26, ఏప్రిల్ 2012, గురువారం

ఆకాశవాణి వారూ వింటున్నారా !!!!!

తెలుగునాట ఉషశ్రీ గారి గురంచి తెలియని వారెవ్వరు! రేడియో లో పురాణ ప్రవచనాల గురించి చెప్పాలంటే ముందుగా ఉషశ్రీ గారి గురించి చెప్పాల్సిందే. ఉషశ్రీ గారి గురించిన ఒక చక్కటి వెబ్ సైటు వారి దగ్గిర బంధువులు (కుమార్తెలు అల్లుళ్ళు) నడుపుతున్నారు. ఊరికే ఆయన ఫోటోలు అందులో ఉంచి ఊరుకోవటం కాకుండా, ఉషశ్రీ గారి గురించిన సమగ్ర సమాచారం, ఆయన గురించిన అనేకానేక అపురూపమైన ఫోటోలు, ఆయన పెళ్లి శుభలేఖ తో సహా ఆ వెబ్ సైటులో ఉన్నాయి.


ఇవే కాదు, ఆయన ప్రవచించిన రామాయణ, భారత, భాగవతాల ఆడియోలు కూడా ఉన్నాయి. ఇంతేనా అంటే, ఇంకా ఉన్నాయి, అప్పుడెప్పుడో, 1980 లో రాజమహేంద్రవరం లో బహిరంగ సభలో భారత యుద్ధం గురించి ఉషశ్రీ గారు చేసిన అద్భుత ప్రసంగం కూడా ఉన్నది. ఈ ప్రసంగం విని తీరవలసిందే. భారత యుద్ధం గురంచి ఒక పక్క చెబుతూనే, సమకాలీన పరిస్థితుల మీద ఉషశ్రీ గారు Extempore గా (ఈ మాటకు తెలుగు తట్టడం లేదు) చేసిన వ్యాఖ్యలు అద్భుతం అనేసుకుని ఊరుకోవటానికి మాత్రమె కాదు , మనసు ఉన్నవాళ్ళు ఆలోచించి తీరవలసినవి. ఇంతేనా అంటే, ఇంకా ఉన్నాయి. అవును అక్కడి ఆడియోలను వీడియోలను చూస్తుంటే, ఇంతేనా? ఇంకా ఉంటే బాగుండును అనిపించి తీరుతుంది. అలనాడు శ్రీరామనవమి సందర్భంగా ఉషశ్రీగారు ఆకాశవాణి బృందంతో భద్రాచలం లో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలను కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్ష ప్రసారం చేశారు . ఆ ఆడియో కూడా ఆ వెబ్ సైటులో వినటానికి ఉన్నది. ఇంకా ఎన్నో వీడియోలు.


అన్నిటికి మించి వారి అమ్మాయి డాక్టర్ గాయత్రి గారు తమ తండ్రి ఉషశ్రీ గారి 80 వ జయంతి సందర్భంగా వ్రాసిన వ్యాసం ఆ వెబ్ సైటుకు తలమానికమైనది. ఆవిడ ఉషశ్రీ గారి గురించిన అనేక వివరాలను ఫోటోలను తమ వ్యాసం లో ఉంచారు. ఆ వ్యాసం పూర్తి పాఠం, ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు.


(క్లిక్ చేసినాక కొద్దిసేపు ఓపిక వహిస్తే అక్కడున్న పిడిఎఫ్ చక్కగా లోడ్ అయ్యి మీకు కనిపిస్తుంది )


