10, జూన్ 2012, ఆదివారం

చిన్నపిల్లల లైవ్ కార్యక్రమానికి గండి కొట్టిన బోఫోర్స్ వివాదం


ఇదేమిటి తుంటి మీద తంతే మూతి పళ్ళు రాలాయన్నట్టుగా, బోఫోర్స్ వివాదానికి రేడియోలో అప్పట్లో లైవ్ వచ్చే చిన్న పిల్లల కార్యక్రమానికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారు కదూ! కాని,  సంబంధం ఉన్నది. 1989లో ఒకానొక రోజున, ఆకాశవాణి  పాట్నా కేద్రం నుండి లైవ్ లో ప్రసారం అవుతున్న  చిన్న పిల్లల కార్యక్రమంలో, ముందుగా ఆహ్వానించబడిన పిల్లల్లో ఒక పిల్లాడిని ఒక పాట పాడరా అబ్బాయి అన్నాడుట ఆ కార్యక్రమపు నిర్వాహకుడు. ఆప్పుడప్పుడే ఎల్ కే జి నుంచి ప్రమోట్ అయ్యాడో లేదో అనిపించే ఆ చిన్న పిల్లవాడు, తనకు బాగా తెలిసిన ఒక పాట అందుకున్నాడుట. అదేమిటి?

गली गली मई शोर है राजाव गांधी चोर है  దీని అర్ధం  అంటే రాజీవ్ గాంధీ దొంగని వీధి వీధినా గోలే అని.


ఇది విని ఆ కార్యక్రమపు నిర్వాహకులు నోరు నొక్కుకుని మిగిలిన కార్యక్రమం ఎలాగోలా కొనసాగించారుట. కాని,  ఆ పిల్లవాడు తన ఇంటి చుట్టుపక్కల వినపడేదే  తెలిసో తెలియకో  లైవ్ కార్యక్రమం లో పాడేశాడు. ఇంకేముంది! ప్రతిపక్షాలకు,  పత్రికలకు మంచి ఆయుధం దొరికింది. రాజీవ్ గాంధీ బోఫోర్స్ వివాదంలో నిందితుడని చిన్న పిల్లలకు కూడా తెలిసిపోయింది అని ప్రచారం మొదలుపెట్టేసారు.  ఈ దెబ్బకి ఆకాశవాణి  వారు, చిన్నపిల్లల కార్యక్రమాలను లైవ్ గా నిర్వహించటం నిషేధించి పారేశారు. 


ఇది బోఫోర్స్ వివాదానికి, చిన్నపిల్లలా రేడియో కార్యక్రమానికి ఉన్న అనవసర సంబంధం.

ఈ వార్తా ఈ మధ్యనే టైమ్స్ ఆఫ్ ఇండియా వారు మళ్ళీ  వ్రాస్తూ   ప్రస్తుతం ఆ స్లోగన్ రాహుల్ గాంధీ మీదకు మళ్ళిందని   చెప్పుకొచ్చారు.నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు చిల్డ్రన్స్ డే కోసమని చిన్నపిల్లల కార్యక్రమానికి పిల్లలను తన ఇంటికి పిలిపించుకుని ఆకాశవాణికి   ఒక కార్యక్రమమే ఇచ్చారుట. మరి ఆయన మనమడి  కాలం వచ్చేప్పటికి, ఆ చిన్న పిల్లల కార్యక్రమాన్ని లైవ్ చెయ్యకుండా నిషేధించాల్సి వచ్చింది. మన దేశం లో నాయకత్వపు విలువలు కాలక్రమాన  ఎంతగా దిగాజారిపోయ్యాయో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ.
అప్పటి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ ఆకాశవాణి  వారి "ప్రధాన మంత్రితో పిల్లలు" అన్న కార్యక్రమం లో పాల్గొన్నప్పటి చిత్రం 
 పై ఫోటో కర్టెసీ సుపర్ణా  ఘోష్ డాట్ కాం 

