1, ఏప్రిల్ 2012, ఆదివారం

పబ్లిసిటీ మానేజర్లూ ఇది చదవండి


ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు శ్రీ  కొలను వెంకట దుర్గా ప్రసాద్ (బాబు) గారు   పై  కార్టూన్, లో  ప్రేక్షకులు ప్రకటనా  కాలుష్యం  వల్ల  ఎదుర్కుంటున్న సమస్య చక్కగా చిత్రీకరించారు 


ప్రతి ఉత్పాదక సంస్థలోనూ  పబ్లిసిటీ మానేజర్లు ఉంటారు. వాళ్ళ పని వారి సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువులకి ప్రచారంకల్పించటం. ప్రచారం దేనికి? వస్తువు గురించి వినియోగదారునికి తెలియటానికి అలా తెలియటం ద్వారా వస్తువును వినియోగదారుడు కొంటాడని ఒక ఆశ

ఎంత చెత్త సినిమా తీసినా, పోస్టర్లు వేసి, వాటిల్లో రకరకాలభంగిమల్లో ముఖ్యంగా నటీమణులను ప్రదర్శించి ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించినట్టు! ప్రకటనలు,  వాటి ఉపయోగం గురించి  ప్రముఖ నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు  ఏమంటున్నారో వినండి

ఈ ఆడియో క్లిప్ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం లోనిది. మా టి వి సౌజన్యం

వస్తువులు కొనేప్పుడు, వినియోగదారుడు మీద ప్రకటనల ప్రభావం ఎంతవరకూ ఉంటుంది? విషయం ఎవరు చెప్పగలరు! నిర్ణయించగలరు? యాడ్ ఎజేన్సీలా!! వాళ్ళు చెప్పినదే వేదంగా ఉత్పాదక సంస్థలు నమ్మవచ్చానమ్మకూడదు. ఎందుకు అంటే యాడ్  ఏజెన్సీల పని వాళ్ళ ప్రకటనలు  అమ్ముకోవటం. తమ ప్రకటన లేనిదే వస్తువూ అమ్ముడుపోదన్న దురభిప్రాయాన్ని/మూఢ నమ్మకాన్ని ఉత్పాదక సంస్థలన్నిటిలోనూ వాళ్ళు ఇప్పటికే (self serving superstition)   అంటించారు.


ప్రస్తుతం, ఈ ప్రకటనలు మనకు చెవులకు కళ్ళకు అడ్డుపడుతూ ఎంతో చీదర కలిగిస్తున్నాయి. వ్యాపార ప్రకటనలు ప్రజలు పట్టించుకోవటం మానేస్తున్న విషయం  ఈ పబ్లిసిటీ మానేజర్లు తెలుసుకుని తమ డబ్బు అనవసరంగా ఈ యాడ్ ఏజెన్సీల విష ప్రచారానికి లోను కాకుండా తమ సంస్థ డబ్బులు కాపాడుకోని, తమ ఉత్పత్తుల ధర తగ్గించి (యాడ్ ఖర్చు తగ్గిస్తే,  వస్తువు ధర తగ్గి తీరుతుంది) అవసరం ఎంతైనా ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యం నాణ్యతా విలువలు పాటించటం. వ్యాపార ప్రకటనలు నమ్ముకుని కుంటి  బతుకు బతికే కంటే, నాణ్యత పాటిస్తూ, వినియోగదారుల్లో మంచి పేరు తెచ్చుకుని తలెత్తుకుని బతకటం ముఖ్యం  అనేది ఈ ఉత్పత్తి దారులు గమనించుకోవాల్సిన  ముఖ్య విషయం. 


ఈ కింది విషయాలు చూడండి. ఈ ప్రకటనల వల్ల ఉపయోగం అనేది ఎక్కడన్నా ఉంటుందా!  లేక వాటివల్ల వినియోగ దారులకి చీదర పుట్టి, ఆ వస్తువు గురించి అసహ్యం పుట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయా??


