3, మార్చి 2013, ఆదివారం

ఇ 'వేమన' పద్యాలు

 
తెలుగు వాళ్ళై ఉండి  వేమన శతకం తెలియని వాళ్ళూ ఉంటారా అని ఒకటి రెండు దశాబ్దాల క్రితమైతే అనుకుని అలా తెలియని వాళ్ళను చిత్రంగా, జాలిగా చూసే అవకాశం ఉండేది. కాని, ఇప్పుడు!?........ కాలక్రమాన, జరిగినది చూస్తె బాధేకాదు,  విపరీతమైన దిగులు కూడా  కలుగుతుంది, మనం ఏ దిశగా పయనిస్తున్నామో తెలియక! ఈ రోజున,  చదువులు ఆ చదువులలో చెప్పబడే విషయాలు, చెప్పించుకునే భాష మనకు సంబంధించినవి కానేకాదు. అప్పుడెప్పుడో ఇంగ్లీషు వాడు మనని గుమాస్తాలను చెయ్యటానికి పెట్టిన చదువు అని ఒకపక్క తిడుతూనే,  ఈ రోజున అంతకంటే అధ్వాన్నమైన పరిస్థితిలోకి పిల్లల చదువులను తోసేశారు. 

ఒక మనిషి తప్పనిసరిగా తెలుసుకోవలిసిన జీవన విధానాలు, కనీసం ఎలా ఉండకూడదో తెలియచెప్పే ప్రక్రియ దాదాపు మృగ్యం. ఒకానొకప్పటి సర్వసాధారణమైన శతక ధారణ ముఖ్యంగా వేమన శతకం సుమతీ శతకం పిల్లల పెంపకం లో  మాయమైపోయింది.  ఆయా శతకాల్లో ఉన్న అద్భుతమైన జ్ఞానం-అతి సామాన్యమైన భాషలో చెప్పబడినది-ఈ రోజున పిల్లలకేకాదు పెద్దలకూ దూరమై పోయింది. 

ఇప్పటి తరానికి, మరచి పోయిన పెద్దలకూ,  తెలియచేయటానికా అన్నట్లుగా ప్రముఖ కార్టూనిస్ట్ "బాబు" గా ప్రసిద్ది కెక్కిన శ్రీ కొలను  దుర్గా ప్రసాద్ గారు తానూ మునుపు ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ధారావాహికగా (1982-88) వేమన పద్యాలను ప్రాతిపదికగా తీసుకుని వేసిన వ్యంగ్య చిత్రాలను సేకరించి పుస్తక రూపంలో మనకోసం తీసుకు రావటం ఒక అద్భుతమైన విషయం.  ఆయన అప్పట్లో ధారావాహికగా వేసినవి 300 కార్టూన్లు కాగా ఈ పుస్తకంలో 239 అద్భుత కార్టూన్లు ఉన్నాయి. ప్రతి కార్టూన్ చూసి చదివి తీరవలసినదే. 

సామాన్యంగా కార్టూన్ అనంగానే బొమ్మ,  బొమ్మకు సరిపొయ్యే సంభాషణ , లేదా సంభాషణకు సరిపొయ్యే బొమ్మ ఉండటం సర్వ సాధారణం. కాని "బాబు" గారు వేసిన ఈ     ఇ 'వేమన' పద్యాల్లో మూడో విషయం కూడా  ఉన్నది.  ముందు వేమన పద్యం చదువుకుని, ఆపైన ఆ పద్యం ఆధారంగా వేసిన చక్కటి కార్టూన్, ఆ కార్టూన్లో ఉన్న సంభాషణ/మాటలు చదివి, ఒక పక్క నవ్వుకుంటూనే వేమన హృదయాన్ని అర్ధం చేసుకుని, ఆయన వ్యంగ్య ప్రధానమైన విమర్శను ఈ వ్యంగ్య చిత్రాలలో చూసి ఆనందించటమే కాదు, కొన్ని చోట్ల చురుక్కుని తగిలి  ఆత్మవిమర్శలో పడటం కూడా  జరుగుతుంది.  

