించేంత సమైక్యత ఉంటుందా అని!!! కానీ నా అలోచన తప్పని వారి అయ్యప్ప నినాదాల హొరు చెప్పింది. చివరికి తాళం చెవులు వచ్చాయి. కానీ, మాదగ్గరకి వొచ్చేటప్పటికి ఆలస్యం జరగటంతో మా కాటేజీలో వున్న వాళ్ళు తాళం పగులకొట్టి మరీ పైకి వెళ్ళారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఎమవుతుందో అదే జరిగింది. తరవాత పోలిసులు వచ్చారు కానీ, వారు మౌనంగా ఓ ప్రక్కన నుంచున్నారు. తరవాత మకరజ్యోతిని 3 సార్లు చూశాము. ఆ సమయలో వినపడిన హొరు లేక నాద ధ్వని  నేను మునుపెప్పుడూ వినలేదు. దరిదాపులు నిమిషంపైన ఆ హొరు జనసముద్రంలో నుండి వచ్చింది.

ఇకపోతే, ఈ మకరజ్యోతి గురుంచి మన "మీడీయా వారూ, బాధ్యతగల విజ్ఞానంగల పౌరులూ" చాలా బాధపడి కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా జ్యోతి రహస్యాన్ని వెల్లడించమని "ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు" వారిని ఆదేసించింది. బాగానే వున్నది. ఇదే విషయంలో "ఇతరుల" మనోభావాలకి సంబంధిచిన "విషయాలు" వెల్లడించమనే ధైర్యం మన బాధ్యతగల పౌరులకి ఉన్నాదా?.....ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువమంది గుమికూడి తొక్కిసలాడుకునే అనేక ప్రదేశాలున్నాయి. హింసాయుతమైన పండగలూ ఉన్నాయి. వాటిగురించి ఈ బాధ్యతగల పౌరులకి ఏమైనా శ్రద్ధ వున్నదా...ఒక వేళ నిజంగా ప్రజల గురించి శ్రద్ధ వుంటే ప్రతీ సంవత్సరం కొన్ని వందల కోట్లు ఆదాయం వచ్చే ఈ శబరిమలై ఆలయం అభివృద్ధి గురించి ఆ కోట్ల రూపాయలు ఎందుకు వాడట్లేదని ఎవరైనా కోర్టుకి వెళ్ళారా?? కోర్టువారు కూడా స్పందించినప్పుడు ఇక్కడి సౌకర్యాలకి ఆ కోట్లు వాడమని దేవస్థానం బోర్డుని ఆదేశించి ఉంటే ప్రజలకి ఉపయోగకరంగా ఉండేదేమో...?? కేవలం మకరజ్యోతి రహస్యానికే ప్రాధాన్యతనిచ్చిన మన "గొప్ప బాధ్యతగల పౌరులు" దానికి సౌకర్యాలని కల్పించమని అడగటంలో ఎందుకు శ్రద్ధ వహించలేదు....???

సమాధానం చాలా తేలిక.......అయ్యప్ప యాత్రవలన కలిగే సామజిక చైతన్యం చూసి ఒర్వలేని "ఇతరులు" చేసే గొడవ, రగడే తప్ప మరొకటికాదు. అయ్యప్ప భక్తి యాత్రలో ఇమిడి ఉన్న సామజిక చైతన్యమే ఈ "ఇతరులకి" ఇబ్బంది కలిగేది. మనలో మనం కులపోరాటాలు చేసుకుని విడిపోయుంటేనే వీళ్ళ ఆటలు సాగుతాయి. ఈ ఇతరులలో "సైన్సు మూఢులు" కూడా ఉన్నారు. వీరికి నమ్మకానికి శాస్త్రానికీ{సైన్సుకీ} తేడా తెలియదు. నమ్మకానికి ఆధారం ఉంటేనే శాస్త్రమని ఈ మూర్ఖుల "నమ్మకం". మన పూర్వీకులు కూడా ఆధారాలు లేనివన్నీ శాస్త్రం కాదని అనివుంటే ఇప్పుడీ సైన్సు[శాస్త్రం] ఇంత అబివృధి చెందేది కాదని ఈ సంకుచిత సైన్సు మూర్ఖులకి తెలియదు.......విచిత్రమేమంటే ఈ శాస్త్రవేత్తలు "ఇతరుల" జోలికి వెళ్ళరు  మరి!!!.............శబరిమలై యాత్ర అంటే భక్తితో కూడుకున్న సామాజిక ఉద్యమమే....కాబట్టి. ఇకనైనా అందరూ అన్నీ ఆలోచించి బాధ్యతగా మెలగాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే శబరిమలై యాత్రవలన సమాజంలోని చెడు తొలగింపబడుతోందే కానీ...మూఢనమ్మకాలంటూ ఎవరినీ బలి తీసుకోవటం లేదు.