  • ఏదన్నా చానెల్లో సినిమా వస్తుంటుంది. ఈ యాడ్ ఏజెన్సీ వాడు, మంచి సస్పెన్స్ కలిగించే క్షణం లో సినిమా ఆపేసి, తమ ప్రకటనలు గుప్పించటం మొదలు పెడతాడు. ప్రేక్షకులు సినిమా చూసే మూడ్ చెడిపోయి ఆ ప్రకటనల్లో చూపించే వస్తువు మీద ద్వేషం పెంచుకునే అవకాశమే ఎక్కువ.  ప్రేక్షకులు ఆ చెత్తంతా చూస్తూ ఊరుకుంటారా , వెంటనే ప్రకటనలు రాని  చానెల్ కి గంతేసి చివరకు ఆ సినిమా చూడటమే మర్చిపోతారు. ఏమయ్యింది ఈ ప్రకటనల పని-సమయం, డబ్బు వృధా. 
  • విసుగుపుట్టిన ప్రేక్షకుడు అలా మాటి మాటికీ చూపించే ప్రకటనల మీద అసహ్యం చూపించి అవ్వి అస్సలు కొనకపోవచ్చు. నేను నెస్ కేఫ్, విక్కో వారి ఉత్పాదనలు  పొరబాటున కూడా కొనను. కారణం 1970-80  లలో ఏ సినిమాకి వెళ్ళినా వీళ్ళు తయారుచేసిన ప్రకటనలు మాటి మాటికి చూపటంవాళ్ళ ఆ ఉత్పాదనలు, ఆ  ఉత్పాదక సంస్థల  మీద నాలో తీవ్రమైన ద్వేషం పెరిగింది.  నాలాగే కొన్ని కోట్ల  మంది ఉండవచ్చు కదా!
  • టి వి లో సినిమా ఆపినప్పుడల్లా,  మళ్ళీ  మొదలు పెడుతున్నప్పుడల్లా, ఆ సినిమాని  ఎవరెవరు స్పాన్సర్ చేస్తున్నారో,  చాలా అసహ్యకరమైన పద్ధతిలో చివర ఒక రాగంతీస్తున్నట్టుగా సాగాతీస్తూ,   ఇరవై ముఫ్ఫై ఉత్పాదక సంస్థల జాబితా  గడగడా పరమ నీచంగా చదవటమే చాతకాని వాళ్ళ చేత చదివించటం. ఆ జాబితా వినటం ఎంతటి అసహ్యాన్ని కలిగిస్తుంది!  ఈ యాడ్ ఏజన్సీల వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి, మనం అంతా టి వి ముందు కూచుని వీళ్ళు చెప్పే ఆ చెత్త జాబితా జాగ్రత్తగా వ్రాసుకుని ఆ వాళ్ళు చెప్పే వస్తువులు కోనేస్తామనా!!!?? వీళ్ళ పిచ్చి కాకపొతే ఆ జాబితా వింటూ ఆనందించే  వాళ్ళు ఎర్రగడ్డ లేదా విశాఖపట్టణం లో ఉన్న ప్రత్యెక వైద్యశాలల్లో తప్ప ఎక్కడా ఉండరు అన్న విషయం ఈ పబ్లిసిటీ మానేజర్లకు తెలియకపోవటం విచిత్రం. లేదా వీళ్ళు కూడా......!?
  • కార్యక్రమాలు జరుగుతుండగా మధ్యలో వాటిని ఆపి కమర్షియల్  బ్రేక్ ఇవ్వటం తో తృప్తి చెందక, కార్యక్రమం జరుగుతుండగానే, ఈ మధ్య వచ్చిన మరొక బెడద. L Shape Ads.  టి  వి లో   వస్తున్న కార్యక్రమం జరుగుతుండగానే, ఆ కార్యక్రమం, కొద్దిగా కుడికి  కొద్దిగా పైకి జరిగి ఎడమ పక్కన, కింద L Shape  లో బెత్తెడు వెడల్పున చోటు చేస్తారు. ఆ బెత్తెడు చోటులో కక్కుర్తిగా  ప్రకటనలు వేస్తారు. మనం కార్యక్రమం చూస్తాం కాని వీడు వేసే ఈ చెత్త చూస్తామా, చూసినా ఎవగించుకుంటాం   గాని, అవి చూసి ఆ వస్తువు కొంటామా? ఇక్కడా డబ్బు వృధా, పైగా ఆ వృధా ఐన డబ్బులు మనం కొనే వస్తువు ధరలో కలిపి మన దగ్గరనుంచి వడేసి లాక్కోవటం. ఇవ్విట "సర్వీసు" సెక్టారుట, ఇలా సంపాయించిన డబ్బు పోయి జి డి పి లో కలిసి మన దేశ అభివృద్ధిని సూచిస్తుందట! ఎలా సూచిస్తుంది!? ఇదేమన్నా ఉత్పాదక వ్యయమా!!??  యాడ్ ఏజెన్సీలకు, వాళ్ళదగ్గర కమీషన్లు కొట్టేసి ఈ  ప్రకటనల ఖర్చు మన మీద నెత్తిన వేసి రుద్దే  పబ్లిసిటీ మానేజర్లకు తప్ప,  దీని వల్ల ఎవరికన్నా ఉపయోగమా?