సహజంగా ఇ 'వేమన' అనంగానే ఇదేదో కంప్యూటర్ కు సంబందించినది (ఇ  కామర్స్, ఇ  గవర్నెన్స్ లాగ) అనిపించే అవకాశం  ఉన్నది. కాని ఈ కార్టూన్లు ప్రధమంగా ఆంధ్ర పత్రికలో ప్రచురితం అయినప్పుడు (1980 లలో) కంప్యూటర్ సామాన్యుడికి బి ఎం డబ్ల్యు కారు లాంటిది. మరి ఈ పేరు ఈ కార్టూన్లకు పెట్టడం లో అంతరార్ధం!? సరే "బాబు" గారునే అడిగితే ఒక నవ్వు నవ్వి, చాలా సామాన్యమైన అర్ధం చెప్పారు (గుప్పెట్లో ఇసకెంత ఉంది అంటే "గుప్పెడు" అన్నంత సహజంగా). ఇవే మన వేమన పద్యాలు అని చెప్పేటమే "ఇ 'వేమన' పద్యాలు" అని పద విరుపుతో అక్షరాలూ తగ్గించి చెప్పటం. 

ఇప్పుడు ఇ  వేమన పద్యాలను కొన్నిటిని మచ్చుకి చూడండి. 

మనం అనుకున్నామని అన్నీ జరుగుతాయా! లేదా అనుకోలేదని కొన్ని జరగకుండా ఉంటాయా? అదీ లేదు. ఇదే అర్ధం వచ్చే ఒక సినిమా పాట కూడా  విన్న గుర్తు. ఈ ఆలోచనకు మూలం వేమన శతకమే! ఆయన చెప్పిన పధ్ధతి వేరు. రానిది కోరినా రాదు, రానున్నది కోరుకోకపోయినా వస్తుంది, ఎంత "చింత" చేసినా కానున్నది కాకపోదురా నాయనా అని వేమన గారు మనకు బోధ చేశారు. ఆ భావనకు నేటి సామాజిక పరిస్థితి జోడించి "బాబు" గారు కట్నం కోరుకున్న వాడికి జైలే గతి  అని వ్యంగ్యం బాగా మిళాయించి వేసిన కార్టూన్. 

చిలిపి తనం కార్టూనిస్టు సొత్తు. ఆ చిలిపితనమే ఈ కార్టూన్ కు మూలం .  చూసే దృష్టిలో ఉండే తేడాలను వేమన పద్య రూపంగా చెప్పి తెలియచేస్తే, "బాబు" అదే పద్యాన్ని మరో విధంగా ఈ నాటి సినిమాల్లో వచ్చే దృశ్యాలను ఎత్తిపొడుస్తూ, చక్కటి కార్టూన్ రూపాన్నిచ్చారు. ఇవ్వాళ సినిమాకి కుటుంబ సమేతంగా వెళ్ళి ఏ క్షణంలో ఏమి చూపిస్తారో, ఎలాంటి వెర్రి మొర్రి డైలాగులు  వినాల్సి వస్తుందో అని క్షణక్షణం హడిలిపోతూ సినిమా చూడవలసి వచ్చిన దుర్గతి వల్ల సామాన్యుడు పడుతున్న బాధను, ఈ చిన్న కార్టూన్లో "బాబు" అద్భుతం గా మలిచారు. 


సమాజంలో మనిషికి ఇచ్చే  గౌరవం సామాన్యంగా ఆ మనిషి వేషం మీదే ఆధార పడి ఉంటుంది, మాసిన తలతో, మురికి గుడ్డలతో జిడ్డోడుతున్న శరీరంతో ఉంటే,  ఎంతటి గొప్పవాణ్ణీ కూడా గౌరవించరు,   ఎవరూ ఆయన గొప్పతనాన్ని గ్రహించరు,  అని వేమన ఉన్న విషయాన్ని సులభంగా చెప్పారు. అదే విషయాన్ని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి, ఆఫీసులో ఒక ఉద్యోగి సామాన్య వేషంలో వస్తే ఎలా తిట్లు తినాల్సి వస్తుందో  ఊహించి వేసిన చక్కటి కార్టూన్ ఇది. 

అప్పులేని వాడు అందరి కంటే సంపన్నుడు అని వేమన ఆనాడు అమాయకంగా తన పద్యం లో బయట పెట్టేశాడు. కాని ఈనాడు! ఎంతటి అప్పు చేసి ఉంటే అంతటి సమర్ధుడు. సామాన్య మానవుడే కాదు చివరకు ప్రబుత్వాలు కూడా ఎంతటి అప్పు చేస్తే అంత సమర్దవంతంగా ఉన్నట్టు. వేమన కాలంలో ఆదాయపు పన్ను లేక బతికిపొయ్యాడు. ఈ కాలం లో ఐతే, నువ్వు అప్పు చెయ్యలేదంటే, నీ దగ్గర ఎంతటి "సంపద" ఉన్నదో కదా అని మన ఆదాయ పన్ను శాఖ వారు  అలాంటి అమాయకపు మనిషికి టాక్సు నోటీసు పంపించి తీరుతారు. అదే విషయాన్ని, తాను అధికారిగా పనిచేసిన అనుభావాన్ని కలిపి ఈ కార్టూన్ వేశారు మన "బాబు". 