ఈ వ్యాసం శీర్షిక ఆకాశవాణి వారిని ఉద్దేశిస్తూ వ్రాయటానికి కారణం పైన ఉదాహరించిన వ్యాసంలోని ఒక భాగం. ఈ కొద్ది భాగం (కొద్దిగా అక్కడక్కడ మార్పులు చేసి ఈ కింద ఇస్తున్నాను)చదవగానే చాలా విచారం కలిగింది. ఆపైన కోపం వచ్చింది. ఉషశ్రీ గారు రేడియోలో చేసిన అద్భుత ప్రవచనాలు ఒక్కటి కూడా ఆకాశవాణి వారు సి డి ల కింద ఇంతవరకూ విడుదల చేయలేదు కదా అన్న విషయం స్పురించింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు ఐతే, ఉషశ్రీ గారి పురాణ ప్రవచనాలు ఒక ఎత్తు. అంతటి ప్రజాదరణ పొందినాయి ఆయన చేసిన ఆ కార్యక్రమాలు. అంతటి ప్రజాదరణ పొందిన కార్యక్రమాల టేపులు ఆకాశవాణి వారి వద్ద ఉన్నాయో లేవో , ఉండీ సి డి లుగా విడుదల చెయ్యటానికి ఇలా తాత్సారం చెయ్యటానికి కారణాలు ఏమిటో. సెక్యులరిజం పిచ్చా! ఇన్ని కోట్ల మంది ఆదరించిన కార్యక్రమం సి డి లుగా ఇవ్వకపోవటానికి వారికి ఉన్న కారణాలు ఏమిటో కదా అని చిత్రవిచిత్రంగా అసంఖ్యాకమైన శ్రోతలు అనుకోవటానికి ఆకాశవాణి వారు అవకాశం ఇవ్వటం చాలా బాధాకరమైన విషయం.
1986 లో ఉషశ్రీ గారు ఆకాశవాణి ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు. రామాయణ భారతాల ప్రవచన దీక్ష నుండి ఆయనకు రిటైర్మెంట్ లేదు. 1990 జులై నాటికి ఉషశ్రీ గారి ఆరోగ్యం బాగా లేదు.కూర్చుంటే వెన్నంతా మంట, భరించలేని నొప్పితో నిరంతరం పడుకునే ఉండవలసి వచ్చింది. ఆ సమయం లో ఆకాశవాణి విజయవాడ వారు ఆర్ఖైవ్స్ కోసం ఉషశ్రీ గారిచేత పదమూడు ఎపిసోడ్స్ కృష్ణ లీలలు చెప్పించి రికార్డ్ చేస్తాం అన్నారు. రోజుకి ఒక్క భాగమైనా చెయ్యగలనో లేదో అనుకుంటూ ఆకాశవాణి స్టుడియోకి వెళ్ళారు ఉషశ్రీ ఏకబిగిన ఆరేసి ఎపిసోడ్స్ చొప్పున రెండు రోజుల్లో రికార్డింగ్ పూర్తిచేసేశారు. ఆ రెండు రోజులు ఉషశ్రీ గారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారట. "అసలు నాకు అనారోగ్యం రేడియోకి వెళ్ళకపోవడమే, ఇవాళ నాకు అసలు ఏ బాధా లేనట్లు ఉంది" అన్నారట ఆనందంగా. రేడియో అంటే అంత ప్రాణం ఉషశ్రీగారికి. రెండు దశాబ్దాల క్రితం ఉషశ్రీ గారు ఇచ్చిన ఆ కార్యక్రమాన్ని ఇప్పటికయినా సి డి లు చేసి తెలుగు శ్రోతలకి ప్రసార భారతి వారు అందిస్తే......ఉషశ్రీ గారు అనారోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ఆర్ఖైవ్స్ కోసం స్టుడియోకి వెళ్ళిన శ్రమకీ, కృష్ణ లీలలు అందించడానికి ఆయన చేసిన కృషికీ ఫలితం ఉంటుంది.
ఉషశ్రీ గారు ఎంతో అనారోగ్యంతో ఉండి కూడా ఆకాశవాణి మీద ఉన్న ప్రేమతో రెండే రెండు రోజుల్లో రికార్డ్ చేసిన కృష్ణ లీలలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రోతలకు అందకుండా తమ బూజు పట్టిన బీరువాల్లో దాచేసి, తెలుగువారికి ఆకాశవాణి చేసిన ద్రోహం (అవును ద్రోహమే) అంతా ఇంతా కాదు, అందరూ ముక్త కంఠంతో గర్హించి, తీవ్రంగా విమర్శించవలసిన విషయం.


ఆకాశవాణి వారూ! ఇప్పటికైనా సరే, ఉషశ్రీ గారు ప్రవచించిన పురాణాలు అన్నీ కూడా సి డి లుగా విడుదల చెయ్యండి. చెయ్యరూ, మన పురాతన ఆలయాలను ఎడారులా మీదుగా వచ్చి ధ్వంసం చేసిన దురాక్రమణ దారులుతో సమం అయిపోతారు.


మార్కెట్లో ప్రస్తుతానికి ఉషశ్రీ గారి ఆడియో కాసెట్లు దొరుకుతున్నాయి. అలాగే కొన్ని వెబ్ సైట్లల్లో కూడా ఆ ఆడియో ఫైళ్ళు లభ్యం అవుతున్నాయి. అవి ఆకాశవాణి లో ఉషశ్రీగారు చేసిన ప్రసంగాలు కాదు. ఆయన పదవీ విరమణ చేసినాక, బయట రికార్డ్ చేసినవి మాత్రమె.


నాకు బాగా గుర్తు 1977-79 ప్రాంతాల్లో అనుకుంటాను, ఇంతటి ప్రజాదరణ పొంది శ్రోతల మనస్సులో నిలిచిపోయిన ఉషశ్రీ గారిని విజయవాడ నుంచి కడప కేంద్రానికి బదిలీ చేశారు. ఎక్కడి విజయవాడ, ఎక్కడి కడప. ఆయన వెళ్ళలేదు, శలవపెట్టి కూచున్నారు. శ్రోతలు ఉద్యమించారు, నానా గోల చేశారు. అర్జీలు పెట్టారు. చివరకు దిగివచ్చి ఆయన్ని అక్కడే అంటే విజయవాడ కేంద్రంలోనే ఉంచినట్టు గుర్తు. ఆ సమయంలోనే, ఉషశ్రీ గారు విజయవాడలో ప్రసిధ్ధి పొందిన శివరామకృష్ణ క్షేత్రంలో(రామకోటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు) అఖండ పురాణ ప్రవచనం చేశారు. ప్రతిరోజూ తండోప తండాలుగా ప్రజలు వచ్చి అవి వినేవాళ్ళు. పక్కనే ఉన్న రోడ్డు మూసుకుపోయి, ఆ రోడ్డుకు ఆ పక్కన అప్పట్లో ఉన్న సత్యనారాయణపురం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం కూడా జనంతో నిండిపోయ్యేది. ఉషశ్రీ గారి గురించిన ఒక గుర్తు ఇది.


ఉషశ్రీ గారి గురించి వారి బంధువులు నిర్వహిస్తున్న వెబ్ సైట్ ఈ కింది లింక్ నొక్కి చూడవచ్చు.



ఇదే వెబ్ సైటులో ఇవ్వాళ శ్రీరామనవమి సందర్భంగా ఒక కొత్త ఆడియో, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు చేసిన రేడియో ప్రసంగం "జానకితో జనాంతికం" ఉంచారు. శ్రీరామనవమి సందర్భంగా విని తీరవలసిన చక్కటి పురాణ ప్రసంగం.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

ఈ వ్యాసంలో ఉన్న బొమ్మలన్నీ కూడా ఉషశ్రీ.ఆర్గ్ వారి సౌజన్యం





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.