  •  రోడ్ మీద డివైడర్ల నిండా ప్రకటనలే ఎవరన్నా చదువుతారా, చదివి ఆ వస్తువు కాని సేవను కాని కొంటారా/వినియోగించుకుంటారా. కోరు. పైగా వీటివల్ల ప్రమాదాలు జరిగే  ఆవకాశం ఎక్కువ. కారణం వీటి మీద వాళ్ళు వేసే రెచ్చగొట్టే భాష, బొమ్మలు. 
  • బస్సులు మీద కొండకచో రైళ్ళ పెట్టెల మీద పూర్తిగా ఒక్క అంగుళం కూడా వదలకుండా ప్రకటనలే. ఎంత అసహ్యంగా ఉంటాయి చూడటానికి. అప్పుడెప్పుడో మల్లిక్ (ప్రముఖ కార్టూనిస్ట్)  అనుకుంటాను ఈ పద్ధతిని ఎద్దేవా చేస్తూ, అప్పడాల బస్సులు, పచ్చళ్ళ బస్సులు అంటూ ఒక హాస్య కథ వ్రాశారు. ఇలా హాస్యానికి కాకపొతే ఇలా ఎక్కడ పడితే అక్కడ మనకు అడ్డం పడి  ఇది కొనండి, ఈ పాలసీ తీసుకోండి అంటే  జరిగే పనేనా. 
  • ఇక్కడ అక్కడ అని  లేదు, ఎక్కడపడితే అక్కడ హోర్డింగ్ లు. ఇదివరకు రాత్రిళ్ళు ఆ హోర్డింగ్ లకు లైట్లు ఉండేవి కాదు. ఇప్పుడు వాటికి కూడా రాత్రిళ్ళు లైట్లు. రైతుకు కరెంట్ ఇవ్వకుండా కట్  పెట్టి ఈ హోర్డింగ్ లకి లైట్లు ఇవ్వాళ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? హోర్డింగ్ లకు ఉంటే సోలార్ లైట్లు ఉండాలి లేదంటే కరెంట్ వాడకాన్ని నిషేధించాలి. రాత్రిళ్ళు ఈ హోర్డింగులు చూడకపోతే మన ఎకానమీ ఏమీ కూలిపోదు. 
  •  అసలు మనకు ఇన్నన్ని హోర్డింగ్ లు అవసరమా? ఎక్కడో  ఐదో అంతస్తు మీద పెద్ద హోర్డింగ్. ఎవరికి  కనపడుతుంది, ఎవరు చదువుతారు. గట్టి గాలేస్తే అది కిందపడి ప్రమాదం  తప్ప. ఈ మునిసిపాలిటీలు, హోర్డింగ్ ల మీద డబ్బులు వస్తున్నాయన్న కక్కుర్తి నుంచి బయటపడి. ప్రతి ఊరిలోనూ,  ప్రజలతో ఒక కమిటీ వేసి ఎక్కడ ఎన్ని హోర్డింగ్ లు ఉండాలి అన్న విషయం  కఠినంగా  నిర్ణయాలు తీసుకుని అమలుపరిస్తేకాని ఈ బెడద తప్పదు.
  • పాకీ దొడ్లల్లో వాడే వస్తువుల గురించి, సానిటరీ నాప్కిన్ ల  గురించి, కండోమ్ ల గురించి సమయం సందర్భం లేకుండా ప్రకటనలు గుప్పించటం చాలా మందికి జుగుప్స కలిగించే విషయం. సామాన్యంగా పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ చేసేప్పుడో, రాత్రి అందరూ కలిసి డిన్నర్ చేసేప్పుడో, టి వి చూస్తుంటే, పాకీ దొడ్డి మూల మూల ఎలా కడగాలో  ఒక పనికిరాని ఫ్లాప్ నటుడు ఒక ఉద్యమం లాగ చూపిస్తాడు. ఎంతటి అసహ్యం. 
