2, అక్టోబర్ 2013, బుధవారం

గాంధీ గారికి నిజమైన నివాళి ఇవ్వగలరా!

 
శుభ్రత గురించి గాంధీగారి తాపత్రయం  గురించి ప్రజలకు బోధిస్తే , వాళ్ళూ శుభ్రం పాటిస్తారని అధికారుల ఆలోచన. కాని ఆ పోస్టరే మురికి పట్టి ఉన్నదే మరి! ప్రజలకు గాంధీ గారి సందేశం అందించాలని ఆ పోస్టర్ ఏర్పరిచిన అధికారులు చేస్తున్నది ఏమిటి?  (ముంబాయిలో ఒక ప్రధాన లోకల్ స్టేషన్ బయట ఉంచబడిన గాంధీగారి పోస్టర్ కు పట్టిన గతి) 
 గాంధీగారి జయంతి మరొకటి వచ్చిపడింది!తప్పదు! రాజకీయాలకు ఎటువంటి  బీరకాయపీచు సంబంధ ఉన్న ఫలానా పార్టీ వాడైనా సరే, తన
గాంధీగారి నెత్తిన చెయ్యి పెట్టిన మంత్రి. ఎన్ డి టి వి వారి రిపోర్ట్ చదవండి క్లిక్
"ముఖ్యమైన"  పనులన్నీ మానుకుని, ఎక్కడో అక్కడ ఒక దండ సంపాయించి,  గాంధీ గారి ఫొటోకో (నిన్న రాత్రి వెతికి పట్టుకున్నది) లేదా నిన్న సాయంత్రం "డిస్కవర్" చెయ్యబడి, అతి కష్టం మీద కాకి రెట్టలు వగైరా కడిగేసి, విరిగిన కర్రను తాత్కాలికంగా బాగుచెయ్యబడిన విగ్రహానికో, దండ వెయ్యాలిసిందే. లేకపోతే మరేమన్నా ఉన్నదా?  ప్రజలు ఏమనుకుంటారు!!!
 

టి వి కెమారాల ముందు రాజకీయ నాయకులు గాంధీ గారి సమాధి మీద పూలు చల్లారు. అక్టోబరు రెండున జరగవలసిన ముఖ్య కార్యక్రమం అయిపోయింది. నాకు చాలా సార్లు అనిపిస్తుంది. అక్టోబరు రెండున కాకుండా,
గాంధీ జయంతి కాని రోజుల్లో గాంధీ గారి సమాధి
ఏ ఒక్క రాజకీయ నాయకుడన్నా గాంధీ సమాధి దగ్గరకు వెళ్ళి ఒక్క రెండు నిమిషాలన్నా  కూచుని ఆయన్ని స్మరించుకుంటారా అని. మీడియా వాళ్ళు కూడా,  అక్టోబరు రెండున బాగా అలంకరించబడిన  గాంధి సమాధిని చూపిస్తారే కాని, మిగిలిన రోజుల్లో అక్కడకు ఎవరు వస్తారు, వచ్చినవాళ్ళు అదొక దర్శనీయ స్థలంగానే చూస్తున్నారా, లేక వాళ్ళు అదొక పవిత్ర స్థలంగా అనుకుంటున్నారా, రోజువారి ఎలాంటి వ్యక్తులు గాంధీ సమాధిని దర్శిస్తుంటారు, సామాన్యంగా అక్కడ ఉండే వాతావరణం చూపించిగల "సెన్సిబిలిటీ"  ఉన్న ఒక్కడంటే ఒక్క మీడియా మనిషి లేడు కదా. 

గాంధీ గారు 144 ఏళ్ళ క్రితం   పోర్‌బందరులో   ఇదే   రోజున   జన్మించారుట.     "ట" అని ఎందుకు అంటున్నాను అంటె, గాంధీ గారి స్మృత్యర్ధం నిర్వహించబడుతున్న  వెబ్ సైటులో(www.mkgandhi.org)ఒక క్విజ్ ఉన్నది(చూడడానికి క్లిక్ చెయ్యండి). ఆ క్విజ్ లో మొట్టమొదటి ప్రశ్న గాంధీ ఎప్పుడు  పుట్టారు అని.  కొన్నాళ్ళు పోయినాక,  గాంధి అనే జీవి ఈ భూప్రపంచంలో మనలాగా రక్త మాంసాలతో తిరిగిన మనిషి అని చెప్పుకుని ఆశ్చర్యపొయ్యే రోజు ఎప్పుడో వస్తుందని, పాపం ఐన్‌స్టీన్ గాంధీ మరణ సమయంలో కాబోలు వాపొయ్యారు. కాని ఎప్పుడో కాదు ఇప్పుడే వచ్చేసింది అని దాదాపు గత రెండు  దశాబ్దాలనుంచి ప్రతిరోజు అనుకోని వ్యక్తులు ఉంటే , అటువంటి మానవమాత్రులు, చాలా తెలివి గలవారని, బ్రతుక నేర్చినవారని, ఎంతో లౌక్యం  వాళ్ళ సొత్తని, అటువంటి వ్యక్తులకు ఉజ్వల భవిష్యత్తు ఉండి తీరుతుందని అనుకునే రోజులివ్వి మరి!