తిరుగు ప్రయాణంలో ఓ కర్ర చేతపట్టి దిగాము. దిగేటప్పుడు ఏటవాలుగా వుండటంతో కర్ర వుంటే మంచిది. దిగేటప్పుడు నాకొక హైదరాబాదు కుర్రాడు కలిశాడు...అతను చెప్పిన ప్రకారం అయ్యప్పదగ్గరకి రావటం వలననే అతనికి దురలవాట్లుపోయి ఆరోగ్యం సమకూరిందని తెలిసింది. మేము కూడా దారిలో పైకెక్కేవారికి కొంత సేవ చేస్తూ పంబ చేరాము. అక్కడనుండి కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సాయంత్రానికి తిరువనంతపురం శ్రీ అనంతపద్మనాభుని దర్శించుకున్నాము. మరునాడు ఉదయం గోరఖ్‌పూర్ రైలులో బయలుదేరి 25 గంటల ప్రయాణం చేసి విజయవాడ చేరుకొన్నాము.

చివరలో మళయాళం వారి ఏర్పాట్లు గురుంచి చెప్పుకొని తీరవలసిందే....ముందుగా భాష...మేము ఎర్నాకుళం నుండి ఎరుమలై, అక్కడ నుండి పంబ...శబరిమలై...తిరిగి అక్కడనుంది పంబ మీదుగా వేరే దారిలో తిరువనంతపురం వెళ్ళాము. ప్రతీ చోటా దేవస్థానములోనూ, రహదారిపైనా తెలుగుతో పాటూ దక్షణ భారత దేశ భాషలన్నీ కనపడటం చాలా ఆనందం కలిగించింది. కొన్ని బస్సుల మీద కూడా తెలుగు ఉన్నది. కేరళా ఆర్టిసీ వారుకూడా చాలా బస్సులు వేసి భక్తులకి చాలా సౌకర్యం కల్పించారు. మనం శబరిమలై నుండి క్రిందకు దిగగానే ప్రైవేటు బస్సుల వాళ్ళు అధిక ధరలు చెపుతారు. వీరినుండి రక్షించటానికి దగ్గర్లోనే ఒక బస్టాండు ఏర్పాటు చేసి ప్రైవేటు బస్సుల దోపిడీ నుండి భక్తులని కాపాడారు. తరవాత అక్కడి పోలిసులు కూడా చాలా సంయమనంగా  వ్యవహరించి, ఎక్కడా దురుసుదనం ప్రదర్శించక పోవటం కూడా చెప్పుకొతగ్గ విషయం.

ఏది ఎలావున్నా, యాత్ర బ్రహ్మండంగా  జరిగింది. ఎటువంటి దుష్ప్రచారాలనూ నమ్మకుండా లక్షలాది భక్తులు తమ మంచి జీవితం కోసం, దురలవాట్లను మానిపించే అయ్యప్ప కోసం వచ్చి మంచి సమాజానికి దారి చూపించారు. కొసమెరుపేమిటంటే స్వామివారి పవళింపు సేవ, ఆలయద్వారాలు మూసేటప్పుడు ప్రతీ రోజూ జేసుదాసుగారి "హరివరాసనం" అనే గీతంతో ముగిస్తారు. మనవాళ్ళ హృదయం ఎంత విశాలమైనదో దీనిబట్టి అర్ధమవుతుంది. స్వస్తి.




ఈ యాత్ర వ్యాస రచన రాధాకృష్ణ కప్పగంతు, విజయవాడ 

12 కామెంట్‌లు:

  1. చాలా వివరంగా, అందంగా వ్రాసిన వ్యాసం.

    రిప్లయితొలగించండి
  2. "మాల వెయ్యటం దీక్ష తీసుకొవటం అనేది మనుషులలో ఎంత మార్పు తెస్తుందో"
    ఈ మార్పు జీవితాంతం ఉంటే బాగుంటుంది.కానీ కొంతమంది మాత్రం దీక్షాధారణ మండలకాలం ముగియగానే యథాప్రకారం పాత జీవితంలోనే ఉంటున్నారు.ఎక్కువ సార్లు మాల వేసినవారు కూడా మద్యం సేవిస్తూ పాత అలవాట్లను వదలకుండా ఉన్నారు.విమర్శలకు అవకాశమిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  3. నా వ్యాసం వేసుకొన్నందుకు ముందుగా శివాగారికి ధన్యవాదాలు. హరేఫల గారూ, చిలమకూరు విజయమోహన్ గారూ ధన్యవాదాలు. అందరిలోనూ ఒకేసారి మార్పు అనేది ఒక్కసారిగా వచ్చే మనస్తత్వం వుంటే లేనిదేముంది......అందుకే కదా 18 మెట్లు 18 సార్లు రావాలని పెట్టింది.