  • చిన్నపిల్లలు మేలుకుని ఉండగానే సానిటరీ నేప్కిన్ ల గురించి కండోమ్ ల గురించి వివరం గా చూపిస్తారు. ఐదారు ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లలు, ఆసక్తిగా చూసి, అదేమిటి అని అడిగితె ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి. పిల్లలకు అన్నీ తెలియాలి. కాని తెలియాల్సిన వయస్సులో తెలియవలసి వచ్చినప్పుడు చెప్పవలసిన వాళ్ళు (తల్లో సోదరో, తండ్రో) చెప్పవలసిన విషయాలు ఇలా బాహాటంగా, నిస్సిగ్గుగా ఈ ప్రకటన దారులు బట్టబయలు చేసి పారేసి, సమాజంలో అందరికీ ఈ వస్తువుల మీద ఏహ్య భావ కలిగించటంలో  మటుకు విజయం సాధించారు.  
  • ఇలాంటి ప్రకటనల వల్ల నెగెటివ్ ప్రచారమే కాని, ఇదేదో కొందామని ఎవరన్న అనుకుంటారా! అనుమానమే. ఇది కూడా ఈ పబ్లిసిటీ మానేజర్లు అనుకునే వాళ్ళు తెలుసుకు తీరవలసిన విషయం. సమయం సందర్భం  తెలియకుండా చేస్తున్న తమ ప్రకటనలు సమాజం లో వాళ్ళ వస్తువులు మీద ఎంతటి అసహ్యాన్ని కలిగిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసేంత పరిణితి వీళ్ళకు రావాలని దైవ ప్రార్ధన చెయ్యటం  తప్ప మనం చెయ్యగలిగినది ఏమన్నా ఉన్నదా!  ఈ విషయాల గురించి మీడియాలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు వ్రాస్తారా/చూపిస్తారా?? వ్రాయరు/చూపించారు. వాళ్ళ జీవనాధారం కదా ఈ ప్రకటనా కాలుష్యం.
  • వార్తా పత్రికలూ, తమ పత్రిక పేరు తప్ప (ఒక్కొక్కసారి వాళ్ళ పేపరు పేరు కిందకు వేసేసి)  మిగిలినది అంతా, అదికూడా మొదటి పేజీలో నిస్సిగ్గుగా ప్రకటనలు ముద్రించటం ఈ మధ్య బాగా ప్రబలింది. చివరకు హిందూ పేపరు కూడా (కాస్త పరువు మర్యాద ఉన్న పేపరుగా పేరు పడింది కదా  మరి) . నేను సామాన్యంగా పేపరు కొనంగానే, మొదటి పేజీ అలా మొత్తం ప్రకటనే ఉంటే  ఆ పేజీ తీసి  నలిపేసి ఆవతల  పారేస్తాను. పొరబాటున కూడా చదవను. నాలాగా ఎన్ని లక్షలమంది ఇలా చేస్తున్నారో కదా. మరి పబ్లిసిటీ మానేజర్లు ఇలాంటివి కూడా తమ బుర్రల్లోకి ఎక్కించుకోవాలి. బుర్రుంటే ఇలాంటి తిక్క పనులు ఎందుకు చేస్తారు అంటారా! నిజమే మరి.
  • వార్తాపత్రికల్లో ఇప్పుడు ప్రకటనల  మధ్య వార్తలు "వెతుక్కుని" చదువుకోవాల్సిన దుస్థితి పాఠకుడికి  కలుగుతున్నది. అసలు విషయం ఏమంటే, మనం వార్తని వెతుకుతాం కాని, ఆ చుట్టూ అసంఖ్యాకంగా ఉన్న ప్రకటనలు పట్టించుకునేది తక్కువ. మహా ఐతే 1 % చూస్తాము ఏమో! అసంఖ్యాకంగా పేపరు నిండా నింపేసే ప్రకటనల ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు. ఇంకెవరు? అన్నిటికి పాపాల భైరవులం, వినియోగాదారులమే. వార్తా పత్రికలూ  ఈ ప్రకటనలు లేకపోతె మూడు రూపాయలకు రావు   అని ఒక భ్రమ కల్పిస్తారు. సరే రాదు. నష్టమేమీ లేదు. మనం కొనలేని ధర ఉంటే కొనటం మానేస్తాము. కాని ఈ పనికి రాని పేపరు మూడ్రూపాయలకు కొని, మనం అవసరంగా కొనుక్కునే అనేక నిత్యావసర వస్తువుల ధరల్లో అవసరం లేని ఈ ప్రకటనలకు అయ్యే ఖర్చు మనం ఎందుకు భరించాలి?? 