దేశానికి స్వతంత్రం సాధించిన కొద్దిరోజుల్లోనే, గాంధీగారు చాలా అమాయకంగా రాజకీయ  పార్టీగా కాంగ్రెస్ అవసరం తీరిపోయిందని, ఇక  ఆ పార్టీని ఒక సంఘసేవా సంస్థగా,   పార్లమెంట్ గురించి ప్రచార నిమిత్తం మార్చెయ్యాలని, 1948 జనవరిలో (హత్యకు గురవ్వటాంకి ముందు రోజుల్లో) అనుకుంటూ, ఆ సంస్థకు లోక్ సేవక్ సంఘ్ అని కూడా నామకరణం చేశారుట.  పాపం గాంధీగారు, 1948 జనవరి 30 న హత్యకు గురయ్యారు. దాంతో లోక్ సేవక్ సంఘ్ కార్యక్రమం సహజంగా మూలన పడింది. ఇంత మంది,  తాము గాంధీగారి శిష్యులమని    చెప్పుకునేవారు కాని, ఆయన పేరు చెప్పుకుని 17 సంవత్సరాలు, దేశ ప్రధానిగా పరిపాలించిన నెహ్రూ కాని, గాంధీగారి చివరి కోరికను తీర్చలేదు సరికదా,  ఆ ఆలోచనే చేసినట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు. గాంధీ గారు అనుకున్నట్టుగా లోక్ సేవక్ సంఘ్ ఏర్పడి ఉంటె.....ప్చ్ అనుకుని ఏమి లాభం, గతజల సేతుబంధనమే.

ఇన్నాళ్ళు పోయినాక, అంటె గాంధీగారి జన్మించిన తరువాత దాదాపుగా ఒకటిన్నర శతాబ్దాల తరువాత,  అదే ఇంటిపేరు స్వత పేరులో చేర్చుకున్న వ్యక్తులు దేశాన్ని కనిపించకుండా పరిపాలిస్తున్నారు.  పోనీ ఇంటిపేరు అదేకదా,  గాంధీగారి ముని మనవలో, ముది మనవలో అనుకుంటె అది పూర్తిగా తెలియని వాళ్ళు అనుకునె మాట. 


ఈ మధ్య ఆ పేరుతో చక్రం తిప్పటంలో  "చెయ్యి" వేస్తున్న ఒక పెద్దమనిషి,  చటుక్కున ఒక పత్రికా ప్రతినిధుల సమావేశంలోకి జొరబడి మరీ,  పరోక్షంగా తమ ప్రధాని మీదే నోరు పారేసుకున్నాడు. దేనికిటా!  వాళ్ళ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం, నేర చరితులకు ఎన్నికల్లో నిలబడటానికి వెసులుబాటు కల్పిస్తూ ఒక ఆర్డినెన్సు జారీచేసి, రాష్ట్రపతి ఆమోదానికి పంపిందట, ఇన్నాళ్ళు పోయినాక, ఆయనగారికి ఉన్నట్టుండి, అలా చెయ్యటంలో ఉండె తప్పులన్నీ, ఏ చెట్టు కింద కూచున్నాడోమరి, జ్ఞానోదయం అయ్యిందట!  సదరు  ఆర్డినెన్సు వండుతున్నప్పుడు కానీ, తయారీలో ఉన్నప్పుడు  కాని, తమ తల్లిగారు ఆ ఆర్డినెన్సుకు చివరి తిరుగమోత పెడుతున్నప్పుడు కాని,  ఇప్పుడు హఠాత్తుగా "తెచ్చుకున్న"   ఆ కోపం,  ఆ ఆవేశం,  "నిజాయితీగా" వచ్చి ఉంటే,  దేశం మొత్తం సంతోషించి, రాబొయ్యే ఎన్నికల్లో ప్రత్యర్ధికి ఇతను తీసిబొయ్యేలా లేడే అని కొంతలో కొంత అలోచన చేసి ఉండే అవకాశం ఉండేది.  