    రిప్లయితొలగించండి
  4. ప్రసాదు గారూ,
    మమ్మల్నీ ఒక్కసారి శబరిమల యాత్ర చేయించారు! పోతే హిందూమత వ్యవహారాల్లో వేలుపెట్టటం అంటే ఈ హిందూదేశములో అందరికీ తగని మక్కువే! ఇదీ ఒకందుకు మంచిదేలెండి ఎక్కడి చెత్త అక్కడ ఊడ్చుకుపోతుంది. మీరు 'ఎరుములై' అని సూచించిన ప్రదేశం పేరు 'ఎఱుమేలి' (എരുമേലി).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @అచంగ

      This is a Guest Article written by my Brother Radhakrishna. This fact I have written at the top of the article and also at the end.

      Then "...ఎక్కడి చెత్త అక్కడ ఊడ్చుకుపోతుంది..." I could not follow what you mean by this.

      తొలగించండి
    2. ప్రసాదు గారూ,
      రాధాకృష్ణగారు రాసినట్టు చూశాను. అయితే 'ఎఱుమేలి' టైపులో దొర్లిన పొఱపాటేమో అని మిమ్మల్నే ఉద్దేశిస్తూ రాశాను.

      శబరిమల మకరజ్యోతి మానవసృష్టే అని తేలిపోయింది కనుక దాని చుట్టూ ఉండే కాకమ్మ కథలు (దీన్ని చూడటంవల్ల బ్రిటిష్ అధికారుల కళ్ళుపోవటం ఇత్యాదులు), దీని ఆధారంగా కల్పించబడే మూఢనమ్మకాలూ తద్వారా వివాదాలూ శబరిమల యాత్ర నుండి నిష్క్రమిస్తాయి. యాత్ర, యాత్ర పరమార్థం మిగిలితే అదే పదివేలు.

      తొలగించండి
    3. ఈ యాత్ర గురించిన ఎన్నో విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.

      తొలగించండి
  5. మమ్మల్నీ ఒక్కసారి శబరిమల యాత్ర చేయించారు! పోతే హిందూమత వ్యవహారాల్లో వేలుపెట్టటం అంటే ఈ హిందూదేశములో అందరికీ తగని మక్కువే! ఇదీ ఒకందుకు మంచిదేలెండి ఎక్కడి చెత్త అక్కడ ఊడ్చుకుపోతుంది. మీరు 'ఎరుములై' అని సూచించిన ప్రదేశం పేరు 'ఎఱుమేలి' (എരുമേലി).

    రిప్లయితొలగించండి
  6. Narayanaswamy S. గారూ, అచంగ (அசங்க)గారు ధన్యవాదాలు, ఇది వ్రాసింది ప్రాసాదుగారు కాదు. 'ఎఱుమేలి'---అక్కడ కేరళవారు వ్రాసిన తెలుగు ఫాలౌ అయ్యాను.ఇంగ్లిసషులో ERUMELY అని ఉన్నది. నేను వెళ్ళటం ఇదే మొదటిసారి.....anyhow thnakyou.

    రిప్లయితొలగించండి
  7. ఆచంగ గారూ ముందర మనని మనం గౌరవిచుకునే పదజాలం వాడితే అది ఇతరుల దగ్గర లోకువ లేకుండా చేస్తుంది. అంతా మంచికి అయినప్పుడు పనికిమాలిన వాదాలేందుకు. ఉదాహరణగా వెనుకటి కధ ఒకటి గుర్తుకొచ్చింది. సినిమాహాలులో తలకాయ నొప్పివచ్చినావిడ మందిమ్మని ప్రక్కన కూర్చున్న డాక్టరు మొగుడిగారిని అడిగితే ఆయన తన చొక్కా గుండీ ఇచ్చి చప్పరించమంటాడు. అది చప్పరించిన ఆవిడకు[నమ్మకం వలన]తలనొప్పి తగ్గిపోతుంది. ఈ కధకు పొడిగింపుగా మరో ప్రక్కన కూర్చున్నాయన "అదేమిటమ్మ మీ ఆయన ఇచ్చింది గుండీ కదా" అని చెప్పినట్లుంది. దీనివలన ఆవిడకు మళ్ళీ తలనొప్పి వచ్చే అవకాశం వున్నదని ప్రక్కన కూర్చున్న మూర్ఖుడికి తెలియాలన్నదే నా ఉద్దేశం.

    రిప్లయితొలగించండి
  8. చాలా బాగా వ్రాసారు. మీ ఈ రచనను విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చదివితే నిజమైన అయ్యప్ప భక్తులుగామారి నిష్ఠగా నియమాలు పాటించి ఆరోగ్యాన్ని, సంస్కారాన్ని సంపాదించి జాతి గౌరవాన్ని తప్పక పెంపొందిస్తారని నా నమ్మిక. మంచి విషయాలు చెప్పినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.