30, జనవరి 2012, సోమవారం

అమరవీరుల దినం

అరుదైన ఈ  ఫోటో సౌజన్యం http://www.whitec0de.com

 జనవరి 30  1948 మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. అహింసా పద్ధతిలో మనం  స్వాతంత్ర్యం సాధించుకున్నాం మనం అనే ఆనందం ఏమాత్రం నిలవకుండా దాదాపు దేశవ్యాప్తంగా మత  కల్లోలం చెలరేగి, హింసా పద్ధతిన మనకు స్వాతంత్ర్యం వచ్చినా దానికన్నా ఎన్నో రెట్లు అమాయక  ప్రజలు  ఊచ కోత కోయ  బడ్డారు. మహాత్ముడిగా పేరొందిన గాంధీ గారి మాట కూడా వినని స్థితికి వచ్చేసింది  దేశం. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన హింసకు కారణం గాంధీ గారి పక్షపాత వైఖరి అని ఆరోపిస్తూ, అదే నమ్మి, గాడ్సే, అహింస పద్ధతిలో ఎంతో నమ్మకం ఉంచిన గాంధీ గారిని కాల్చి చంపాడు. అహింసా చాంపియన్ అయిన గాంధీ గారు హింసా పద్ధతిలో మరణించటం చరిత్రలోని విషాదకరమైన సంఘటనల్లో  ఒకటి. 

ఈ విషాదకర సంఘటనను, ఆంధ్ర పత్రిక మరుసటి రోజున ఈ విధంగా అందించింది.
 పై పేపర్ కట్టింగ్ ఆంధ్ర ప్రదేశ్  ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం 

గాంధీ గారి మరణం భారత్ దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రజల విషాదాన్ని ప్రతిబింబిస్తూ ప్రముఖ గాయకుడు సూరిబాబు గారు ఒక పాట పాడారు. ఆ పాట ఈ కింది ప్లెయర్లో వినవచ్చు:

  
పై పాట సౌజన్యం ఫిరంగిపురం పాటల గంధర్వుడు శ్రీ శ్యాం నారాయణ 
మా చిన్న తనంలో దాదాపు 1980 లవరకూ కూడా జనవరి 30 ని అమరవీరుల దినం గా జరుపుకుని ఆ రోజున మహాత్మా గాంధీ తో కలిపి అనేకమంది అమర వీరులను తలుచుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించేవారు. అన్ని నగరాల్లోనూ ప్రత్యేకంగా సైరన్ మోగించి, ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం జరిగేది.ఇప్పుడు అలాంటిది పెద్దగా జరుపుతున్న దాఖలాలు లేవు. 

 
ఏమి చేస్తాం గాంధీ అనుచరులమని చెప్పుకుంటూ ఆయన మాటలను బోధనలను పడికట్టు మాటలు చేసేసి ఓట్లు దండుకునే మంత్రాలుగా చేసిపారేశారు   అక్టోబరు రెండు నో లేకపోతె జనవరి ముఫ్ఫై నో గుర్తుకు తెచ్చుకుని తూ తూ మంత్రంగా రెండు దండలు లైనుకట్టి మరీ వేసి చేతులు దులుపుకుంటున్నారు. కుదిరిన వాళ్ళు గాంధీ గారి సమాధి ముందు ఫోటోలలో పడటానికి కాసేపు కూచుని వస్తారు. అంటే ఆయన మీద చూపించే భక్తీ, ఆయన చెప్పిన ఆలోచనా పద్ధతులను అమలుపరిచే  రీతి. అందుకే కాబోలు ప్రముఖ రచయిత చలం గారు గాంధీ గారి బోధల గురించి ఈ కింది విధంగా వ్యాఖ్యానించారు:

"గాంధీగారి అహింసా సిద్ధాంతం ఒక ఉపకరణ, ఒక పాలసీ,  ఆయన అనుచరులకి.  ఒక ధర్మం  కింద, ఒక సత్యంకింద, ఎవరికీ విశ్వాసం లేదు".(మ్యూజింగ్స్ 290వ పుట-5వ  ముద్రణ)



అమర వీరుల ఆత్మలు   శాంతించుగాక 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.