ఆర్డినెన్సు పాస్ చేశేసి, రాష్ట్రపతి గారి అమోదానికి  పంపించేసినాక, ఊళ్ళొ వాళ్ళందరూ మొహాన ఉమ్మేయ్యటానికి, లాలాజలానికి కటకట పడుతూ కెక్కరిస్తున్న  సమయంలో, సరిగ్గా దేశ ప్రధాని  దేశంలో లేని సమయంలో, అల్లరి చేయ్యటంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?! రాజకీయంగా లబ్ధి పొందాలని, తానొక్కడె తమ పార్టీలో అతిగొప్ప వ్యక్తి, అన్యాయాన్ని సహించని వ్యక్తి, ఎప్పుడు చూసినా ప్రజాస్వామ్యం గురించి, రాజకీయ ప్రక్షాళన గురంచి మాత్రమే ఆలోచిస్తున్నట్టుగా భ్రమ కల్పించటానికి కాకపోతే,  మరింకేదన్నా ఉందని అనుకుంటె, అటువంటి వ్యక్తికి ప్రపంచ జ్ఞానం శూన్యం అనుకోవటంలో తప్పులేదని, నా ఒక్కడి అభిప్రాయం కాదు, లోకం మొత్తం కోడై మాత్రమే  కాదు   ప్రభాత వేళ లేచి హడావిడి చేసే పక్షి ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తూ  కూస్తున్నది. 
 

గాంధీ జయంతి రోజున ఈ పిడకల వేట ఏమిటి? నిజమే ఇది పిడకల వేటే. గాంధీ జయంతి రేపనగా, విదేశయాత్ర ముగించుకుని ప్రధాని గారు దేశంలో దిగారు. గాంధీ జయంతి సందర్భంగా, వారు సదరు సరికొత్త గాంధీ గారితో సమావేశం అయ్యి, ఆయన ఆవేశానికి మూలం ఏమిటో వాకబు చేస్తారుష.  చేసి ఏమి చేస్తారో మరి?! 
**********************************
గాంధీగారు పోయి కూడా ఆరు దశాబ్దాలు దాటిపొయ్యాయి, ఇంకా ఆయన చెప్పిన సూత్రాలే  వల్లించాలా అనుకునే వాళ్ళూ ఎక్కువవుతున్న ఈరోజుల్లో,  కనీసం గాంధీ గారి సమాధి మీద పూలు చల్లినందుకు సార్ధకతగా, ఇవ్వాళ అవును ఇవ్వాళే, ప్రభుత్వం నేరచరితుల ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవటమే కాదు, అటువంటి బిల్లు మరొకసారి ప్రవేశపెట్టే ఆలోచనే చెయ్యము అని హామీ ఇస్తూ,  అటువంటి ప్రయత్నం చేసినందుకు దేశప్రజల క్షమాపణ కోరితే,  గాంధీ గారికి అంతకు మించిన నివాళి ఉండదని నా అభిప్రాయం. పేరు ఎవరికి వచ్చినా సరే పరవాలేదు, ప్రజలు అర్ధం చేసుకుకోగలరు,   సామాన్య ప్రజల జ్ఞాన సంపద, వారి ఆలోచన ధోరణి, వివేచనా శక్తి అనేకసార్లు నిరూపించబడింది మరి.
**********************************

*
**
***
****
*****
****
***
**
*
=================================================
విజయవాడలో ఉన్న గాంధీ హిల్ పరిస్థితి ఈ కింది లింకు నొక్కి తెలుసుకోవచ్చు:


=================================================


3 కామెంట్‌లు:

  1. వర్ధంతికీ,జయంతికీ మాత్రమే దివంగా నాయకుల్ని తల్చుకోడం ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయమే కదా! అకోట్బర్ రెండునే పుట్టిన లాల్ బహదూర్ శాస్త్రి ని కనీసం ఒక్కళ్ళైనా తల్చుకునే వాళ్ళున్నాఅ చెప్పండి, కనీసం ఆ ఒక్క రోజునైనా?

    అసలు కొన్నాళ్లాగితే సబర్మతి ఆశ్రమాన్ని గానీ, రాజ్ ఘాట్ ని గానీ (ఢిల్లీ ప్రధానమైన రోడ్లో ఉంది ఇది) ఇంత స్థలం ఎందుకని కుదించినా ఆశ్చర్య పడక్కర్లేదు.

    గాంధీ తురుఫు ముక్కలా కాంగ్రెస్ కి ఉపయోగపడ్డాడంతే

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.