2, ఫిబ్రవరి 2012, గురువారం

రామాయణ రంకట! భారతం బొంకట!! ఎలా??

"రామాయణం రంకు భారతం బొంకు" అనేటువంటి నానుడి ఆ మాటలు ఎందుకు వచ్చాయో కూడా తెలియకుండా వాడెయ్యటం దశాబ్దాలుగా జరుగుతున్నది. 

తరచి చూస్తె రామాయణంలో  రంకు ఎక్కడ ఉన్నది? ఒకవేళ అలాంటిది ఉండి ఉంటే అది రామాయణం అయ్యి ఒక ఇతిహాసంగా ఇన్నాళ్ళు ప్రజల మనస్సుల్లో పవిత్రంగా ఉండి ఉండేది కాదు, అనేకమంది కవులు కవయిత్రులు తమ తమ పద్ధతుల్లో రామాయణాన్ని వ్రాసి ఉండేవారు కాదు. 

మరి రామాయణం రంకు అనేయ్యటం ఎంతవరకూ మర్యాద, సమంజసం. 

ఇక భారతంలో బొంకు అంటే అబద్ధం ఉన్నదా? ఉండి ఉండవచ్చు. ఏక్కడో ధర్మరాజు తన గురువు గారైన ద్రోణుడిని క్రుంగదీసి దెబ్బ కొట్టటానికి ఒక అబద్ధం లాంటిది ఆడాడు అని ఒక అపప్రధ. అంత మాత్రాన మహాకావ్యం మొత్తం "బొంకు" అనేస్తే ఎలా.

ఈ సందేహాలన్నిటికి కూడా జవాబులు తెలుసుకోవాలని ఉన్నా ఎవరిని అడిగితె ఏమనుకుంటారో, "ఓశ్ ఈ మాత్రం తెలియదుటోయ్" అంటూ ఎద్దేవా చేస్తారేమో అని ఒక బిడియం. ఏతావాతా చెప్పొచ్చేది  ఏమంటే రామాయణం రంకు, భారతం బొంకు అని ఎందుకు వాడుకలోకి వచ్చిందో నాకు తెలియలేదు. 

కాని  తాడేపల్లి పతంజలి గారు ఈ విషయంలో చక్కటి వివరణ ఇచ్చి నా అనుమానాన్ని రామాయణం వరకు నివృత్తి చేసారు. ఇలా నాలాగా ఈ విషయంలో పైన చెప్పిన నానుడి  ఎలా వచ్చింది అని తెలియక కొట్టుమిట్టాడుతున్న  వారి కోసం, పతంజలిగారు చెప్పిన విశేషాలు ఆయన గొంతులోనే వినండి:


  తాడేపల్లి పతంజలి గారు  తెలుగు లెక్చరర్

ఒక్క ధర్మరాజు చెప్పాడు అన్న ఒక్క అబద్ధం ఉదహరిస్తూ  భారతం బొంకు అని అనేయ్యటం సమంజసం అనిపించటం లేదు. పైగా ధర్మరాజు అబద్ధం ఆడటం వల్ల మహాభారతం నడవలేదు. యుద్ధం లో చివరలో ఆయన ఒక అబద్ధం చెప్పి ఉండవచ్చు. 


కాబట్టి పైన ఉదాహరించిన నానుడిలో రెండో భాగం ఇంకా "క్లారిఫై" అవ్వవలసే ఉన్నది.







9 కామెంట్‌లు:

