20, ఏప్రిల్ 2012, శుక్రవారం

తప్పుడు ప్రకటనలపై కట్టడి

 పైనున్న వార్తకు లింకు క్లిక్
ఇదే బ్లాగులో అనేక సార్లు ప్రస్తుతం  మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాలలో  వ్యాపార ప్రకటనా కాలుష్యం కూడా         ముఖ్యమైనదని  ఎన్నో సార్లు వ్రాయటం జరిగింది, కొంత వరకు చదివిన వారి వద్దనుంచి స్పందన, కొంత చర్చ జరిగింది. 

ఈ రోజున, "ఈ నాడు" వార్తా పత్రిక,  ఐదో పేజీలో (బెంగుళూరు ఎడిషన్) "తప్పుడు ప్రకటనల కట్టడిపై ప్రభుత్వం దృష్టి" అనే శీర్షికతో ఒక వార్త ప్రచురితం అయ్యింది. సహజంగా, ఈ వార్త నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.  భారత్ మిస్సైల్ పరీక్షలో విజయం, చైనాకు అగ్గి తగిలింది వార్తలకంటే ఈ వార్త మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. నిజానికి మిస్సైల్  పరీక్ష విజయవంతం చేసిన శాస్త్రజ్ఞులందరినీ  బ్లాగుముఖంగా అభినందిస్తున్నాను.కాని అంతకంటే పై వార్తకు కారణమైన ప్రభుత్వాధికారులను ఎక్కువగా అభినందిస్తున్నాను. కారణం సమాజం మొత్తం మీద దుష్ప్రభావన్ని  కలిగించే ప్రకటనా కాలుష్యాన్ని కట్టడి చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టినందుకు. 

వ్యాపార ప్రకటనలు,  ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, తామర తంపరగా ఎక్కడపడితే అక్కడ ఇది వ్రాయవచ్చు ఇది వ్రాయకూడదు అన్న ఇంగితం లేకుండా,  ఏవిధమైన అడ్డూ అదుపూ, సమాజం పట్ల బాధ్యతా  లేక పోవటాన్ని ప్రభుత్వం కూడా కొంతవరకూ గమనించింది అన్న విషయం తేటతెల్లం అయ్యింది. 

కాని ప్రభుత్వం కదా! ఈరోజు తెలిసిన విషయాన్ని ఫైళ్ళకు ఫైళ్ళు తయారు చేసుకున్నాక, ఒక తరం గుమాస్తాలు పదవీ విరమణ ఉత్సవాలు అయినాక, ఆ విషయం మీద చర్య అనేది వెలుగు చూడవచ్చు. ఒక దశాబ్దమో, రెండు దశాబ్దాలకో చర్యలు అమలు జరిగే ఆవకాశం లేకపోలేదు. 

చిత్రమైన  విషయం ఏమంటే ప్రకటనలలో తప్పుడు విషయాలు ప్రచారం చేసే కంపెనీలపై చర్య తీసుకోవటానికి కొత్త చట్టం తీసుకు వస్తారట. కొత్త చట్టం దేనికి ! ప్రస్తుతం  ఐ పి సి  లో ఉన్న సెక్షన్ 420 ,  ఇలా తప్పుడు ప్రచారం  చేసే వారి మీద ఎందుకు వాడకూడదో నాలాంటి సామాన్యులకు అర్ధం కాని విషయం. న్యాయ నిపుణులు  కూలంకషంగా పరిశీలించి ప్రభుత్వానికి సవ్యమైన సలహాలు అందిస్తే , సమయం వృధా కాకుండా  తప్పుడు ప్రకటనల బారిన పడకుండా ప్రజలను కాపాడినవారు అవుతారు. 

ఈ వార్త ప్రచురించిన ఈనాడు,  లోపలి  పేజీల్లో రెండు కాలమ్స్ లో వార్తను వివరంగా వ్రాస్తే, ఆన్ లైన్ ఎడిషన్ లో అంటీముంటనట్టుగా  క్లుప్తంగా వ్రాసి వదిలేశారు . ప్రింట్ ఎడిషన్ లో పరిమితమైన  చోటులోనే వార్తలన్నీ సద్దుకోవాల్సిన సమస్య, ప్రకటనల మధ్య చోటు వెతికి ,  వార్తలు వ్రాయవలసిన ఆర్ధికపరమైన అవసరం ఉన్నాయి కాని, ఆన్ లైన్ ఎడిషన్లో పూర్తిగా వ్రాయటానికి ఉన్న అభ్యంతరం ఏమిటో  మరి.   వార్తలను పూర్తిగా ఆన్లైన్ ఎడిషన్లో వస్తే ప్రింట్ పత్రిక ఎవరూ కొనరన్న భయం కావచ్చు. 