  • అందరూ ఆలోచించాల్సిన విషయం. ఆలోచనా! అదేమిటి? నిజమే.....అదేమిటీ! మోకాలు నిమురుకుంటూ నో , కుడి కాలుతో ఎడమ సీలమండని రాస్తూనో, కాలి మడమకేసి  చూస్తూనో  ఉంటే గుర్తొచ్చే  విషయమా! ఇదే   మన సమస్యలన్నిటికీ  మూలం.
  • టి వి లలో మామూలుగా వచ్చే కార్యక్రమం కంటే ఈ ప్రకటనల శబ్ద స్థాయి (అవును శబ్దమే అది) ఎక్కువగా ఉంచితే మనం చూసి తీరతాం అని ఈ పబ్లిసిటీ  మూక ఉద్దేశ్యం. మనం వెంటనే మ్యూట్ నోక్కేస్తాం. ఆప్పుడు  ఏమయ్యింది?  పొరబాటున వినేది కూడా పొయ్యింది. ఎప్పుడూ దురాశ దుఖ్ఖానికే  దారి తీస్తుంది. పబ్లిసిటీ మానేజర్లు ఇలాంటి చౌక రకపు వేషాలు వెయ్యకుండా, తమ వస్తువు గురించి సమాచారాన్ని ఇస్తే, ప్రకటనలకు గౌరవం. అంతే  కాని, వినియోగదారులను  ఎలాగోలాగ బ్రైన్వాష్ చేసి పారేసి (పెద్ద శబ్దాలు, వెర్రి మొర్రి మాటలతో ప్రకటనలు, కళ్ళకి, చెవులకు  చీదర కలిగిస్తూ) మనచేత వాళ్ళ వస్తువులను  ఒక్కసారి కొనిపించుకోగాలరేమో కాని, ఎల్లకాలమూ వాళ్ళ పప్పులు ఉడకవు. అందుకనే, ఇప్పుడు వ్యాపార ప్రకటనలను "కాలుష్యం" కింద పరిగణించాల్సిన అవసరం వచ్చింది అని ప్రజలు అనుకోవాసిన దుస్థితికి తెచ్చుకున్నారు ఈ యాడ్ ఏజెన్సీలు, పబ్లిసిటీ   మానేజర్లు కలిసి. కళ్ళు తెరుచుకుని ఈ  నీచమైన దశనుంచి  వీళ్ళు బయటపడితే బాగుండును. 
  • కార్యక్రమాలము మధ్య అసంఖ్యాకమైన ప్రకటనలు వెయ్యటం వల్ల ఉపయోగం లేకపోగా, ప్రేక్షకుడు/శ్రోత ఆ ప్రకటనలను అసలు వినకుండా/చూడకుండా మ్యూట్ నోక్కటమో   లేదా మరో చానెల్ కు వలస వెళ్లిపోవటమో  జరుగుతుంది. దీనివల్ల ఇంతా ఖర్చు పెట్టి ఈ ప్రకటనలు వేయించటం వల్లా ఈ ఉత్పాదక సంస్థలు బావుకున్నది ఏమిటి? ఫలానా కంపెనీ చెత్త ప్రకటనలు గుప్పిస్తుంది అన్న  చెడ్డ పేరు తెచ్చుకోవటం తప్ప.
  • కొన్ని చానెళ్ళు కలిసి, వాళ్ళ మధ్య ఎంత పోటీ ఉన్నా సరే, ఈ ప్రకటనల విషయం వచ్చేసరికి ఎంతో కలిసికట్టుగా  ఒక  దుర్మార్గమైన పని చేస్తుంటారు. అందరూ కలిసి వ్యాపార ప్రకటన  బ్రేక్ ఒకే సమయం లో ఇస్తారు. దానివల్ల మనం చానెల్ మార్చినా ఈ వ్యాపార ప్రకటనా కాలుష్యం తప్పుకో లేము. ఇలా చెయ్యటం సవ్యమైన పనేనా! నా దృష్టిలో ఒక  Restrictive Trade Practice. ప్రభుత్వం ఈ విషయం లో చానేళ్ళను  కట్టడి చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వానికి ఇలాంటి విషయాలు పట్టించుకునే జ్ఞానం, సమయం, ఆసక్తి ఎక్కడ. గత రెండు దశాబ్దాలుగా, ప్రభుత్వాలు పడిపోకుండా చూసుకోవటమే సరిపోతున్నదాయే. 
