16, అక్టోబర్ 2013, బుధవారం

రేడియో అన్నయ్య శ్రీ ఏడిద కామేశ్వరరావు

 శ్రీ ఏడిద కామేశ్వరరావు
రేడియో అన్నయ్యగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో,  అంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రపు ప్రసారాలు వినపడే ప్రాంతాల్లో శ్రీ ఏడిద కామేశ్వరరావు గారు ప్రసిధ్ధులు.  కామేశ్వర రావుగారు ఎలా ఉంటారు, ఆయన ఫొటో ఉంటే బాగుండును మన రేడియో అభిమానిలో ప్రచురిద్దాము అని ఎంతగానో ప్రయత్నించాను. కాని దొరకలేదు. ఒక్కొక్కసారి ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని వెతికిన చందాన అవుతుంది పరిస్థితి.మిత్రులు దాసరి వెంకటరమణ గారు బాల సాహిత్య పరిషత్‌కు ప్రధాన కార్యదర్శి కదా ఆయన్ను అడిగితే సరిపోదా  అన్న ఆలోచనే రాలేదు, నేను రేడియో అభిమాని బ్లాగు నడుపుతున్న సంగతి ఆయనకు తెలియదు. నా పక్కనుంచి సమన్వయ లోపం.
 

దాసరి వెంకటరమణగారి దగ్గరనుంచి ఒక ఆహ్వానం అందింది. ఏడిద కామేశ్వర రావుగారి జీవిత కథ ఒక చిరు పుస్తకంగా ప్రచురిస్తున్నారనిన్నీ, ఆ కర్యక్రమం ఇవ్వాళే  అంటే 16 అక్టోబరు, 2013 హైదరాబాదులో అని. ఆ ఆహ్వానంలో చూద్దునుకదా, నా చిన్న నాటి రేడియో అన్నయ్య కామేశ్వర రావుగారి తాతయ్య అయ్యినప్పటి ఫొటో. అద్భుతమైన  విషయం. ఇన్నాళ్ళకు, ఏ పిల్లల కార్యక్రమం వింటూ పెద్దవాణ్ణి అయ్యానో, ఆ కార్యక్రమం నిర్వహించిన రేడియో అన్నయ్య రూపు చూడగలిగాను.

అప్పటి జ్ఞాపకాలు:
  • కామేశ్వర రావు గారి గొంతు ఎంతో మార్దవంగా ఉండి, పిల్లలను లాలించి, భయం లేకుండా చేసి వాళ్ళ చేత పాటలు పద్యాలు పాడించేట్టుగా ప్రోత్సాహం ఇచ్చేట్టుగా ఉండేది.
  • కార్యక్రమం ఆదివారం పొద్దున్న వచ్చేది. అప్పట్లో బాగా గుర్తు, ఆదివారం పొద్దునపూట కరెంటు రిపేర్ల కోసం తీసేసే  వాళ్ళు. చాలా సార్లు ఈ కార్యక్రమం మిస్ అయ్యేవాళ్ళం. కరెంటు వాళ్ళు  మధ్యాహ్నం కరెంటు తీసేవాళ్ళు కాదు, మూడు గంటలకు రేడియో నాటకం ఉండేది జనం ఊరుకోరు అందుకని.
  • రేడియో అన్నయ్యగా ఏడిద కామేశ్వర రావు గారు, రేడియో అక్కయ్యగా వింజమూరి లక్ష్మి గారు కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపేవారు.
  • లక్ష్మీ రాజ్యం అనే పేరుగల అమ్మాయి ఎక్కువసార్లు వచ్చి పాటలు పాడేది. ఆ పాటల్లో నాకు బాగా గుర్తున్నది, "కొండమీద కోయిల ఒకటి కూసిందీ". ఈ పాట మన అకాశవాణీ గుమాస్తాలు ఎక్కడో పారేశారు. దొరకకుండా పోయింది.
  • కామేశ్వర రావుగారు, పిల్లల్ని రైల్వే స్టేషన్ కు,ఎక్కడన్నా ఒక ఫ్యాక్టరీకి అలా తీసుకెళ్ళి ప్రత్యక్ష ప్రసారం లాగా వెళ్ళిన పిల్లలకు చూపిస్తూ, వింటున్న పిల్లలకు కూడా అక్కడి వివరాలు, వింతలు విచిత్రాలు చెబుతూ ఉండెవారు.
కామేశ్వర రావుగారు నేను పుట్టి పెరిగిన సత్యనారాయణ పురంలోనే ఉండేవారుట. ఆయన గొంతు తెలుసు కాని, ఆయన ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడన్నా ఎదురుపడినా గుర్తించలేని స్థితి. చిత్రంగా ఉంటాయి ఇలాంటి విషయాలు. అక్కడక్కడే ఉండి, మనం ఎంతగానో ఇష్టపడుతున్న మనిషి అక్కడే ఉన్నారని తెలిసి, తెలుసుకోలేకపోవటం. 

