14, ఏప్రిల్ 2012, శనివారం

इतना बड़ा एक्टर, दस पैसा!! - ఇంత పెద్ద నటుడు పదిపైసలా ఇచ్చేది

మనకెంతో సుపరిచితుడైన నటుడు శ్రీ  అక్కినేని నాగేశ్వర రావు. హాస్య పాత్రలు, పురాణ పాత్రలు, నవలా నాయక పాత్రాలు, అసలు సిసలైన మసాళా సినిమా పాత్రలు అన్నీ కూడా తనదైన శైలిలో చేసి దాదాపు ఆరేడు దశాబ్దాల నట జీవితంలో ఎన్నెన్నో బిరుదులూ, సత్కారాలు పొందారు.  ఎ ఎన్ ఆర్  అందరికీ తెలిసిన ఈయనతో సుదీర్ఘంగా, ఎంతో పరిశోధన చేసి, ఓపికగా చక్కటి ఇంటర్వ్యూ ను "గుర్తుకొస్తున్నాయి" అన్న పేరుతొ "మా" టి వి వారు తయారు చేసి ప్రసారం చెయ్యటమే కాకుండా, సి డి ల కింద విడుదల చేసారు. ఈ ఇంటర్వ్యూ లలో (మొత్తం 74  భాగాలు గా 25  సి డి లు)  తన నట జీవితంలో తాను  ఎదుర్కున్న కష్టాలు, నటుడుగా ఎదగటానికి చేసిన అభ్యాసం, తాను చూసిన మనుషులు, అప్పటి పెద్ద పెద్ద వారు, ఇలా ఎన్నెన్నో విషయాలు విశేషాలు తనదైన ప్రత్యెక శైలిలో కొన్ని చోట్ల నిర్మొహమాటంగా, మరికొన్ని చోట్ల లౌక్యంగా చక్కగా వివరించారు. ఆయన చేత అన్ని విషయాలు తరచి తరచి అడుగుతూ,  మంచి విశేషాలు బయటకు లాగి చెప్పించిన  ప్రతిభ, మనకు అందరికీ తెలిసిన ప్రముఖ టి వి ఎంఖర్. సుమ.  

ఈ ఇంటర్వ్యూలలో భాగంగానే, శ్రీ నాగేశ్వర రావు నటన గురించి వివరిస్తూ,  తన నటనేమీ పెద్ద చెప్పుకోవలసినది కాదనీ ఈ ప్రపంచంలో ఎందరో  మహా నటులు ఉన్నారనీ, ఈ పద్మశ్రీలు, పద్మ విభూషణాలు, దాదా ఫాల్కే  అవార్డులు వాళ్లకు ఇవ్వాలని అని చిత్రంగా అన్నారు. ఆరాధన సినిమాలో తాను  వేసిన పాత్ర, ఆ పాత్ర కథా పరంగా గుడ్డివాడు అవ్వటం, ఆ గుడ్డితనాన్ని నటించటం తానూ ఎలా గుడ్డివాళ్ళను చూసి చేసినదీ చెప్పుకోస్తూ, నిజ జీవితంలో తనకు ఎదురైనా ఒక చిత్రమైన సంఘటన వివరించారు నాగేశ్వర రావు. వినండి మరి.
 

 ఆడియో గుర్తుకొస్తున్నాయి సి డి నుంచి"మా" టి వి సౌజన్యం 

నిజమే! జీవితం లో నటించేస్తూ బతికే వాళ్ళు ఎంతో మంది. వాళ్ళతో పోలిస్తే  మనం ఇవ్వాళ సినిమాల్లో చూసే వాళ్ళు నటులే కాదు.

గుర్తుకొస్తున్నాయి అనే ఈ శీర్షిక కింద దాదాపుగా మన తెలుగు సినిమా చరిత్రను తన పక్కనుంచి శ్రీ నాగేశ్వర రావు చక్కగా వివరించారు. ఈ విషయం మీద ఈ సి డి ల విడుదల సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం యు ట్యూబ్ లో దొరుకుతున్నది. 

సుదీర్ఘమైన  తన నట జీవితం లో తనకు పరిచయమైన, తాను  కలిసి పనిచేసిన నటీ నటుల గురించి, దర్శక, నిర్మాత,  రచయిత ల  గురించి నిస్పక్షపాతంగా తన జ్ఞాపకాలనుండి చక్కగా వివరించారు నాగేశ్వర రావు. ఎనభయ్యో పడిలో పడి తన శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం  కూడా చక్కగా కాపాడుకుంటూ, అప్పటి జ్ఞాపకాలను మనకు ఈ వీడియో ద్వారా  అందించటం చాలా గొప్ప విషయం.


సినీ/నాటక రంగంలో కంటే పెద్ద నటులు నిజ జీవితంలోనే ఎక్కువగా మనకు తారస పడుతూ ఉంటారన్న విషయం శ్రీ నాగేశ్వర రావు చెబుతూ ఉంటే మరొక విషయం గుర్తుకు వస్తున్నది. ప్రముఖ నటుడు కమల్ హాసన్, చాలా సంవత్సరాల క్రితం ఒక టి వి ఇంటర్వ్యూలో, "మీరు రాజకీయాల్లోకి వస్తారా" అని అడిగినప్పుడు అద్భుతమైన జవాబు, సందర్భోచితంగా చెప్పాడు. "అబ్బో అంత నటన నాకు చేతకాదండీ, ఏదో ఇలా సినిమాలకే పరిమితం" అని చెప్పి ప్రేక్షకులను నవ్వించినా ఆ మాటల వెనుక  ఉన్న ఆవేదన, ప్రస్తుత సమాజంలో ఉన్న నిజ పరిస్థితికి అద్దం  పడుతూ  కమల్ హాసన్ అన్న మాటలు అక్షర సత్యాలు. 
2 వ్యాఖ్యలు:

  1. :)))))))) బాగుంది. నటన రాజకీయాలలోనే కాదు. మనం పరిశీలించాలేగానీ, నిత్యం నిమిషానికో పాత్ర, క్షణానికో నటన పుట్టుకొస్తుందీ లోకంలో. రాజకీయాలను విమర్శిస్తూ కమల్ లాంటి వాళ్లు చెప్పేదానిలో నిజమెంత ఉందో నటనా అంతే ఉంది. ఎందుకంటే రాజకీయాలను విమర్శించడం వల్ల మాత్రమే ఉపయోగం లేదు. ప్రతివాడూ విమర్శిస్తూ నటిస్తుంటే బాగు చేసేదెవడు? జంధ్యాల గారు బ్రతికుంటే ఇంకా చాలా పాత్రలు పట్టి చూపేవారేమో తన సినిమాలలో. అక్కినేని అనుభవాలు ఆయన అఆ లు (అక్కినేని ఆలోచనలు)గా కూడా వ్రాశారనుకుంటా. మీరు చెప్పిన గుర్తుకొస్తున్నాయి తో పాటు అది కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అక్కినేని గుర్తుకొస్తున్నాయి సిడీల సెట్ కొన్నాను. మీరు చాలా వివరంగా చెప్పారు. ఈమధ్యనే ఈ సిడీలను సంక్షిప్తం చేసి DVDగా విడుదల
    చేశారు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.