 మనవాళ్ళు లైవ్ కార్యక్రమాలు చేసెప్పుడు  టేప్ లేకుండా చేసేవారు కాబట్టి పై ఉత్పాతం కలిగింది. బి బి సి వంటి అంతర్జాతీయ రేడియోల్లో, లైవ్ కార్యక్రమం కూడా తప్పనిసరిగా రికార్డ్ అవుతూ, లైవ్ కార్యక్రమం జరుగుతుండగా  ఆ కార్యక్రమం, ఒక్క రెండు మూడు సెకన్ల తరువాత రికార్డ్ అయినది మాత్రమె  ప్రసారం అవుతుంది. అంటే స్టుడియోలోకాని బయట నుండి కాని  లైవ్ లో మాట్లాడిన మాటలు రెండు మూడు సెకన్ల తరువాత మాత్రమె ప్రసారం అవుతాయన్నమాట . టేప్ రికార్డర్  రికార్డింగు హెడ్ కు ఎగువగా మరొక రిప్లే హెడ్,  రెండు మూడు సెకన్ల తరువాత ప్లే అయ్యేట్టుగా తగిలించి అందులోంచి వచ్చేది మాత్రమె  ప్రసారం చేస్తారు. లైవ్ అన్నా కూడ శ్రోతలు వినేది, రెండు సెకన్ల క్రితం రికార్డ్ అయ్యిన కార్యక్రమమే. మంచి చురుకుగా ఉండే ఒక సంపాదకుడు ఆ కార్యక్రమాన్ని జాగ్రత్తగా వింటూ ఈ రెండు సెకన్లల్లో రాకూడనిది వస్తే, కార్యక్రమాన్ని ఆపేసి, ఏదో అనివార్య కారణం అని చెప్పి, విరామ సంగీతంగా నిలయ విద్వాంసుని  గోటు వాయిద్యం వేస్తారు.  కాబట్టి "గలి గలి మే చోర్ హై"  బి బి సి లో అయితే వచ్చేది కాదు అన్న మాటే కాదు ఉన్నమాటే.
2 వ్యాఖ్యలు:

 1. ఆసక్తి కరమైన విషయం. ఇలాటి విషయాలని చక్కగా అందిస్తున్న మీకు ధన్యవాదములు.
  అసలు ఎందుకు లైవ్ ప్రోగ్రామ్స్ పెడతారో తెలియనంత అజ్ఞానం లో ఇప్పటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
  మరి ఇప్పుడు ఏం చేయగలమో!
  విలువలు క్షీణిస్తున్న దశలో.. నేను ఉన్నాను అన్నట్టు కోన ఊపిరితో ఉంది. రేడియోలో లైవ్ కార్యక్రమాలు.
  అందుకు విచారించక తప్పదు. గతం ఘనం గా మిగిలిపోతుందేమో అన్న బాధ కూడా ఉంది

  ప్రత్యుత్తరంతొలగించు
 2. థాంక్యూ వనజవనమాలి గారు. మీరన్న విషయంతో ఏకీభవిస్తాను.

  మీరూ అకాశవాణి కార్యక్రమాల పట్ల ఉన్న అభిమానంతో, విజయవాడలో సంవత్సరానికి ఒకసారి మీలాంటి శ్రోతలను కలుస్తారని మునుపు చెప్పారు. అలా కలిసినప్పుడు, అలనాటి శ్రోతలు ఎవరైనా అప్పటి కార్యక్రమాలను రికార్డ్ చేసి ఉంచారేమో కాస్త వాకబు చేసి, ఎవరి దగ్గరన్నా ఉంటె, తెలియచేయగలరు. వాటిని డిజిటైజ్ చేయించి అందరితో పంచుకునే కార్యక్రమం నేను పూనుకుని చేయ్యగలను. లేదా మీరు మీ బ్లాగుద్వారా అందరికీ అంధుబాటులోకి తెస్తే అంతకంటే అద్భుతమైన కార్యక్రమం మరొకటి ఉండదు.

  మీరు కూడా రేడియో అభిమాని బ్లాగులో సహ రచయితగా ఉండాలని నా ఆహ్వానం అందుకుని మీ మొదటి వ్యాసంతో స్పందించగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.