  • ఇలా అన్ని చానెళ్ళు కూడా ఒకే సమయం లో ప్రకటనలు వేసినా కూడా, ప్రేక్షకులు ప్రకటనలు ఆ సమయంలో రాని చానేళ్ళను వెతికి పట్టుకుని వాటిని చూస్తుంటారు. ఇది కూడా ఈ నిరక్షరాస్య  పబ్లిసిటీ మానేజర్లు తెలుసుకోవాలి, తెలుసుకుని చెత్త చెత్తగా ప్రకటనలను గుప్పించి కాలుష్యం పెంచటం మానాలి.  
  • రోజూ పొద్దున్నే వచ్చే వార్తా పత్రికల్లో కరపత్రాలు పెట్టి ఇవ్వటం మరో రకం ప్రకటనా కాలుష్యం.  ఇది పూర్తిగా వృధా  ఐన పని. ఎవ్వరూ చదవరు. ఇంట్లో చిన్న పిల్లలున్న వాళ్లకి మాత్రమె ఉపయోగం. వాళ్లైనా ఆ కాయితం ఏమిటి అని చదివి ఉపయోగించరు . వాడి పారేస్తారు అంతే. 
  • ప్రతివాడూ పర్యావరణం కాపాడండి అని కూసే వాళ్ళే. ఇలా కాయితాలు వ్యాపార ప్రకటనలకు దుబారా చెయ్యటం మానితే, ఎంతెంత  కాయితం   ఆదా అవుతుంది! తద్వారా ఎన్నెన్ని చెట్లు కొట్టకుండా కాపాడబడతాయి. ఇంతవరకూ ఏ పర్యావరణ కార్యకర్తా  ఈ విషయం గురించి మాట్లాడటం  నేను వినలేదు.  వాళ్లకి స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా ప్రకటనలు చేసే వాళ్ళే కదా ఎలా మాట్లాడుతారు!!
  • ఈ వ్యాపార ప్రకటనా పర్వం ఎంతవరకూ వెళ్ళిందంటే,  చానేళ్ళను నియంత్రిం చేవరకూ వెళ్ళింది. ఎవ్వరినో అనటం దేనికి, ప్రభుత్వం తామిచ్చే ప్రకటనల ఆశ చూపించి మీడియాని కొంత కట్టడి చెయ్యటం నిజం కాదా. పెద్ద పెద్ద ఉత్పాదక సంస్థలు, మీడియా మానేజిమెంట్ (అంటే ఆ వార్తల్లో ఎంత నిజమున్నా సరే తమ మీద వ్యతిరేక వార్తలు పడకుండా చూడటం ట, ) తాము భారీ సంఖ్యలో ఇచ్చే వ్యాపార ప్రకటనలనే  ముఖ్యంగా వాడుకుంటాయన్నది   బహిరంగ రహస్యమే  కదా.
  •  కోట్ల పెట్టుబడితో వ్యాపారం చేసే ఉత్పాదక సంస్థలు, యాడ్ ఏజెన్సీల గుప్పిట్లో కీలుబోమ్మలయ్యి అవసరం ఉన్నా లేకున్నా వ్యాపార ప్రకటనలు చెయ్యటం చూస్తుంటే, కుక్క తన తోక ఊపటం కాదు, తోకే కుక్క మొత్తాన్ని ఊపుతున్న విపరీత స్థితి స్పురించటం లో ఆశ్చర్యం ఎంత మాత్రం లేదు కదా! 
మొత్తం మీద వ్యాపార ప్రకటనలు అనేవి, వినియోగ దారునికి, ఉత్పాదక సంస్థలు తయారు చేసే వస్తువుల గురించి తెలియచెప్పటానికి వాడాలి కాని, వినియోగదారులను ఎలాగోలాగ కనికట్టు చేసి, వాళ్ళను మాయ చేసి బుట్టలో వేసుకుని, తమ వస్తువులను అమ్ముకోవాలని ఉబలాటపడటం చాలా అన్యాయమైన పనే కాక, సంఘ విద్రోహమైన పని.  