కొసమెరుపు ఏమిటి అంటే, ఈ వార్తా ప్రచురితమైన పుటలోనే ఒక పెద్ద కంపెనీ ప్రకటన ఉన్నది. ఆ ప్రకటన శీర్షికలో "ఉచితంగా" అన్న విషయం ప్రముఖంగా ఉన్నది.  ఆ పక్కనే ఒక పువ్వు గుర్తు, గుర్తుకు వివరణగా షరతులు వర్తిస్తాయి అని కింద ఎక్కడో  చిన్న ప్రింటులో అదీ నిలువుగా (సామాన్యంగా చదవటానికి వీలులేని పద్ధతిలో) వ్రాశారు. ఆ షరతులు ఏమిటో వాళ్ళ దగ్గరకు వెళ్ళి  అడిగితె  కాని చెప్పరు, ప్రకటలో ఐతే వ్రాయలేదు.  ఇలా ఉచితం అంటూ ప్రలోభ పెట్టటం, అది చూసి ఆకర్షితులైన వారు చివరకు ఏదో అక్కడ దాకా వచ్చాం కదా అని ఆ వస్తువు వాళ్ళు చెప్పిన ధరకు ఆ షరతుల ప్రకారం అక్కర్లేకపోయినా  వాళ్ళు విధించిన  నిబంధనల ప్రకారం కొనుక్కుని,  ఆ ఉచితం చివరకు ఉచితమో అనుచితమో తెలుసుకునే అవకాసం వచ్చేప్పటికి జరగవలిసినది జరిగిపోతుంది. ఇలాంటివి కూడా మోసపూరితమైన ప్రకటనలు అవుతాయో కాదో న్యాయ నిపుణులు విశ్లేషించాలి.

మరొక ప్రకటనలో "వరల్డ్ లీడర్" అన్న మాట వాడారు. అంటే ఏమిటి? వారు తప్ప మరొకరు  ఆ వస్తువు అంతకంటే బాగా చెయ్యలేరా? లేకపోతె వీళ్ళొక్కళ్ళే  ఆ వస్తువు తయారు చేయటం తెలిసిన వాళ్ళా!!  అలా  చెప్పి ప్రచారం చేసుకోవటానికి వాళ్ళ దగ్గర  ఉన్న ఆధారం ఏమిటో మరి!

ఇప్పుడు ప్రభుత్వ ఆలోచిస్తున్నట్టుగా, తప్పుడు ప్రకటనలను కట్టడి చేసి తీరాల్సిందే. ఆయా కంపెనీలు తెంపరితనంగా, అతి తెలివి ప్రదర్శిస్తూ , తమను తాము సమర్ధించుకోవటానికి, తప్పుకుపోవటానికి   ఏ  మాత్రం వీలు లేకుండా "తప్పుడు ప్రకటన" అంటే ఏమిటో నిర్ద్వంద్వంగా, సంశయానికి  ,  సందేహానికి  ఆవకాశం లేకుండా నిర్వచించాల్సిన  అవసరం తప్పకుండా  ఉన్నది. ఇలా నిర్వచించే ప్రయత్నాలో భాగంగా, తప్పుడు ప్రకటనల వల్ల  మోసపోయిన వినియోగదారుల వద్దనుంచి వారి వారి అభిప్రాయాలను సేకరించి వాటిని కూడా పరిగణలోకి తీసుకుని తీరాలి. 

వ్యాపార ప్రకటన అనేది, ఒక  వస్తువు గుణగణాల గురించి వినియోగదారుని తెలియచెప్పేదిగా  ఉండాలి తప్ప, ప్రలోభపెట్టి ఆ వస్తువు కోనేట్టుగా ఉండకూడదు. నా దృష్టిలో వినియోగదారుని ప్రలోభ పెట్టటానికి ఎటువంటి మాట వాడినా, ఆ వ్యాపార ప్రకటన మోసపూరితమైనదే, అటువంటి ప్రకటనదారులను శిక్షించి, అమాయక ప్రజలను ప్రభుత్వం కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 

ఇదే విషయం మీద కొద్ది రోజుల క్రితం వ్రాసిన వ్యాసం ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు. అదే వ్యాసంలో మునుపు వ్రాసిన వ్యాసాలన్నిటికీ లింకులు ఉన్నాయి. 














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.