  1. రామాయణం , భారతం మహా గ్రంధాలు .
    వీటిని అర్ధం చేసుకోవడం లో ఇప్పటికీ ఎవరి ఆలోచనలు వారివి.
    ఇందుకు , ఇవి చారిత్రిక గ్రంధాలు కాకపోవడం, ఒక మతానికి సంబంధించినవి కావడం , వీటికి సరైన హేతుబద్ధత లేక పోవడం కారణం.
    ప్రతీదీ ప్రదేశము , కాలము , పరిస్తితులు పైన ఆధారపడి వుంటాయి.
    దేవుడు పేరుతో చెపితే ప్రజలు వింటారు అనుకుంటే ఏదైనా మంచి పని చేయాలన్నా , చెప్పాలన్నా దేవుడు పేరుతో చెప్పడం తప్పు కాదు.
    పై రెండు మహా గ్రంధాలు కూడా అలా రాసినవే అని నా అభిప్రాయం.ఇవే కాదు ఇతర మత గ్రంధాలూ లేదా మంచిని బోధించే ఏ గ్రంధాలు అయినా అంతే.
    లేని దేవుడుని లేడు అని నిరూపించాలనే సందర్భం లో ఎలా వాదించాలో తెలియని వారు ఉక్రోషం తో చేసే అభాండాల లో నుండే ఈ సామెత వచ్చి ఉండవచ్చు.
    దేవుడు లేడు అని వెర్రిగా వాదనలు చేసే సందర్భం లో దేవుడు పేరుతో చెప్పిన మంచిని వంచిచడం కోసం రామాయణం రంకు , భారతం బొంకు అనేవి వాడి వుంటారు.
    మనిషిని మనిషి నమ్మలేని పరిస్తితి ఉన్నంత వరకూ దేవుడు వుంటాడు. దేవుడు ఉన్నా లేకున్నా దేవుడి పేరుతో చెప్పిన మంచిని తూలనాడ్డం మంచిది కాదు అని నా అభిప్రాయం.
    రామాయణం మనిషి ఎలా విలువలతో జీవించాలని చెపితే , భారతం విలువలు కోల్పోతున్న సమాజంలో విలువలను నిలపాలన్నా , అందుకోసం చేసే యుద్ధం లో ఎలాంటి ఎత్తులు వేయాలో నేర్పుతుంది. వీటిని అపసవ్య కోణం లో చూడడం కంటే ఇవి ఏ కాలమాణ పరిస్తితులలో రాసారో అర్ధం చేసుకుని మానవత్వపు విలువలని కాపాడడం లో వాటి ఉపయోగాన్ని ఉపయోగించుకోవాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగా చెప్పారు కొండలరావుగారూ. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

      "...వీటికి సరైన హేతుబద్ధత లేక పోవడం కారణం..."

      ఒక విషయానికి హేతుబధ్ధత ఉందా లేదా అన్నది తీసుకోవటానికి పరిధి మనకున్నాయనుకున్న తెలివితేటలే కాని మరేమన్నా పరిధి ఉన్నదా? దీనికి ఉదాహరణ, భూమి బల్లపరుపుగా ఉన్నదని శతాబ్దాలుగా నమ్మటం. ఆ తరువాత కాదు గుండ్రంగా ఉన్నదని కొంతమంది బల్లగుద్ది శాస్త్రీయంగా (!) చెబితే అది నమ్మెయటం. మానవుడు రాకెట్లల్లో వెళ్ళి భూమిని ఫొటో తీసినదాకా ఎవరూ చూడలేదుకదా భూమి గుండ్రం అని. ఇప్పటికీ, భూమి బల్లపరపుగా ఉన్నదని నమ్మేవారి సొసైటీలు ఉన్నాయట!.మరి వాళ్ళకున్న హేతుబధ్ధత ఏమిటో కదా?!

      హేతుబధ్ధత కు కొలమానం ఏమిటి? ఏమన్నా ఉన్నదా. మనకు నచ్చనదల్లా హేతుబధ్ధం కాదు, నచ్చినది ఏ గడ్డపువాడు వేరే పనిలేక లైబ్రరీల్లో కూచుని వ్రాసినదైనా సరే హేతుబధ్ధత ఉందనుకోవటం పరిపాటి. కాబట్టి హేతు బధ్ధత అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలిసినదే కాని, మరెవరో వచ్చి ఇది కాదు అది అవును అని చెబితే నమ్మెస్తే, అదేరకపు హేతుబధ్ధత అవుతుంది!

      ఏమయినా మీ వ్యాఖ్యలో ఇతర మత గ్రంధాలు కూడా అలాంటివే అనే ధైర్యం చేసినందుకు ధన్యవాదాలు. సామాన్యంగా హేతుబధ్ధత గురించి మాట్లాడేవారు హిందూ మత గ్రంధాలనే ఎన్నుకుంటారు. ఇతర మత గ్రంధాల జోలికి పోరు. పోతే కీళ్ళు విరుస్తారని వాళ్ళకు తెలుసు. హిందూ మత గ్రంధం ఐతే పట్టించుకునేది ఎవరు!!?

      తొలగించండి
    2. ఇలా మొదటి సారిగా అన్నది ఆరుద్ర గారు అనుకుంటా...