వ్యాపార ప్రకటనలు లేకపోతె కొన్ని పేపర్లు చానెళ్ళు మూసుకోవలిసినదే అని ఒక ప్రేలాపన. పరవాలేదు. మన సమాజానికి ఇన్నన్ని  పేపర్లు, పత్రికలూ, చానెళ్ళు అవసరమా?? లేనే లేదు. ప్రకటనలు అవసరానికి మించకుండా కట్టడి చేసి, దానివల్ల కొన్ని పేపర్లు, చానెళ్ళు మూతపడినా పరవాలేదు. మొత్తం మీద సమాజానికి మేలే కాని కీడు కాదు. ఏదో కొన్ని వందల మందికి ఊహా జనితమైన సంపాదనా  మార్గం ఈ ప్రకటనలు ఇస్తుంటే, వాటివల్ల కోట్ల మంది సమాజంలో అనవసర ఖర్చు అందులోనూ అనుత్పాదక ఖర్చు చెయ్యాల్సి రావటం వల్ల, మన ఎకానమీకి ఎంత నష్టం అనేది నిష్పాక్షపాతంగా  బేరీజు వేసి తీరాలి. అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంతటి ద్రవ్యోల్బణానికి ఇలాంటి ఉత్పాదతతో సంబంధం లేని ఈ అనుత్పాదక ఖర్చులు  కూడా కారణమే కదా. 
విచిత్రం ఏమంటే, ఇలా వ్యాపార ప్రకటనలు వాటివల్ల సామాజిక పరంగా, ఆర్ధిక పరంగా వచ్చే దుష్పరిణామాల గురించి చర్చించి సమాజాన్ని ఉత్తేజితులను చెయ్యాల్సిన మీడియా, ఈ విషయాల గురించి ఒక్క సారి కూడా స్పందించదు.  దురదృష్ట వశాన మీడియా మొత్తం ఈ వ్యాపార ప్రకటనల మీదే బతుకుతున్నది.  మీడియాలో గగ్గోలు పెట్టినా  దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉండే ప్రభుత్వం, తమంతట తాముగా ఇలాంటి విషయాల మీద స్పందించి నిర్ణయాలు తీసుకుంటుందా అనేది ఉత్తి భ్రమ మాత్రమె. 

