1, ఫిబ్రవరి 2012, బుధవారం

ఏది నిజం!

నిన్నటి  పేపర్లల్లో పై వార్త లోపలి పేజీల్లో ప్రముఖంగా ప్రచురించారు. సార్జెంట్ దేవరాజ్ సింగ్ గాడ్సే ను ఎంతో సాహసం చూపి పట్టుకున్నారని, ఆ పట్టుకున్న సాహస కార్యానికి ఆయనకు అశోకచక్ర 1952  లో బహూకరించారని. 

గాంధీని హత్య చెయ్యటం ఆ హత్య వెనుక ఉన్న కుట్ర ఎవరెవరు ఈ కుట్రలో భాగస్వాములు. ఎవరి పాత్ర ఎంతవరకు చివరకు ఎవరికీ శిక్ష పడింది వంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి పరిశోధన చేసి, పోలీసు, కోర్టు రికార్డ్లను కూడా ఉదాహరిస్తూ ప్రముఖ రచయిత మనోహర్ మల్గొంకర్ "The Men Who Killed Gandhi" అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం చాలా ప్రజాదరణ పొంది అనేకసార్లు పున:ముద్రణ చేయబడింది.

పై పుస్తకంలో గాడ్సే గాంధీ ని కాల్చిన తరువాత జరిగిన ఉదంతం గాడ్సే మాటల్లోనే ఈ కింది విధంగా ఇవ్వబడింది:

పిస్టల్ నా కుడి అరచేతిలోఇముడ్చుకొని, రెండు చేతులూ ముకుళించి 'నమస్తే' అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేసాను. ఆ తరువాత కాల్పులు జరిగాయి, తుపాకీ దానంతటే పేలిందనిపించింది. నేను రెండు సార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయం. గాంధీ గుండు దెబ్బ తగలగానే 'హెరామ్' అని కిందపడిపొయ్యారు.  నేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని 'పోలీస్ పోలీస్" అని అరవటం మొదలు పెట్టాను.నాకు కావలిసింది అందరూ, నేను ఈ పని ముందుగావేసుకొన్న పథకం ప్రకారం కావాలని చేసానని అనుకోవాలి, అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశాననుకోకూడదు. అక్కడనుంచి తప్పించుకుని పారిపోవటానికి పయత్నించాననిగానీ, తుపాకీ వదిలించుకొవలని అనుకుంటున్నానని గాని ఎవరూ అనుకోకూడదు. తుపాకీతోసహా పట్టుబడటమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషం దాకా, ఎవరూ కదలలేదు". నాథూరామ్ గాడ్సే హత్యా స్థలంనుండి పారిపొయ్యే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు, అతన్ని నిర్భంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు. అక్కడ డి ఎస్ పి సర్దార్ జస్వంన్త్ సింగ్ చేత మొదటి సమాచార నివేదిక తయారు చేయబడింది. 


పై పుస్తకం ప్రకారం ఇప్పుడు పత్రికల్లో వ్రాసిన విధంగా గాడ్సేను వీరోచితంగా పట్టుకున్నది ఎక్కడ? మనోహర్ మల్గోంకర్  పుస్తకం లో ఉన్నది నిజమా, ప్రస్తుతం వార్తా పత్రికల్లో వచ్చినది నిజమా?

ఒక వార్త వ్రాస్తున్నపుడు ఆ విషయం మీద కూలంకషంగా పరిశోధన చేసిన పుస్తకం లో ఉన్న విషయాలను కూడా ఉదహరించవలసిన అవసరం ప్రస్తుతం మీడియాకు అనిపించక  పోవటం శోచనీయం.  లేదా వార్త వ్రాస్తున్న  చోటు ఎక్కువై, ప్రకటనలకు స్థానం తక్కువవుతున్నదని తీసుకున్న సంపాదక నిర్ణయమా!!!








3 కామెంట్‌లు:

  1. అన్ని పత్రికలూ ఇంతే
    ఆలోచన కలిగించటం కన్నా ఆవేశంకలిగించటమే వార్త అనే దాని లక్ష్యం అయింది.
    ఇది చాలా విచారించ వలసిన సంగతి.
    ఈ రోజుల్లో సంచలనాత్మకతకున్న విలువ మూలవార్తకు లేదు!
    అందుచేత వార్త దొరికినప్పుడు సరిగా పరిశీలించి అవసరమైతే పరిశోధించి మరీ సరిగా ప్రకటించాలన్న తాపత్రయం పత్రికలకు లేదు.

    రిప్లయితొలగించండి
  2. పైన పేర్కొన్న పుస్తకం తెలుగు అనువాదం ఉందా? ఉంటే ఎక్కడ దొరుకుతుంది?

    రిప్లయితొలగించండి
  3. @శ్యామలీయం
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. పత్రికల్లో చోటు నింపే గుమాస్తాలు కాకుండా, సమగ్రమైనవార్తలు పాఠకులకు అందించగల పాత్రికేయులు మళ్ళీ రావాలని నా ఆకాంక్ష.

    @ శంకరయ్యగరు

    Men who Killed Gandhi కు తెలుగు అనువాదం నాకు తెలిసి రాలేదండి. మనోహర్ మల్గొంకర్ ఒక మంచి ఆంగ్లో ఇండియన్ రచయిత. ఆయన అనేక రచనలు చేశారు. అందులో Bend in the Ganges, Men who killed Gandhi ముఖ్యమైనవి. కాని ఆయన పుస్తకల్లో ఏదీ కూడా తెలుగులోకి అనువాదం చెయ్యబడలేదు, పైన ఉన్న ఉదంతం నేను అనువాదం చేసుకున్నది మాత్రమే.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.