ఇలా ఈ పుస్తకంలో ఇలా ఎన్నో కార్టూన్లు. ప్రత్యక్షమైన దేవత ఝడుసుకునేట్టుగా వరాలడిగే మనిషి, మోసం చెయ్యటమే పరమావధిగా పెట్టుకున్న దుర్మార్గులు, ఇక రాజకీయ నాయకులు సరే సరి, దొంగ  సన్యాసులు, ఇలా మనకు సమాజంలో కనపడే దుర్లక్షణాలకు మూలాలను ఎన్నిటినో ఈ పుస్తకంలో సరదాగా కార్టూన్లలలో చూడవచ్చు, వేమన పద్యాలను ఇంకా బాగా అర్ధం చేసుకోవచ్చు. 

తప్పకుండా చూడ /చదువ వలసిన పుస్తకం 

మీకిప్పటికే తెలిసి ఉండాలి శ్రీ కొలను వెంకట  ప్రసాదు గారు తన బ్లాగు ద్వారా సుపరిచితులు. ఆయన బ్లాగును ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు 



బ్లాగు లోకంలో ఉన్న ఏకైక ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ "బాబు" ఈయనకు తోడుగా "సురేఖ" గారు కూడా ఉన్నారు.
**********************************
ఇదంతా చదివినాక ఈ పుస్తకం ఎక్కడ దొరుకును!? అని ఆసక్తి కలగటం సహజం. ఈ పుస్తకం ధర 180 రూపాయలు. కొనదలుచుకున్నవారు సంప్రదించవలసిన చిరునామా:

శ్రీమతి కె శాంత కుమారి,
ఇంటి నంబరు 30-19-24/1, చాపరాల వారి వీధి,
సీతారామపురం 
విజయవాడ-520002
**********************************














4 కామెంట్‌లు:

  1. మన సాహిత్యంలో అత్యంత కీలకమైనవి వేమన పద్యాలు. వేమన తత్వం మానవ స్వభావాన్ని, లోకం పోకడను అందులోని లోపాలను ఎండగట్టడం లోనూ అదీ అందరికీ అర్ధమయ్యే రీతిలో, చక్కని ఉపమానాలతో చెప్పినవి. వందలకొలదీ పేజీల సారాన్ని నాలుగు లైన్ల ఆటవెలదిలో మెదడుకు హత్తుకుపోయే విధంగా చెప్పడం బహుశా వేమనకు సాధ్యమయినట్లు ఇతరులెవరూ చెప్పలేదని నా అభిప్రాయం.

    మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు ప్రసాద్ గారు. కొన్ని పద్యాలలో వేమా అని ఉన్నది. అలాగే వేమన పద్యాలలో కొన్ని చేర్పులు, పదాలలోనూ మార్పులు జరిగాయని అంటారు. నిజమేనా?

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు కొండలరావుగారూ.

    సామాన్యంగా వేమన శతకంలో విశ్వదాభిరామ వినుర వేమా అని ఉండటమే మనం ఎక్కువగా చూస్తుంటాము. నేను కూడా మొదటిసారి వేమన పద్యం "వేమా" తొ ముగియటం చూడటం. దుర్గా ప్రసాద్ గారు ప్రముఖ కార్టూనిస్ట్. అయన ఈ విషయం లో వేమన పద్యాలను కూలంకషంగా పరిశీలించి, పెద్దల సూచనలు స్వీకరించిన తరువాతనే ఈ పుస్తక ప్రచురణకు పూనుకున్నట్టుగా ఆ పుస్తకపు ముందు మాటలో తెలుస్తున్నది.

    రిప్లయితొలగించండి
  3. ఒక ప్రయోగాత్మకంగా ఇలాంటి పుస్తకాలు తేవలసిన అవసరం ఏంతో ఉంది. వీటిని బాల సాహిత్యం లో చేర్చి పిల్ల్లలతో చదివించాల్సిన అవసరం కూడా ఉంది. చిరునామా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. చిరునామా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా అబ్బాయి కోసం వేమన శతకం పుస్తకాలు కొన్నాను కానీ ఇదైతే కార్టూను బొమ్మలు ఉండడం చేత ఇష్టంగా చదివిస్తుందేమో.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.