సమాజం లో ఉన్న  ఆలోచించగలిగిన వాళ్ళు, సామాజిక కార్యకర్తలు (అంటే వామపక్ష వాదులు మాత్రమె అనే భ్రమ ఉన్నది చాలా మందికి) కొంతలో కొంత స్పందించటం మొదలుపెడితే, మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ వ్యాపార ప్రకటనా కాలుష్యాన్ని ఎంతో  కొంత తగ్గించవచ్చు అన్న ఆశ  మిణుకు మిణుకు మంటూ ఉన్నది. 

ఇదే విషయం మీద ఈ బ్లాగులో మునుపు వ్రాసిన వ్యాసాలు:









 

3 కామెంట్‌లు:

  1. ప్రతీ వాక్యంతో ఏకీభవించాల్సిందే. అన్నీ సత్యాలే. పిల్లల్ని ఎరగా వాడుకునే వారి గురించి కూడా కాస్తంత రాసి ఉండాల్సిందేమో! కానీ, నిజానికి మీరు పైన రాసిన విధంగా ఆలోచించేవారు Minority అంటే అతిశయోక్తి కాదు. ఊదరగొడితేనే నమ్మి కొనేవారు Majority.

    రిప్లయితొలగించండి
  2. మీరు రాసినది ప్రత్యక్షర సత్యం.ప్రకటనలు రేడియోలో లేని కాలం ఇంకా చాలా బాగుండేది

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు సుధామ గారూ.

    మీరు చెప్పినది నిజమే రేడియోలో రెండు రకాలు ఉన్నాయి కదండీ. వివిధభారతి వాణిజ్య ప్రసార కార్యక్రమం అని ఒకటి ముఖ్య కేద్రం ఒకటి. పేరే వాణిజ్య ప్రసార కేంద్రం అని హెచ్చరించి మరీ ప్రకటనలు వేసే వాళ్ళు. కొత్తల్లో సరదాగా ఉన్నా, రాను రాను, ప్రకటనలు ఎక్కువయ్యి, కార్యక్రమాల నిడివి కుచించుకుపోయి, శ్రోతలకు దూరమయ్యింది రేడియో. ఈ ప్రకటనల జాడ్యం, ముఖ్య కేద్రంలోనూ కార్యక్రమాలకూ అంటించారు కొంతకాలానికి. ఆకాశవాణిలో కళాకారుల ప్రాభవం పోయి, కమర్షియల్ మానెజర్ల ప్రభ వెలగటం మొదలయ్యి, ప్రజలకు దూరమయ్యి కుసిళ్ళుతున్నది ప్రస్తుతం.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.