      తొలగించండి
  2. " హేతుబధ్ధత కు కొలమానం ఏమిటి? ఏమన్నా ఉన్నదా."
    - హేతుబద్ధత అంటే కార్యకారణ సంబంధాలను వివరించగలిగేది.నిజాన్ని ఋజువు చేయగలిగేది.
    హేతుబద్ధత ఎవరికి వాల్లు నిర్నయించుకునేది కాదు . అందరికీ అర్ధమయ్యేలా ఆచరణలో నిరూపించగలిగేది. ఎవరికి వాల్లు నిర్ణయించుకునేది విశ్వాసం మాత్రమే.
    నిరూపించగలిగేవి హేతుబద్ధత కలిగినవి అయితే విశ్వాసాలు నిరూపణకు విశ్వాసం పొందగలిగినప్పుడు వాటికి హేతుబద్ధత లభిస్తుంది.
    విశ్వాసాలన్నీ అవాస్తవాలు అని చెప్పలేము. అవి నిరూపణకు నిలబదగలిగినప్పుడు మాత్రమే హేతుబద్ధత లభిస్తుంది.
    హేతుబద్ధతకు మన తెలివితేటలే పరిధి అనుకోవడం అమాయకత్వం లేదా పరిమిత తెలివితేటలు ప్రదర్శించడం క్రిందికే వస్తుందనేది నా భావన.
    నిరూపించగలిగే విషయాలపై ఇంకా స్వంత నమ్మకాలు వుండడం ( భూమి బల్ల పరుపుగా వుందని నమ్మడం ) వాల్ల విశ్వాసం మాత్రమే . బ్రిటీష్ లైబ్రరీలో కూర్చుని చెప్పినా , మనం బ్లాగుల్లో చెప్పినా మనం చెపితే హేతుబ్ద్ధత కాదు .
    అది ఆచరణలొ ఇదీ...ఇలా...ఇందుకూ..అని నిరూపించగలగాలి. కొన్ని నిరూపించడానికి క్లిష్టంగా వున్న వాటిని గత అనుభవ భావాలతో మేళవించి చెప్పగలగాలి.సైంటిస్టులు ప్రయోగాలతో అధారాలతో నిరూపించి భూమి గుండ్రంగా ఉందని నిరూపించాక కూడా బైబిల్ పట్టుకుని మా గ్రంధం లో ఇలా వుంది మేము నమ్ముతాము అంటే అది విశ్వాసం మాత్రమే.
    విశ్వాసం వాదనకు నిలబడకపోవచ్చు. కొన్ని విశ్వాసాలను ఎదురువాదనతో నిలబెట్టనూ వచ్చు. కానీ హేతుబద్ధత అంటే కేవలం వాదన మాత్రమే గాక ఆచరణలో నిరూపించగలిగేది కూడా అయి వుంటుంది.
    తరువాతి కాలం లో అది తప్పు అంటే వినయంగా ఇప్పటివరకూ ఇంతవరకే తెలిసింది . ఇప్పుడు మరి కొంత తెలిసింది అని కొత్తగా తెలిసిన దానిని కలిపి చెప్పుకుంటూ ... పోతుంది.
    హేతుబద్ధత గురించి మాట్లాడే వాల్లు హిందూ మతం గురించే మాట్లాడితే అది ఒక మతం వాల్ల విశ్వాసాలను దెబ్బ తీయడం క్రిందికే వస్తుంది. ఇది ఒక రకమైన పైత్యం. మతాన్ని విమర్సించెటపుడు కోపంతోనో ద్వేషంతోనొ విమర్షిస్తే అది మతొన్మాదుల ఉన్మాద చర్యలకంటే ప్రమాదం. మరింత ఉన్మాద్మ పెరగడానికి కారణం అవుతుంది.
    అలా అని హిందూ మతం లో సతి గురించో , ముస్లిం మతం లో తలాక్ గురించో మాట్లాడకుండా పోట్లాడకుండా వుండకూడదు.
    మైనారిటీ మతోన్మాదమైనా , మెజారిటీ మతోన్మాదమైనా ప్రమాదకరమే.
    హిందూ మత గ్రంధం ఐతే పట్టించుకునేది ఎవరు!!? ఎందుకు లేరు. భజరంగదల్ నుండి విశ్వహిందూ పరిషద్ వరకూ చాలా మందే వున్నారు. కాకపొతే ప్రజలను వోటర్లుగా చూడడం అలవాటైన మన నేతలు ముస్లిం , మైనారిటీ సోదరులారా అంటో వెకిలి ప్రేమ ఒలక బోస్తుంటారు.రిజర్వేషన్‌ల పై రాజకీయం చేస్తుంటారు.
    ఇది కూడా జాగ్రత్తగా గమనిస్తే మతోన్మాదం , మత ఘర్షనలు పెరగడానికీ సమాజం లో అంతరం పెరగడానికీ అంతర్లీనంగా ఉపయోగపడుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొండలరావుగారూ బాగా వ్రాశారు కాని, కాని నేను చెప్పేది ఏమంటే మనకంటూ తెలిసి అర్ధం అయ్యేవరకూ కూడా దేనిలోనూ హేతుబధ్ధత కనపడదు అని. మనకు ఇష్టం అయితే హేతుబధ్ధం లేకపోతే మూఢాచారం. ఇది ఇవ్వాళ్టి ప్రపంచం.

      తొలగించండి
  3. రామాయణాల గురించి చర్చించే ఓపిక నాకులేదుగానీ ఈ సోకాల్డు హేతుబధ్ధత గురించి మరియు మతగ్రంధాల హేతుబధ్ధత గురించీ...