శ్రీ ఏడిద కామేశ్వర రావుగారి జీవిత విశేషాలతో చిరు పుస్తక ప్రచురణ ఆవిష్కరణ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. శ్రీ ఏడిద కామేశ్వర రావుగారి శత జయంతి సందర్భంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి, ఆయన జీవిత విశేషాలను పుస్తక రూపంగా తీసుకు వచ్చిన దాసరి వెంకటరమణ గారికి అభినందనలే కాదు, అప్పటి బాలలు ఈ నాటి పెద్దలందరి   తరఫునా ధన్యవాదాలు.

2 వ్యాఖ్యలు:

  1. రేడియో దూరమయ్యాక సగం జీవితం దూరమయ్యినట్టు అయిపోయింది నాకు...(మీరు నవ్వుకోనంటే)....ఉదయం నాలుగున్నర తర్వాత...ఆకాశవాణి విసాఖ కేంద్రమ్ కు ముందు ట్యూన్ చేస్తుంటే....క్రీస్టియన్ కార్యక్రమాలు వచ్చేవి...అవి పెట్టుకుని, వింటూ పనులు మొదలు పెట్టే వాణ్ణి.....సిలోన్...వివిధ భారతి..మెద్రాస్ కూడా ,ఇళయరాజా పాటల కోసమ్...వినే వాళ్ళం...ఏకాంబరం...కార్మికుల కార్యక్రమం,యువ వాణి...ఇలా.. ...ఆకాశవాణి ప్రోగ్రామ్స్ టైమింగ్స్...తరువాతి రోజుల్లోని ప్రోగ్రామ్స్ పై...ఒక పుస్తకం కూడా వచ్చేది...రేడియో మాస్కో నూ ఫాలో అయ్యేవాళ్లం...ప్చ్...లైఫ్ లో రేడియోని మిస్ అయిపోవడం...చాలా శూన్యంగా అనిపిస్తుంది...ఆ థ్రిల్...కిక్...మజా...సరదా...ఆహ్లోదం...మరెందులోనూ నేను చూళ్ళేదు...ఇప్పటికీ ఏమయినా ప్రసారాలు వస్తున్నాయా?ఎఫ్.ఎం.లు కాకుండా?తనికెళ్ళ భరణి గారి మిధునం లో మళ్ళీ ఆ రేడియో ప్రోగ్రామ్స్ బాక్ గ్రౌండ్ లో విని నిట్టూర్చాం!!?ఇప్పటి జీవన విధానం చాలా మందికి రోత పుట్టింది......ముందు ముందు..మళ్ళీ రేడియో బ్రతుకుతుందేమో?ఇప్పటికె చాలా మందికి సెల్ ఫోన్లలో పాత పాటలు రికార్డ్ చేసుకుని, వినడం మొదలయ్యింది...!!

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.