    హేతుబద్ధత అంటేనే మనం reasoning "మన"చేత reason out చేయబడగలగడం అయినప్పుడు, మన హేతువుకందనివాటిని నిర్హేతుకమైనవిగా పరిగణించడంతప్పులేదేమో. నాకైతే ఇలా అనిపిస్తుంది. మన logical/reasoning abilities అన్నీ "మన" మతం దగ్గరికొచ్చేకొద్దీ తిరోగమన దిశలో వెళుతుంటాయి. కావాలంటే చూడండి. ఒక హిందువుని ఇస్లాము లేదా క్రైస్తవమత గ్రంధాలు విమర్శించేటప్పుడు దీంట్లో అది తప్పు, ఇది తప్పు అంటూ ఉంటాడు. అదే తన పురాణాల దగ్గరికొచ్చేటప్పటికిమాత్రం ఇలా "మనకు అంతుబట్టనంతమాత్రాన/అర్ధంకానంతమాత్రాన అది అసత్యమనుకోరాదు" అని చెబుతారు. సరిగ్గా క్రైస్తవులు, ముస్లిములు కూడా అలాగే ప్రవర్తిస్తారు. తాము ఇతర మతగ్రంధాలను ఏకిపారేస్తారు. తమవాటిలో ఎన్నో రహస్యాలున్నాయని, సైన్సు ఈనాటికీ వాటిని కనుక్కోలేకపోయిందనీ ఇతరుల గ్రంధాల్లో ఉన్నదంతా మాత్రం చెత్త అని ఇల్లెక్కి అరుస్తారు. నిజానికీ ఇటు హిందువుల గ్రంధాలూ, అటు ముస్లిముల, క్రైస్తవుల గ్రంధాలూ అన్నీ దొందూ దొందే ఏవీ ప్రస్తుత కాలానికి సరిపోవు. అక్షరం మార్చకుండా అనుసరించడానికీ ఏవీ పనికిరావు. ఈనాడు మనమనుసరిస్తున్న విలువలను (విజ్ఞానాన్నీ) ఆయా గ్రంధాల్లో వెదుక్కుంటున్నాం తప్పితే మరింకేమీ కాదు.

    ఒక్కముక్కలో చెప్పాలంటె భారతంలోని బొంకు క్రైస్తవుల దగ్గరా, బైబిలులోని బూతు హిందువులదగ్గర, ఖురానులోని కుళ్ళును మిగిలిన ఇద్దరిదగ్గరా అడిగితెలుసుకోవాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మినర్వా గారూ, ఒకళ్ళు హేతుబధ్ధం అన్న మాత్రాన ఏదీ హేతుబధ్ధం కాదు. హేతుబధ్ధం కాదన్నది, కోట్ల మంది నమ్మే విషయం హేతుబధ్ధం కాకపోనూ పోదు, ఇప్పటి మన తెలివితేటల పరిధిలో అది హేతుబధ్ధం అనిపించకపోవచ్చుకదా. కొన్నాళ్ళుపోయిన తరువాత తెలివి పెరిగితే అదే విషయం హేతుబధ్ధం అనిపించవచ్చు.

      తొలగించండి
    2. "ఇప్పటి మన తెలివితేటల పరిధిలో అది హేతుబధ్ధం అనిపించకపోవచ్చుకదా. కొన్నాళ్ళుపోయిన తరువాత తెలివి పెరిగితే అదే విషయం హేతుబధ్ధం అనిపించవచ్చు."

      కాకపోనూ వచ్చు. కావచ్చునేమో నన్న సంశయలాభం (benifit of doubt)కంటే అయ్యేదాక వేచిచూద్దాం, అయ్యాకే అంగీకరిద్దాం అనే "వేచిచూత" మంచిది కదా. నమ్మకాలని హేతుబధ్ధతకి గీటురాయిగా పరిగణించలేముకదా. నలుగురు మేకను కుక్కన్నందుకే మేకను కుక్కగా భ్రమిస్తున్న దశలో ఉన్నమేమో అని నా అనుమానం (నిజానికి మేక మేకలానే ఉండింది కానీ కుక్క అవలేదు కదా). Even if a million believe in some stupid thing, it wouldn't make that stupid thing a truth; it just makes a million stupids కదా.

      తొలగించండి
    3. May be present day million stupid fellows look like great intelligentia tomorrow. Who knows. When Socrates was given poison what the people who sentenced thought of him. Then what was he? Just because something could not be proved today need not necessarily be wrong always. When somebody proposed that earth was round, he was heckled but later people had to believe it.

      By this I do not mean that we everything our mythology says should be believed. I only say that we should not heckle our own mythologies which will only provoke others to do it with double vigour.

      తొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.